Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ముదిరిపోతున్న‘సెక్యులర్’ పిచ్చి!

  • ఎస్‌.ఆర్. రామానుజన్, ఆంధ్రభూమి దినపత్రిక, 29
  • - 10 - 2015

మీరు రాత్రికి రాత్రే దినపత్రికల్లో పతాక శీర్షికల్లోకి ఎక్కాలనుకుంటున్నారా? వివిధ ఛానళ్లలో నిర్వహించే బుద్ధిమాలిన చర్చల్లో ప్యానలిస్టుగా మారాలనుకుంటున్నారా? అయితే అందుకు మీరు పెద్దగా కష్టపడాల్సిన పనేం లేదు. ఒక లెటల్‌హెడ్‌ను సృష్టించండి. అయితే దానిపై మాత్రం ఏదో ఒక ‘సేన’..అంటే హిందూ సేన, రుద్ర సేన, సనాతన సేన..ఏ పేరైనా కావచ్చు. తక్షణం సెక్యులరిస్టులను ఆకర్షించే పై రకాల్లో ఏదోఒక పేరు మీ లెటల్‌హెడ్‌పై చేర్చండి. తర్వాత మీరు చేయాల్సిందల్లా..గోమాంస భక్షకులకు లేదా చరిత్రను వక్రీకరించిన వారికో లేక రచయితల ముసుగులో ‘సెక్యులర్ పోరాట యోధు లు’గా పేరుపడ్డ వారికో వ్యతిరేకంగా మీరు సృష్టించిన లెటర్‌హెడ్‌పై ఒక ప్రకటన చేయడం! చాలు ఇక జరగాల్సిన కిష్కింధకాండకు మీ ప్రమేయం అవసరం లేదు!! మీడియాకు కావలసిన వ్యక్తిగా మారిపోతారు. 

లేకపోతే దశాబ్దాల క్రితం అవార్డులు పొందిన ఈ సెక్యులర్ రచయితల్లో కొందరు అకస్మాత్తుగా వెలుగులోకి ఎట్లా రాగలిగారో ఒక్కసారి ఆలోచించిండి!

మిమ్మల్ని మీరు ‘సెక్యులర్’వాదిగా నిరూపించుకోవాలనుకోండి. అప్పుడు మీరు ..‘‘ఔను, నేను హిందువునే, గో మాంసాన్ని భుజించడానికి గర్వపడుతున్నాను,’’ అంటే చాలు. మీరిక వీర సెక్యులరిస్టు అయిపోయినట్టే! 

ఎందుకంటే ఈ ‘సెక్యులర్ దళం’వారు చేసిన కొన్ని ట్వీట్‌లను ఒక్కసారి పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది.

"భారత పౌరులుగా, జె స్యూస్ ఛార్లీ మాదిరిగా ప్రచారం చేయాలి. మీ తలను సగర్వంగా ఎత్తే ఉంచి ఈ విధంగా చెప్పం డి, ‘నేను గోమాంసాన్ని భుజిస్తాను,’ అని. జె స్యూస్ ఛార్లీ అంటే ఫ్రెంచ్ భాషలో ‘‘నేను ఛార్లి’’ అని అర్థం. జిహాదీలు పన్నెండు మంది కార్టూనిస్టులను పొట్టన పెట్టుకున్న తర్వాత ఫ్రెంచ్ కళా దర్శకుడు ఈ నినాదాన్ని సృష్టించాడు. వాక్‌స్వాతంత్య్రానికి, పత్రికా స్వేచ్ఛకు మద్దతుదార్లు దీనికి మరింత ప్రాచుర్యం కల్పించారు. విచిత్రమేమంటే మనదేశంలో ఈ నినాదాన్ని ఉటంకించేవాళ్లు జిహాదీలకు మద్దతుదార్లు. కార్టూనిస్టులకు కూడా ఒక ‘లక్ష్మణ రేఖ’ ఉండాలని ఇటువంటివారు కోరడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనేం లేదు. ఉదారవాదులుగా తమకు తామే ఢంకా భజాయించి మరీ చెప్పుకునే వారి ‘ద్వంద్వ’ నీతికి ఇంతకు మించిన ఉదాహరణ మరేం కావాలి? అయితే ‘హేతువాదులు’గా చెప్పుకునే వీరికి ఈ లక్ష్మణరేఖ వర్తించదని మనం అర్థం చేసుకోవాలి! 

సాహిత్యంలో పాక్షిక-శృంగార రచయితగా పేరుపడ్డ ఒక మహిళా కాలమిస్టు ఒకావిడె ఉంది. ‘‘నేను ఆవు మాంసాన్ని భుజిస్తాను. రండి నన్ను కూడా చంపేయండి’’ అంటూ ట్వీట్ చేసింది. మరి ఈవిడే ‘నేను పంది మాంసం తింటాను, రండి చంపేయండి’ అని అనగలుగుతుందా? అనదు! ఎందుకంటే అటువంటి మాటలు ఒక మతంవారి మనోభావాలను దెబ్బతీస్తాయి మరి!

‘‘అతి క్రూరమైన ఈ పగ, ద్వేషం దేశంలో కొనసాగుతున్నప్పుడు, ఐక్యరాజ్య సమితిలో ఉన్నతస్థానం పొందినా ఫలితమేంటి?’’...ఎన్‌డీఏ ప్రభుత్వ మంత్రివర్గ ఏర్పాటుపై ఒక యాంకర్ ఇచ్చే సలహా ఇది. ఇదెట్లా ఉందంటే, నరేంద్ర మోదీ..దాద్రిలోని అఖలెక్ ఇంటి ముందు నిలబడి గోమాంసాన్ని భుజించినందుకు అతగాడిని చంపేయమంటూ ప్రజలను దగ్గరుండి ప్రేరేపించినట్టుగా ఉంది.

ఇక మరో లెఫ్ట్ మహిళా ఉగ్రవాది ‘‘అఖిలెక్ కేవలం గోమాంసాన్ని తిన్నందుకు హత్యకు గురికాలేదు. కేవలం మోదీ ఇండియాలో ముస్లిం అయినందువల్లనే హతుడయ్యాడు,’’ అంటూ వ్యాఖ్యానించింది. మనదేశంలో సెక్యులర్ ప్రవచనాలు ఈ స్థాయిలో కొనసాగుతున్నాయి. ‘‘అసహనం’’, ‘‘విభజన తత్వం’’ దేశంలో మత ఉద్రేకాలను రెచ్చగొట్టడం వంటి పదాలన్నీ వాడేది వీరే. 

అసలీ పరమ ‘శ్రేష్టులు’ వ్యవహారశైలి ఎట్లా ఉంటుందో పరిశీలిద్దాం. ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడ్డారనుకుందాం. ఖర్మకాలి ఆ వ్యక్తి దళితుడైతే ఇక అంతే సంగతులు. ఎంత నరకం సృష్టించాలో అంతా సృష్టిస్తారు. వెంటనే ఒక కెమేరా బృందాలను ప్రపంచంలోని ఎక్కడెక్కడి వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆగమేఘాల మీద నలుమూలలకూ పంపుతారు. కనుబొమలమీది వెంట్రుకల వంటి వీరు ఆయా ప్రాంతాల వారి అభిప్రాయాలను ఏదోవిధంగా రాబట్టి వాటిని నేరుగా ప్రసారం చేయడమో లేదా ప్రచురించడమో చేస్తారు. ఇక సహజంగానే సెక్యులర్ బ్రిగేడ్‌లు రంగంలోకి దిగుతాయి. ఇక దీనిపై రాజకీయ గందరగోళాన్ని సృష్టించి, వండి వార్చి, చివరకు గత 18 నెలలుగా దేశంలో అసహనం పెరిగిపోతున్నదని తేల్చేస్తారు. మరి ఈ ‘వార్తా వ్యాపారులు’ ఏ నిష్కళంకులైన, ఉత్తములైన- ఏ పార్టీకి చెందినవారైనా- వారి వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను ఎందుకు స్వీకరించరు? ‘అడవి ఎలుకలు ప్రోది చేసిన మట్టి దిబ్బ’ను పెద్ద ‘పర్వతం’గా మార్చాలంటే ఈ విధానం పనికిరాదు మరి!

ఇక మరింత గందరగోళం సృష్టించడానికి మరోమార్గం కూడా ఉంది. ‘మన్ కీ బాత్’లో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, 2016 జనవరి నుంచి దిగువ స్థాయి పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండా నేరుగా ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తామని ప్రకటించారు. కేవలం అవినీతికి కారకులైన మధ్య దళారీలను తొలగించేందుకే ఈ పద్ధతి పాటింపు అని కూడా స్పష్టం చేశారు. ఎర్రకోటపై జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి కేటగిరీకి చెందినవారి మెరిట్ లిస్టు ఉండటం వల్ల, దీనికి, రిజర్వేషన్లకు సంబంధం లేదు. కానీ మోదీ చేసిన ప్రకటనను వక్రీకరించి, తప్పుడు వ్యాఖ్యానాలు సృష్టించి..ఇక ముందు రిజర్వేషన్లు ఉండబోవన్న ప్రచారం మొదలు పెట్టారు.

మీరు ‘‘ప్రియమానసం’’ అనే చిత్రం పేరు విన్నారా? ఇది పూర్తిగా సంస్కృత భాషా చిత్రం. దాదాపు 22 ఏళ్ల విరామం తర్వాత తీసినది. జివి అయ్యర్ తీసిన ‘ఆది శంకర’, 'భగవద్గీత’ తర్వాత మూడో చిత్రమిది. కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించేందుకు మొదట ఈ చిత్రాన్ని షార్ట్‌లిస్టులో చేర్చారు. కానీ, ఇందులో హిందూ దేవతలున్నారన్న నెపంతో తర్వాత దీన్ని నిషేధించారు. కేరళకు చెందిన 17వ శతాబ్దపు ప్రముఖ మేధావి, రచయిత, నాటకకర్త అయిన ఉన్నయ్ వారియర్‌పై తీసిన చిత్రమిది. ‘కథాకళి’కి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ‘నలచరితం’ నృత్యనాటక కర్తగా ఆయన పేరు ప్రఖ్యాతులు జగద్విదితం. కేరళలో వారియర్లు అప్పట్లో పూలదండలు అల్లేవారు. అందువల్ల ఆయన ఎక్కువగా కేరళలోని కూడలమనిక్కమ్, అనంతపద్మనాభ స్వామి దేవాలయాల్లో గడిపారు. కానీ ఆయన నంబూద్రి బ్రాహ్మణుడు కాదు. ఒక ప్రముఖ వ్యక్తి ఆత్మకథకు సంబంధించిన చిత్రం కనుక ఇందులో హిందూ దేవతలను చూపించక తప్పలేదు. కేవలం ఈ కారణం చేతనే ప్రియమానసం చిత్రం పరిశీలనకు నోచుకోలేకపోయింది. మనలోని ‘సెక్యులర్’ దృక్కోణ ఫలితమిది!

దీనికి పూర్తి భిన్నమైన మరో సంఘటన పరిశీలిద్దాం. హిందూ దేవతలను కించపరుస్తూ కర్ణాటకకు చెందిన ఒక జర్నలిజం విద్యార్థిని కొన్ని రచనలు చేసిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమెపై కొన్ని బెదిరింపు హెచ్చరికలు వచ్చాయంటూ ఒకటే అరుపులు పెడబొబ్బలు పెడుతున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన నీతి ఏమంటే.. మీరు చేయితిరిగిన రచయిత అయినా లేక కొత్తగా రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టిన వారైనా తక్షణ గుర్తింపు రావాలంటే ఒక్కటే మార్గం. హిందువులకు వ్యతిరేకంగా రచనలు చేయాలి. అప్పుడు ఏవిధమైన కష్టపడకుండానే మీకు తక్షణ గుర్తింపు వచ్చేస్తుంది! రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో పేర్కొన్న భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డంపెట్టుకొని మీరు హిందూ దేవతలకు వ్యతిరేకంగా అడ్డమైన రాతలు రాయవచ్చు. మరి అదే ఇస్లాంకు వ్యతిరేకంగా ఇటువంటి రాతలు మీరు ఎట్టిపరిస్థితుల్లో రాయలేరు. అయినప్పటికీ మీరు మొండిగా రాశారనుకోండి..కేరళలో ఒక అధ్యాపకుడి చేతికి పట్టిన గతే మీకూ పడుతుంది.

తన పుట్టిన రోజు సందర్భంగా ఒక విద్యార్థిని బొట్టు పెట్టుకున్న నేరానికి తెలంగాణలోని ఒక పాఠశాల ఆమెను శిక్షించింది. తమ మతానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్న ఒక హిందువును బిహార్‌లో ముస్లింలు దారుణంగా హతమార్చారు. మరి ఇవన్నీ మన సెక్యులరిజం పునాదులను మరింత బలపరచే సంఘటనలే! ఇటువంటి వాటికి విరుద్ధమైనవేవైనా మతతత్వంతో కూడుకున్నవే.

గోవధను వ్యతిరేకించిన కర్ణాటకలోని మూడ్‌బిర్ది గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన జరిగిన పది రోజుల తర్వాత కూడా మన జాతీయ మీడియాకు దీని గురించి తెలియదు! తీరా ఈ సంఘటన వెలుగులోకి వచ్చేసరికి.. గోవధ, పశువుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేపట్టిన మతపరమైన కార్యకలాపాల వల్లనే అతను హత్యకు గురయ్యాడు తప్ప మరోటి కాదు. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే ఈ సంఘటనను వాడుకుంటున్నారంటూ తీర్పులిచ్చేశారు. మరి ఇదే తర్కాన్ని కల్బర్గీకి కూడా వర్తింపజేస్తే, అతని హత్య కూడా మతపరమైన కార్యకలాపాల వల్లనే కదా జరిగింది! కానీ ఈ హత్యను ఆవిధంగా ఎవరూ పరిగణించరు. స్థానిక లింగాయత్‌లకు వ్యతిరేకంగా అతని పోరాటం, ఆ వర్గం వారి ఆగ్రహానికి కారణమైంది. 1986లోనే ఆయన్ను వారు హెచ్చరించారు. గోవధ చట్ట ప్రకారం నిషిద్ధం. అటువంటప్పుడు ఆవులను చంపితే చట్టాన్ని ఉల్లం ఘించినట్లే కదా! ఈ ఉల్లంఘనను వ్యతిరేకిస్తే సహనం లేనట్లవుతుందా? ఎంతటి విడ్డూర తర్కం!?

మానవాళిపై దారుణమై అకృత్యాలు జరిగిన ఇన్నేళ్ళూ మీగడ మింగిన పిల్లిలా ఉన్న రచయితలు ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేయడమేంటి? సాల్మన్ రష్దీ, తస్లీమా నస్రీన్‌ల పుస్తకాలను నిషేధించిన విధంగా నార్లవెంకటేశ్వరరావు సీతను, గీతను ఎగతాళి చేస్తూ చేసిన రచనలను ఎవరూ నిషేధించలేదు. ఇప్పుడెందుకు ఈ గలాటా? 

ఈ విషయంలో నయనతార సెహ్వాల్ నిష్కపటత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. అతి ప్రదర్శించే ఒక యాంకర్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె.. ‘‘ఇప్పుడు తేడా ఉంది. ప్రస్తుతం మనం హిందూ ప్రభుత్వాన్ని కలిగివున్నాం,’’ అన్నారు. భేష్! మన సెక్యులర్ రచయితల మనోప్రవృత్తి ఏవిధంగా ఉన్నదీ తెలియజెప్పడానికి ఇది చాలు.

ముదిరిపోతున్న‘సెక్యులర్’ పిచ్చి! Reviewed by rajakishor on 7:06 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.