భూమి సేకరణ బిల్లు నేపథ్యంలో " పరిమార్చుతున్న ‘ప్రపంచీకరణ’! " - హేబ్బార్ నాగేశ్వర్ గారి విశ్లేషనాత్మక వ్యాసం
వాణిజ్య ప్రకటనలను ప్రజాహిత సమాచారంగాను, ప్రజోపకరమైన సమాచారాన్ని వాణిజ్య ప్రకటనలుగాను భ్రమింపచేయడం కూడా ‘ప్రపంచీకరణ’ వ్యాప్తి చేసిన మారీచజాలంలో భాగం. పార్లమెంటు ఆమోదించిన ‘్భమి సేకరణ’ బిల్లు నిజానికి ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ వ్యాపార ప్రకటన వంటిది. వ్యవసాయ భూమిని అమ్మిపారేయడానికి వీలైన ప్రలోభాన్ని ఈ ప్రకటన కల్పిస్తోంది!! పైకి మాత్రం రైతులకు వ్యవసాయ భూముల యజమానులకు న్యాయమైన పరిహారం ఇప్పించడానికి ఈ కొత్త ‘చట్టం’ దోహదం చేస్తుందన్న భ్రాంతి కలుగుతోంది. కానీ విదేశీయ సంస్థలు క్రమంగా చిన్న రైతుల భూములను కాజేయడానికి, చిట్టిపొట్టి రైతులను వ్యవసాయ శ్రామికులుగా మార్చడానికి పరిహార ప్రలోభం దోహదం చేయగలదు! చిట్టి పొట్టి రైతులు యజమానులు. దోపిడీదారులు కాదు. య జమానులందరూ దోపిడీదారులన్న కృత్రిమవర్గ ద్వేష సిద్ధాంతం అనాదిగా ఈ దేశం లో వాస్తవం కాలేదు. అందుకు కారణం భారతీయమైన వికేంద్రీకృత వ్యవస్థ! ప్రపంచీకరణ కేంద్రీకరణను వ్యవస్థీకరిస్తోంది. కేంద్రీకరణవల్ల గుత్త పెత్తనం పెరిగి యజమాని దోపిడీ చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది!
గతంలో కమ్యూనిస్టు దేశాలలో ఇలా కేంద్రీకరణ పెరిగింది. ప్రభుత్వమే ఏకైక యజమాని అయింది! అందువల్ల ఐరోపా దేశాలలోను రష్యాలోను సోవియట్ యూనియన్ దేశాలలోను యజమాని దోపిడీదారుడు అయ్యాడు. ఈ ‘యజమాని’ కొంతమంది ఉన్నత రాజకీయవేత్తల, అధికారుల సమష్టి ముఠా! ప్రభుత్వమే యజమాని రూపంలో పాలితులను దోపిడీ చేసిన కేంద్రీకృత వ్యవస్థ ఆయా కమ్యూనిస్టు దేశాలలో 1991 వరకు పరిఢవిల్లింది. ఈ దోపిడీ పట్ల ప్రజలలో పెల్లుబికిన ప్రతిక్రియ విస్ఫోటనంగా మారింది. ఉక్కు పాదాలతో తొక్కిన నియంతృత్వ ప్రభావాన్ని ప్రతిఘటించి ప్రజలు కమ్యూనిస్టు వ్యవస్థలను, కేంద్రీకృతమైన దోపిడీ వ్యవస్థలను కూలదోశారు! ఇదంతా కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన చరిత్ర! కానీ 1993 నుండి మొదలైన ‘వాణిజ్య ప్రపంచీకరణ’ వందలాది వర్థమాన దేశాలలో ఈ చరిత్రను పునరావృత్తం చేసింది, చేస్తోంది. కమ్యూనిస్టు వ్యవస్థలో వలె ఈ ‘మార్కెట్ ఎకానమీ’ - స్వేచ్ఛావాణిజ్య వ్యవస్థలలో కూడా ఉత్పాదకత, పంపిణీ కేంద్రీకృతమవుతున్నాయి. ఈ కేంద్రీకృత వ్యవస్థ అనాదిగా భారతదేశంలో పరిఢవిల్లిన స్వయం సమృద్ధ వికేంద్రీకృత వ్యవస్థకు పూర్తి విరుద్ధమైనది! అందువల్లనే వాణిజ్య ప్రపంచీకరణ అన్ని రంగాలలోను అభారతీయతను పెంపొందిస్తోంది. కమ్యూనిస్టు వ్యవస్థలో ఒకడే పెద్ద యజమాని- ప్రభుత్వం!! ఈ ‘ప్రపంచీకరణ’ వ్యవస్థీకరించిన ‘‘మార్కెట్ ఎకానమీ’’లో వందల సంఖ్యలో మాత్రం యజమానులు ఉన్నారు- బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు!!
ఇలా లక్షలాది కోట్లాది యజమానులు, దోపిడీ చేయని యజమానులు, చిన్నవ్యాపారులు, చిన్న పరిశ్రమలవారు, కుటీర పారిశ్రామికులు, చిన్న రైతులు, ఇతరేతర అసంఖ్యాక స్వయం ఉపాధిజీవనులు, వృత్తులవారు అంతరించిపోయి, వారి స్థానంలో అతి పెద్ద సంస్థలు, ప్రధానంగా విదేశీయ ప్రభుత్వేతర సంస్థలు యజమానులుగా అవతరించే ప్రక్రియ పేరు ప్రపంచీకరణ! అలాంటి ప్రపంచీకరణ మన దేశంలో ఇంకా పూర్తిగా సమీకృతం కాలేదని, సమగ్రం కాలేదని మన ప్రధాని మన్‌మోహన్‌సింగ్ మథన పడుతుండం వర్తమానం! అలా ఆయన అభీష్టం మేరకు ప్రపంచీకరణ సర్వ సమగ్రం కావడానికి ఈ కొత్త భూమి సేకరణ చట్టం దోహదం చేస్తుంది. ఎనభై శాతం వ్యవసాయదారులు ఒప్పుకున్నట్టయితే ఒక గ్రామానికి చెందిన వంద శాతం ప్రజల భూమిని వాణిజ్య పారిశ్రామిక సంస్థలు కాజేయవచ్చు! ప్రభుత్వ మాథ్యమంగా ఇలా కాజేసే ప్రక్రియ పేరు భూమి సేకరణ!! ఇలా కాజేసే సంస్థలు శతవిధాలా విదేశీయ సంస్థలే అవుతాయి. ఎందుకంటే స్వదేశీయ వాణిజ్య సంస్థలు ఇచ్చే వాటికంటె, పది రెట్లుగా వందరెట్లుగా విదేశీయ సంస్థలనుండి రాజకీయవేత్తలకు విరాళాలుగా ముడుతున్నాయి. ‘‘లంచాల’’కు ‘‘విరాళాలు’’ అన్న పేరు స్థిరపడడానికి దోహదం చేస్తున్న ప్రక్రియ కూడా ప్రపంచీకరణ!! ఇలా విరాళాలు పుచ్చుకునే రాజకీయవేత్తలు దగ్గరుండి రైతులకు నచ్చచెప్పి భూమిని లాక్కొంటారు. ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని వేలాది ఎకరాల తమలపాకుల తోటలను ధ్వంసం చేసి, ఆ భూమిని ‘పోస్కో’వారు సిమెంటు రాసులు పోసుకునేందుకు అప్పగించినవారు ఇలాంటి రాజకీయవేత్తలే! వెయ్యిమంది చిన్న రైతులు భూమిని కోల్పోతారు. ఒకే విదేశీయ సంస్థ ఆ భూమిని కొనేస్తుంది. ఒక పెద్ద వాణిజ్య వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటుచేస్తుంది. భూములను కోల్పోయిన వారికి ఉద్యోగాలనిస్తుంది. లాభాలను తమదేశానికి తరలిస్తుంది. ఒక పెద్ద ‘అనేక అంతస్థుల’ బృహత్ దుకాణం ఏర్పడుతుంది. చుట్టుపట్ల వున్న వంద చిన్న దుకాణాలు మూతపడిపోతాయి! ఇలా విదేశీయ ‘వాల్‌మార్ట్’, మన్‌సాంటో, పోస్కో, లావా సా వంటి సంస్థలు దాదా పు ఒక వెయ్యి కావచ్చు- ఎక్కువ కావచ్చు- మన దేశాన్ని ‘నిర్వహించేందుకు’ వీలు కల్పించే ప్రక్రియ పేరు ప్రపంచీకరణ! కొత్త భూమి సేకరణ చట్టం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది!! ప్రపంచీకరణ చిన్న యజమానులను పరిమార్చుతుంది. పెద్ద యజమానులను ప్రతిష్ఠిస్తుంది!
రాష్ట్ర రాధానిలోని ఒక చోట ఒక పెద్ద భవన ప్రాంగణం ఉంది. ఈ ప్రాంగణంలో ఒకే జిల్లాకు చెందిన నల్లగొండ జిల్లాకు చెందిన నేతపనివారి దుకాణాలున్నాయి. దాదాపు రెండు వందల బట్టల దుకాణాలు ఒకేచోట ఒకే ప్రాంగణంలో ఉండడం అరుదైన వ్యవహారం. ఇవన్నీ చిల్లర దుకాణాలు. ఈ రెండు వందల మంది యజమానులు ఇలా బట్టల వ్యాపారం చేస్తున్నారు. చిన్న యజమానులు. ఇది దోపిడీకి పెద్దగా అవకాశం లేని వికేంద్రీకృత వాణిజ్య వ్యవస్థ! ఇది భారతీయ పరంపరకు కొనసాగింపు. ఈ దుకాణాల ప్రాంగణం సమీపంలోనే మరో బృహత్ భవనంలో ఒక రాక్షసిలా జెయింట్ బట్టల విక్రయ కేంద్రం వెలసి ఉంది. ఈ బృహత్ భవనంలోని అన్ని అంతస్థులనూ ఒకే దుకాణం ఆక్రమించి ఉంది! ఒకడే యజమాని, మిగిలిన వందలమంది ఉద్యోగులు, శ్రామికులు, కూలీలు... ఇలాంటి ‘సౌత్ ఇండియన్’ మాల్స్, మెగా దుకాణాలు ప్రపంచీకరణకు ప్రతీకలు! దోపిడీకి ఎక్కువ అవకాశం ఉన్న వాణిజ్య వాటికలు! ఇంత పెద్ద దుకాణందారుడు టోకు వ్యాపారం చేయవచ్చు. కానీ చిల్లర వ్యాపారంలోకి చొరబడి, చిల్లర వర్తకులతో పోటీకి దిగడమే ప్రపంచీకరణ స్వభావం!! మధ్యతరగతి జనం త్రేతాయుగంలో సీతమ్మ బంగారు జింకను చూసి మురిసిపోయినట్టుగా ఈ ‘మెగా’ ‘జెయింట్’, ‘హైపర్’, ‘కాపర్’దుకాణాల మెరుగులను చూసి మోసపోతున్నారు!! ప్రపంచీకరణ అంటే ఇదంతా!! వ్యవసాయ రంగంలో ఈ ప్రపంచీకరణ వైపరీత్యం స్థిరపడడానికి కొత్త భూమి సేకరణ చట్టం దోహదం చేస్తుంది!! అప్పుడు ఉల్లిపాయలు వందరూపాయలు కిలో, బియ్యం రెండు వందల రూపాయల కిలో చొప్పున వాల్‌మార్ట్ వారి చిల్లర దుకాణాలలో కొనుక్కోవచ్చు...
ధరలను పెంచుతున్నది, రూపాయ విలువను రూపుమాపుతున్నదీ ఎవరు? శీతల పానీయాలను మంచినీళ్లను, ఉర్లగడ్డ ఉప్పేరి- పొటాటో చిప్స్‌ని, లేస్, బర్గర్స్, వేఫర్స్, ఇంకా అనేక అనవసరమైన వాటిని అతి తక్కువ పెట్టుబడితో మన దేశంలోనే తయారుచేసి ఇక్కడనే అమ్మి లాభాలను తమ దేశాలకు ఎగుమతి చేస్తున్న బహుళ జాతీయ సంస్థలు ధరల పెరుగుదలకు మొదటి కారణం! అంతకంటె పెద్ద కారణం ఈ అనవసరమైన తిండి పదార్థాలను, శీతలపానీయాలను, ఐస్‌క్రీములను కొని తింటున్నవారు... చిన్న పాపలకు ఎండుద్రాక్షలు, జీడిపప్పులు, ఖర్జూరపు పళ్లు, బాదం పప్పులు, పుఠాణా పప్పులు, వేరుసెనగలు, బఠాణీలు, పుట్నాలు వంటివి తినడం నేర్పవచ్చు. పళ్లు పుచ్చిపోవడానికి కారణమైన ‘బంక చాక్లెట్లు’ మప్పతున్నారు! ఐస్‌క్రీమ్‌లలోని చాలా రకాలలో ఆవు దూడల కడుపులను చీల్చి సాధించిన కొవ్వు కలుపుతున్న సంగతి ఆమధ్య బాగా ప్రచారమైంది. శీతల పానీయాలలో క్రిమి సంహారక మందులు చేరిపోయాయన్నది కూడా బహిరంగ రహస్యం!! ఇధంతా ‘ప్రపంచీకరణ’, ‘అంతర్జాతీయ అనుసంధానం’, ‘మార్కెట్ ఎకానమీ’, ‘ప్రభుత్వ ప్రభుత్వేతర భాగస్వామ్యం’ వంటి వైపరీత్యాలు సృష్టించిన మాయాజాలం. కందిపప్పు ధరలు, బియ్యం ధరలు ఇక తగ్గవు. భయంకరంగా పెరిగిపోతాయి.
ఈ ప్రపంచీకరణ వ్యవసాయాన్ని పూర్తిగా దిగమింగడానికి కొత్త భూమి సేకరణ చట్టం దోహదపడుతుంది. ‘ఎండోసల్ఫాన్’ వంటి మందులవల్ల బసిలస్ తురింజెనిసిస్-బిటి- విషం నిండిన విత్తనాలవల్ల పంట పొలాలు పాడైపోతున్నాయి. చివరికి వ్యవసాయానికి పనికిరాని స్థితికి చేరుకుంటాయి. ఆత్మహత్యలకు బలైపోయిన పోగా మిగిలిన రైతులకు వ్యవసాయమంటే విరక్తి పుడుతుంది!! ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలోని చిన్న రైతుల ఆవులు ఎద్దులు కోతకు గురై మాంసంగా మారి డబ్బాలకెక్కి విదేశాలకు వెళ్లిపోయాయి. ట్రాక్టర్ల కిరాయి సేద్యానికి సహజమైన ఎరువులు అందువల్ల లేవు! ఈ స్థితిలోభూమి కాజేయదలచిన ‘బహుళ జాతీయ సంస్థలు’ కొత్త చట్టాన్ని ఉపయోగించుకోగలవు. మార్కెట్ ధరకు నాలుగు రెట్లు పరిహారం లభిస్తుంది కనుక వ్యవసాయదారులు కూడా సేద్యంపై విరక్తి పొంది ఉన్నారు కనుక- సులభంగానే భూమిని అమ్మివేయడానికి సిద్ధపడతారు!! ఫలితంగా ఒక గ్రామాన్ని రెండు మూడు గ్రామాలను కొనివేయగల బహుళ జాతీయ సంస్థల పని చాలా సులభమైపోతుంది... వ్యవసాయం మూలపడి పరిశ్రమలు వృద్ధి పొందుతాయి. వ్యవసాయం జరిగే చోట కూడా తిండి గింజలు కాక ఇంధనం తయారుకు వీలైన మొక్కలు పెరుగుతాయి! చివరికి దేశంలో తిండిగింజల కటకట ఏర్పడి తీరుతుంది! ఇదే ‘ప్రపంచీకరణకు’ పరాకాష్ఠ!
సమష్టి ప్రజాహిత కార్యకలాపాలకు మాత్రమే ప్రజల భూములను ప్రభుత్వం సేకరించాలన్నది తరతరాల సంప్రదాయం. రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇదే!! ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ దోపిడీ కలాపాలు సైతం ఇపుడు ‘ప్రజాహితం’ హోదాను పొందాయి. ఇదీ కొత్త చట్టానికి ప్రపంచీకరణ’ కల్పిచిన నేపథ్యం.
ఆంద్రభూమి దిన పత్రిక సౌజన్యంతో
భూమి సేకరణ బిల్లు నేపథ్యంలో " పరిమార్చుతున్న ‘ప్రపంచీకరణ’! " - హేబ్బార్ నాగేశ్వర్ గారి విశ్లేషనాత్మక వ్యాసం
Reviewed by JAGARANA
on
11:15 AM
Rating:
No comments: