Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

నిజమైన నాయకుడు ఎవరు?

ప్రొ. ముదిగొండ శివప్రసాద్, ఆంధ్రభూమి, 13-10-2015

అభ్యుదయ పథంలో ముందుకు సాగిపోతున్న రాష్ట్రాలలో గుజరాత్ ప్రథమస్థానంలో ఉంది. బిహారు ఇరవై ఒకటవ స్థానంలో ఉంది. ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం పెట్టుబడులకు అనువైన భారతదేశ ప్రాంతాలల్లో గుజరాత్ మొదటిస్థానంలో, ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. ఇవి ఆధికారిక గణాంకాలు. ఒక రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే అందుకు కొన్ని ముఖ్య లక్షణాలను మదుపుదారుడు చూచుకుంటాడు. అక్కడ నీరు, విద్యుత్తు, నేల పుష్కలంగా లభించాలి. కూలీ చౌకగా ఉండాలి. ముడిసరుకు లభించాలి. తన పరిశ్రమకు రక్షణను ప్రభుత్వం కల్పించాలి. ప్రజలలో పనిచేసే మనస్తత్వం ఉండాలి. రహదారి సౌకర్యాలుండాలి. సమ్మెలు, సత్యాగ్రహాలు జరిపి లాకౌట్లు ప్రకటించే పరిస్థితి రాకూడదు. ఇలాంటివి చూచుకుంటారు. ఇప్పుడు ఆలోచించండి. ఈ లక్షణాలు భారతదేశంలో ఏయే రాష్ట్రాలల్లో ఉన్నాయో ఎక్కడెక్కడ లేవో- మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని దేశభక్తి అనే గీటురాయిపై చూడాలి. బిహారును లల్లూప్రసాద్‌యాదవ్ పదిహేను సంవత్సరాలు, నితీశ్‌కుమార్ పది సంవత్సరాలు పరిపాలించారు. అక్కడ దారిద్య్రం విలయతాండవం చేస్తున్నది. ఎందువల్ల? ప్రజలు సోమరిపోతులు. చీకటిపడితే చాలు దారిదోపిడీలు మొదలవుతాయి. 

విహార అనే సంస్కృత శబ్దంనుండి బిహార్ అనే మాట పుట్టింది. శ్రీకృష్ణుడు గౌతమబుద్ధుడు విహరించిన భూమి ఇదేనా? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నరేంద్రమోదీ బిహారు అభివృద్ధికోసం మొన్న ఒక లక్షా అరవై వేల కోట్లు ప్రకటించారు. ఈ మొత్తం లల్లూయాదవ్ వంటివారి చేతిలో సురక్షితంగా ఉంటుందా?? మొత్తం వీరు పలహారం చేసి విహారయాత్రలు చేయరా?
ఇటీవల ఒక ఇంగ్లీషు ఛానల్‌లో లల్లూయాదవ్‌గారి ప్రసంగం విన్నాను. అందులో ఎక్కువ భాగం నరేంద్రమోదీని, ఎల్‌కె అద్వానీని తిట్టేందుకు కేటాయించాడు. అద్వానీ మరణశయ్యమీద ఉన్నాడట, మోదీ ‘దేశభక్తుల చేతిలో కీలుబొమ్మ- అందుకని అతనిని నమ్మవద్దు’ అని లల్లూయాదవ్ ప్రజలకు హితబోధ చేశాడు. అంతేకాదు హిందూ ఓట్ బ్యాంకు, కుర్మీ ఓట్ బ్యాంక్, యాదవ్ ఓటు బ్యాంక్, దళిత్ ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు ముస్లిం ఓటుబ్యాంకు ఎందుకు ఉండకూడదు?? అని అసదుద్దీన్ ఒవైసీ సూటిగా ప్రశ్నించాడు. ఆయన బిహారులోని సీమాంచల్ ప్రాంతంలో నలభై ముస్లిం మెజారిటీ (ప్రభావిత) ప్రాంతాలల్లో మజ్లీస్ అభ్యర్థులను నిలబెడుతున్నాడు. అంటే ‘యంవై’ కూటమి దీనివల్ల దెబ్బతింటుంది. యం అంటే ముస్లిం వై అంటే యాదవ్.

ఒవైసీ హిందువుల చేతిలో కీలుబొమ్మ- మా సెక్యులర్ విజయావకాశాలను దెబ్బతీస్తున్నాడు అని లల్లూయాదవ్‌తోబాటు పవన్‌వర్మ ఆరోపించారు. ఈయన జెడియు ప్రవక్త- ఔరా? అని ఆశ్చర్యపోయాను. ఈ ప్రసంగాలు విన్నాక నాకు స్పష్టంగా ఒక విషయం తెలిసింది. హిందువులకు శత్రువులు హిందువులే అని! 

జీలం నదీ తీరంలో రెండువేల సంవత్సరాలకు పూర్వం అలెగ్జాండరు- పురుషోత్తమునికి మధ్య యుద్ధం జరిగినప్పుడు అలెగ్జాండరుకు మద్దతు పలికింది తక్షశిలరాజు అంభి! పృథ్విరాజు మీద 12వ శతాబ్దంలో ఘోరీ మహమ్మద్ దండయాత్ర చేసినప్పుడు ఆయనకు భారతదేశపు తలుపులు బార్లా తెరిచింది జయచంద్ అనే భారతీయుడు. ఈ జయచంద్‌కు పధ్నాలుగవ తరంవాడు వి.పి.సింగ్- మండల్ కమిషన్ పేరుతో ఉత్తరప్రదేశ్‌లో ప్రజలను రెచ్చగొట్టి కొద్దినెలలు ప్రధానమంత్రి అయినాడు.
సబూర్‌భాయి పేరు విన్నారా? ఇతడు గుజరాత్‌లోని జీరాభాయి అనే హిందూ సైనికుడి కొడుకు. వరంగల్ నుండి 241 టన్నుల బంగారం, కోహినూర్ వజ్రం కొల్లగొట్టుకొనిపోయాడు. హళిబీడు శ్రీరాజేశ్వర దేవాలయం నేలమట్టం చేశాడు. ఇదెలా జరిగింది?? (పూర్తి చారిత్రక వివరాలకు మాలిక్‌కాఫర్ నవల చూడండి.) రెండవ ప్రతాపరుద్రుని ఓటమికి స్థానిక రెడ్డి- వెలమ కులాల మధ్య ఘర్షణ ఒక కారణం. రాణాప్రతాప్‌కు వ్యతిరేకంగా అక్బర్ సేనలకు ఆధిపత్యం వహించిన మహనీయుని పేరు రాజామానసింగ్. సుక్షత్రియుడు. ‘మాకు స్వాతంత్య్రం వద్దు’ అని బ్రిటీషు పాలనను సమర్ధించిన జస్టిస్ పార్టీ నాయకులలో ఎక్కువ మంది తమిళులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజును వీర పాండ్య కట్టబ్రహ్మన్నను శత్రువులకు పట్టించి ఇచ్చింది హిందువులే. ఎన్.డి.తివారి- భరద్వాజ్, ఆనందవర్మ, మనీష్ తివారి, మణిశంకర్ అయ్యర్, సుప్రియా చతుర్వేది, గిరిజావ్యాస్, శీలాదీక్షిత్, సాందీప్ వీరంతా జన్మసిద్ధంగా బ్రాహ్మణులు. సోనియాగాంధీ పాద సేవకులు.

ఇటీవల పత్రికలలో ఒక వార్త చూచాను. పి.చిదంబరం (మాజీ కేంద్రమంత్రి) సహాయంతో అరుణ్ అనే ఆయన చేసిన 223 కోట్ల ఆర్థిక నేరం ‘వాసన్ ఐకేర్ గ్రూపు’లో జరిగిన గోల్‌మాల్ ఇది. ‘ఎన్‌డిఏ నాయకులు మేక తోలుకప్పుకున్న తోడేళ్లు’అని చిదంబరం లోక్‌సభలో చేసిన ప్రసంగ పాఠం నాకింకా బాగా గుర్తుంది. ఎవరు మేకతోలు కప్పుకున్న పులులో ఇప్పుడు తెలుస్తున్నది. చిదంబరం ఎప్పుడూ మచ్చలేని తెల్లని బట్టలు ధరిస్తాడు. దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన రోజులల్లో ఆనాటి ప్రధాని చంద్రశేఖర్ లారీలల్లో బంగారు దిమ్మెలను విదేశాలకు తాకట్టు పెట్టడానికి రహస్యంగా చేరవేస్తున్న సన్నివేశం నాకు గుర్తుకు వచ్చింది. చైనా, రష్యా, అమెరికా, పాకిస్తాన్‌లకు రహస్య సమాచారాలు చేరవేస్తున్న వారితో భారతీయుల పాత్ర కూడా గణనీయంగా ఉన్నట్లు చాలాసార్లు నిరూపణ అయింది. భారతదేశాన్ని రక్షించిన వారిలో సిక్కులు ప్రథములు. వారిని ప్రత్యేక దేశం (ఖలిస్థాన్) కోరుకోండి అని రెచ్చగొట్టిందీ భారతీయులే. ఇదే వర్గం ఇప్పుడు పెన్షన్‌రూల్స్ పేరుతో భారత మాజీ సైన్యాన్ని రెచ్చగొట్టి దేశ రక్షణను బలహీనపరుస్తున్నది. 

తమిళనాడులో తమిళ మకలోకచ్చి హిందూమున్నాని సంస్థల కార్యకర్తలు లోగడ సామాజికోద్యమాలు నడిపారు. ఎనిమిది మంది హిందూ మున్నాని కార్యకర్తలు హత్యకు గురిఅయినారు. ఎందువల్ల?? రజనీకాంత్ టిప్పుసుల్తాన్ వేషం వేయాలనుకుంటే అభ్యంతరం చెప్పారు. నటులకు సామాన్యంగా కళ పేరుతో వ్యాపారం చేసుకోవటమేకాని ప్రత్యేక సిద్ధాంతాలు అరుదుగా ఉంటాయి. సిద్ధాంతాలకోసమే కళారంగంలో ప్రవేశించిన వర్గాల సంగతి వేరు. టిప్పుసుల్తాను ఎందరో హిందువులను యుద్ధంలో చంపాడు. టిప్పును బ్రిటీష్‌వారు చంపారు. 

హిందువులకు జీహాదీలు క్రూసేడర్లు చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు శత్రువులని అందరూ చెపుతుంటారు. మరి ఈ హిందువుల మాటేమిటి? నహర్ అంటే నదీ తీరం. కాశ్మీరులోని నది ఒడ్డున జీవించే కుటుంబం అలహాబాదుకు వలసవచ్చారు. వీరే నెహ్రూ వంశీయులు. కాశ్మీరులో షేక్‌అబ్దుల్లా వీరిని పండిట్స్ అంటారు. అంటే కాశ్మీరీ బ్రాహ్మణుల ‘డెమోగ్రఫీ’ని మారుస్తుంటే నెహ్రూగారు నిరసన తెలుపకుండా ప్రోత్సహించటం దారుణం. అలాగే ఉస్మాన్ ఆలీఖాన్‌కు కూడా నెహ్రూగారు మద్దతునిచ్చారు. ఏడవ నిజాం నవాబు కోట్లాది ముస్లిములను తెలంగాణాలోకి దిగుమతి చేసుకోవటం మొదలుపెట్టాడు. దీనివలన తెలంగాణా ముస్లిం మెజారిటీ దేశం(కంట్రీ)గా మార్చి పాకిస్తాన్ వలె భారతదేశంతో సంబంధం లేకుండా చేయాలనే ప్రయత్నం మొదలైంది. దీనిని నెహ్రూ ప్రోత్సహించటం ఏమిటి?? ‘ఇది తప్పు’ అన్న నాటి హోంమంత్రి సర్దార్‌పటేల్‌ను నెహ్రూ గౌరవించలేదు. ఈ మత పిచ్చిని స్వయంగా నెహ్రూ ప్రోత్సహించి తాను సెక్యులరిస్టును అని చెప్పుకున్నాడు. 

గద్వాలకు చెందిన పాగ పుల్లారెడ్డి తెలంగాణ స్వాతంత్య్ర సమర యోధుడు. 1947లో సూర్యాపేట వద్ద నడిపిన బార్డర్ క్యాంపు ఫోటోలు, డాక్యు మెంట్లు చూపించారు. ప్రాణాలు అరచేత పెట్టుకొని వేలాది మంది ప్రజలు తెలంగాణ నుంచి పారి పోతుంటే, సూర్యాపేట వద్ద వీరికి అన్నోదకాలను ఏర్పాటు చేశారు. ఇలా సంవత్సరం పాటు సాగింది. రజ్వీ సైన్యం ఓటమిపాలైన తర్వాత తెలంగాణ ప్రజలు తిరిగి తమ స్వస్థలాలకు వస్తే అక్కడ ఇళ్లు తగలబడి ఉన్నాయ. స్త్రీలు మానభంగాలకు గురయ్యారు. ఇంత జరిగినా నెహ్రూ నిజాం చాలా మంచోడు అంటూ కితాబిచ్చారు. 

స్వామి రామానందతీర్థ వంటి వారి త్యాగాలు పట్టించు కోలేదు. ఈయన సమాధి బేగం పేటలో ఉంది. రామానంద తీర్థ, దివంగత ప్రధాని పివి నరసిం హారావుకు రాజకీయ గురువు.

18-9-2015నాడు కలకత్తాలో 64 నేతాజీ రహస్య పత్రాలు విడుదల చేయబడ్డాయి. నేతాజీ కుటుంబ సభ్యులు శిశిర్‌బోసు భార్య కృష్ణబోసు, సురజిత్‌కర్ పురకాయస్థ చంద్రబోసులకు రహస్యపత్రాలు లాంఛనంగా పోలీసు కమిషనర్ అందించారు. ఇది 12800 పుటలున్నాయి. నేతాజీ 1940లో ‘చలో ఢిల్లీ’అనే నినాదం ఇచ్చారు. ఇప్పుడు 2015లో కుటుంబ సభ్యులు మళ్లీ ‘చలో ఢిల్లీ’అన్నారు. ఈ మాటకు అర్థం ఏమిటంటే కలకత్తాలో వలెనే న్యూఢిల్లీలోని రహస్యపత్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం బయటపెట్టాలి అని!!

ఇంగ్లీషు టీ.వి. ఛానల్‌లో నేతాజీపై చరిత్ర వ్రాసిన వ్యక్తి మృదులా ముఖర్జీ ఎందుకు గట్టిగా అరుస్తున్నది? కాంగ్రెసు నాయకుల జీవిత చరిత్రలు ఈమె వ్రాశారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియమ్ డైరెక్టరుగా పనిచేశారు. ఇవ్వాళ ఆమెచేసిన పరిశోధనలు అసత్యమైపోయాయి అనే బాధతోనా? శర్మిలాముఖర్జీ (కాంగ్రెసు స్పోక్స్‌పర్సన్) ఎందుకు ఇంకా గట్టిగా అరుస్తున్నారు? నెహ్రూగారి నిజస్వరూపం బయటపడిందనా? 

1945లో విమాన ప్రమాదం జరుగలేదు. జరుగని విమాన ప్రమాదంలో నేతాజీ ఎందుకు చనిపోతాడు? ఒక కుండ చూపించి ‘ఇదిగో ఇది నేతాజీ చితాభస్మం’ అన్నారు. దాన్ని ఇండియాకు ఎందుకు తెప్పించలేదు? న్యూఢిల్లీలో ఉన్న దస్త్రాల్లో నెహ్రూ కుటుంబం లోగడ ఎన్నింటిని మాయం చేసిందో ఎవరికీ తెలియదు. కోల్‌కతాలో మమతా బెనర్జీ విడుదల చేసిన దస్త్రాలు ప్రధానంగా నేతాజీ కుటుంబ సభ్యులను దేశ ద్రోహులుగా భావించి వారిపై గూఢచర్యం జరిపిన అంశాలున్నాయి. ఇది తగునా? ఇప్పుడు కోల్‌కతా, ఢిల్లీ ఫైళ్లతో పాటు కె.జి.బి ఫైళ్లను కూడా కలిపి తులనాత్మకంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. 

నేతాజీ ఫైళ్లు వెలుగు లోకి వస్తే రాత్రికి రాత్రి జర్మనీ, రష్యా, అమెరి కాలతో మన సత్సంబంధాలు దెబ్బతినవు. సరికదా 125 కోట్ల భారత ప్రజలు సంతో షిస్తారు. నెహ్రూ పరపతి మాత్రం తుడిచి పెట్టుకుపోతుంది. 

బతికి వున్న నేతాజీ మరణించాడని ప్రచారం చేయవలసిన అవసం ఆయనకు ఎందుకు కలిగింది? జర్మనీలో నివసిస్తున్న నేతాజీ మేనల్లుడి ఉత్తరాలు తెరిచి రహస్యంగా భారత గూఢచారులు నెహ్రూ ఆదేశాలతో ఎందుకు చదివారు? ఆ ఉత్తరాలల్లో ఏమైనా అభ్యంతర కరమైన సమాచారం లభించిందా? ఆ గూఢచర్యం దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగింది.

అంతర్జాతీయ స్థాయగల చేతివ్రాతల నిపుణుడు గుమ్‌నామ్ బాబా చేతివ్రాతను నేతాజీ చేతివ్రాతతో పోల్చి ఇద్దరూ ఒకటే అని చెప్పాడు. ఆ గుమ్ నామీ బాబా ఏమైనాడు? రాబోయే కొద్ది రోజుల్లో ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే అంశాలున్న దస్త్రాలు వెలుగులోకి రావచ్చు. అప్పుడు చరిత్రకారులు నేతాజీని అస లైన హీరోగా తప్పక గుర్తిస్తారు.

నిజమైన నాయకుడు ఎవరు? Reviewed by rajakishor on 9:40 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.