భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదా?
"భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ నశించిపోయింది" అంటూ మనదేశంలోని అభ్యుదయ రచయితలు, అపర మేధావులుగా చలామణీ అవుతున్నవారు ఈ మధ్య తెగ గగ్గోలు పెడుతున్నారు. అక్కడికి భావప్రకటన స్వేచ్ఛ తమ గుత్త సొత్తు అయినట్లు వీరంగాలు వేస్తున్నారు.
భావప్రకటన స్వేచ్ఛ అంటే ఏమిటి? భావప్రకటన స్వేచ్ఛ అంటే తనకు తోచినట్లు మాట్లాడటం కాదు, ఎదుటివారి ఆలోచనలను, భావాలను స్వాగతించడం, వాటిని గౌరవించడం, అవసరమైతే వ్యక్తిగతంగా కాని సామాజికంగా కాని వాటిని అనుసరించడం.
భూమి బల్ల పరుపుగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. క్రైస్తవమత దేశాలన్నీ అదే నమ్మాయి. కాని పదహారవ శతాబ్దంలో గెలీలియో భూమి బల్లపరుపుగా కాదు, గుండ్రంగా ఉంటుంది అంటే క్రైస్తవమత విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడని ఆ మత పెద్దలు అతనిని వ్యతిరేకించారు. ఖగోళశాస్త్రానికి సంబంధించి అతడు చేసిన సైద్ధాంతిక ప్రతిపాదనలను మార్చుకొమ్మని బలవంతం చేస్తూ పోప్ అతనిని గృహ నిర్బంధం చేసి అతని కదలికలపై ఆంక్షలు విధించేడు. తన సిద్ధాంతాలను మార్చుకొంటేనే విడుదల చేస్తామన్నారు.
దేని గురించైనా ప్రామాణిక నిర్వచనం కావాలంటే అమరాకోశం పేరు చెప్తారు హిందువులు. ఇది క్రీస్తుపూర్వమే వ్రాయబడింది. ఇందులో భూమి గురించి యేమని వర్ణించి ఉందొ తెలుసా? "భూమి: గోళః ఇవ ఆస్థి, అచలతి" అంటే భూమి గోళాకారంలో ఉంటుంది కానీ కదలకుండా ఉంటుంది అని. మరి క్రీస్తుశకం ఐదవ శతాబ్దం వాడైన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్టు ఏమన్నాడో తెలుసా? "భూమి: గోళః ఇవ అస్థి. చలతి పరన్తు అచలతి ఇవ భావయతి" అంటే భూమి గోళాకారంలో ఉంటుంది. కదులుతూ ఉంటుంది కానీ భూమిపై ఉన్న వారికి కదలనట్లే ఉంటుంది అని. మరి అమరాకోశానికి విరుద్ధంగా చెప్పాడని ఆర్యభట్టుని ఎవరూ ఖండించలేదే? ఆయనని ఎవరూ రాళ్ళతో కొట్టి చంపలేదే. ఆయనచేప్పిన దానినే మనం శాస్త్ర ప్రమాణంగా స్వీకరించేం కదా.
మరో విశేషం ఏమిటంటే అమరకోశం వ్రాసిన అమరసింహుడు క్రీస్తుపూర్వానికి చెందిన బౌద్ధ చక్రవర్తి. బౌద్ధులు వేదాలను ఖండిస్తారన్నది అందరికీ తెలిసినదే. అలాంటిది అమరసింహుడు వ్రాసిన అమరాకోశాన్ని మనమందరం ప్రామాణికంగానే స్వీకరించేం. ఇది భావప్రకటన స్వేచ్ఛ కాదా?
శంకరాచార్యులు, మండనమిశ్రుల వాదన జరుగుతున్నప్పుడు మండనమిశ్రుని భార్య భారతి న్యాయనిర్ణేతగా ఉంటుంది. ఆ వాదనలో శంకరుడే విజయుడని నిర్ణయిస్తుంది. మరి భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతె ఇది సాధ్యమా?
మనదేశంలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు, ఆగమశాస్త్రాలు ఎన్నో వెలిసాయి. గత రెండువేల సంవత్సరాలలో ఒక్క భగవద్గీతపై వెయ్యికి పైగా వ్యాఖ్యానాలు వచ్చేయి. వీటిలో దేని ప్రత్యేకత దానిది. రామాయణ, మహాభారతాలను ఎంతో మంది తమ మనసుకి నచ్చినట్లుగా మళ్ళీ మళ్ళీ వ్రాస్తున్నారు. మన జానపదాలలో అయితే రామాయణం, మహాభారతాల గురించి ఎన్ని రకాల కథలున్నాయో! వీరిలో ఎవరూ ఎవరినీ ఖండించలేదే! ఇదంతా భావ ప్రకటన స్వేచ్ఛ కాదా?
ఇంకా మన సమాజంలో విలసిల్లిన ఎన్నో భాషలు, కళలు, ఆచారాలు, ఆరాధనా పద్ధతులు ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్చను తెలియజేయడం లేదా? శ్రీ కృష్ణుడు నరకాసృని వధానంతరం అతని కుమార్తె శైబ్యను ద్వారకకు తీసుకువెళ్ళి ఆమె ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాడు. ఆమె కోసం నరకాసురుని పూజా మందిరాన్ని ఏర్పాటు చేస్తాడు కూడా. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదా?
మన దేశంలో చార్వాకుల సంప్రదాయం ఉండేది. వీరు నాస్తికవాదులు. మరి వీరిపై ఎవరూ యుద్ధాలు చేయలేదే? మరి నేటికాలపు ప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్స్ దైవం యొక్క ఉనికినే ప్రశ్నిస్తే అతనిని చర్చిల్లోకి రాకుండా క్రైస్తవమత పెద్దలు ఆంక్షలు విధించలేదా?
ఆచార్య నాగార్జునుడు శూన్యవాదం ప్రకటించడం. సృష్టికి మూలం కార్యాకారణ సంబంధం అన్నాడు. ఆదిశంకరుడు మాయావాదం ప్రతిపాదించాడు. మనదేశంలో ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సంప్రదాయాలున్నాయి. శాక్తేయ, గాణపత్య సంప్రదాయాలున్నాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి విభేదిస్తూనే ఉంటాయి. కర్ణాటకలో బసవేశ్వరుడు బసవ సంప్రదాయాన్ని ప్రారంభించేడు. మనసమాజంలోని కుల వ్యవస్థను అంగీకరించరు వీళ్ళు. కానీ వీళ్ళంతా కలసి ఒక సమూహంగా ఏర్పడిపోయారు. వీరిని మనలో కలిపెసుకున్నామే కాని వెలివేసి చూడలేదే! ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదా?
సాల్మన్ రష్డీ "సాటానిక్ వర్సెస్" రాస్తే అతని తలను ఖండించి తెచ్చినవారికి విలువైన బహుమతి ఇస్తానని ఫత్వా జారీ చేసాడు ఆయెతుల్లా ఖొమైనీ. రెండేళ్ళ క్రితం లండన్లో ఒక విద్యాలయంలో పండ్ల ప్రదర్శన ఏర్పాటు చేసారు. తమాషా కోసం అక్కడ ఉన్న ప్రతి పండుకు ఒక చారిత్రిక ప్రముఖుని పేరు పెట్టారు. అక్కడున్న ఒక అనాసపండుకి మహ్మద్ ప్రవక్త పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కొందరు సందర్శకులు చాలా గొడవ చేసారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు క్షమాపణ చెప్పేవరకు వదలలేదు. డెన్మార్క్‌లో ఒకాయన ప్రవక్తగారి బొమ్మ గీచాడని అతనిని హింసించారు. ప్రపంచంలో బహాయీ సంప్రదాయం వారు ఉన్నారు. వారు కూడా అల్లాని ఆరాధిస్తారు. ఖురాన్ని నమ్ముతారు. ఒకే ఒక్క తేడా ఏమిటంటే మహమ్మద్ ప్రవక్త మరో రూపంలో వస్తాడని వారు అన్నారు. అంతే ఒక్క టెహరాన్ (ఇరాన్ రాజధాని) లో ఒక్క గంట వ్యవధిలో ఏభై ఆరు వేల మంది బహాయీలని ఊచకోత కోసేరు. ఇస్లాంలో ఎంత అసహనం!
బంగ్లాదేశ్ లో హిందూ యువతులపై జరిగే అత్యాచారాల గురించి "లజ్జ" నవలలో వ్రాసిన రచయిత్రి తస్లీమా నజ్రీన్ కి ఎలాంటి గౌరవ సత్కారాలు లభించేయో మనకి తెలిసినదే. తన పుస్తకాన్ని పశ్చిమబెంగాల్‌లో నిషేధించేరు. భారతదేశంలో తనకు వ్యతిరేకంగా అయిదు ఫత్వాలు జారీ అయ్యాయి. ఆమెను పశ్చిమబెంగాల్ నుంచి తరిమేశారు. ఢిల్లీలో అనేక నెలలపాటు గృహనిర్బంధంలో ఉంచారు. సునీల్ గంగూలీ, శంఖఘోష్ వంటి ప్రముఖ రచయితలు ఆమె పుస్తకాన్ని నిషేధించాలని అప్పటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను కోరారు. ఇస్లామిక్ మతవాదుల మౌఢ్యాన్ని ధైర్యంగా ఎదిరించిన రచయిత్రిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తస్లిమా నస్రీన్ తల నరికిన వారికి ఐదు లక్షల రూపాయల బహుమానాన్ని ప్రకటించారు ముస్లిం మతపెద్దలు. ప్రాణభయంతో వచ్చి ఆమె తలదాచుకున్న కోల్‌కతా నుంచి కూడా ముస్లిం మతవర్గాల దాష్టీకానికి తల ఒగ్గి, వామపక్ష, ప్రగతిశీల విశుద్ధాత్ముల ప్రభుత్వం ఆమెను వెళ్ళగొట్టారు.
మరి డా. అంబేద్కర్ హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ రాముని తప్పుపడుతూ "రిడిల్స్ ఆఫ్ రామాయణ" వ్రాసేరు. మరి వారిపై ఎవరూ విరుచుకుపడలేదే? ఆ పుస్తకాన్ని ఖండించమని ఎవరూ గొడవలు చేయలేదే?
సాల్మన్ రష్దీ, తస్లీమా నస్రీన్‌ల పుస్తకాలను నిషేధించిన విధంగా నార్లవెంకటేశ్వరరావు సీతను, భగవద్గీతను ఎగతాళి చేస్తూ చేసిన రచనలను ఎవరూ నిషేధించలేదు. తాపీ ధర్మారావు హిందూ దేవతలను కించపరుస్తూ "దేవాలయంలో బూతు బొమ్మలేందుకు?", "సాహితీ మొర్మొరాలు" అన్న రచనలు చేస్తే ఎవరూ విరుచుకుపడలేదే? ఎంతటి తీవ్రభావాలు వెల్లడించినా శ్రీశ్రీని నెత్తిన పెట్టుకొన్నాం. “నాల్గుపడగల హైందవ నాగరాజు” అన్న జాషువాను మన కవిగా ఆదరించాం. ఆయన శతజయంతిని మన వేడుకలుగా జరుపుకున్నాం. రామాయణ విషవృక్షం అన్నా, శ్రీకృష్ణుడు దొంగోడు, రాసలీలల వాడు అని అవమానించినా, వినాయకుడిపై కార్టూన్లు వేసినా సరస్వతీ దేవిని నగ్నంగా చిత్రీకరించినా హత్యలు జరగలేదు కదా!
సెప్టెంబర్ 11, 1893న చికాగో సర్వమత సభలలో మాట్లాడుతూ స్వామీ వివేకానంద ఇలా అంటారు, "సహనము, సార్వజనిక ఆమోదాన్ని ప్రపంచానికి బోధించిన మతానికి చెందినవాడనైనందుకు నేనెంతో గర్విస్తున్నాను. ప్రపంచములోని వివిధ మతాల పట్ల సహనం వహించడం మాత్రమే కాదు వాటన్నింటినీ సత్యాలుగా అంగీకరించి గౌరవించిన దేశం మా దేశం. రోమనుల దురాగతాలకు గురై తమ దేవయాలన్నీ విధ్వంసం కాగా ప్రపంచమంతటా చెల్లాచెదురైపోయిన యూదులకు ఒక్క భారతదేశంలోనే శాంతియుత ఆశ్రయం లభించింది. ప్రపంచం నలు మూలల నుండి శరణార్ధులై వచ్చిన వివిధ మతాలకు, వివిధ దేశాలకు చెందిన వారందరికీ సాదరముగా ఆశ్రయమిచ్చింది మా దేశం. ఇస్లాం మతస్తులను, క్రైస్తవ మిషనరీలను, వివిధ దేశాల నుండి వచ్చిన వ్యాపారస్తులను సగౌరవంగా ఆహ్వానించిన దేశ మా దేశం. ఇది హిందూ సంస్కృతీ యొక్క గొప్పదనం. అటువంటి దేశానికి చెందినందుకు నేనెంతో గర్వపడుతున్నాను."
ఇదేమీ తెలియకుండా భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛ మంటగలిసిపోతోందంటూ మేధావులమనుకునేవారు పెడబొబ్బలు పెడుతున్నారంటే అది వారి అజ్ఞానం మాత్రమే అవుతుంది.
భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదా?
Reviewed by rajakishor
on
1:26 PM
Rating:
No comments: