విశ్లేషణ : తాలిబన్ల తదుపరి లక్ష్యం భారత్ ! - నీనా గోపాల్
ఇస్లామాబాద్, రావల్పిండి జంటనగరాల ప్రయాణం విచ్ఛిన్నం దిశగా కొన సాగుతున్నది. ఉగ్రవాదాన్ని బోధించే పాఠశాలల నుంచే పాకిస్తాన్‌లో తాలిబన్లు పుట్టుకొచ్చారని చెప్పవచ్చు. పూర్తి మతావేశంతో ఉండే వీరు ఇక ఎంతోకాలం ఐఎస్‌ఐ చెప్పుచేతల్లో పనిచేయబోరు. పాక్ తాలిబన్లు చాలా స్వతంత్రంగా ఒక నాయకుడి కింద పనిచేస్తున్నారు. వీరి తర్వాతి లక్ష్యం పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమే. అంటే అఫ్గానిస్థాన్‌లో కర్జాయ్ ప్రభుత్వం ఏవిధంగా అఫ్గాన్ తాలిబన్లకు ఎరగా మారనున్నదో, పాక్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టబోతున్నదని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
కాబూల్‌లోని వజీర్ అక్బర్ ఖాన్ ప్రాంతానికి చెందిన తవెర్న- డు-లిబన్ రెస్టారెంట్ సమీపంలో గత జనవరి 17న జరిగిన ఆత్మాహుతి దాడిలో మొత్తం 21 మంది దుర్మరణం పాలయ్యారు. అదేవిధంగా కెనడాకు చెందిన లోగార్‌లోని ఒక మసీదులో గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మైక్రోఫోన్ బాంబు దాడిలో గవర్నర్ అర్సలా జమాల్ (47) మరణించారు. ఈ రెండు సంఘటనలను పరిశీలిస్తే ఒక సారూప్య అంశం గుర్తుకు వస్తుంది. ఈ రెండు సంఘటనల్లో పాల్గొన్న తాలిబన్లు అమెరికా ఆధీనంలోని బగ్రామ్ సైనిక స్థావరంలోని జైలునుంచి విడుదలైనవారే. ముఖ్యంగా అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్ వ్యక్తిగతంగా ఇచ్చిన ఆదేశాల మేరకు వీరు విడుదలయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అఫ్గాన్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లను చర్చల్లో పాల్గొనేలా చేయడానికి అవసరమైన సానుకూల వాతావరణాన్ని కల్పించడంలో భాగమే వీరి విడుదల!
హమిద్ కర్జాయ్ వరుసగా మూడోసారి కూడా ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న తీవ్ర కాంక్షతో ఉన్నారు. కానీ విదేశీ సైన్యాలు ఈ ఏడాది దేశం విడిచి వెళుతున్న నేపథ్యంలో, వారి స్థానంలో ఏర్పడే ఖాళీని ఆక్రమించడానికి తాలిబన్లు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో పెరిగిన తాలిబన్ల దాడులకు ఇదే నేపథ్యం. ఫలితంగా గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా, అఫ్గానిస్థాన్ భద్రతాపరమైన శూన్యతను ఎదుర్కొనబోతున్నది. ఈ ఏడాది చివరి నాటికి అమెరికా కేవలం 8 నుంచి 10వేల మంది సైనికులను మాత్రమే అఫ్గానిస్థాన్‌లో ఉంచబోతున్నదని ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ఇరాక్ నుంచి తన సైన్యాలను ఉపసంహరించుకున్న సమయంలో తీసుకున్న జాగ్రత్తలన్నింటిని అమెరికా ప్రస్తుతం కూడా తీసుకుంటున్నది. కాకపోతే సున్నీ వర్గాలనుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణమిది. ఈ నేపథ్యంలో 2017 నాటికి అఫ్గానిస్థాన్‌లో ఒక్క సైనికుడు కూడా లేకుండా స్వదేశానికి రప్పించాలని ఒబామా నిశ్చయించారు. అప్పటికి ఆయన పదవీ కాలం ముగిసిపోవడం మాత్రమే కాదు, ఇక అఫ్గానిస్థాన్ పూర్తిగా తాలిబన్ల హస్తగతం కావడం కూడా పూర్తవుతుంది.
వచ్చే ఎన్నికల్లో మొత్తం 11 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. వీరంతా ప్రస్తుత అధ్యక్షుడు, హమిద్ కర్జాయ్, అమెరికా అధ్యక్షుడు ఒబామాలకు సంయుక్త లేఖను రాసారు. ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ద్వైపాక్షిక భద్రతా ఒప్పందంపై ఇరు దేశాల అధ్యక్షులు సంతకం చేయాలన్నదే ఆ లేఖ సారాంశం. అయితే కర్జాయ్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. తమ భూభాగంలో విదేశీ సైన్యాలు తిష్టవేసి ఉండటం ఆయనకు సుతరామూ ఇష్టం కానిది.
ద్వైపాక్షిక భద్రతా ఒప్పందంపై సంతకం చేయాలని కోరుతున్న వారి అభిప్రాయం ఒక్కటే. త్వరలో జరుగనున్న ఎన్నికలకు ముందు, తర్వాత తాలిబన్లు రెచ్చిపోకుండా నిరోధించాలంటే ‘‘విదేశీ సైన్యాలు’’ అఫ్గాన్‌లో ఉండి తీరాల్సిందేనని వారి ఉద్దేశం. ముఖ్యంగా పాక్‌కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ) మాజీ బాస్‌లకు ఇక ఎంతకాలమో జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేని తాలిబన్లు రెచ్చిపోకుండా ఉండటానికి ఇది చాలా అవసరమని వారు కోరుతున్నారు. నిజానికి కాబూల్‌లోని రెస్టారెంట్ పేల్చివేత సంఘటన జరిగిన సరీగ్గా 24 గంటలకు, పాకిస్తాన్‌లోని బన్ను ప్రాంతంలో సైనిక కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో మొత్తం 20 మంది సైనికులు మరణించారు. ఇందుకు తెహ్రిక్ -ఎ- తాలిబన్ కారణమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా తెహ్రిక్-ఎ-తాలిబన్ నేతలను చర్చలకు ఆహ్వానిస్తున్నారు. ఇదిలావుండగా రావల్పిండిలోని సైనిక కేంద్ర కార్యాలయానికి కూత వేటు దూరంలోఉన్న మార్కెట్ వద్ద జనవరి 20వ తేదీన ఒక ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వెజ్ ముషార్రఫ్‌ను హతమార్చడానికి విఫలయత్నం చేసిన వారు అధికార పీఠానికి చాలా చేరువగా వచ్చేశారు. కాబూల్, బన్ను, రావల్పిండి ప్రాంతాల్లో వరుసగా జరిగిన బాంబు పేలుళ్ళు అందిస్తున్న సందేశాన్ని తప్పుగా అంచనా వేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. డ్యూరాండ్ రేఖకు రెండువైపులా అమెరికా జరుపుతున్న డ్రోన్ దాడులకు ఇవి ప్రతీకారదాడులు ఎంతమాత్రం కావు. అఫ్గాన్, పాకిస్తాన్ విభాగాలుగా విడిపోయిన తాలిబన్లు, తాము చేయాలనుకున్నది చేసి చూపిస్తున్నారు. కర్జాయ్ లేదా నవాజ్ షరీఫ్ లేదా ఖైబర్-్ఫక్తూన్‌క్వా పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్...వీరిలో ఎవరూ ఈ దాడుల ప్రభావాలను పూర్తిగా అర్థం చేసుకున్నారనుకోవడానికి వీల్లేదు. లేదా వారు అసలు వాస్తవాన్ని అంగీకరించడానికి ఇష్టపడటం లేదని భావించాలి.
ఢిల్లీ మాత్రం ఈ సంఘటనలతో తీవ్రంగా కలత చెందుతోంది. ఎందుకంటే ఇప్పటికే అఫ్గానిస్థాన్‌లో వౌలిక సదుపాయాల కల్పనకు, దేశ పునర్నిర్మాణానికి రెండు బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టింది. తాలిబన్ల యత్నాలను తటస్థీకరించడానికి అవసరమైన రాజకీయ విధాన రూపకల్పనకు కృషి చేస్తోంది. ఈ పద్ధతుల ద్వారా అంతర్గత పరిపాలనా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పరచడం భారత్ ముఖ్యోద్దేశం. ముఖ్యంగా ఎన్నికల్లో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల నేతలు, పౌర సమాజాల మధ్య పరస్పర చర్చల ద్వారా ఒక ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ ఏర్పాటు కావాలని భారత్ కోరుకుంటోంది. అంతే కాని కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమై నిగూఢంగా ఉండే, పూర్తి మతోన్మాదంతో కూడిన వ్యవస్థ అఫ్గానిస్థాన్‌లో ఏర్పడటానికి భారత్ ఇష్టపడటం లేదు. కానీ ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ పూర్తిగా విఫలమయ్యే పరిస్థితి దాపురించింది.
తాలిబన్ల అరాచకత్వం వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని అంగీకరిస్తూనే పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకె నారాయణ్..అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలో తెచ్చుకున్న తర్వాత తాలిబన్ల తర్వాతి లక్ష్యం కేవలం భారత్ మాత్రమేనని హెచ్చరించారు. మరి తాలిబన్ల అంచనా ఏమిటన్నది సుస్పష్టం. విదేశీ సైన్యాలు అఫ్గానిస్థాన్ నుంచి వైదొలగే వరకు తాలిబన్లు పోరాట పంథాను తాత్కాలికంగా పక్కన పెడతారు. విదేశీ సైన్యాలు దేశాన్ని వదలి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలన్న దానిపై తాలిబన్లకు చాలా స్పష్టత ఉన్నది. మరోమాటలో చెప్పాలంటే విదేశీ సైన్యాలు దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత, తాలిబన్లను తమ విశ్వరూపం చూపుతారు. బలహీనమైన అఫ్గాన్ సైన్యం, పోలీసుల చేతిలో అత్యాధునిక అమెరికన్ ఆయుధాలు ఉండవచ్చు గాక. డ్రోన్ దాడులు, వైమానిక దళం, సంకీర్ణ సేనలు లేకుండా తాలిబన్లతో తలపడటం కేవలం గుడ్డివాడి నడక చందమే.
ఇక పాకిస్తాన్ తాలిబన్ల విషయానికి వస్తే..ఇప్పటికే వారు ఫక్తున్‌క్వా, బెలూచిస్తాన్‌లలో పూర్తి పట్టు సాధించారు. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం పాక్ ప్రభుత్వ అధికారాన్ని ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు. మరో మాటలో చెప్పాలంటే అక్కడ పాక్ ప్రభుత్వ పాలన, ఆదేశాలు అమలు జరగడం దుస్సాధ్యం. ఇక ఇస్లామాబాద్, రావల్పిండి జంటనగరాలకు వస్తే... విచ్ఛిన్నం దిశగా వాటి ప్రయాణం కొనసాగుతున్నది. ఉగ్రవాదాన్ని బోధించే పాఠశాలల నుంచే పాకిస్తాన్‌లో తాలిబన్లు పుట్టుకొచ్చారని చెప్పవచ్చు. పూర్తి మతావేశంతో ఉండే వీరు ఇక ఎంతోకాలం ఐఎస్‌ఐ చెప్పుచేతల్లో పనిచేయబోరు. పాక్ తాలిబన్లు చాలా స్వతంత్రంగా ఒక నాయకుడి కింద పనిచేస్తున్నారు. వీరి తర్వాతి లక్ష్యం పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమే. అంటే అఫ్గానిస్థాన్‌లో కర్జాయ్ ప్రభుత్వం ఏవిధంగా అఫ్గాన్ తాలిబన్లకు ఎరగా మారనున్నదో, పాక్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టబోతున్నదని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
‘ఎంతోకాలంగా అఫ్గానిస్తాన్‌ను అగ్నిగుండంలా మార్చిన ఉగ్రవాద ప్రవాహం, ప్రస్తుతం వెనుదిరిగి పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తున్నది,’ అంటూ లాహోర్‌కు చెందిన ఒక రక్షణ విశే్లషకుడు పేర్కొనడం గమనార్హం. నిజం చెప్పాలంటే ఇది పాక్ స్వయంకృతాపరాధమే. అఫ్గానిస్థాన్‌లో రష్యా సేనలు ప్రవేశించినప్పుడు, వాటికి వ్యతిరేకంగా అమెరికా మద్దతుతో, ఉగ్రవాదులను పెంచి పోషించింది పాకిస్తానే! వారికి అప్పట్లో అన్ని రకాలుగా సహాయం అందించడం..నేడు పాముకు పాలు పోసినట్లైంది. అయినప్పటికీ పాకిస్తాన్‌లో పరివర్తన రాకపోవడం విచిత్రం. ఒక పక్క తన సైనికులు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో ఉగ్రవాద దాడుల్లో మరణిస్తున్నా ఇంకా మత ఛాందస వాదం ముసుగులో ఉగ్రవాదాన్ని పొరుగు దేశాల్లోకి ఎగుమతి చేస్తూనే ఉంది. చైనా నుంచి సంపాదించిన అణు పరిజ్ఞానాన్ని, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలకు అందించి ప్రపంచానికి సరికొత్త సవాళ్ళను సృష్టించిందీ పాకిస్తానే! ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు, సౌదీ అరేబియా పాక్ నుంచి అణుబాంబును కొనుగోలు చేయాలన్న తలంపుతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తా చెడ్డ కోతి వనమెల్లా చెడగొట్టిన చందంగా పాక్ వ్యవహారశైలి తయారైంది. తాను పెంచి పోషించిన ఉగ్రవాదులే చివరకు తనకు ఎదురు తిరిగే దుస్థితిని పాక్ ఎదుర్కొంటున్నది. ఇదే సమయంలో ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే దేశంగా పాక్ ప్రపంచ దేశాల దృష్టిలో ముద్ర వేయించుకుంది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో సైతానుతో కలిసి భుజం భుజం రాసుకుంటూ తిరగడంలో ఉన్న అపాయాన్ని ఇప్పటికైనా పాక్, అఫ్గానిస్థాన్‌లు గుర్తించాలి. అంతే కాదు న్యూఢిల్లీతో కలిసి చర్చించి ఒక అంగీకారానికి రావడం ద్వారా ఈ ఉగ్రవాద భూతాన్ని తుదముట్టించడానికి సకల చర్యలు తీసుకోవాలి. తమ దేశాల్లోని ప్రస్తుత రాజకీయ వ్యవస్థను పరిరక్షించుకోవడానికి, ఇది తమ తక్షణ కర్తవ్యమని ఆ రెండు దేశాలు ఇప్పటికైనా తెలుసుకోవాలి. మరి హమిద్ కర్జాయ్‌కు ఆశ్రయం కల్పించడానికి భారత్ చర్చలు ప్రారంభించగలదా?’
మూలం : ఆంధ్రభూమి
మూలం : ఆంధ్రభూమి
విశ్లేషణ : తాలిబన్ల తదుపరి లక్ష్యం భారత్ ! - నీనా గోపాల్
Reviewed by JAGARANA
on
8:47 AM
Rating:
No comments: