Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

నేతాజీ...మిస్టరీ!

గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఆంధ్రభూమి, ఆదివారం మాగజైన్, 25-10-2015

సుభాస్ చంద్రబోస్‌ను దేశం నించి తరిమేసింది ఎవరు? ఇది చరిత్ర విషయం కనుక మనం మన దేశ చరిత్రలో కొద్దిగా వెనక్కు వెడదాం. 

ఆర్య చాణక్యుని (కౌటిల్యుని) శిక్షణలో గొప్ప నేతగా తీర్చిదిద్దబడ్డ వౌర్య చంద్రగుప్తుడు, సెల్యూకస్‌ను ఓడించాడు. సెల్యూకస్ నుండి ఇప్పటి ఆఫ్ఘానిస్తాన్, ఉత్తర పాకిస్తాన్, కాందహార్ - భూములను బహుమతిగా పొందాడు. ఆ మౌర్య చంద్రగుప్తుని మగధ రాజ్యం ఇంచుమించు భారతదేశమంతా విస్తరించింది! సెల్యూకస్ కూతురు హెలెన్‌ను మౌర్య చంద్రగుప్తుడు, తన కొడుకు బిందుసారుడికి కట్టబెట్టించుకున్నాడు. బహుశా ఆ హెలెన్ కొడుకే అయి ఉండవచ్చు - అశోకుడు. 

అశోకుడు మొదట్లో అరివీర భయంకరుడే. అతని తాత అతనికందించిన విశాల సామ్రాజ్యానికి వారసుడే. అయితే కళింగరాజుతో జరిగిన భయంకర యుద్ధ వినాశనాన్ని చూసి చలించిపోయాడు. బౌద్ధమతం స్వీకరించి సన్యాసియైపోయాడు. ‘శాంతి-శాంతి’ ‘అహింస-అహింస’ ‘దమ్మం-దమ్మం’ -అన్నాడు. 

రాజు రాజసకుడు అయ్యి ఉండాలి. అలాకాక సాత్వికుడు అయితే ఏమవుతుందో అదే అయ్యింది. వాయవ్య, దక్షిణ దిక్కుల్లోంచి తిరిగి విజృంభించి దండయాత్రల కొస్తూన్న గ్రీకు సేనలను ఎదుర్కొనే శక్తీ శౌర్యమూ అశోకుని సైన్యాల్లో నశించి ఉంది. 

ఇలా జరుగుతూండగా, అశోకుడు చనిపోయిన తర్వాత అదే మౌర్య వంశంలో ఆఖరివాడయిన బృహద్రధుడు, రాజు అయ్యాక కూడా ఈ దండయాత్రలు సాగుతూనే వచ్చాయి. ఈ ‘మహానుభావుడు’ కూడా బౌద్ధమతం స్వీకరించి ‘అహింస' జపం చేశాడు. ఆ యవనులు తిరిగి మన పడమటి ప్రాంతాలను వశపరచుకున్నారు. ఇది సహించలేని బృహద్రధుడి సేనాని పుష్యమిత్రుడు (185-149 క్రీ.పూ.) ఆ రాజును చంపి తానే రాజయ్యి ఆ యవసేనల్ని తరిమికొట్టాడు. సింధునదీ తీరాన అశ్వమేధ యాగం చేశాడు (రెండోది పాట్నాలో చేశాడు) తన జీవనధర్మం వైదిక ధర్మమేననీ చాలా స్పష్టంగా ప్రకటించి, ఆచరించి చూపాడు. అయినా ఆ పుష్యమిత్రుడు బౌద్ధుల్నీ, బౌద్ధమతాన్నీ చాలా గౌరవించాడు! 

ఇదిలా ఉండగా మౌర్యులకు లొంగి ఉన్న కళింగ రాజ్యంలో ‘చేది’ వంశపు ఖారవేలుడు పరిపాలనకొచ్చాడు. 24వ ఏటనే రాజయిన ఆయన కూడా బౌద్ధమతాన్ని భద్రంగా ‘అటకెక్కించి’ తాను వైదిక మతానుయాయి అయి, పుష్యమిత్రుడితో చెయ్యి కలిపి ‘డెమిట్రియస్’ అనే భయంకర గ్రీకు సేనానిని తరిమికొట్టాడు. ఆ తర్వాత ఆ ఖారవేలుడు జైన మహామునుల సమ్మేళనం ఏర్పాటు చేశాడు. ఆ జైనమండలి ఆనంద పారవశ్యంతో ఆ ఖారవేలునికి అనేక బిరుదులు ప్రదానం చేసింది! 

ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. అశోకుడు ‘అహింస' మంత్రాన్ని జపించకుండా అదే పాత శౌర్యంతో పరిపాలించి ఉండి ఉంటే ఏమయ్యేది? - భరతభూమి అఖండంగా ఉండి ఉండేది కాదా! 

ఇదే విధంగా బోస్‌కు మన గాంధీ వగైరా నాయకులు సపోర్టు ఇచ్చి ఉంటే, బోస్ తన ఆజాద్ హింద్ ఫౌజ్‌తో బ్రిటిషర్లతో యుద్ధం చేసి ఉంటే, మన దేశం ఏకఖండంగా ఉండేది కాదా? 

1011లో మహమ్మద్ గజినీ సోమనాథ్‌ను కొల్లగొట్టడం, రాజులందర్నీ భయభ్రాంతుల్ని చేసింది. దాంతో బౌద్ధం, (మన అదృష్టం కొద్దీ) రాజప్రాసాదాల్లోంచి మాయమైపోయింది! 

రాజ్యాల రక్షణకై రాజులందరూ భగవద్గీతలో చెప్పబడిందే చెయ్యసాగారు. ‘యుద్ధం చేసి శాంతిని కొనుక్కో’ అనేదే అది. శ్రీకృష్ణ దేవరాయలు, ముసునూరి నాయకులు, రాణీ రుద్రమదేవి, రాణాప్రతాప్, బాప్పరావలుడు, లాచిత్ బడ్‌ఫుకన్, రాణీ చెన్నమ్మ, అహల్యాబాయి హోల్కర్, ఛత్రపతి శివాజీ, ఇంకా.. మనకన్నా ఒక వందేళ్లు మాత్రమే ముందు పుట్టి మహాతల్లి ఝాన్సీలక్ష్మీబాయి - వగైరాలంతా పట్టినవి కత్తులే! కాషాయ వస్త్రాలూ కాదు, అహింసా మంత్రమూ కాదు! వీళ్లు తమ బుద్ధికుశలత, కార్యశౌర్యం, నిరుపమానమైన సాహసం, గొలుసుల్ని కూడా తెంపాలనే తెగింపు, ఒక్క కత్తి విసురుతో కుత్తుక తెంచే నైపుణ్యం, ప్రజానురక్తి, దేశభక్తి - ఇవి వీళ్ల సొత్తులు. కనుకనే వీళ్లు భారతీయ హృదయాలలో చిరస్థానాన్ని సంపాదించుకున్నారు. (1940-50 ప్రాంతాల్లో మన స్కూళ్లల్లో తరగతుల్లో ‘స్క్వాడ్’లు వీరి పేర్లతోనే ఉండటానికి కారణం ఇదే!) 

ఛత్రపతి శివాజీ మరణం తర్వాత 1757 ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి దేశంలో స్థిరపడింది. 1857లో విక్టోరియా రాణి తన బ్రిటిష్ ప్రభుత్వం ఏలుబడిలోకి మన దేశాన్ని తీసుకుంది. మన ఆఖరి హిందూ రాణి ఝాన్సీలక్ష్మీబాయి బ్రిటిషు వారి మీద తిరగబడింది. దాంతో బ్రిటిషు వారి దమననీతి మన మీద పెచ్చు పెరిగిపోయింది. ప్రజలు నరకయాతనలు అనుభవించసాగారు. ప్రజల్ని జో కొట్టటం కోసం బ్రిటిషు ప్రభుత్వమే 1885లో ‘కాంగ్రెస్’ con-gress = come together) అనే సంస్థ స్థాఫనకు ప్రోత్సహించింది. నిజానికి దీని పేరు ‘వినతిపత్ర సమర్పణ సంస్థ’ అనొచ్చునేమో... 1920 వరకూ జరిగిన కాలఖండాన్ని ఆంగ్లేయుల నిరంకుశ పాలనా కాలమని చెప్పవచ్చు. 

మహాత్మాగాంధీ ఇరవై ఏళ్లపాటు దక్షిణ ఆఫ్రికాలో గడిపిన కాలంలో అక్కడి తెల్ల పాలకుల దమననీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాడు. ఆ నిర్వహణలో, లియో టాల్‌స్టాయ్, జీసస్ క్రైస్ట్, ధోరో (సహాయ నిరాకరణను వివరించినవారు)ల ప్రభావం గాంధీ మీద బాగా ఉంది. కనుకనే 1914లో ఇండియా తిరిగి వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఉంటూనే మొదటి ప్రపంచ యుద్ధంలో (1916) వారికి అనుకూలంగా సైన్యంలోకి యువకుల్ని చేర్చటానికి సహకరించాడు. రౌలత్ చట్టం (1919), అమృత్‌సర్‌లో (జలియన్‌వాలాబాగ్) జనరల్ ఓ డయ్యర్ కాల్పులు (1920), ఆ తర్వాత సహాయ నిరాకరణోద్యమం, దండి, ఉప్పు సత్యాగ్రహం - వగైరాలన్నీ గాంధీ నడిపిన ఉద్యమాలు. 

అయితే ఈ పాశ్చాత్య ప్రభావం అతి తక్కువగాగల నాయకుడు సుభాస్ చంద్రబోస్. అతనిలో భారతదేశ చరిత్రలోని వీరులు, త్యాగ పురుషుల పట్ల గాఢమైన అనురక్తి, భక్తి ఉన్నాయి. జపాన్‌లో భారతీయ సైనికులకు అతనిచ్చిన ఉపన్యాసంలో ఇవి కనపడతాయి. కాగా, రష్యాలో వచ్చిన బోల్షివిక్ విప్లవం తాలూకు ప్రభావం అతని మీద కనిపిస్తుంది. అందుకనే వామపక్ష భావజాలం అతనిలో మనం చూస్తాం. అయితే ఇది లోతైనది కాదు. ఉడుకురక్తం గల యువకులు చాలామందికి ఆ రోజుల్లో ఉన్న లక్షణమే!

18-9-2015వ తేదీన నేతాజీ సుభాస్ చంద్రబోస్‌కు సంబంధించిన అరవై నాలుగు రహస్య పత్రాలను బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయటపెట్టారు. బ్రిటిష్ వలస పాలన నించి మన మాతృభూమికి విముక్తి కలిగించటం అనేది సుభాస్ చంద్రబోస్ చేపట్టిన ఆజీవన వ్రతం! అయితే, 23 ఆగస్టు 1945న ఆయన మంచూరియా మీదుగా తన సైన్యానికి సహాయం అడగటం కోసం రష్యా వెళ్లటానికై సింగపూర్‌లో విమానం ఎక్కినప్పటి నించీ ఆయన వివరాలు వాస్తవంగా తెలియరావటం లేదు. ఆయన విమాన ప్రమాదంలో చనిపోయాడన్న వార్త ప్రచారం అయ్యింది. కానీ, మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆయన జీవించే ఉన్నాడన్న కథనాలు, రష్యా వెళ్లి వచ్చిన అనేక మంది ప్రముఖుల వల్ల వెల్లడయ్యాయి. కాగా, కాలక్రమంలో స్వతంత్ర భారత్ నుంచి అందిన సూచనల మేరకు ఆయన రష్యాలో కాల్చివేయబడ్డాడు అన్న వార్త కూడా పక్కనించి సన్నసన్నగా బయటికి పొక్కింది. ఇతమిత్థంగా విషయం తేల్చటానికి గత మన ప్రభుత్వాలు ప్రయత్నించలేదు. ఇది ఒక వ్యూహమేమో తెలీదు. 

1857 నాటి మొదటి స్వాతంత్య్ర సంగ్రామం పౌరుషాగ్నినీ, పోరాటాల స్ఫూర్తినీ బాగా అర్థం చేసుకున్నవాడు సుభాస్. వివేకానందుడి బోధలు ఆయనకు స్ఫూర్తికేంద్రాలు! దేశ ప్రజల్లో ఉన్న - జ్వలించే స్వాతంత్య్ర కాంక్ష, గుండెలు మండించే ఆంగ్లేయ వ్యతిరేకతలు ఆయనకు కరదీపికలు! ‘ఆయుధ పోరాటంతోనే భారత్‌కు విముక్తి’ అన్న స్థిర నిశ్చయానికి ఆయన వచ్చేశాడు. 

గాంధీది మాత్రం - వినతిపత్రాలు, ఒప్పందాలు, శాంతి బోధలు, నిరశన వ్రతాలు - బాట! ఈ అభిప్రాయ భేదం వల్లనే గాంధీకన్నా ఎక్కువగా బోస్ దేశ ప్రజలకు అర్థమయ్యాడు. దగ్గరయ్యాడు. (కానీ ఈ సత్యం పైకి రాకుండా తొక్కివేయబడింది.) 

మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు సహకరించినందుకు ఆంగ్లేయులు స్వతంత్రం ఇస్తారని ఆశించిన భారతీయులకు తీవ్ర నిరాశే ఎదురైంది. దేశమంతా అసంతృప్తి జ్వాల చెలరేగింది. గొప్ప దేశభక్తులైన లాల్-బాల్-పాల్‌లు మరణించారు. నాయకుడి కొరత ఏర్పడింది. ఇంగ్లండ్‌లో ఐసిఎస్ పాసై దానికి రాజీనామా చేసి దేశసేవ కోసం వచ్చిన సుభాస్‌కు దేశం ఆహ్వానం పలికింది. 1921లో సుభాస్ కాంగ్రెస్‌లో చేరాడు. 1938లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. 1938వ సం. ఫిబ్రవరి 13న బార్డోలీ స్టేషన్‌లో ఆయన దిగినప్పుడు ఆయనను 51 జతల ఎద్దులుగల రథంపై ఊరేగించి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. (1940లో ఆంధ్ర వచ్చినప్పుడు ఏలూరులో 21 జతల ఎడ్ల రథంపై ఆయన్ని ఊరేగించారు.) ఆ రోజున ఆయన చేసిన అధ్యక్షోపన్యాసం, దేశంలోని అన్ని వర్గాల వారి ప్రశంసలకు పాత్రమైంది! ఆయన అప్పుడు ఒక అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా ప్రకటించాడు: ‘కాంగ్రెస్ సంస్థలోని దక్షిణ, వామపక్షాలు రెండూ కలిసి పనిచేస్తే, గాంధీగారి నాయకత్వంలోనే, మనకు స్వాతంత్య్రం త్వరలోనే తప్పక సిద్ధిస్తుంది’ అనేది. 

బోస్‌కు గాంధీపట్ల గౌరవమే. కానీ, కార్య పద్ధతిలో మాత్రం శత్రువును బతిమాలే పద్ధతిని బోస్ తీవ్రంగా వ్యతిరేకించాడు. రాబోయే స్వతంత్ర భారతానికి కాబోయే నాయకుడు బోసేనని ప్రజలు భావింపసాగారు! కానీ బోసు మాత్రం ఏనాడూ తనకు పదవి కావాలని, మాట వరసకైనా అనలేదు; కోరుకోలేదు కూడా! ఈ పరిస్థితి గాంధీకి నచ్చలేదు. బోసు తనకన్నా ఎత్తుకు ఎదిగాడు. తను హింసను వ్యతిరేకిస్తూంటే, అతను సాయుధ పోరాటమంటున్నాడు. కాగా, తను ససేమిరా ఇష్టపడనివారు పక్షీయుల్ని కూడా కలుపుకొనిపోతానంటున్నాడు. తనలాగా హిందువుల్నీ ముస్లిముల్నీ వేరుపరచి దువ్వటం లేదు. మొదట్నుంచీ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిగా భోగాది పట్టాభి సీతారామయ్యని తను బలపరుస్తూ రాగా, ఇతగాడు ఎన్నికై కూర్చున్నాడు.. - ఇదీ గాంధీ ఆవేదన! 

గాంధీ ఇట్లా ఒక వర్గాన్ని సమర్థిస్తూ రావటంతో కాంగ్రెస్‌లోనూ, దానివల్ల దేశ రాజకీయాల్లోనూ నైతిక స్థాయి దిగజారటం మొదలైంది. అధోగతికి ఇక్కడే బీజం పడింది. కాంగ్రెసులోని దక్షిణపక్షేయుల సహకారం బోసుకు లభించదని గాంధీ చాలా స్పష్టంగానే బోసుకు చెప్పాడు. 

1939లో త్రిపురలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో తిరిగి రెండోసారి బోసు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. గాంధీ ‘పట్టాభి ఓటమి నా ఓటమి’ అని బహిరంగంగా ప్రకటించాడు. గాంధీ వర్గీయులు చేసిన వ్యక్తిగత దూషణలూ, అధ్యక్షుడుగా బోస్ అధికారాలను హరించివేసే తీర్మానాలూ, దక్షిణ పక్షీయుల తీవ్ర సహాయ నిరాకరణా - ఇవి బోస్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. బోస్‌కి క్షయవ్యాధి సోకింది. ఇక రాజీనామా చెయ్యక తప్పలేదు. బోస్ కాంగ్రెస్‌లోనే ఉండి స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ సంస్థలో సభ్యులు తగ్గారు. 

అప్పటికే ద్వితీయ ప్రపంచ సంగ్రామం మేఘాలు అలుముకుంటున్నాయి. బ్రిటిషు వారు పాల్గొనక తప్పదు. కనుక అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వంతో భారతీయులు సాయుధ పోరాటం చేస్తే లాభం ఉంటుందని బోస్ తలపోసాడు. 

కానీ గాంధీకి ఆ ఉద్దేశం లేదు. ‘అహింస జెండా’ పట్టుకొని ఆయన తన ఇష్టానుసారం ఉద్యమాలు ప్రారంభిస్తూ, ఫలితాలు రాక ముందే, హఠాత్తుగా వాటిని విరమింపజేస్తూ వస్తున్నాడు. బ్రిటిషు వారు కూడా గాంధీని ఒక ‘పాశ్చాత్య పాలనా వ్యతిరేకవాది’గా మాత్రమే చూశారు. ఆయన వల్ల తమకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని గ్రహించారు. కనుక గాంధీ వారికి శత్రువు కాదు. కానీ పాశ్చాత్య ఉద్యమాల పంథాలో పాశ్చాత్యుల సహకారంతో తమకు ప్రమాదం తెచ్చే విప్లవకారులు మాత్రం తమకు పక్కలో బల్లేలు. శత్రువులు. కనుక వారిని అణచివెయ్యక తప్పదు. ఇదీ బ్రిటీషు పాలకుల భావన. 

1939లో హిట్లర్ పోలెండ్‌ను ఆక్రమించి రెండో ప్రపంచ యుద్ధానికి నాంది పలికాడు. జర్మనీ, జపాన్, ఇటలీ -ల కూటమి - ‘యాక్సిస్ ఫోర్సెస్’ (అగ్రరాజ్యాల కూటమి) - ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా ఏర్పడింది. అప్పుడు ఇంగ్లండ్, అమెరికా, ఫ్రాన్స్, రష్యాలు ‘ఎల్లైడ్ ఫోర్సెస్’ (మిత్ర రాజ్యాల కూటమి)గా ఏర్పడ్డాయి. యుద్ధం మొదలైంది. భారత గవర్నర్ జనరల్ మౌంట్బాటెన్, అప్పటి ఎనిమిది రాష్ట్ర మంత్రివర్గాలను సంప్రదించకుండానే, భారతదేశం కూడా యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించాడు. ఒక్క ఇంగ్లండ్ తప్ప పైదేశాలేవీ కూడా భారత్‌కు శత్రువులు కాదు. అయినా సరే, భారతీయులు యుద్ధంలో పాల్గొని ఖైదీలుగా పట్టుబడి నరకయాతనలు అనుభవించటానికి సిద్ధపడవలసి వచ్చింది. 

ఈ పరిస్థితి ఎంతో కాలంగా బోస్ ఊహించి హెచ్చరికలు చేస్తూ ఉన్నట్టిదే. అప్పుడైనా కాంగ్రెస్, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్రోద్యమం తీవ్రతరం చెయ్యాలి గదా! కానీ చెయ్యలేదు. బ్రిటీషు వారితో కాంగ్రెసు ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించింది! యుద్ధంలో నిమగ్నమై ఉన్న బ్రిటిష్ వారికి ఆందోళన కలిగించటం తన అభిమతం కాదు’ అని గాంధీ స్పష్టంగా ప్రకటించారు! అంటే, తన దేశ సోదరులు అనవసరంగా యుద్ధ ఖైదీలయి అలమటించటమే తన అభిమతం అని చెప్పినట్లయ్యింది గదా!

తన స్వంత కాంగ్రెసులోనే తనను వెలివేస్తున్న పరిస్థితి బోసును కుంగదీసింది. అయినా సరే, ఒక మహోద్యమం, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సాగించటానికై 1940లో బోసు దేశంలో అనేక చోట్ల బ్రహ్మాండమైన సమావేశాల్లో ప్రసంగించారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. (మన దురదృష్టంవల్ల ఈ విషయం ప్రచారం కాలేదు!) ప్రభుత్వం దీనికి భయపడింది!! బోస్‌ను అరెస్టు చేసింది. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించటం చేత స్వగృహంలోనే ఆయన్ని నిర్బంధించి ఉంచింది. అయితే బోస్, 26-1-1941న తప్పించుకొని అంతర్థానమయ్యాడు. ఈ విధంగా బ్రిటిషు వారి అరెస్టులు, క్షీణించిన తన ఆరోగ్యాలే కాకుండా బ్రిటీషు వారితో పోరాటానికి గాంధీ అనుయాయులు తిరస్కరించటం - ఇవి కూడా సుభాస్ దేశం వదలటానికి ముఖ్య కారణాలు. కాగా, ఏ విదేశం సహాయం చేస్తానంటే ఆ విదేశీ సహాయం తీసుకోవాలనుకోవటం ఇంకో కారణం. 

అష్టకష్టాలు పడి బోస్ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా మాస్కో చేరి అక్కడ తన ఉద్యమానికి సహకారం లభించే పరిస్థితి కానరాక బెర్లిన్ వెళ్లాడు. రెట్టించిన ఉత్సాహంతో ఉన్న హిట్లర్, తమ సొంత దేశంలోనే బానిసలుగా మారి ఉన్న భారతీయుల పట్ల న్యూనతాభావంతో ఉన్నాడు. హిట్లర్ తనకు సహకరించాలనీ, యుద్ధంలో నిమగ్నమై ఉన్న బ్రిటిష్ వారి హస్తాల నుండి భారత్‌కు విముక్తి కలిగించాలనీ బోస్ ప్రాధేయపడ్డాడు. కానీ భారత్ యొక్క సర్వసత్తాకత (సావరినిటీ)ను మాత్రం బేరం పెట్టలేదు. యుద్ధంలో ‘యాక్సిస్ ఫోర్సెస్’ (జపాన్, జర్మనీ, ఇటలీ)కు చిక్కిన భారతీయ సైనికులు ఇటలీలోని సైనిక శిబిరాల్లో నరకయాతనలు అనుభవిస్తున్నారు. హిట్లర్ (జర్మనీ నియంత) ముస్సొలినీ (ఇటలీ నియంత)ల సహకారంతో బోస్ ఆ ఖైదీలను బెర్లిన్ (జర్మనీ)కి తప్పించాడు. ఐరోపా దేశాల్లో నివసిస్తున్న భారతీయులందర్నీ కలపటం కోసం తాను ఏర్పాటు చేసిన ‘స్వతంత్ర భారత కేంద్ర’ అన్న వలంటీర్ల సంస్థలో వాళ్లను చేర్చి అందరికీ సైనిక శిక్షణ ఇచ్చే ఆలోచన చేశాడు. 

బెర్లిన్‌లోని టైగార్టిన్ ప్రాంతంలో జరిగిన ఈ ‘స్వతంత్ర భారత కేంద్ర’ ప్రథమ సమావేశంలోనే బోస్‌ను ‘నేతాజీ’ అని పిలవాలనీ, ‘జనగణమన’ అనే గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించాలనీ, ‘జైహింద్’ అనేది తమ నినాదమనీ - నిర్ణయించబడింది. ‘ఆజాద్ హింద్ రేడియో’ అనే రేడియో కేంద్రాన్ని కూడా బోస్ ప్రారంభించాడు. యుద్ధ ఖైదీలుగా జర్మనీకి కూడా పట్టుబడి అన్నాబెర్గ్ శిబిరంలో ఉంచబడిన భారతీయులు బోస్‌ను చూడగానే ఒక్క ఉదుటున కరతాళ ధ్వనులతో, జయజయ ధ్వానాలతో దిక్కులు పిక్కటిల్లేలా అత్యద్భుతమైన స్వాగతం పలికారు. బోసు లేకపోవటం వల్ల భారత్‌లో తాము నిర్వీర్యమై పోయామనీ క్షోభపడ్డారు. ఇది చూసిన హిట్లర్‌కు బోస్ పట్లా, మొత్తం భారతదేశం పట్లా అమాంతంగా ఆత్మీయత పుట్టుకొచ్చింది. వీరితో బోస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ అనే సాయుధ దళాన్ని - తన చిరకాల స్వప్నాన్ని నిర్మించాడు. దీనికై కావలసినంత ధనాన్ని తన ప్రభుత్వం ఇస్తుందని హిట్లర్ ప్రకటించాడు. 

యుద్ధం ప్రచండంగా సాగుతోంది. అయినా సరే, డిసెంబర్ 1942 నాటికి 3500 మంది భారతీయ యువకులు ‘ఆజాద్ హింద్‌ఫౌజ్’లో సుశిక్షితులయ్యారు. జర్మన్ సైనికాధికారులు బోస్ పక్కనే ఉండి శిక్షణను సమీక్షించేవారట. ఎంత గౌరవం! ఈ సైన్యాన్ని తీసుకువెళ్లి భారతదేశానికి సమీపంలో ఉంచి బ్రిటిషు వాళ్లతో యుద్ధం చెయ్యాలనేది బోస్ పథకం. 

ఈ పరిస్థితుల్లో, సింగపూర్, బర్మా మొదలైన ప్రాంతాలు బ్రిటిష్ వారి నుండి జపాన్ వారి అధీనంలోకి వచ్చినట్లూ, జపాన్ వారికి (యాక్సిస్ ఫోర్సెస్‌కు) దొరికిన భారత యుద్ధ ఖైదీలకు రాస్ విహారి బోస్ అన్న విప్లవకారుడు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా శిక్షణ ఇస్తున్నట్లూ బోస్‌కు తెలిసింది. 

ఇంకొక ‘క్షుద్ర వార్త’ కూడా తెలిసింది. భారతదేశాన్ని ద్విజాతి సిద్ధాంతం ప్రాతిపదికగా విభజించాలనే ప్రతిపాదన దేశంలో పాకుతోందనీ, దానిపట్ల గాంధీ తటస్థంగా వ్యవహరిస్తూ, పైకి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనీ కూడా తెలిసింది. బోస్ తన రేడియో ద్వారా దాన్ని ఖండిస్తూ ఆవేదనతో ప్రసంగించటం మొదలుపెట్టాడు. 

1942లో బోస్, జలాంతర్గామి ద్వారా జపాన్ చేరాడు. అప్పుడు బోస్, అక్కడ చేరి ఉన్న కొన్ని వేల మంది భారతీయులకిచ్చిన ఉపన్యాసం వారి రక్తాన్ని మరిగించింది. వారంతా కలిసి, ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా దేవుని పేరిట, బోస్ చేత ప్రమాణం చేయించారు. మంత్రి వర్గం పేర్లు ప్రకటించబడ్డాయి. ఆ మంత్రుల్లో అన్ని మతాల వారూ ఉన్నారు. ఎవరు హరిజనుడో, ఎవరు ముస్లిమో అడిగినవాడు, చెప్పినవాడు లేడు. (ఈ విషయం బహుశా గాంధీకి అర్థమై ఉండదు!) 

అప్పుడు బోస్ ప్రసంగం ఇలా సాగింది: ‘1757లో ఆంగ్లేయుల కంపెనీ చేతిలో వంగ రాష్ట్రం ఓడిపోయినప్పటి నించీ భారతీయులు నిద్రపోలేదు. పోరాటం సాగిస్తూనే ఉన్నారు. సురాజుద్దౌలా, మోహన్‌లాల్, వేలు తంపి, అన్నా సాహెబ్ పేష్వా, బాజీరావు పేష్వా, ఔధ్ రాణులు, సర్దార్ శ్యామ్‌సింగ్, అతారివాలా, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానాసాహెబ్, మహారాణా కున్వర్‌సింగ్ - మొదలైన వారంతా తృణప్రాయంగా ప్రాణాలొడ్డి స్వతంత్ర సంగ్రామం చేసినవారే. వీరు మనకిచ్చే స్ఫూర్తి సాయుధ పోరాటమే కాని బిచ్చమెత్తటం కాదు. స్వతంత్రం మనకు సాయుధ పోరాటంతోనే వచ్చి తీరుతుంది! ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసాలు పెంచుకోండి! ఇదే అంతిమ పోరాటం!’ 

ఈ ప్రవాస భారత ప్రభుత్వాన్ని తక్షణమే తొమ్మిది దేశాలు గుర్తించాయి. ఈ వార్త తెలిసి భారత్‌లో 12-18 సం. వయసున్న బాలబాలికలు ఈ సైన్యంలో చేరాలని ఉవ్విళ్లూరారు. కారణం, ‘ఆజాద్ హింద్ ఫౌజ్’లో ‘ఝాన్సీలక్ష్మీ మహిళా విభాగం’ కూడా ఉంది. దానికి కెప్టెన్ లక్ష్మి సెహగల్ నాయకురాలు. సింగపూర్ చేరిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ (ఐఎన్‌ఏ -ఇండియన్ నేషనల్ ఆర్మీ). 

అక్టోబర్ 25, 1943న బ్రిటన్, అమెరికాలపై ఆజాద్ హింద్ ఫౌజ్ యుద్ధం ప్రకటించింది. సింగపూర్, బర్మాల్లోని బ్రిటీష్ సైన్యాలను ఈ ఫౌజ్ చాలా తిప్పలు పెట్టింది. విజయోత్సాహంతో 'ఢిల్లీ చలో’ నినాదంతో బయల్దేరి వస్తూ వస్తూ అరకాన్ పర్వతంపై ఈ ఫౌజ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. అల్లైడ్ ఫోర్సెస్‌కు జపాన్ లొంగిపోక తప్పలేదు. దాంతో ఫౌజ్‌కు జపాన్ చేస్తానన్న వైమానిక దళ సహాయం అందలేదు. ఫౌజ్ దళం మణిపూర్ చేరుకొనేటప్పటికి బ్రిటిష్ వైమానిక దళం దాడులు ఫౌజ్ మీద హెచ్చాయి. అవన్నీ కొండలు, అడవులు.. విపరీతమైన వర్షాలు. వైద్యుల్లేరు. మందుల్లేవు. రోగాల వల్ల కూడా మరణించిన వారు మరణించగా, బర్మాకు పారిపోయిన వారు పారిపోగా, మిగిలిన వారు బ్రిటిష్ దళాలకు లొంగిపోయారు. చివరికి యుద్ధంలో బ్రిటన్ గెలిచింది కానీ, నడుం విరిగిపోయినట్లయ్యి భారత్‌ను వదిలింది. 

‘నేతాజీ’ సుభాస్‌చంద్రబోస్, జపాన్ వెళ్లే విమానాన్ని సింగపూర్‌లో ఎక్కారు. ఏమయ్యాడన్న దానిపై స్పష్టమైన ఆచూకీ ఇప్పటికీ లేదు. 

ఇంతకీ మనకి స్వాతంత్య్రం ఎవరి వల్ల వచ్చింది? బోస్ వంటి స్ఫటికం లాంటి దేశభక్తి, శీలంగల విప్లవకారుల సాయుధోద్యమాలూ, చివర్లో బొంబాయి, కలకత్తా రేవుల్లో ‘మేం ఇంగ్లండు సరుకుల్ని ఓడల్లోంచి దించము’ అంటూ నౌకాదళం చేసిన సమ్మెలూ - వల్లనా? లేక స్వతంత్రాన్ని ‘ముష్టి ఎత్తటం’ వల్లేనా? 

గాంధీగారు వ్యక్తిగతంగా గొప్పవాడే. దేశాన్నంతనీ ఉద్యమం బాట పట్టించిన మహానాయకుడే. కానీ ఎక్కడున్నాడు? జాతి పౌరుషాగ్ని మీద నీళ్లు చల్లి, చేవలేని వారిలా చేసే కార్యక్రమంలో బిజీగా ఉండిపోయాడు. 

నేతాజీ సుభాస్ బోస్ మీద అభాండాలున్నాయి. నియంత హిట్లర్ ‘బూట్లు నాకిన కుక్క’ అనీ, ‘యుద్ధోన్మాది’ అనీ - వగైరాలు. నిజం ఏమిటంటే, ఎవరు సహాయం అందిస్తే వారి నించి దాన్ని అందుకోవాలనే తాపత్రయమేగానీ, బోస్‌కు వేరే ఆరాధ్య నాయకులంటూ లేరు! టోజో (జపాన్ ప్రధాని), హిట్లర్ (జర్మనీ నియంత), ముస్సోలినీ (ఇటలీ నియంత), రష్యన్ నాయకులు - వీరందర్నీ సమానంగా ఆశ్రయించాడు. అయితే, ఎక్కడా తన వ్యక్తిత్వాన్నిగానీ, తన దేశ సార్వభౌమాధికారాన్ని గాని తాకట్టుపెట్టే ప్రయత్నం చెయ్యలేదు. కనుక పై లక్షణాలున్నట్లా? 

బోస్‌లో ఉన్న లోపం ఒక్కటే. సరియైన సైనిక శిక్షణ తాను పొందలేకపోయాడు. తన ఐఎన్‌ఏకు అందించలేక పోయాడు. 1934లో బోస్, ఎమిలీ ష్నెంకెల్ అన్న మహిళను వివాహమాడాడు. ఆ విషయం చాలా రహస్యంగా ఉంచబడింది. యుద్ధ సమయంలో 1941 ప్రాంతంలో, బోస్ ఇండియా వచ్చే సమయంలో, ఆవిడ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె పేరు అనిత! ఆ అనిత సంతతివారు ఇప్పుడు వార్తల్లోకొచ్చారు. 

ఇంకొక ప్రశ్న - మహాత్మాగాంధీ, దక్షిణ ఆఫ్రికా నించి ఇండియా వచ్చి ఉండకపోతే, ఇండియాకు స్వతంత్రం వచ్చి ఉండేదా? కాదా? - వచ్చి ఉండి తీరేది. భారతీయుల రక్తం అటువంటిది! బోసే యుద్ధ పటాలాల్ని నడిపించి, యుద్ధం చేసి, తన వీరత్వంతో శూరత్వంతో - భారత్ పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి ఉండేవాడు. లేదా ఇంకొక యుద్ధ వీరుడు పుట్టి ఉండేవాడు! అందుకనే, ఈనాటికీ మన తూర్పు రాష్ట్రాల్లో, మయన్మార్, సింగపూర్ ప్రాంతాల్లో - ఉన్న భారతీయులను భారత నాయకుడిగా బోస్ ఒక్కడే తెలుసు! వాళ్ల ఇళ్లల్లో ఇప్పటికీ ఉన్నవి బోస్ చిత్రపటాలే! గాంధీవికావు, నెహ్రూవికావు!! అందుకనేనేమో నెహ్రూకు బోస్ పట్ల ‘కినుక’! 

బోస్ తాలూకు సంతతి, కుటుంబ సభ్యులతో సహా 34 మంది ఇటీవల 14-10-2015న ప్రధాని మోదీగారిని ఢిల్లీలో కలిశారు. నేతాజీ మేనకోడలు శీలాసేన్ గుప్తా అందరిలోనూ పెద్దది. ఆవిడతో మోదీ ప్రత్యేకంగా ఫొటో దిగారు. ఆ అందరూ మోదీగారితో ‘మీరు మా బోస్ గురించిన వివరాలు బయటపెడతారనే కొండంత ఆశతో ఎక్కడెక్కడి వాళ్లమూ కలిసి మీ దగ్గరకొచ్చాం’ అన్నారు. మోదీ వారందర్నీ సాదరంగా ఆహ్వానిస్తూ ‘నేను తప్పకుండా నెరవేరుస్తాను. నేతాజీ జన్మదినమైన వచ్చే జనవరి 23నాటికి చెయ్యగల ననుకుంటున్నాను. నేతాజీ చివరి ప్రస్థానం అయిన రష్యా ప్రభుత్వంతోబాటుగా అన్ని ప్రభుత్వాలనూ సంప్రదిస్తాను. నమ్మండి!’ అని హామీ ఇచ్చారు. ఆ బృందం అంతా ఆకాశంలో తేలిపోయినంత ఆనందంగా ‘ఇంతకాలానికి మా ఆశలు చిగురిస్తున్నాయి’ అంటూ సెలవు తీసుకున్నారు! 

మనం ఎదురుచూసేదీ ఆ ‘మిస్టరీ’ వీడాలనే కదా! *

నేతాజీ...మిస్టరీ! Reviewed by rajakishor on 7:34 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.