నేతాజీ ‘మరణాన్ని’ నమ్మని అమెరికా గూఢచార సంస్థ సిఐఏ
కోల్‌కతా, ఫిబ్రవరి 7: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అదృశ్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 1945లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు వచ్చిన వార్తల పట్ల అనేక సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే అమెరికా గూఢచార సంస్థ సిఐఏ కూడా బోస్ మరణ వార్తను విశ్వసించలేదు. నేతాజీ జీవించే ఉన్నారని, 1964లో ఆయన ప్రవాస జీవితం నుంచి భారత్‌కు తిరిగి రావొచ్చని 1945లో సిఐఏ పేర్కొంది. 1945 నాటి సిఐఏ డిక్లాసిఫైడ్ పత్రాలను 1964 ఫిబ్రవరిలో బహిర్గతం చేశారు. నేతాజీ విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు ఎలాంటి సమాచారం లేదని తమ పత్రాలు సూచిస్తున్నాయని, ఆయన మృతి చెందినట్లు వచ్చిన వార్తలు విశ్వసనీయమైనవి కావని సిఐఏ విడుదల చేసిన డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. ‘ప్రస్తుతం నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు వర్గానికి బోస్ నేతృత్వం వహిస్తుండొచ్చు. అలా చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి’ అని 1964 ఫిబ్రవరిలో సిఐఏ విడుదల చేసిన ఒక పత్రం పేర్కొంది. నేతాజీ మనుమడు చంద్రబోస్ సహా పరిశోధకులు అభిషేక్ బోస్, అనుజ్ ధార్‌లకు నాలుగు డిక్లాసిఫైడ్ సిఐఏ పత్రాలు అందాయి. సమాచార స్వేచ్ఛా చట్టం కింద ఈ పత్రాలను వారు పొందారు. నేతాజీ మృతి చెందారనేది వదంతని, ఆయన జీవించే ఉన్నారని 1949 జనవరిలో రూపొందించిన ఒక నివేదికలో సిఐఏ పేర్కొంది. బోస్ సైబీరియాలో ఉన్నారని, ఓ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకొని అజ్ఞాతం నుంచి బయటకు రావడానికి వేచిచూస్తున్నారని న్యూఢిల్లీలోని ఉన్నత స్థాయి విశ్వసనీయ వర్గాలు తమకు తెలిపాయని 1950 నవంబర్‌లో భారత రాజకీయాలపై చేసిన సమగ్రమైన విశే్లషణలో సిఐఏ పేర్కొంది. విడుదల చేసిన సిఐఏ పత్రాల్లో చాలా పాతదైన పత్రం 1946 మే నెల కన్నా ముందుది. నేతాజీ మృతి చెందారా? లేదా? అనేది ధ్రువీకరించాలని వాషింగ్టన్ డిసిలోని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆదేశించారని ఈ పత్రంలో పేర్కొన్నారు. ‘్భరత్‌పై నేతాజీకి అద్భుతమైన పట్టు ఉందని, ఆయన కనుక భారత్‌కు తిరిగి వస్తే సమస్యలు తలెత్తుతాయి’ అని ముంబయిలోని అప్పటి అమెరికా కాన్సులేట్ జనరల్ రాశారు. బ్రిటిష్‌వారు నేతాజీని భారత్‌లో గృహ నిర్బంధంలో ఉంచగా, దేశ స్వాతంత్య్ర సమరానికి అంతర్జాతీయ మద్దతును కూడగట్టడానికి ఆయన 1941లో నిర్బంధం నుంచి తప్పించుకొని పారిపోయారు. జపాన్ సహాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించిన నేతాజీ 1945లో అదృశ్యమయ్యారు. 1945 ఆగస్టు 17న బ్యాంకాక్ విమానాశ్రయంలో ఆయన చివరిసారిగా కనిపించారు. నేతాజీ అదృశ్యంపై దర్యాప్తు జరిపిన ముఖర్జీ కమిషన్ 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మృతి చెందారనే వార్తను ఖండించింది. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన పత్రాలలోని సమాచారాన్ని ఇవ్వడానికి ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) గతంలోనిరాకరించింది. ఈ సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల విదేశాలతో భారత్ సంబంధాలు దెబ్బతింటాయని పేర్కొంది. అయితే నేతాజీ కుటుంబ సభ్యులు, ఆయన జీవితంపై పరిశోధన చేసిన పరిశోధకులు మాత్రం భారత ప్రభుత్వం నేతాజీకి సంబంధించిన పత్రాలను విడుదల చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.’
మూలం : ఆంధ్రభూమి
నేతాజీ ‘మరణాన్ని’ నమ్మని అమెరికా గూఢచార సంస్థ సిఐఏ
Reviewed by JAGARANA
on
9:40 AM
Rating:
No comments: