‘రేఖ’ను మార్చుతున్న చైనా మూక! - చైనా దూకుడు పై హెబ్బార్ కలం
- హెబ్బార్ నాగేశ్వర్ రావు
రానున్న ఆర్థిక సంవత్సరంలో సైనిక వ్యయాన్ని భారీగా పెంచాలని చైనా ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఆందోళన చెందవలసింది ప్రధానంగా మన ప్రభుత్వం! మన ప్రభుత్వం ఇలా ఆందోళన చెందుతున్న జాడలేదు! చైనా ప్రభుత్వం ప్రతి ఏటా మనకంటె దాదాపు నాలుగు రెట్లు సైనిక వ్యయం చేస్తుండడం దశాబ్దులుగా నడుస్తున్న చరిత్ర! పెద్ద దేశాలు తమవారి వ్యయంలో తులనాత్మకంగా తక్కువ శాతం రక్షణకు కేటాయిస్తున్నాయి. చిన్న దేశాలు, పెద్ద దేశాలతో పోల్చినప్పుడు, తమ వార్షిక వ్యయంలో ఎక్కువ శాతం రక్షణకు కేటాయిస్తుండేది అనివార్య ప్రక్రియ! పెద్ద దేశాల ఆదాయం ఎక్కువ ఉంటుంది కనుక తక్కువ శాతం కేటాయించినప్పటికీ ‘రక్షణ’కు నిధులు సరిపోతాయి. తక్కువ ఆదాయం ఉన్న చిన్న దేశాలు ఎంత ఎక్కువ ‘శాతం’ కేటాయించినప్పటికీ ఇరుగుపొరుగు ప్రమాదాల దృష్ట్యా సరిపోకపోవచ్చు! కానీ చైనా కంటే చిన్నదేశమైన మన దేశంలో కేంద్ర ప్రభుత్వ వార్షిక వ్యయంలో కేవలం పదునాలుగు, పదమూడు శాతం మాత్రమే రక్షణకు పెడుతోంది. మనకంటె పెద్ద దేశమైన చైనా తన వార్షిక వ్యయంలో దాదాపు పదిహేడు శాతం రక్షణకు కేటాయిస్తోంది! మరోవైపు మనకంటె చిన్న దేశమైన పాకిస్తాన్ ‘బడ్జెట్’లో ఇరవైమూడు శాతం- సైనిక రంగానికి కేటాయిస్తోందట! మనది ప్రజాస్వామ్య వ్యవస్థ కనుక ప్రభుత్వం ఎంతమేరకు రక్షణకు ఖర్చుపెడుతున్నదీ తెలిసిపోతోంది! కానీ ‘ఏకపక్ష నియంతృత్వం’ నెలకొని ఉన్న చైనాలో ఈ పారదర్శకత లేదు! అందువల్ల చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తున్న నిధులకంటె రెట్టింపునకు పైగా వాస్తవంగా సైన్యంకోసం ఖర్చుచేస్తోందన్నది పాశ్చాత్య మాథ్యమాలు విప్పిన గుట్టు...
రానున్న ఆర్థిక సంవత్సరం 2014-2015 లో దాదాపు ఎనిమిది లక్షల ఎనబయి ఐదువేల కోట్ల రూపాయలు రక్షణ రంగానికి కేటాయించిందట! క్రీస్తుశకం 2012-2013వ ఆర్థిక సంవత్సరంలో చైనా రక్షణకు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఆధికారికంగా కేటాయించింది! అంటే రెండేళ్లలో చైనా రక్షణ ‘బుడ్జెట్’ యాబయి శాతం పెరిగింది! ఇదే రెండేళ్లలో మన రక్షణ బడ్జెట్ ఇరవై శాతం కూడ పెరగలేదు! నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో చైనా సైనిక వ్యయం దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు-ఆధికారికంగా!! అంటే 2012- 2013 కంటె 2013-2014వ సంవత్సరంలో చైనా- రక్షణ వ్యయం దాదాపు పదిహేడు శాతం పెరిగింది. కాని వర్తమాన ఆర్థిక సంవత్సరంలో కంటే వచ్చే ఏడాది ఇరవై ఎనిమిది శాతం అధికంగా సైనిక వ్యయం చేయాలని చైనా నిర్ణయించింది. యుద్ధం చేస్తున్న సమయంలో కూడ, చిన్న దేశాలు సైతం ఒకేసారి ఇరవై ఎనిమిది శాతం మేరకు రక్షణ వ్యయా న్ని పెంచడం అరుదైన విషయం. కానీ ‘శాంతి’ సమయంలో చైనా ఇలా ఒకేసారి ఇరవై ఎనిమిది శాతం- ఏడు లక్షల కోట్ల రూపాయల నుండి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు- సైనిక వ్యయా న్ని పెంచడం ఇరుగుపొరుగు దేశాలను హడలెత్తిస్తున్న వ్యవహారం! గత ఆర్థిక సంవత్సరం 2012-2013లో మన రక్షణ వ్యయం లక్షా తొంబయి మూడు వేల కోట్లు కాగా ప్రవర్థమాన వత్సరంలో ఈ వ్యయం రెండు లక్షల మూడువేల కోట్లు. అంటే ఐదున్నర శాతం మాత్రమే పెరిగింది. మొత్తం బడ్జెట్ పరిమాణం గత సంవత్సరంలో కంటె వర్తమాన వత్సరంలో పదహారు శాతానికి పైగా పెరిగింది! అందువల్ల వాస్తవమైన మన రక్షణ వ్యయం గత ఏడాది కంటె ఈ ఏడాది తగ్గినట్టయింది!
క్రీస్తుశకం 1962లో మన దేశంపై దురాక్రమణను జరిపిన తరువాత చైనా ప్రభుత్వం ఏక పక్షంగా ఉభయ దేశాల మధ్య వాస్తవ అధీనరేఖ- ఎల్‌ఏసి- నిర్ధారించింది! మన ప్రభుత్వం బుద్ధిగా ఈ వాస్తవ అధీనరేఖను గౌరవిస్తోంది! అయినప్పటికీ నిరంతరం చైనా ప్రభుత్వం ఈ వాస్తవాధీనరేఖను మన భూభాగంలోకి నెట్టుకుంటూ వస్తోంది. ఫలితంగా ప్రతి ఏటా ఎంతో కొంత మన భూభాగం చైనా అక్రమ అధీనానికి గురవుతోంది! 1948-1949లో యుద్ధం ముగిసిన తరువాత మన జమ్మూకాశ్మీర్‌లోని ఎనబయి మూడువేల చదరపు కిలోమీటర్లు భూభాగం పాకిస్తాన్ అక్రమ అధీనంలో మిగిలింది. అందులో పాకిస్తాన్ దురాక్రమిత ‘కాశ్మీర్‌నకూ మన అధీనంలో మిగిలిన జమ్మూకాశ్మీర్‌నకూ మధ్య ‘అధీనరేఖ’-ఎల్‌ఓసి- ఏర్పడింది! ఈ ‘ఎల్‌ఓసి’ అప్పటినుంచి ఇప్పటివరకు మన వైపునకు జరగడం లేదు. ఎందుకంటె జరిపే పాకిస్తాన్ యత్నాలను మన ‘సరిహద్దు భద్రతా దళాలవారు’- బిఎస్‌ఎఫ్-, సైనికులు విజయవంతంగా ప్రతిఘటిస్తున్నారు. కానీ జమ్మూకాశ్మీర్ తూర్పు ప్రాంతమైన లడక్‌లో చైనా నిరంతరం జరుపుతున్న చొరబాట్లను దళాలు- భారత టిబెట్ సరిహద్దు పోలీసు దళాలు కాని సైనికులు కాని- ప్రతిఘటించడంలేదు! కారణం మన ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ప్రతిఘటించనివ్వకపోవడం!! నిరంతరం కాల్పులు జరుపుతున్న పాకిస్తాన్ ‘ఎల్‌ఓసి’ని మనవైపునకు ఒక్క అంగుళంమేర కూడ జరుపలేకపోతోంది! కాని ‘తూటా’ కూడ పేల్చని చైనా 1962నుంచి నేటివరకూ ‘ఎల్‌ఏసి’ని దాదాపు యాబయి కిలోమీటర్ల మేర మనవైపుకు జరుపగలిగింది! ఈ ‘అంతరానికి’ కారణం ప్రతిఘటన!
ఈ ‘తేడా’గురించి ఇటీవల మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన ‘జాతీయ సంగోష్ఠి’లో అనేక వివరాలు వెల్లడయ్యాయి! ‘‘జమ్మూకాశ్మీర్ సంబంధిత వాస్తవాలు, భ్రమ లు’’- ‘‘రియాలిటీస్ అం డ్ ఇమేజెస్ ఆఫ్ జమ్మూకాశ్మీర్’’- అన్న అంశంపై ‘జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం’ వారు, మాఖన్‌లాల్ పత్రకారితా విశ్వవిద్యాలయంవారు సంయుక్తంగా ఈ జాతీయ సదస్సును నిర్వహించారు! వక్రీకరణలను తొలగించి జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన వాస్తవాలను ఆవిష్కరించడంలో ప్రచార మాథ్యమాల పాత్ర గురించి సదస్సులో ప్రధానంగా చర్చించారు! ఈ సదస్సులో సమర్పించిన ‘‘చైనా, భారత- పశ్చిమ క్షేత్ర- సరిహద్దు సందర్శన’’అన్న అధ్యయన నివేదికలో ‘ఎల్‌ఏసి’ నిరంతరం మన వైపునకు జరిగి వస్తున్న వైపరీత్యం గురించి అనేక వివరాలు ఉన్నాయి. ఆర్‌ఎన్ రవి, శౌర్య దోనల్, అశుతోష్ భట్నాగర్ అన్న ఢిల్లీకి చెందిన పత్రికా రచయితలు జమ్మూకాశ్మీర్‌లోని- లడక్‌లోని- భారత్ చైనా సరిహద్దును సందర్శించి ‘రేఖ’ వెంబడి అనేక రోజులపాటు పర్యటించిన తరువాత ఈ అధ్యయన నివేదికను రూపొందించారు! కొత్త ఢిల్లీలోని ‘ఇండియా ఫౌండేషన్’వారు ప్రచురించిన ఈ చిరు పుస్తకంలో చైనా చొరబాట్ల తీరుతెన్నుల గురించి అనేకానేక వివరాలు పొందుపరిచారు! భారత్, టిబెట్‌ల మధ్య 1959 వరకూ కొనసాగిన సరిహద్దు ఆ తరువాత ‘్భరత చైనా సరిహద్దు’గా మారడం చారిత్రక వైపరీత్యం! టిబెట్‌ను చైనా ‘దిగమింగడం’ ఇందుకు ఏకైక కారణం! ఈ ‘్భరత్ టిబెట్’ చారిత్రకమైన సరిహద్దు మూడు క్షేత్రాలుగా విభక్తమై ఉంది! పశ్చిమ క్షేత్రం, మధ్య క్షేత్రం, పూర్వక్షేత్రం, మన లడక్‌కూ చైనా దురాక్రమి త టిబెట్‌కూ మధ్య ఉన్న సరిహద్దు పశ్చిమ క్షేత్రం! మన హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరఖండ్ సిక్కిం రాష్టాలను ఆనుకొని ఉన్న సరిహద్దు మధ్యక్షేత్రం. భూటాన్‌కు తూర్పుగా బర్మావరకు విస్తరించి ఉన్న ‘్భరత్ టిబెట్’ సరిహద్దు తూర్పు క్షేత్రం!!
చైనా ప్రభుత్వ దళాలు ప్రతిరోజు ఎక్కడోఅక్కడ ఈ ‘వాస్తవ అధీనరేఖ’ను మనవైపునకు జరుపుతూనే ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్ జూలైల మధ్య నాలుగుసార్లు చైనా దళాలు భారీ ఎత్తున జరిపిన చొరబాట్ల వల్ల మన ప్రభుత్వం సైతం ఉలిక్కిపడి లేచింది. ఎందుకంటె చొరబాట్లను పట్టించుకోకపోవడం ప్రచారం చేయకపోవడం ప్రతిఘటించకపోవడం దశాబ్దుల తరబడి మన ప్రభుత్వ విధానమైంది! ఉత్తర లడక్‌లోని దీపసంగ్ పర్వత చరియలలోకి చైనా దళాలు దురాక్రమించడం అతి పెద్ద చొరబాటు. వాస్తవ అధీన రేఖను దాటి ‘రాఖీ’నల్లా ప్రాంతంలో దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర మన ‘‘అధీనంలో ఉన్న’’ మన భూభాగంలోకి చైనా దళాలు చొచ్చుకొని వచ్చాయి! ‘వాస్తవ అధీన రేఖ’కు అటువైపున ఉన్నది మన ‘‘అధీనంలో లేని’’ మన భూభాగం! ఆ తరువాత యాబ యి మంది యుద్ధాశ్వారూఢులైన చైనీయులు రేఖదాటి మన వైపునకు చొరబడ్డారు. మరోసారి ‘రేఖ’ను దాటి మన వైపునకు వచ్చి మన నిఘా ‘కెమెరా’లను ధ్వంసం చేసి, కొన్నింటిని ఎత్తుకొనిపోయారు. చివరిగా జూలైలో ‘రేఖ’దాటి వచ్చి మన సైనిక స్థావరంపై దాడిచేసి ధ్వంసంచేసి పోయారు! గత ఏడాది జూలై తరువాత ఇప్పటివరకూ ప్రతిరోజూ లడక్‌లో చైనావారి చిన్న చిన్న చొరబాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్-జూలైలో మధ్య జరిగిపోయిన ఆ నాలుగు పెద్దచొరబాట్ల తరువాత కూడ ప్రభుత్వం నిరోధక చర్యలు తీసుకోవడం లేదు! కానీ ప్రచార మాధ్యమాలవారు మాత్రం కొంత కదిలారు. ఈ కదలికలో భాగం అశుతోష్ భట్నానగర్ బృందం వారి సరిహద్దు సందర్శనం...
వాస్తవ అధీన రేఖవద్ద - ఎల్‌ఏసి వద్ద- చైనావారి ‘పిఎల్‌ఏ’ దళాలు అటువైపున తిష్ఠవేసి ఉన్నాయి. కానీ రేఖకు ఇటువైపున మన భారత్ టిబెట్ సరిహద్దు రక్షకులు కాని సైనికులు కాని నెలకొని ఉండకపోవడం మన ప్రభుత్వ విధాన వైపరీత్యం, రక్షణ వైఫల్యం! ఈ వైపరీత్యం, వైఫల్యం 1962 నుండి సాగుతున్నాయి. వాస్తవ అధీనరేఖకు ఆరుకిలోమీటర్ల దూరంలో మాత్రమే మనవైపున మన భద్రతాదళాల బృందాలు గస్తీ తిరుగుతున్నారు! అందువల్ల వాస్తవ అధీనరేఖను చైనావారు అతిక్రమించిన సంగతి వారు ఆరు కిలోమీటర్లు లోపలికి వచ్చేవరకూ మనవారికి తెలియడంలేదు! ఎందుకంటె ‘ఎల్‌ఏసి’కి మన సైనిక స్థావరాలకూ మధ్య ఆరు కిలోమీటర్ల ప్రాంతంలో మన ‘్భద్రత’ లేదు!! మన ప్రభుత్వం ‘ఎల్‌ఏసి’ ఇటువైపున ఆరుకిలోమీటర్ల దూరంలో ‘వాస్తవ నిఘా రేఖ’- లైఫ్ ఆఫ్ యాక్చువల్ పెట్రోలింగ్- ‘ఎల్‌ఏపి’-ని ఏర్పాటుచేసుకొంది. చైనా సైనికులకు దూరంగా ఉండాలన్న లక్ష్యంతో!! ‘‘దుష్టులకు దూరం గా ఉండడం మేలన్న’’ సామెతను మన ప్రభుత్వం ఇలా ఆచరించి చూపెడుతోంది! అందువల్ల చైనావారు ఈ ఆరు కిలోమీటర్ల దూరం కొద్దిగా కొద్దిగా ఆక్రమిస్తూ వస్తున్నారు! చివరికి మన ‘వాస్తవ గస్తీరేఖ’ ఉభయుల ‘వాస్తవ అధీనరేఖ’గా మారిపోతోంది... ఇలా మారిన తరువాత మన దళాలవారు మరి కొన్ని కిలోమీటర్లు వెనక్కి వచ్చి మరో ‘వాస్తవ గస్తీరేఖ’ను ఏర్పాటుచేసుకుంటున్నారట!! ఇలా మన ‘ఎల్‌ఏసి’ మాటిమాటికీ ‘ఎల్‌ఏపి’గా మారుతోందట... ప్రతిఘటన లేకపోవడంవల్ల!!
మూలం : ఆంధ్రభూమి
‘రేఖ’ను మార్చుతున్న చైనా మూక! - చైనా దూకుడు పై హెబ్బార్ కలం
Reviewed by JAGARANA
on
9:30 AM
Rating:
No comments: