అమెరికాలో హిందూ స్వయంసేవ
వి. భాగయ్య, సహసర్ కార్యవాహ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
ఆంధ్రభూమి , ఆదివారం మాగజైన్ , 25-10-2015
ఈ విశాలవిశ్వం భగవంతుడి సృష్టి. ఇది నిత్యచైతన్య స్ఫూర్తి. ఈ ప్రపంచంలోని ప్రతి జీవిని, ప్రకృతిని ప్రేమించడం హిందుత్వ లక్షణం. ఏకత్వంలో భిన్నత్వాన్ని దర్శించడం దీని ప్రత్యేకత.
ఆధునిక ప్రపంచానికి చుక్కానిలా చెప్పుకునే అమెరికాలో ఈమధ్య పర్యటించినపుడు ఎన్నో విషయాలను గమనించాను. న్యూజెర్సీలో సెప్టెంబర్ 27న జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఓ శాస్తవ్రేత్త అభిప్రాయం నన్ను ఆకట్టుకుంది. ఆ సైంటిస్ట్ అక్కడ 20 ఏళ్లుగా నివసిస్తున్నారు. ‘ఇవాళ నేను ఇలా ఉన్నానన్నా, ఉత్తమ వ్యక్తిత్వంతో ఎదిగానన్నా అది సంఘ్ స్కూల్ విద్యాభారతిలో విద్య అభ్యసించడంవల్లే సాధ్యమైంది. ఆ పాఠశాల ఓ విజ్ఞానవిహారం. అమెరికాలోనే ఉంటున్న నా పిల్లలకు కూడా ఈ తరహా విద్య అభ్యసించే అవకాశం ఉండాలని కోరుకుంటున్నా’నని ఆయన అన్నారు. అత్యున్నత పదవులు, హోదాలు, అర్హతలతో అమెరికాలో ఉంటున్న అనేకమంది హిందువుల మనోభావం కూడా ఇదేనని నా అభిప్రాయం. ఇలాంటివారిని సంఘటిత పరుస్తోంది అమెరికాలోని హిందు స్వయంసేవక్ సంఘ్. సంస్కృతి, భక్తి, మానవత్వం అనే అంశాల ఆధారంగా హిందువలందరినీ ఒకతాటిపైకి తీసుకువస్తోంది. భారత్‌లో అన్ని భాషలు, సంప్రదాయాలు, వివిధ ప్రాంతాలనుంచి వచ్చి అమెరికాలో ఉంటున్న 250మంది హిందువులు ఇక్కడ కలుసుకున్నారు. ఆడిపాడారు. ఒక్కొక్కరు తెచ్చిన ఆహారపదార్థాలను ఇచ్చిపుచ్చుకుని కలసి తిన్నారు. హిందుత్వలోని భావశుద్ధి గురించి చర్చించుకున్నారు. అందులోని ఔన్నత్యాన్ని స్మరించుకున్నారు.
ఆ తరువాత బోస్టన్‌లో జరిగిన మరో కార్యక్రమంలో మరోరకమైన చర్చ జరిగింది.
అమెరికాలో ఉంటున్న హిందువులంతా హిందువులుగా కలుసుకోవడం లేదని, తమిళులనో, తెలుగువారిమనో, ఉత్తరాదివారమనో, వైష్ణవులమనో చెప్పుకుని కలుస్తున్నామని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ సిఇఒ అభిప్రాయపడ్డారు. హిందువులలో ఐక్యత కన్పించకపోతే పిల్లలకు దాని విలువ ఎలా తెలుస్తుంది. అందువల్ల సంస్కృతిపరంగా హిందువులంతా సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే అమెరికాలో హిందువులను ఏకతాటిపైకి తీసుకువచ్చే బృహత్తర బాధ్యతను హిందు స్వయం సేవక్ సంఘ్ చేపట్టింది. 35 సంవత్సరాలుగా ఈ క్రతువును సాగిస్తోంది. 150 ప్రాంతాల్లో హిందూ స్వయం సేవక్ శాఖలు పనిచేస్తున్నాయి. అమెరికన్లను సోదరులుగా భావిస్తూ వారిలో, పేదలకు మానవత్వంతో సేవలందించేందుకు కృషి చేస్తోంది. హిందూ సమాజాన్ని ఒకటిగా చేసి వారిని సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చేస్తోంది. ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్లకు హిందూస్వయంసేవక్ సంఘ్ సహాయం ఉపకరిస్తోంది. వారికి మంచి ఆహారం, మంచి విద్య అందించేందుకు కావలసిన పుస్తకాలు ఇస్తున్నది. పియోరియాలోని హిందూస్వయం సేవక్ సంఘ్ చేపట్టిన ఈ తరహా కార్యక్రమం విజయవంతం అవుతోంది. అక్కడి స్కూళ్లలో ఉండే పేదలైన ఆఫ్రికన్ అమెరికన్ పిల్లలకు అన్నీతానే సేవలందిస్తోంది. హెచ్‌ఎస్‌ఎస్ నిర్వహించిన గురువందన కార్యక్రమం అమెరికన్ టీచర్ల మనసు చూరగొంది.
ఇటీవల వచ్చిన కత్రినా తుఫానుతో నష్టపోయిన వారికి సాటి హిందువులతో కలసి ఈ సంస్థ ఆదుకుంది. నేపాల్‌లో ఇటీవల ఏర్పడిన ప్రకృతి విపత్తులో నష్టపోయినవారికి ఈ సంస్థ ఎంతో సహాయం చేసింది. ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు అక్కడ అంతా కొత్తగా ఉంటుంది. అలాంటివారికి తోడుగా ఉంటోంది హెచ్‌ఎస్‌ఎస్ యువ విభాగం. ఏర్‌పోర్ట్‌నుండి వారిని ఆహ్వానించి నెలరోజులపాటు వసతి, భోజన సదుపాయం కల్పించడం దాని బాధ్యతగా భావించి సేవలందిస్తోంది. హిందుత్వ విలువలను కాపాడుతూ మానవత్వంతో చేస్తున్న ఆ పని ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగుతోంది. బ్లూమింగ్‌టన్‌లో జరిగిన కార్యక్రమంలో మరో విజయసూచిక. ఈ కార్యక్రమంలో 11 సంస్థలు పాలుపంచుకున్నాయి. స్వాధ్యాయ పరివార్, ఇస్కాన్, మనబడి, సత్యసాయి సేవాసమితి, రామకృష్ణ మిషన్, విహెచ్‌పి, సేవ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. యోగా బోధిస్తున్న హెచ్‌ఎస్‌ఎస్ మున్ముందు భారీఎత్తున సామూహిక యోగా శిక్షణ తరగతులు నిర్వహించాలని భావిస్తోంది. ఆధునిక సాంకేతిక విజ్ఞానం పరిఢవిల్లుతున్న వేళ హిందుత్వ విలువలను కాపాడుకోవడం, మానవ విలువలను సంరక్షించుకోవడం, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం అవసరం. హెచ్‌ఎస్‌ఎస్ అదే భావిస్తోంది. అందుకోసం కుటుంబ ప్రబోధన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది.
అహంకారాన్ని తరిమేసి, స్వార్థాన్ని పక్కనపెట్టి హిందువులంతా మానవసేవను బాధ్యతతో చేపట్టేలా హిందూస్వయంసేవక్ సంఘ్ కృషిచేస్తోంది. ఈ విషయంలో హిందువులలో చైతన్యం రగిలించడంలో విజయం సాధించింది. చికాగోలో జరిగిన గణపతిపూజ కార్యక్రమంలో 150 కుటుంబాలు పాల్గొన్నాయి. భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మికతతో సాగిన ఈ కార్యక్రమం అచ్చం భారత్‌లో జరిగినట్లే సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. అమెరికానుంచి తెలుసుకోవలసింది ఎంతో ఉంది. రామకృష్ణ పరమహంస వంటి వ్యక్తులు అమెరికా సమాజంలో ఉన్నారు. బోస్టన్‌లో ఎమర్సన్, థౌరౌ అలాంటివారే. బోస్టన్‌లోని ఓ మోడల్ హౌస్‌ను చూస్తే దివ్య అనుభూతి కలుగుతుంది. అందులోనే థౌరౌ నివసించారు. భగవద్గీత, ఉపనిషత్తుల ప్రభావంతోనే ఆయనీ స్థితికి చేరుకున్నారని చెప్పేవారు. అక్కడున్న పెద్ద సరస్సు తేటగా, కాలుష్యంగా లేకుండా ఉంది. అమెరికాను ఎప్పటికీ సంఘటితంగానే ఉండాలని కలలుగని, సాధించిన వ్యక్తి అబ్రహాంలింకన్. ఆరులక్షలమంది మరణించినా అమెరికా ఐక్యతకే ఆయన పెద్దపీట వేశారు. ఇలినాయస్ లోని స్ప్రింగ్‌ఫీల్డ్ వద్ద ఆయన స్మారకాన్ని చూసినప్పుడు ఆయన ఘనత అంతా కళ్లముందు కదలాడింది. అమెరికాలోని ట్విన్‌టవర్స్‌పై తీవ్రవాదుల దాడి జరిగిన తరువాత అనతికాలంలోనే అక్కడ నిర్మించిన స్మారకకట్టడం స్ఫూర్తిదాయకమైనదేకాక అమెరికన్ల మనోనిబ్బరాన్ని తెలియచేస్తుంది. అక్కడున్న మ్యూజియంలో ఆనాటి దుర్ఘటనలో అసువులుబాసిన 2500మంది ఫొటోలను ఉంచారు. ఇండియానా పోలిస్‌లోని ఓ యూనివర్సిటీకి వెళితే...అక్కడంతా విద్యాబోధనలో నిమగ్నమై కన్పించారు. కాలయాపన, కాలాన్ని వృధాచేయడం మాటే లేదు. బోస్టన్ స్వాతంత్య్ర పోరాటం ఓ స్ఫూర్తిదాయక ఘట్టం. ఇప్పుడు అమెరికాలో ఉన్న హిందువులు తమ పురాతన సంప్రదాయాన్ని రక్షిస్తూ మానవసేవలో తరిస్తున్నారు. విశ్వమతంగా వినుతికెక్కిన హిందుత్వ కార్యక్రమాలు ఇప్పుడు విస్తృతంగా సాగుతున్నాయి. ఆయా కార్యక్రమాల్లో స్థానికులనూ భాగస్వామ్యం చేస్తున్నారు.
చికాగోలోని ఆర్ట్ గ్యాలరీ సందర్శన కొత్త ఉత్సాహాన్నిచ్చింది. వివేకానందుడు ప్రపంచాన్ని జాగృతపరచేలా ఉపన్యసించింది ఇక్కడే. ఇప్పటికీ అక్కడ ఆనాటి స్ఫూర్తిదాయక తరంగాలు మనసును తాకుతూనే ఉన్నాయ.
అమెరికాలో హిందూ స్వయంసేవ
Reviewed by rajakishor
on
5:29 PM
Rating:
No comments: