Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

అమ్మకోసం... కొత్త కోణంలో వివేకానంద


      • మహారాజా
        ... మీకు తెలుసు. నేను తిరిగి వచ్చినప్పటి నుంచి జబ్బుపడ్డాను. పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్నది. ఇప్పుడు దాదాపుగా మృత్యువు గుమ్మం దగ్గర ఉన్నాను. తమరి ఔదార్యాన్ని, స్నేహాన్ని పురస్కరించుకుని ఈ మనవి చేస్తున్నాను. ఒక పెద్ద పాపం చేశానన్న అపరాధ భావం నా మనసును ఎప్పుడూ బాధిస్తుంది. అదేమిటంటే - ప్రపంచానికి సేవ చేయడం కోసం నేను నా తల్లిని చాలా నిర్లక్ష్యం చేశాను. ఇక కనీసం కొనే్నళ్లయినా మా అమ్మను బాగా చూసుకోవాలని నా చివరి కోరిక. అమ్మతో కలిసి ఉండి, తమ్ముడికి పెళ్లి చేసి వంశాన్ని నిలబెట్టాలని అనుకుంటున్నాను. ఆమె ఇప్పుడు దరిద్రపు కొంపలో ఉంటున్నది. ఓ చిన్నపాటి మంచి ఇల్లు ఆమెకు కట్టించాలని ఉంది. సాయానికి ఎవరిని అడగాలో తెలియదు. యూరప్‌లో నాకు వచ్చిన డబ్బంతా ‘పని’ కోసం ఉద్దేశించింది. ప్రతి పైసా ఆ పనికే ఖర్చయింది. నా కోసం ఇతరులెవ్వరినీ సహాయం అడగలేను. నా సొంత కుటుంబ విషయాలు మీకు తప్ప నేను ఎవరికీ చెప్పలేదు. ఇంకెవరికీ తెలియదు. నేను అలిసిపోయాను. మనసులో బాధగా ఉంది. మరణానికి దగ్గరయ్యాను. మిమ్మల్ని ప్రార్థించేది ఇది: మీ గొప్ప ఉదార స్వభావానికి తగినట్టు దయతో నాకు చివరి సహాయం చేయండి.
        తాజా కలం: ఈ ఉత్తరం పూర్తిగా వ్యక్తిగతం. మీరు చేసేదీ లేనిదీ దయచేసి టెలిగ్రాం ఇవ్వగలరా?
         
      భువనేశ్వరి దేవి - స్వామిజి తల్లి 
        నమ్ముతారా? చదివితే మనసున్న ఎవరికైనా కళ్లు చెమర్చే ఈ ఉత్తరం రాసింది స్వామి వివేకానంద! ఈ లోకాన్ని వదిలి వెళ్లడానికి సుమారు నాలుగేళ్ల ముందు 1898 నవంబరులో ఖేత్రీ
        మహారాజా అజిత్‌సింగ్‌కి రాసిన లేఖ ఇది. శంకర్ రచించినThe Monk As Man గ్రంథం 67వ పేజీలో దీన్ని ఉటంకించారు.
        జాబు అందగానే స్వామి చిత్తక్షోభను అర్థం చేసుకుని మహారాజా కదిలిపోయాడు. తప్పక సహాయం చేస్తానని వెంటనే టెలిగ్రాం ఇచ్చాడు. దానికి సంతోషించి స్వామి బేలూరు మఠం నుంచి 1898 డిసెంబర్ 1న కృతజ్ఞత తెలుపుతూ జాబు రాశారు. ఇల్లు కట్టడానికి ఎంతయ్యేదీ, తల్లి పోషణకూ, తన మందులకూ ఎంత కావలసిందీ అందులో వివరించారు. ఆ ప్రకారం రాజావారూ చేయగలిగింది చేశారు. ఆ వివరాలు ఇక్కడ అక్కర్లేదు.
        పై ఉత్తరాన్ని చదివితే ఆశ్చర్యం వేస్తుంది. దేశం, ధర్మం, కర్తవ్యం తప్ప మరొక ధ్యాస లేక, తల పెట్టిన మహా సంకల్పాన్ని సాధించడం మినహా ఇంకో ఆలోచన దగ్గరికి రానీయక..., సాంసారిక బంధాల్లో, అనుబంధాల్లో, లౌకిక లంపటాల్లో ఎన్నడూ చిక్కుకోకుండా... బతికినంత కాలం, కడపటి క్షణం వరకూ ఏకదీక్షతో నిర్విచారంగా నిర్వికారంగా పరిశ్రమించిన ఆ కర్మయోగి మనసు పొరల్లో కన్నతల్లి మీద అంతలేసి ప్రేమ పొంగి పొరలిందా?
        ‘గురుదేవుల నిర్యాణం తరవాత పెద్ద సమస్య వచ్చింది. ఒకవైపు మా అమ్మ, తమ్ముళ్లు. నాన్న పోయాక కుటుంబం చితికింది. కటిక దారిద్య్రం అనుభవిస్తున్నాం. తినడానికి తిండి లేక పస్తులుంటున్నాం. నేనే పెద్ద కొడుకుని. ఇంటి బాధ్యత నేనే మోయాలి. ఆకలి చావు నుంచి మా వాళ్లను తప్పించాలి. ఇంకోవైపు నా ఆదర్శం. శ్రీరామకృష్ణుల భావాలు దేశానికి, లోకానికి చాలా మంచివి. వాటిని ప్రచారం చేసి, అమలు పరచాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఏమి చెయ్యాలి, ఏది ఎంచుకోవాలి అని రోజులు, నెలలు మనసులో ఎంతో మధనపడ్డాను. నరకయాతన అనుభవించాను. చివరికి - ఒక నిర్ణయానికి వచ్చాను. అంతటి ఉదాత్త భావాలు ప్రపంచానికి తెలియకుండా అంతరించిపోవడం కంటే అమ్మ, తమ్ముళ్లు భయంకరమైన బాధలు పడటమే మేలని గుండెరాయి చేసుకున్నాను. త్యాగం చెయ్యకుండా గొప్ప పని ఏదీ సాధించలేము. గుండెను కోసి నెత్తురోడే హృదయాన్ని బలిపీఠం మీద పెట్టాలి’ అని స్వయంగా చెప్పి, నిజంగానే అలా చేసి, కుటుంబ బాధ్యతను పక్కనపెట్టి, జీవితమంతా దేశానికి అంకితం చేసిన మహనీయుడు అమ్మను సుఖపెట్టలేక పోయానే అని అంతగా పరితపించాడా?
        వివేకానందుడెవరో తెలియని వారు పై ఉత్తరాన్ని చదివితే అందరిలాగే ఆయనకూ అమ్మంటే మహా ఇష్టం. కాని సన్యాసి కదా? ఏమీ చేయలేక పోయాడు. అందుకే ఇల్లు కట్టించడానికి సాయం కోసం ఎవరో మారాజును దేబిరించాడు -అనుకోగలరు.
        వివేకానంద మనమెరిగిన సన్యాసులు, ఈ కాలపు స్వామీజీల వంటివాడైతే ఒకరిని యాచించాల్సిన అవసరమే పట్టేది కాదు. ఆయన ఊ అంటే చాలు లక్షలు, కోట్లు కుమ్మరించటానికి దేశంలో ఎందరో మహారాజులు, విదేశీ కుబేరులు సిద్ధంగా ఉన్నారు. అజ్ఞాతంగా, అతిసామాన్యంగా దేశమంతటా తిరిగిన రోజుల్లో స్వామిని చూసి మైసూరు మహారాజా ముగ్ధుడై, ‘మీరు ఏమి కావాలంటే అది ఇస్తాను, ఎంత సంపదైనా సంతోషంగా ధారపోస్తాను’ అని అడిగితే, ఆయన్ని చిన్నబుచ్చడం ఇష్టంలేక ‘అలాగా! ఒక మంచి హుక్కా ఇవ్వండి చాలు’ అని కోరిన విరాగి వివేకానంద! సెలవు తీసుకునేటప్పుడు ‘దారి ఖర్చులకు పనికొస్తాయి ఉంచండి’ అని మైసూరు ప్రధాని తన జేబులో నోట్ల కట్ట కుక్కపోతే, అక్కర్లేదని వారించి ‘నేను వెళ్లే ఊరికి రైలు టిక్కెటు మాత్రం తీసి పెట్టండి’ అని వివేకానంద మాత్రమే అనగలడు.
        ప్రపంచంలోకెల్లా పెద్దది, గొప్పది అనుకునే హార్వర్డ్ యూనివర్సిటీ వేదాంత తత్త్వం మీద లెక్చర్ ఇవ్వటానికి అమెరికా పర్యటనలో ఉండగా స్వామీజీని ఆహ్వానించింది. 1896 మార్చి 25న అక్కడి గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆయన చేసిన ప్రసంగానికి విశ్వవిద్యాలయ అధికారులు ముగ్ధులై.. ఈస్టర్న్ ఫిలాసఫీ విభాగం ఛైర్ మీకిస్తాం. మీరు ఎంత కావాలంటే అంత పారితోషికం ఇస్తాం ఇక్కడే ఉండిపొండి - అని ఆఫర్ చేశారు. తరవాత కొలంబియా యూనివర్సిటీ కూడా ఇలాంటి ప్రతిపాదనే చేసింది. ఇంకొకరైతే ఎగిరి గంతేసి సరే అనేవాళ్లే. ఏ యూనివర్సిటీ కోరికను మన్నించినా వివేకానంద తన తల్లికి చిన్న ఇల్లు ఏమిటి ఇంద్రభవనమే కట్టించి, ఒళ్లంతా బంగారపు తొడుగు చేయించగలిగేవాడు. కాని - ఆయన అంత గొప్ప యూనివర్సిటీల ఆఫర్లను చిరునవ్వుతో తిరస్కరించారు- ‘సన్యాసిని. నాకెందుకు ఇవన్నీ’ అంటూ!
        జీవితంలో ఒక్కసారి అమెరికాలో అడుగుపెట్టే చాన్సు వస్తేనే ఈ కాలంలో కొంతమంది కళాకారులు, సన్యాసులు జోలెపట్టి అందిన కాడికి డాలర్లు దండుకుంటారు. ఒక్క నెల రోజులు అక్కడ ఉండగలిగితే చాలు కొన్ని సంవత్సరాలకు సరిపడా సంపాదిస్తారు. వివేకానంద అమెరికాకు ఒకసారి కాదు - రెండుసార్లు వెళ్లాడు. మొదటి తూరి మూడేళ్లు పైగా ఉన్నాడు. తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం దాకా విశాల దేశమంతా నిర్విరామంగా తిరిగాడు. నోరు బొంగురుపోయేలా, ఒళ్లు పులిసిపోయేలా వారానికి 12, 14, ఒక్కోసారి ఇంకా ఎక్కువ చొప్పున తడవకో కొత్త విషయం మీద లెక్చర్లు ఇచ్చాడు. అంత కష్టపడితే ఆయనకు దక్కింది లెక్చరుకు 30 నుంచి 80 డాలర్లు మాత్రమే. మాయదారి ఏజంటు మోసగించినా, కష్టార్జితాన్ని చాలా నష్టపోయినా, మొత్తానికి బాగానే ఆర్జించాడు. అందులో ఒక్క డాలరు కూడా - ‘ఇండియాలో గొప్ప పని ఏదో తలపెట్టాను. దాని కోసం విరాళమివ్వండి’ అని అడుక్కున్నది కాదు. అద్భుత విద్యను ప్రదర్శించి, స్వశక్తితో కష్టపడి సంపాదించిన సొమ్మును ఆయన ఎలా ఖర్చు పెట్టినా అడిగేవాళ్లు లేరు. దిక్కులేని మా అమ్మకు ఇంత ఇస్తున్నాను అంటే ఎవరైనా సంతోషిస్తారు. అసలు ఒకరికి సంజాయిషీ ఇవ్వవలసిన అవసరమూ ఆయనకు లేదు. అయినా - గురువుగారి దివ్య స్మృతికి శాశ్వత ఆకృతి ఇవ్వాలన్న ‘పని’ని తాను తలపెట్టాడు కనుక సంపాదించిన ప్రతి సెంటూ - తల్లి, తమ్ములు అక్కడ నానా అవస్థలు పడుతున్నారని తెలిసి కూడా - ‘పని’ కోసమే వివేకానంద ఖర్చు పెట్టాడు... అది తనది కాదు అనుకున్నాడు కనుక. తనది కానట్టే సమాజ కార్యానికి వెచ్చించి, సొంత అవసరాల దగ్గరికి వచ్చేసరికి ఖేత్రీ మహారాజా ముందు చేయి చాచడం ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి శోభనిచ్చేదే తప్ప ఆయన స్థాయిని తగ్గించేది కాదు.
        డబ్బు కావాలంటే వివేకానంద ఆ సంస్థానాధీశుడినే ప్రార్థించ నవసరం లేదు. ‘సచ్చిదానంద’ ‘వివిదిశానంద’ అంటూ దండం, గొంగళి, భిక్షాపాత్ర, భగవద్గీత మాత్రం పట్టుకుని మూడేళ్ల పాటు ఆయన అజ్ఞాతంగా దేశమంతా తిరిగినప్పుడే, స్వామి దివ్యశక్తికి మోకరిల్లి ‘మీకు ఏది కావాలంటే అది ఇస్తాం. ఇంకొన్నాళ్లు మా దగ్గర ఉండండి చాలు’ అని... అడక్కుండానే ఎందరో మహారాజాలు ఖరీదైన కానుకలు ఇవ్వబోయారు. అలాంటిది ఆయన పేరు ప్రపంచమంతా మారుమోగాక, ఆయనను చూసి యావద్దేశం గర్వపడసాగాక, ఆయన చిన్న సూచన చేస్తే చాలు వారిలో ఎవరైనా కనకవర్షం కురిపించరా?
        హైందవ ప్రభువులే కాదు. నిజాం దర్బారులో పెద్ద నవాబూ హైదరాబాదుకు స్వామి వచ్చినప్పుడు ‘మీరు అమెరికా వెళ్లేందుకు ఖర్చంతా భరిస్తాను’ అని తనంతట తాను ఆఫర్ చేశాడు. సున్నితంగా తిరస్కరించిన స్వామి తరవాత అమెరికా వెళ్లాలన్న నిశ్చయానికి వచ్చాక తన ప్రయాణానికి ఏర్పాట్లు చేసే మహదవకాశాన్ని తన సన్నిహితుడు, భక్తుడు అయిన ఖేత్రీ రాజా అజిత్‌సింగుకు మాత్రమే ఇచ్చాడు. అందువల్ల చివరి దశలో తల్లిని సుఖపెట్టాలన్న కోరిక తొందరపెట్టినప్పుడు సహాయం కోసం ఆయన అజిత్ సింగ్ వైపే చూడటం సహజమే; సమంజసమే.
        మానవ సహజమైన మాతృ ప్రేమ ఏదో - అంతరాంతరాల్లో నుంచి పొంగుకొచ్చిన స్థితిలో తన కోరికను అజిత్ సింగ్ ముందు అలా పెట్టినా - వివేకానందుడు ఆ తరవాత కూడా అమ్మ దగ్గర ఉన్నదీ లేదు. పనులు మానుకుని అజమాయిషీ చేసి అమ్మకు ఇల్లు కట్టించి ఇచ్చిందీ లేదు. వంశాన్ని నిలబెట్టటం కోసం పెద్దరికం పైన వేసుకుని సంబంధం చూసి తమ్ముడిని ఓ ఇంటి వాడిని చేసిందీ లేదు. దగ్గరుండి తల్లిని బాగా చూసుకోలేక పోయానే అన్న బాధ లోపల ఎంత ఉన్నా పై ఉత్తరం రాసిన తరవాత కూడా తన జీవిత లక్ష్యం మీదే దృష్టి యావత్తూ కేంద్రీకరించాడు. ధర్మ ప్రచారానికీ, ధర్మవీరులను తయారుచేయడానికీ, జాతిని జాగృతం చేయడానికీ సమయమంతా వెచ్చించాడు. ఆస్తమా, మధుమేహం లాంటి జబ్బులు, నెప్పులు ఎన్ని పీడించినా, ఆ శరీరం తనది కాదన్నట్టు తితిక్షతో భరించాడు. 1902 జులై 4న జీవితంలో చివరి రోజు కూడా బేలూరు మఠంలోనే ఉండి, విద్యార్థులకు మూడు గంటలు పాఠం చెప్పి, శిష్యులతో వేదాంత చర్చ చేసి, తన గదిలో ధ్యానం చేస్తూ మహా సమాధి చెందాడే తప్ప అమ్మను చూద్దాం, తమ్ముడికి అప్పగింతలు పెడదాం అనుకోలేదు.
        దటీజ్ వివేకానంద! *
        source: 
  • http://www.andhrabhoomi.net/specials/AADIVAVRAM%20--%20Ee%20Vaaram%20Special/content/e-varam-special
    అమ్మకోసం... కొత్త కోణంలో వివేకానంద Reviewed by JAGARANA on 8:45 AM Rating: 5

    2 comments:

    1. వివేకానంద గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు.

      ReplyDelete

    All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
    Designed by JOJOThemes

    Contact Form

    Name

    Email *

    Message *

    Powered by Blogger.