మహాయోగి... మహాద్రష్ట - కొత్త కోణంలో వివేకానంద
- ఎం.వి.ఆర్. శాస్త్రి ( ఆంధ్రభూమి దిన పత్రిక చీఫ్ ఎడిటర్ )
కాలేజి రోజుల్లో రామకృష్ణ పరమహంసను యాదృచ్ఛికంగా కలిసేదాకా వివేకానందుడికి ఆధ్యాత్మిక వాసన లేదని చాలామంది అనుకుంటారు. ‘మీరు దేవుణ్ని చూశారా’ అని అడిగితే ఆయన ఔనని చెప్పాక, కాలిబొటన వేలిని తన నుదుటిపై ఉంచి అలౌకిక దివ్యానుభవం కలిగించాకే నరేంద్రుడి జీవితం మారిపోయిందని సాధారణ జనాభిప్రాయం.
దానికి తగ్గట్టు నరేంద్రుడూ తాను శ్రీరామకృష్ణుల బానిసనని, గురుదేవుల దివ్య సందేశాన్ని ప్రచారం చేయడానికే తాను జీవిస్తున్నానని చాలా పర్యాయాలు చెప్పాడు.
నిజానికి వివేకానంద కారణజన్ముడు. పుట్టుకతోనే మహాయోగి. ఎటొచ్చీ ఆ సంగతి అతడికే తెలియదు. అతడు ఎవరన్నది తొలి కలయికలోనే గురువుగారు గుర్తుపట్టారు. నువ్వు ఫలానా అనీ చెప్పారు. కాని అతడు నమ్మలేదు.
ఐదారేళ్ల వయసులో ఓ రోజు తోటి పిల్లలతో కలిసి నరేంద్రుడు ఉన్న గదిలోకి పాము వచ్చింది. పిల్లలు కెవ్వుమని కేకలేస్తూ బయటికి పరిగెత్తారు. నరేన్ కదలలేదు. మెదలలేదు. అతడికి బాహ్య ప్రపంచం స్పృహే లేదు. కేకలు విని తల్లి పరుగెత్తుకొచ్చి చూస్తే పిల్లవాడు ఈ లోకంలో లేడు. అదేమిరా అని గద్దిస్తే ‘ఏమోనమ్మా! ఏమైందో తెలియదు. చాలా ఆనందంగా మాత్రం అనిపించింది’ అన్నాడు ధ్యానముద్రలోంచి బయటికొచ్చి!
శ్రీరామకృష్ణులతో నరేన్ మొదటి భేటీ గురించి ప్రపంచానికి తెలిసింది వేరు. వాస్తవంగా ఏమి జరిగిందో గురుశిష్యులు ఇద్దరికి మాత్రమే తెలుసు. అనంతర కాలంలో సన్నిహిత మిత్రులకు స్వయంగా వివేకానందే చెప్పింది ఇది:
నన్ను పాడమన్నారు. పాట పాడాను. ఆయన హఠాత్తుగా లేచి నన్ను చెయ్యి పట్టుకుని ఉత్తరపు వరండాలోకి తీసుకువెళ్లి తలుపులు గడియ పెట్టారు. అక్కడ మేమిద్దరం మాత్రమే ఉన్నాం. రహస్యంగా ఏమైనా ఉపదేశం చేస్తారేమో అనుకున్నాను. కాని ఆయన నా చెయ్యి పుచ్చుకుని ఏకధారగా ఆనందబాష్పాలు రాల్చారు. నేను ఆశ్చర్యపోయాను. నేను ఎప్పటి నుంచో తనకు బాగా తెలిసినట్టు ప్రేమ కురిపిస్తూ, ‘ఇప్పటికి వచ్చావా? దయ లేకుండా నన్ను ఎందుకింత నిరీక్షింపజేశావ్?’ అంటూ వెక్కుతూ అన్నారు. అంతలోనే నా ఎదుట నిలబడి రెండు చేతులూ జోడించి ‘ప్రభూ! నాకు తెలుసు. నువ్వు నారాయణ అవతారానివి. ప్రాచీన నర మహర్షివి. మానవుల బాధలు పోగొట్టటానికి భూమి మీద పుట్టావ్’ అని తీవ్ర ఉద్వేగంతో అన్నారు. ఆ విచిత్ర ప్రవర్తనకు నేను విస్తుపోయాను. ఈయనెవరో పిచ్చివాడిలా ఉన్నాడు. విశ్వనాథ దత్తాగారి అబ్బాయినైన నన్ను పట్టుకుని ఏదేదో అంటాడేమిటి? - అనుకున్నాను... ....’
(The Life of Swami Vivekananda, by His Eastern and Western Disciples, Vol.I. p.76)
ఇదంతా ‘మీరు దేవుణ్ణి చూశారా’ అని నరేంద్రుడు ప్రశ్నించడానికి ముందే జరిగింది!
దక్షిణేశ్వర్‌లో మూడోసారి కలిసినప్పుడు కూడా గురుదేవులు సమాధిలోకి వెళ్లి నేనేదో దేవుణ్ని అయినట్టు ‘నారాయణా! నా కోసమే నువ్వు శరీరం ధరించి వచ్చావ్’ అన్నారనీ వివేకానంద చెప్పారు. (The Gospel of Sri RamaKrishna, p.985)
పరమహంస అంతటి బ్రహ్మజ్ఞానే తనకు దైవత్వం ఆపాదించినా, ఔను కాబోలని నరేన్ పొంగిపోలేదు. తృటిలో తనకు దివ్యానుభూతి కలిగించి నిర్వికల్ప సమాధిలోకి తీసుకువెళ్లినా గురువు మీద పూర్తిగా గురి కుదరలేదు. మహాసమాధికి మూడు నాలుగు రోజుల ముందు శ్రీరామకృష్ణ అతడిని దగ్గరికి పిలిచి దివ్యశక్తులు ధారపోసి ‘నరేన్! ఇవాళ నాకున్నదంతా నీకిచ్చేసి నేను ఏమీ లేని ఫకీరుగా మిగిలాను. నేనిచ్చిన శక్తితో నువ్వు గొప్ప పనులు చేస్తావు. ఆ తరవాతే వచ్చిన చోటికి వెళతావు’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అద్భుత శక్తులేవో తనలోకి విద్యుత్తులా ప్రసరించినట్టు నరేంద్రకు అనుభవమయింది కూడా. అయినా గురువు దైవత్వం మీద పరిపూర్ణ విశ్వాసం అతడికి కలగలేదు. కళ్లు మూసుకుని దేన్నీ, ఎవరినీ అంత తేలిగ్గా నమ్మని, హేతువుకు అందని విషయం దేన్నీ ఒక పట్టాన విశ్వసించని, దేన్నయినా ప్రశ్నించే కుశాగ్రబుద్ధి అతడిది. శ్రీరామకృష్ణులు ఇంకో రెండు రోజుల్లో శరీరం వదిలిపెడతారనగా మరణశయ్య పక్కన నిలబడ్డ నరేన్‌కి వింత ఆలోచన వచ్చింది. అదేమిటో అతడి మాటల్లోనే వినండి:
‘మాస్టర్ చాలాసార్లు తాను భగవదవతారమని చెప్పారు కదా. దుర్భరమైన నెప్పితో నరకయాతన పడుతూ మృత్యుముఖంలో ఉన్న ఈ క్షణాన ఆయన ‘నేను దేవుడి అవతారాన్న’ని చెబితే నమ్ముదాం’. మనసులో ఆ ఆలోచన మెదిలిందో లేదో గురువుగారు అతడి వైపు చూసి ‘ఓ! నరేన్! నీకు ఇంకా నమ్మకం కుదరలేదా? ఎవరు రాముడో, ఎవరు కృష్ణుడో అతడే రామకృష్ణుడిగా ఈ శరీరంలో ఉన్నాడు. వేదాంత అర్థంలో కాదు. నిజంగానే’
(Life of Swami Vivekananda, Vol.I. p.183)
సముద్రాన్ని దాటి పాశ్చాత్య దేశాలకు వెళ్లిన మొట్టమొదటి సన్యాసి స్వామి వివేకానంద. దుర్భర దారిద్య్రం నుంచి తన ప్రజలను పైకి తేవడానికి ఏమి చేయాలన్నా డబ్బు కావాలి. అది తన దగ్గర లేదు. తన దేశవాసుల దగ్గరా లేదు. పడమటి దేశాల్లో కొల్లలుగా ఉంది. దేశోద్ధరణ కోసం తాను తలపెట్టిన బృహత్ కార్యానికి అత్యవసరమైన నిధులను గౌరవంగా వీలైన మేరకు సంపాదించాలన్నది స్వామి పాశ్చాత్య యాత్రలో ఒక ముఖ్య ధ్యేయం. నిరంతర హైందవ ధర్మ ప్రచారం ద్వారా స్వశక్తితో హుందాగా దాన్ని సాధించాలని ఆయన అనుకున్నారు. అమెరికాలో ఉన్నంతకాలమూ ఆయన అనారోగ్యాన్ని, దేహ బాధలను లెక్కచేయక సుడిగాలిలా తిరుగుతూ సభలూ, సమావేశాలూ, మేధావులతో వాదోపవాదాలతోనే ఆయనకు ఎక్కువగా పొద్దు గడచిపోయింది. ఆయనకున్న ఆధ్యాత్మిక దివ్య శక్తితో మహిమలను ప్రదర్శించి అందరినీ మంత్రముగ్ధులను చెయ్యగలిగి కూడా ఆయన తన అలౌకిక శక్తులను తనలోనే దాచుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప వాటిని ఎవరి ముందూ కనపరచలేదు. ఆంతరంగిక శిష్యులకు, ఆధ్యాత్మిక సాధకులకు వ్యక్తిగతంగా ఆయన కలిగించిన దివ్యానుభవాలు చాలానే ఉన్నాయి. ఒక్కోసారి అహంకారం తలకెక్కిన ధనాఢ్యులను సేవామార్గం వైపు మళ్లించటానికి కూడా స్వామి తన మహత్తును చూపెట్టేవారు.
ఉదాహరణకు జాన్ డి.రాక్‌ఫెల్లర్. అమెరికాలో అపర కుబేరుడు. ధనం వల్ల వచ్చిన పొగరూ అతడికి జాస్తి. 1894లో వివేకానంద షికాగోలో ఉన్నప్పుడు ఆయన బస చేసిన గృహస్థుకు రాక్‌ఫెల్లర్‌తో బిజినెస్ సంబంధాలున్నాయి. వాటిని పురస్కరించుకుని అతడు - మా ఇంట్లో గొప్ప హిందూ సాధువు ఉన్నాడు. ఒకసారి వచ్చి చూసిపోరాదా అని చాలాసార్లు ఆహ్వానించాడు. తనంతటి శ్రీమంతుడు ఆఫ్టరాల్ ఓ సన్యాసిని చూడబోవటమేమిటని రాక్‌ఫెల్లర్‌కు అనిపించినట్టుంది. వెళ్లలేదు. తరవాత ఏమైందో ఓ రోజు ఆహ్వానం లేకుండానే షికాగో మిత్రుడి ఇంటికి చెప్పాపెట్టకుండా వెళ్లాడు. హిందూ సన్యాసి ఎక్కడున్నాడని బట్లర్‌ని అడిగి చరచరా స్టడీరూములోకి వెళ్లాడు.
అప్పుడు స్వామి సీరియస్‌గా ఏవో రాసుకుంటున్నారు. వచ్చింది ఎవరా అని తలకూడా ఎత్తలేదు. రైటింగ్ టేబుల్ దగ్గరికి రాక్‌ఫెల్లర్ వచ్చాక కూచోమని చెప్పి, అతడి పుట్టుపూర్వోత్తరాలను పూసగుచ్చినట్టు చెప్పారు. అతడికి తప్ప మరో మనిషికి తెలియని రహస్యాలను కళ్లతో చూసినట్టు చెప్పి ఆగంతకుణ్ని ఆశ్చర్యలో ముంచారు. తరవాత నెమ్మదిగా ‘్భగవంతుడు నీకు అంత సంపదనిచ్చింది ప్రజల సేవకు దాన్ని వినియోగించాలనే. చేతికందిన అవకాశాన్ని ఉపయోగించుకుని తరించమ’ని హితబోధ చేశాడు. తనంతటి వాడితో ఒక బికారి ఇలా మాట్లాడతాడా అని రాక్‌ఫెల్లర్‌కు చాలా కోపం వచ్చింది. చర్రున అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు.
వెళ్లినవాడు వారం తిరక్కుండా మళ్లీ తిరిగొచ్చాడు. మునుపటిలాగే విసురుగా అదే గదిలోకి వెళ్లాడు. స్వామి మళ్లీ అదే భంగిమలో ఉన్నాడు. నిలబడే జేబులోంచి ఒక కాగితం తీసి బల్లమీద పడేశాడు. ‘చూడు. నువ్వు ఊహించనంత పెద్ద మొత్తాన్ని పబ్లిక్ సేవా సంస్థ పెట్టటానికి డొనేట్ చేశాను. ఇదిగో డాక్యుమెంటు. ఇప్పుడు నీకు తృప్తి కలిగి ఉండాలి. కనీసం చేసిన దానికి నాకు థాంక్స్ అయినా చెప్పు’ అన్నాడు చిటపటలాడుతూ.
స్వామి కనె్నత్తి చూడలేదు. పత్రాన్ని చేతిలోకి తీసుకుని మొత్తం చదివి ‘్థంక్సు నువ్వు నాకు చెప్పాలి’ అన్నారు ప్రశాంతంగా, ప్రసన్నంగా.
రాక్‌ఫెల్లర్ జీవితంలో ఇచ్చిన మొట్టమొదటి పబ్లిక్ విరాళం అదే.
వ్యక్తుల గతాన్ని, భవిష్యత్తును కచ్చితంగా చెప్పగలిగిన స్వామీజీలు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. దానికి మహాత్ములే అక్కర్లేదు. మంచి జ్యోతిష్కుడు కూడా చెప్పగలడు- అని పెదవి విరిచేవారు సైతం ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టే విషయం ఒకటుంది.
కమ్యూనిస్టు విప్లవం మొట్టమొదట రష్యాలో వస్తుందని మార్క్సిజం ప్రవక్తలైన మార్క్స్, ఏంగిల్స్‌లే ఊహించలేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జర్మనీలో మొదట శ్రామిక విప్లవం వస్తుందని, చిట్టచివర రష్యాలో వస్తుందని వారు దృఢంగా నమ్మారు. అదే తిరుగులేని సత్యవాక్కు అని అక్టోబరు విప్లవానికి కొద్ది రోజుల ముందు దాకా మహా మేధావులందరూ అనుకున్నారు. మొట్టమొదట రష్యాలో కష్టజీవులు లేస్తారని రెండు దశాబ్దాల కంటే ముందు కచ్చితంగా చెప్పినవాడు ప్రపంచం మొత్తంలో వివేకానంద ఒక్కడే. అంతేకాదు. తరువాతి విప్లవం చైనాలో వస్తుందన్న సంగతీ మావో పుట్టటానికంటే ముందు లోకానికి చాటిందీ ఆ స్వామి ఒక్కడే.
As early as 1896 Swami Vivekananda made the following observation to Sister Greenstidel: "The next upheavel that is to usher in another era, will come from Russia or China... ... To the young men who saw him in Dacca he said something more.. "Yes, the Shudras of the world will rise... I can see through the veil, the shadow of coming events of the world... As the astronomers see the movements of the stars through telescope, likewise the movement of the world falls within the range of my vision. You take it from me, this rising of the Shudras will take place first in Russia, and then in China; India will rise next and will play a vital role in shaping the future world.'
(Swami Vivekananda, A Historical Review, R.C.Majumdar, PP 109-110)
(నవశకాన్ని ఆవిష్కరించే తరువాతి విప్లవం రష్యా నుంచి గాని, చైనా నుంచి కాని వస్తుందని ఎప్పుడో 1896లోనే సిస్టర్ గ్రీన్‌స్టిడెల్‌కు స్వామి వివేకానంద చెప్పారు... ఢాకాలో తనను చూడవచ్చిన యువకులకు ఆయన మరికొన్ని విషయాలు చెప్పారు... ‘‘ఔను. ప్రపంచంలో శూద్రులు లేస్తారు. కాలపు ముసుగులోంచి నేను రాబోయే ఘటనల నీడను చూడగలను.. ఖగోళ శాస్తజ్ఞ్రులు టెలిస్కోపు నుంచి తారల కదలికలను చూసినట్టే ప్రపంచ గమనం నా దృష్టిపథంలో పడుతుంది. నేను చెబుతున్నా వినండి. ఈ శూద్రుల తిరుగుబాటు మొదట రష్యాలో జరుగుతుంది. అనంతరం చైనాలో. ఆ తర్వాత ఇండియా లేస్తుంది. భావి ప్రపంచాన్ని మలచడంలో కీలక భూమిక వహిస్తుంది.’’)
వివేకానంద ఏనాడో చెప్పిన జోస్యం అక్షరాలా నిజమైంది. శ్రామిక విప్లవం రష్యాలో వచ్చింది. చైనాలోనూ వచ్చింది. ఇక ఇండియా లేవటమే మిగిలి ఉంది. భావి ప్రపంచాన్ని మలచడంలో మనమే కీలక పాత్ర పోషించనున్నామన్న స్వామి వాక్కే భారత జాతికి ఉత్సాహం నింపి, వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుం
Source:http://www.andhrabhoomi.net/specials/AADIVAVRAM%20--%20Ee%20Vaaram%20Special/content/mahayogi
Source:http://www.andhrabhoomi.net/specials/AADIVAVRAM%20--%20Ee%20Vaaram%20Special/content/mahayogi
మహాయోగి... మహాద్రష్ట - కొత్త కోణంలో వివేకానంద
Reviewed by JAGARANA
on
1:36 PM
Rating:
No comments: