Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఏకాత్మ మానవ దర్శనం ఎప్పటికీ అనుసరణీయం

పూజ్య డా. మోహన్ భాగవత్ జీ, సర్ సంఘచాలాక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 

దీనదయాళ్ ఉపాధ్యాయ
పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ. ధ్యేయ నిష్ఠగల ఆర్‌.ఎస్‌.ఎస్‌. స్వయంసేవక్‌, ప్రచారక్‌. రాజకీయాలపట్ల ఆసక్తిలేని రాజకీయ వేత్త. వస్తుతః దీనదయాళ్‌జి ఆలోచనాపరుడు, సంఘటనాకర్త. అయినప్పటికీ భారతీయ జనసంఘ్‌ బాధ్యతను స్వీకరించాలని శ్రీ గురూజీ ఆయనకు చెప్పినపుడు భారత రాజకీయాల స్వభావాన్ని తన స్వర్ణ కరస్పర్శతో పరివర్తింప జేయటానికి శాయశక్తులా ప్రయత్నించారు. ఈ సెప్టెంబరు 25తో వారి శతజయంతి సంవ త్సరం ప్రారంభమైంది.
శతజయంతి సంవత్సరం సందర్భంగా వారి గురించి, వారు ప్రతిపాదించిన ఏకాత్మ మానవ దర్శనం గురించి 'ఆర్గనైజర్‌' సంపాదకుడు ప్రఫుల్లకేత్కర్‌, 'పాంచజన్య' సంపాదకుడు హితేష్‌ శంకర్‌లు ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌సంఘచాలక్‌ డా. మోహన్‌రావు భాగవత్‌తో ముఖాముఖి (ఇంటర్వ్యూ) నిర్వహించారు. ఈ ముఖాముఖిలో శ్రీ మోహన్‌ భాగవత్‌ చక్కటి సమాధానాలిచ్చారు.
ఈనాటి రాజకీయాల స్వభావం, వ్యవహారశైలి ఏకాత్మ మానవ దర్శన సూత్రాలకు అనుగుణంగా లేవని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇవాళ రాజ కీయాలు దేశంకోసం కాదు, చివర నిలిచిన వ్యక్తి కోసం కాదు; రాజకీయ పార్టీల ప్రయోజనాల చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. రాజనీతి (రాజకీయాలు) లో 'రాజ్‌' అంటే అధికారం మొదట వస్తున్నది, దాని తర్వాత 'నీతి' (విధానం) వస్తున్నది. అధికారం చేప ట్టడం సులువైన పని, కాని కొన్ని సిద్ధాంతాలకు కట్టు బడి విధానాన్ని రూపొందించడమే కష్టం. సమాజం ఆలోచించే తీరు కూడా అలానే ఉంది.  ఎందుకంటే ప్రజలు కూడా రాజకీయ పార్టీలను, రాజకీయ వేత్తలను ఎన్నికల్లోని జయాపజయాలను బట్టే అంచనావేస్తున్నారు తప్ప, ఆ జయం లేదా అపజయం తర్వాత వారు ఏంచేస్తున్నారనే దాన్నిబట్టి కాదు. జయాపజయాలు తాత్కాలికమైన గాలివాటం మీద ఆధారపడతాయి. సమస్యలు ఓట్ల లెక్కింపుగా మార్పిడి చేయబడతాయి. రాజ్యాంగ నిబంధనల వల్లనో లేక రాజకీయ పార్టీలవల్లనో ఇది జరుగుతున్నదని నేననటం లేదు. రాజకీయ వేత్తలే దీనికి బాధ్యులు. కాని ఇదొక సార్వత్రిక జాడ్యం. ఒకవేళ ఏ రాజకీయ పార్టీ అయినా సైద్ధాంతికంగా లేదా విధానపరంగానే పనిచేయాలనే నిర్ణయించుకున్నా స్వార్థ ప్రయోజనాలు గల వ్యక్తులు అలా జరగనివ్వరు.
రాజకీయ పరిణతి లేకపోవడంతో పార్టీలు అధికారం సాధించడం కోసం మనోద్వేగాలతో ఆడుకునే ధోరణి చూపిస్తాయి. ఇలా రాజకీయాలనేవి అధికారం అందుకునే పరుగుల పోటీగా తయారై నాయి. రాజ్యాధికారం కోసం అడ్డదారుల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ వ్యవస్థను మార్చవలసి ఉంది. ఈ పని అందులో ఉన్నవారే చేయాలంటే జరగదు. సమాజమే చేయాలి. ఓటర్లు తమ అల్ప ప్రయోజనాల నుంచి బయటపడి తమ వ్యక్తిగతమైన, కులపరమైన లేదా సామాజికవర్గ పరమైన ప్రయోజ నాలను వదులుకొని విస్తృతమైన జాతీయ ప్రయోజ నాలకు ప్రాధాన్యమిచ్చినపుడు మాత్రమే పరిస్థితి మారుతుంది. అప్పుడిక రాజకీయ పార్టీలు కూడా దారికి వచ్చి అలానే చేస్తాయి. నిజమైన రాజకీయ సంస్కరణలు వచ్చినపుడే మార్పు వస్తుంది. కొన్ని సందర్భాలలో క్లిష్టకాలాల్లో పరిస్థితి దుర్భరంగా తయారైనపుడు ప్రజలు సంకుచిత ప్రయోజనాలను అతిక్రమించి మార్పుకోసం ఓటువేశారు. అయితే ఇది తాత్కాలికం కాకుండా మరింత శాశ్వతంగా జరగాలి. సమాజంలో నిరంతరమైన సుస్థిరమైన రాజకీయ పరిణతి ఉంటే ఏకాత్మ మానవ దర్శనానికి అనుగుణ మైన రీతిలో వ్యవస్థను మార్చగలదు.
దీనదయాళ్‌జీ శతజయంతి సంవత్సరం జరుపు కుంటున్నాం. పైగా ఇది వారి ఏకాత్మ మానవదర్శనం ప్రతిపాదనకు స్వర్ణోత్సవ సంవత్సరం కూడాను. పరిస్థితుల్లో మార్చు వచ్చింది. ఆయన ఆలోచనా విధానం ప్రస్తుత పరిస్థితులకు ఏ మేరకు వర్తిస్తుంది?
పరిస్థితులు మారాయి. అందుకు సందేహం లేదు. అయితే ఏకాత్మ మానవ దర్శనం తాత్వికచట్రం చిరంతన సూత్రాలమీద ఆధారపడి ఉన్నందున అది ఇప్పటికీ అనుసరణీయంగానే ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులనుబట్టి సూత్రాలను పునర్‌ నిర్వచించవలసి ఉంటుందనేది నిజమే. చివరగా నిలిచిన మనిషి జీవన పరిస్థితులమీదనే సమాజబలం ఆధారపడి ఉంటుంది. అత్యంత బలహీనమైన లంకెను దృఢపర చాలి. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం. ఈ సూత్రం ఎన్నటికీ మారదు. అయితే అత్యంత బలహీనమైన లంకెను దృఢతరం చేయడానికి రూపొం దించవలసిన పథకాలు మాత్రం పరిస్థితులనుబట్టి మారవలసి ఉంటుంది. ఏకాత్మ మానవ దర్శనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పనిచేయవలసి ఉంటుంది.
ఏకాత్మ మానవ దర్శనం ప్రతిపాదించబడినప్పుడు భారత్‌లో సోషలిజం మంత్రజపం జరుగుతుండేది. ఇప్పుడేమో సరళీకరణ, ప్రపంచీకరణ గురించి మాట్లాడుతున్నారు. సందర్భం ఏ మేరకు మారింది? ఏకాత్మ మానవ దర్శనాన్ని ఏ మేరకు ఆధునీక రించారు?
ఏ పదం లేదా ఏ సైద్ధాంతిక చట్రం ఫ్యాషన్‌గా ఉన్నదనేది అసలైన సమస్య కాదు. ఆ సిద్ధాంతం ప్రతిపాదించే సూత్రాలను అమలుచేయటంలో నిజాయితీ, చిత్తశుద్ధి ఎంత అనేది చూడాలి. సోషలిజంగాని, సరళీకరణగాని మొత్తంగా మానవ జాతి వికాసం కోసమే ప్రతిపాదించబడ్డాయి. 1917 లో రష్యాలో కమ్యూనిస్టు పాలన ఏర్పడినది మొదలు సోషలిజం, కమ్యూనిజంల విశ్వసనీయత క్షీణించింది. లిబరల్‌ క్యాపిటలిజం విషయంలోనూ ఇలాగే జరిగింది. లిబరల్‌ సిద్ధాంతాల పేరిట ప్రపంచంమీద ప్రాబల్యం సంపాదించడానికి అమెరికా ప్రయత్ని స్తున్నది. వాస్తవానికి స్వార్థ ప్రయోజనాలే ఉన్నాయి తప్ప లిబరలిజమేమీ లేదు. సైద్ధాంతికంగా పైచేయి సాధించడానికై ఎన్నడూ పోరాటం జరగలేదు. స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే జరిగింది. చేతల కోసం సిద్ధాంతాలు వల్లిస్తున్నారే తప్ప సిద్ధాంతాల కోసం చేతలు లేవు.
రేపు కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి అప్పుడు కమ్యూనిజం సూత్రాలను నిజాయితీగా అనుసరిస్తే  కమ్యూనిస్టు సిద్ధాంతానికి గల పరిమితులేమిటో వారు గ్రహించి అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. సోషలిజం, క్యాపిటలిజం ఒకదానికొకటి ప్రతిక్రియగా వస్తూ పోతూ ఉంటాయి. సోషలిస్టులు క్యాపిటలిస్టు లుగా, క్యాపిటలిస్టులు సోషలిస్టులుగా మారు తుంటారు. కాని అది సోషలిజం వైఫల్యమనో లేదా క్యాపిటలిజం వైఫల్యమనో వారెవరూ చెప్పరు. ఎందు కంటే వారికది సిద్ధాంతాలకు సంబంధించిన విషయం కాదు. అధికారానికి, స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే  సంబంధించినది. భారత్‌ లో మనం సైద్ధాంతిక స్థానాలకు సంబంధించిన ఈ నిజాయితీ సమస్యను నిజంగా పరిష్కరించ గలమా, మన సైద్ధాంతిక సూత్రాల విషయంలో నిజాయితీగా ఉంటూ తదనుగుణంగా వ్యవహరించే రాజకీయ సంస్కృతిని పెంచి పోషించగలమా అనేదే అసలైన ప్రశ్న. ఈ విషయంలో ఏకాత్మ మానవ దర్శనం దారి చూపుతుంది.
'దేశంకోసం రాజకీయాలు' అనేది దీనదయాళ్‌జీ సిద్ధాంతానికి ప్రాతిపదిక. ఇప్పుడు దేశంలో రాజకీ యంగా మార్పు వచ్చింది. ప్రజలు చాలా ఆశిస్తు న్నారు. దీనితో విభజించే, బుజ్జగించే రాజకీయాలకు కాలం చెల్లిందని ఒక నూతన శకం ఆరంభమైనదని మీరు భావిస్తున్నారా?
మొదటి ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలోనే ఈ విషయం చెప్పాననుకుంటాను. ఈ పని వారు చేయ వలసి ఉంది. అయితే కేవలం ప్రభుత్వం మారినంత మాత్రాన మొత్తం పరిస్థితి మారబోవటం లేదు. ఒకే ఒక్క పార్టీ మాత్రమే అలా చేసేందుకు ప్రయత్నిస్తే వారు ఎంత మేరకు సాధించగలుగుతారనే విషయం ఎప్పుడూ సందేహాస్పదమే. బుజ్జగింపు విధానాలు అనుసరిస్తే ఎంత దూరం పోగలరో నేను చెప్పలేను. దీనికి సామాజిక చైతన్యం కూడా అవసరమే. చివరకు తమ యోగ్యతకు తగ్గ ప్రభుత్వమే ప్రజలకు లభిస్తుంది. దేశం కోసం జీవించడానికి, మరణించడానికి సమాజం సిద్ధంగా ఉన్నదా అన్నదే మనం పరిశీలించ వలసిన అసలు సమస్య. రాజకీయవేత్తలు తమ పాత్ర పోషించవలసిందే. అయితే ఆ పాత్రకు కావలసిన వాతావరణాన్ని సమాజమే సృష్టించాలి. రాజకీయ వేత్తలు, సమాజం చేయి చేయి కలిపి నడవాలి. పేదరికం ఉన్నంతకాలం 'గరీబీ హటావో' వంటి నినాదాలు పనిచేస్తాయి. పేదరికాన్ని నిర్మూలించిన మీదట, ప్రజలు విద్యావంతులైన మీదట అధికారంలో ఉన్నవారు మరిన్ని ప్రశ్నలను, సవాళ్ళను ఎదుర్కో వలసి ఉంటుంది. కనుక అటువంటి పరిస్థితిని ఎదుర్కోవటం వారికి ఇష్టముండదు. అటువంటి ప్రలోభానికి రాజకీయవేత్తలు దూరంగా ఉండాలి. జాతీయ పునర్‌ నిర్మాణం దిశగా వాతావరణాన్ని మార్చడానికై అన్ని ప్రయత్నాలకు వారు ఊతమివ్వాలి.
ఏకాత్మ మానవ దర్శనాన్ని అమలులోకి తేవాలంటే అందుకు ఆచరణాత్మక పద్ధతి ఏమిటి?
ఒక దర్శన లేదా తత్వశాస్త్రం గురించి ఆలోచించి నపుడు దానిని భారతదేశానికి మాత్రమే పరిమితం చేయం; సమస్త విశ్వానికి దానిని అన్వయిస్తాం. యావత్‌ ప్రపంచం ధర్మోదయాన్ని వీక్షించాలని జ్ఞానేశ్వర్‌ వంటి సాధుపుంగవులు వచించారు. డాక్టర్‌ హెడ్గేవార్‌ కూడా ''ప్రపంచాన్ని పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం నుంచి విముక్తం చేసేందుకు భారత్‌ సంపూర్ణ స్వాతంత్య్రాన్ని సాధించాలి'' అంటూ కాంగ్రెసు మహాసభల్లో తీర్మానాన్ని ప్రతిపాదించారు.
దురదృష్టవశాత్తు అది ఆమోదించబడలేదు. ఒక జాతిగా భారత్‌కు గల ఈ లక్ష్యం విషయంలో భారత్‌ లోని సామాన్య ప్రజానీకానికి స్పష్టత ఉండాలి. భారత్‌కు గల ఈ యథార్థ అంతర్గత సామర్థ్యాన్ని సాకారం చేసే ఆలోచనా ప్రక్రియే ఏకాత్మ మానవ దర్శనం. ఇది భారతదేశానిదేగాక ప్రపంచానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించగలదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిద్ధాంతాలన్నీ దోపిడీ చేసేవిగాను, అణచివేసేవిగాను ఉన్నాయి.
ధర్మభావన ప్రాతిపదికగా ఏకాత్మ మానవ దర్శనం ద్వారా దీనదయాళ్‌జీ వాటన్నిటికీ ఒక ప్రత్యామ్నాయాన్ని అందజేశారు. ఇప్పటిదాకా మనం విదేశీ సిద్ధాంతాల ఆధారంగా వ్యవస్థతో ప్రయోగాలు చేశాం. ఇది ఈనాటి ఫ్యాషన్‌గా ఉంది. వాటిని సంపూర్ణంగా త్రోసిపుచ్చకుండా వాటిలోని సానుకూల మైన అంశాలను స్వీకరించి భారత గడ్డకు చెందిన ఉత్తమాంశాలను జోడించి ఒక నూతన నమూనాను నిర్మించటం గురించి మనం ఆలోచించవలసి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ద్వారా ఈ దిశగా కొన్ని ప్రయ త్నాలు జరుగుతున్నాయి. శక్తిశాలియైన సుసంపన్న మైన భారత్‌కు సంబంధించిన ఈ దర్శనం సకల జగత్తు శాంతి, శ్రేయస్సులకు దోహదం చేస్తుంది కనుక దీని ఆవశ్యకత ఈనాడు మరెంతగానో ఉంది. దీనిని సాకారంచేసేందుకై మనం ఆయా విధాన ప్రయోగాలను అన్వేషించవలసిన అగత్యముంది.
భారత్‌ ప్రాథమికంగా ఒక వ్యావసాయిక దేశమై నప్పటికీ ఇక్కడి రైతుల పరిస్థితి నిజానికి చాలా దయనీ యంగా ఉంది. దీనదయాళ్‌జీ చూపించిన దార్శనిక నిర్దేశనాన్ని అనుసరించి రైతుల సమస్యలకు పరిష్కా రాలు కనుగొనటమెలా?
వ్యవసాయం, అరణ్యాలు సహా ప్రకృతితో మనకున్న అంతర్నిహితమైన అనుసంధానతయే మన సుసంపన్నమైన జీవన మూల్యాలు, సంస్కృతిలోని రహస్యం. ప్రకృతిని మానవ జీవనంలోని ఒక అవిభాజ్యమైన భాగంగా మనం పరిగణిస్తాం. మనం ఎల్లప్పుడూ విరాట్‌ విశ్వంలోని ఒక యూనిట్‌గా జీవించాం. ఇప్పుడు కూడా భారత్‌ ప్రాథమికంగా వ్యావసాయిక దేశమే. రైతులు, వనవాసులే భారతీయ ప్రయోజనాలకు, జీవన విధానానికి యథార్థ వాహకులుగా ఉన్నారు. విధానపరమైన సంస్కరణలు కూడా వారినే అనుసరించాలి. ఈ పనిచేస్తూనే పరిశ్ర మలు కూడా మన సాంప్రదాయిక వివేచనకు అనుగు ణంగా ఉండాలనే విషయంలో మనం స్పష్టంగా ఉండాలి. 200 సంవత్సరాల క్రితం, బ్రిటిషువారు మనను పాలించటం మొదలుపెట్టకముందు మనం వ్యావసాయిక, పారిశ్రామిక ఉత్పత్తులు రెంటిలోను అగ్రగణ్యులు గా ఉంటుండేవారం. వేల సంవత్స రాలుగా ఈ రెండు ఉత్పాదక విధానా లను మనం అన్యోన్యంగా సమ్మిళితం చేసిన విషయాన్ని చాలా మంది పరిశోధకులు సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఈ సంప్రదాయాన్ని బ్రిటిషువారు సర్వనాశనం చేసిన తర్వాత మనం కూడా పృథక్‌ వైఖరితో ఆలోచిస్తున్నాం. వ్యవసాయం, పరిశ్రమ దేనిదారి దానిదేనని, ఒకదా నితో ఒకటి పొసగనివని భావిస్తు న్నాం. ఇది పక్కా పాశ్చాత్య ధోరణి. వ్యావసాయిక దేశమనో లేక పారిశ్రామిక దేశమనో మనం పేరు తగిలించుకోనక్కర్లేదు. మనకు రెండూ అవసరమే.
పేద రైతుల్లోని అత్యంత నిరుపేద రైతు కూడా పేదరికం నుంచి బయటపడగలిగే విధంగా మన విధానాలన్నీ ఉండాలి. భూమిలేని కూలీ ఆత్మహత్య చేసుకునే అగత్యం కలుగకూడదు. అదే సమయంలో ప్రపంచంలో మన ఔచిత్యం వెల్ల డయ్యేలా పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో మనం ముందుకు దూసుకుపోవాలి. అడవులను నిర్మూలించ కుండానే, బంజరు భూములను గరిష్ఠంగా వినియో గించుకుంటూ అవసరమైన పారిశ్రామికీకరణ జరగాలని దీన దయాళ్‌జీ అన్నారు. మన ఆహార అవసరాలు పూరించుకోవడానికి మాత్రమేగాక ప్రపంచ దేశాలకూ కొంత సరఫరా చేసేలా చూడటా నికై ఏ మేరకు వ్యావసాయిక భూమి అవసర మున్నదో మదింపు చేయాలి. పర్యావరణ సంతుల నాన్ని కాపాడటానికి కావలసిన అరణ్య ప్రాంత పరిధిని కూడా మదింపు చేయాలి. ఆపైన పరిశ్రమల కోసం ఎంత భూమిని కేటాయించవచ్చునో కూడా లెక్కించవచ్చును.
ఈ విషయంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. పూర్వ సర్‌సంఘ చాలక్‌ మాననీయ సుదర్శన్‌జీ ఝార్ఖండ్‌లో ఒక ఆదర్శవంతమైన ప్రయోగం చేశారు. ఆయన ఒక షెడ్యూల్డు జాతుల బృందం వారిని పిలిచి ఒక చిన్న తండూర్‌ వంటి మూసతో ఇనుము తయారీ సాంకేతికతను బోధించారు. ఇలాంటి ఉదాహరణ లను పరిగణనలోకి తీసుకొని క్రొత్త విధానాలను, క్రొత్త ప్రయోగాలను మనం కనుగొనవలసి ఉంది. అమెరికా, ఐరోపాల్లోని పరిస్థితులు భిన్నమైనవి. అందువల్ల వారి ప్రణాళికా వ్యవస్థలు కూడా భిన్నమైనవి. వాటిని అదేవిధంగా సార్వత్రికంగా వర్తింప జేయలేము. వారిలో మంచి అంశాలు ఏవి ఉన్నా మనం తప్పకుండా నేర్చుకుంటాం. అయితే ప్రాథమికంగా మనం మన అవసరాలకు తగిన సాంకేతికతను, విధానాలను రూపొందించుకోవలసి ఉంది. మన సాంకేతికత భారతీయ విజ్ఞానంతోను, సంప్రదాయంతోను సమ్మిళితమైతే సర్వజనులకు సుఖసంతోషాలను, శ్రేయస్సును చేకూర్చే వ్యవస్థను ప్రసాదించగలదని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను.
ఒత్తిడి బృందాల వల్ల ప్రజాస్వామ్యం చైతన్యంతో తొణికిసలాడుతుందని రాజకీయశాస్త్రంలో బోధిస్తారు. మనం పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు సాగవలసి ఉంటుందని పండిట్‌జీ విశ్వసించారు. ''ఒక ¬దా- ఒక పింఛను'' లేదా రిజర్వేషన్ల కోసం డిమాండు వంటి ఉద్యమాలను ఏకాత్మ మానవ దర్శనం దృష్టితో ఎలా చూస్తారు?
విశిష్ట ప్రయోజన బృందాలను ఏకాత్మ మానవదర్శనం త్రోసిపుచ్చిందని నేననుకోవటంలేదు. ప్రజాస్వామ్యంలో కొన్ని ఆకాంక్షలుంటాయి గనుక విశిష్ట ప్రయోజన బృందాలు ఏర్పడుతున్నాయి. అయితే ఇతరులకు కష్టనష్టాలు కలిగే రీతిలో ఈ ఆకాంక్షలు తీర్చేందుకు మనం యత్నించకూడదు. సర్వజనుల శ్రేయస్సు అనే సమగ్ర వైఖరి మనకు ఉండాలి. విస్తృతమైన జాతీయ ప్రయోజనంలోనే నా ప్రయోజనం ఇమిడి ఉన్నదని గ్రహించటంలో వివేక ముంది. ఈ సమస్యల కోసం ఎలాంటి ఆందోళనలు జరగకుండా ప్రభుత్వం కూడా వీటి పట్ల సున్నితంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఏకాత్మ మానవ దర్శనం దృక్పథం ప్రకారం చూస్తే ప్రభుత్వం మన నుంచి వేరైనదేననే ఆలోచనను మార్చుకోవాలి. ఉదాహరణకు మీకు ఫ్యాన్‌ గిరగిరా అతివేగంగా తిరగాలి. నాకేమో ఫ్యాన్‌గాలి అసలు అక్కర్లేదను కోండి. అలాంటప్పుడు ఫ్యాన్‌ కాస్త తక్కువ వేగంతో తిరిగేలా మనమిద్దరం ఒక అంగీకారానికి రావచ్చు. ఈ రకమైన దృక్పథంతో ప్రయోజనాల మధ్య సామరస్యం సాధ్యమే. సిగపట్లకు దిగకుండా సమ న్వయ సామరస్యాలతో మనం పురోగమించగలం. సామూహిక ప్రయోజనంలోనే నా ప్రయోజనం ఉన్నదనే విషయాన్ని ప్రభుత్వం, సమాజం ఉభయులూ గ్రహించాలి. ఉభయపక్షాలలోను ఈ సంతులనం అవసరం. వాస్తవానికి ఇవి రెండు పక్షాలు కానే కావు. ఒకే విరాట్‌ వ్యక్తిత్వంలోని భాగాలు మాత్రమే. ఒక వర్గం మరో వర్గాన్ని పీడన, తాడనలకు గురిచేయటం అందరి ప్రయోజనాలకు వ్యతిరేకమని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఈ రకమైన వైఖరినే మనం అలవరచు కోవలసి ఉంది.
ఒకవంక మీరు సమాజం అంతటి పరిణతి పొందలే దంటున్నారు. మరోవంక అత్యంత బలహీనమైన లంకె పరివర్తనాత్మక పాత్ర నిర్వర్తించాలని ఆశిస్తు న్నారు. ఇది ఆదర్శమే తప్ప ఆచరణ సాధ్యం కాదని మీకు అనిపించటంలేదా?
ఇది అసాధ్యంగాను, కష్టంగాను కనిపించవచ్చు. కాని ముందుకు పోవడానికి ఇదొక్కటే మార్గం. గత్యంతరంలేదు. ప్రభుత్వం కట్టుదిట్టమైన విధానాలు రూపొందించాలి. సమాజాన్ని ఏకాత్మక దృక్పథంతో సంఘటితం చేయాలి. చెట్టపట్టాలుగా ఈ పరస్పర పూరక ప్రక్రియలు సాగాలి. 'ఈ పని మేము చేయగలం' అని రాజకీయ పార్టీలు తీర్మానించాలి. ఇది మనం ప్రయత్నించి చూడలేదు గనుకనే సాధించ లేకపోయాం. సామాజిక, రాజకీయ మేధావులు ఉభయులు ఈ విషయం అంగీకరించి ఏకోన్ముఖంగా కృషిచేస్తే ఇది సాధించగలం. ఒక్కొక్కసారి మనం కఠిన పరిస్థితుల గుండా పయనించవలసి ఉంటుంది. అయినా సరే అపేక్షిత దిశలో మనం పోతూఉండాలి. ఉదాహరణకు ఘోష్‌ వాద్యాలతో పథసంచలనం (రూట్‌మార్చ్‌) చేస్తున్నపుడు వాద్యాలు మ్రోగించలేని పరిస్థితి వస్తుంది, కాని ప్రత్యామ్నాయ మార్గం కనిపెట్టి మార్చింగ్‌ సాగవలసి ఉంటుంది. చివరకు మళ్ళీ సమన్వయం సాధించవలసి ఉంటుంది. ఈ ఉదా హరణ ఏదో చిన్నవిషయంగా కనిపించవచ్చు. కాని ఇది మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది కనుక సరైన ఉదాహరణ అనే చెప్పవచ్చు. అధికారంలో ఉన్నవారు, సమాజంలో పనిచేసేవారు చేతులు కలిపి దేశాన్ని బలోపేతం చేయగలరు. ఇది పోరాటంతో జరిగే పని కాదు. ఏకాత్మ మానవ దర్శనం అత్యంత ఆచరణా త్మక విధానం. ఈ మార్గంలో కొంచెం నడిస్తే క్షేత్ర స్థాయిలో దీని ఆచరణాత్మకత ఎలాంటిదో గ్రహించ గలుగుతాం. తగినంత ప్రయోగం చేసి ప్రదర్శించనిదే దీని ఆచరణ సాధ్యతను నిరూపించలేం.
కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు సజావుగా ఉండటంలేదు. కొన్నిసార్లు ప్రత్యేక ప్యాకేజీల పేరుతో, మరికొన్నిసార్లు గుర్తింపు సమస్యలతో సంబంధాలు చెడిపోతున్నాయి. ఏకాత్మ మానవదర్శనం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలా?
భావాత్మక హార్దికత (జుఎశ్‌ీఱశీఅaశ్రీ షశీతీసఱaశ్రీఱ్‌వ) ఒక్కటే దీనికి పరిష్కారం. కేంద్రం, రాష్ట్రాలూ దేశం కోసమే ప్రభుత్వాలు నడుపు తున్నాయి. రాష్ట్రాలన్నీ దేశం లోని అవిభాజ్యమైన భాగాలే తప్ప అవి వేరైనవి కావు. చేతులు, కాళ్ళు, లేదా మెదడు తాము స్వతంత్రులమని చాటుకోలేవు. అలాగే రాష్ట్రాలు దేశ శరీరంలోని అవిభాజ్యమైన అంగాలు. ఈ రకమైన అనుబంధం ఉన్నంత కాలం అంతా సజావుగానే సాగుతుంది. ప్రత్యేక ప్యాకేజీ అనేది ఒక రాజకీయ సాధ నంగా తయారైతే, రాజకీయ బ్లాక్‌ మెయిలింగ్‌ తమను ముందుకు తీసుకుపోగలదని తక్కిన రాష్ట్రాలన్నీ భావిస్తే అది అనారోగ్య కరమైన పోటీకి దారితీస్తుంది. సామరస్య పూర్వకమైన సంబం ధాలు నెలకొనాలంటే తార్కికంగా సమర్థించుకోగలిగిన చర్యలే మనం తీసుకోవలసి ఉంటుంది.
నైతిక నిష్ఠ, నిజాయితీలే ప్రధానమైన కొలబద్ధలని మీరు చెప్పారు. ఏకాత్మ మానవ దర్శనానికి అనుగుణంగా తీసుకోబడిన లేదా సూచింపబడిన ఆరంభిక చర్య, ఏదైనా మీ దృష్టిలో ఉన్నదా?
సామాజికంగా వెనుకబడిన వర్గాలవారికి రిజర్వేషన్లు ఇందుకు చక్కని ఉదాహరణ. దీనిమీద రాజకీయాలు చేయటానికి మారుగా రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా ఈ విధానాన్ని మనం అమలుచేసి ఉన్నట్లయితే ఈనాటి పరిస్థితి వచ్చేదే కాదు. ఆరంభం నుంచి దీనిని రాజకీయం చేశారు. సమాజ ప్రతినిధులతో బాటుగా మొత్తం జాతి ప్రయోజనాలపట్ల సిసలైన ఆసక్తి కలిగి ఉండి సామాజిక సమానత్వం పట్ల నిబద్ధత కలిగినవారితో కూడా ఒక కమిటీని నెలకొల్పాలని, ఏయే తరగతుల వారికి ఎంతకాలం రిజర్వేషను అవసరమో ఆ కమిటీ నిర్ణయించాలని మా అభిప్రాయం. స్వయం ప్రతిపత్తి గల కమీషన్ల మాదిరిగా ఈ రాజకీయేతర కమిటీయే నిర్ణయాలను అమలు చేసే అధికార సంస్థగా ఉండాలి. నిజాయితీగా, నైతిక నిష్ఠతో పనిచేసేవిధంగా రాజకీయ అధికారులు వారిని పర్యవేక్షించాలి.
ఏకాత్మ మానవ దర్శనం విద్యను, విద్యావిధానాన్ని ఉపాధి కల్పనతోను సంస్కారాల (సంతులిత జీవనానికి తోడ్పడే విలువల) తోను కూడా ముడి పెడుతుంది. ప్రస్తుత విద్యావిధానాన్ని సంస్కరించ డానికి ఏవైనా కొన్ని చర్యలు సూచిస్తారా?
ముందుగా మనం విద్య గురించి ప్రస్తుతమున్న ఆలోచనను సంస్కరించటం అవసరం. విద్య అనేది ఉపాధి కల్పించేదిగా ఉండాలని, అదే సమయంలో అది మంచి మనుష్యులను తయారుచేయాలనే విషయాన్ని ముఖ్యమైన విద్యా కేంద్రాలన్నీ అంగీకరి స్తాయి. స్వాతంత్య్రానంతరం మన విలువల ఆధారంగా గల మనదైన విద్య నమూనా గురించి మనమెన్నడూ ఆలోచించనే లేదు. చేసిన కొద్దిపాటి సూచనలేవైనా ఉన్నా వాటిని అమలుచేసిందీ లేదు. ఏకాత్మ దృక్పథం ప్రాతిపదికగా మనం మన విద్యావ్యవస్థ స్థితినీ, గతినీ సంపూర్ణంగా మార్చ వలసి ఉంది. ఉత్తములైన, స్ఫూర్తిప్రదాయకులైన  ఉపాధ్యాయులను తయారుచేయటం మీద విద్యా విధానం దృష్టిపెట్టాలి. 
ఇందుకుగాను అధికారంలో ఉన్నవారు విద్యా రంగంలో జోక్యం కల్పించుకోవటం తగ్గాలి. విద్య సత్యంమీద ఆధారపడినదై ఉండాలి. పౌరులలో ఆత్మవిశ్వాసాన్ని నింపేదిగా ఉండాలి. అది మనలను మంచి మనుష్యులుగా తీర్చిదిద్దాలి. పాఠశాలల్లో బోధించే విద్యకే నేను పరిమితం కావటంలేదు. కుటుంబంలోను, సమాజంలోను కూడా వాతావరణం విద్యకు దోహదం చేసేదిగా ఉండాలి. సమాజ కేంద్రితమైన విద్య గురించి దీన దయాళ్‌జీ మాట్లాడు తుండేవారు. ఆ దిశగా మనం నిజాయితీగా ఆలో చించి పురోగమించవలసిన అవసరముంది.

ఏకాత్మ మానవ దర్శనం ఎప్పటికీ అనుసరణీయం Reviewed by rajakishor on 7:12 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.