Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

వివేకానంద మనకు వరం వివేకానందకు మనం శాపం - కొత్త కోణంలో వివేకానంద

- ఎం.వి.ఆర్. శాస్త్రి  ( ఆంధ్రభూమి దిన పత్రిక చీఫ్ ఎడిటర్ )
అదేమిటి? వివేకానంద స్వామిని మనమెక్కడ మరిచాం? ఆయన 150 జయంతిని వైభవంగా దేశమంతటా ఇంకా జరుపుకుంటూనే ఉన్నాం కదా? ఊరూరా ఆయన విగ్రహాలు ప్రతిష్ఠించాం. ఆయన పేర ఎన్నో సంస్థలు, మహా వ్యవస్థలు నెలకొల్పాం. ఆయన బొమ్మలు ఇంటింటా పెట్టుకున్నాం. ఆయన ఫొటోలు జేబుల్లో దాచుకున్నాం. ఆయన సూక్తులు ఫ్రేము కట్టించి ఇంట్లో బల్లల మీద పెట్టుకున్నాం. ఆయన రచనలు, ఉపన్యాసాలు, ఉత్తరాలు చిన్నా, పెద్దా పుస్తకాలుగా, ఎన్నో సంపుటాలుగా లక్షల కాపీలు వ్యాప్తి చేశాం. ఆయన చికాగో ప్రసంగాన్ని, ముఖ్యమైన కొటేషన్లను కింది నుంచి పైకి గడగడ ఒప్పగించగలిగిన వాళ్లు దేశంలో వేల సంఖ్యలో ఉన్నారు. ఆయన స్థాపించిన రామకృష్ణ మిషన్ కార్యకలాపాల్లో లక్షల మంది పాల్గొంటున్నారు. కన్యాకుమారిలో ఆయన రాక్ మెమోరియల్‌ను రోజూ వేల మంది దర్శిస్తున్నారు. ఆయన జయంతిని ఏటేటా భక్తిశ్రద్ధలతో దేశవాసులు జరుపుకుంటున్నారు. ఆయనకున్నంత యూత్ ఫాలోయింగ్ దేశంలో మరే నాయకుడికీ లేదు.
నిజమే. అవన్నీ అక్షర సత్యమే. వివేకానందుడిని వంక పెట్టలేనంత దివ్యంగా పూజిస్తున్నాం. ఎటొచ్చీ ఆయన చెప్పిన పాఠాలనే మరచిపోయాం. ఆయన చేసిన అతి ముఖ్యమైన ఉపదేశాలనే గుంటపెట్టి గంట వాయించాం.
స్వామి వివేకానంద వ్యక్తి కాదు. మహాశక్తి. ఎన్నో శతాబ్దాల్లో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తళుక్కున మెరిసి, దేశాన్ని తరింపజేసే దివ్యస్ఫూర్తి.
1863 జనవరి 12న కలకత్తాలో స్వామి పుట్టేనాటికి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం మొదలై ఆరేళ్లు మాత్రమే అయింది. వ్యాపారం పేర వచ్చి, మోసాలు, ద్రోహాలు చేసి దుర్మార్గంగా దేశాన్ని ఆక్రమించిన తెల్లదయ్యాలపై హిందూ, ముస్లిం భేదాలు లేకుండా దేశవాసులందరూ కలిసికట్టుగా తిరగబడి మహోగ్రంగా పోరాడినా ప్రయోజనం లేక, చివరికి విదేశీ రాక్షస శక్తులదే పైచేయి అయింది. పరాజయ భారంతో భారతజాతి కుంగిపోయింది. లక్షలాది తిరుగుబాటుదారులను శిక్షించటానికి ఉరికంబాలు చాలక రోడ్లకు రెండువైపులా మైళ్ల పొడవున మహావృక్షాల కొమ్మకొమ్మకూ స్వాతంత్య్ర యోధులను ఉరి తీశారు. దేశభక్తులను పగబట్టి వేటాడి, దారుణ దమనకాండతో, రాక్షస ఆంక్షలతో అణచిపెట్టి బ్రిటిషు పాలకులు యావద్భారతాన్ని క్రూరంగా బాధిస్తున్నారు.
కనీస మానవ హక్కులకు దిక్కులేదు. విద్య పేర, వైద్యం పేర దేశమంతటా వ్యాపించి, ఎక్కడికక్కడ చర్చిలు పెట్టి, హిందూ మతాన్ని, హిందువుల దేవుళ్లనూ, ఆచారాలనూ, విశ్వాసాలనూ అవమానిస్తూ, కాళ్లతో తొక్కివేస్తూ, తమదొక్కటే సిసలైన మతమని విర్రవీగే క్రైస్తవ మత ప్రచారకులకు అడ్డూ అదుపూ లేదు. భారతదేశ ఉజ్వల గతాన్ని, గర్వించదగ్గ చరిత్రను, భారత సంస్కృతి వైభవాన్ని, భారతీయ విద్య విశిష్టతను, భారతీయ విజ్ఞానపు వెలుగులను పథకం ప్రకారం వక్రీకరించి తిమ్మిని బమ్మి చేసి... ఇంగ్లిషు వారు ఎడమ పాదం మోపనంత వరకూ ఈ దేశం అనాగరికంగా, ఆటవికంగా, మూఢత్వంలో మగ్గినట్టు తెల్లవారు నిర్విరామంగా సాగించిన ప్రచారపు విషం మేధావి వర్గం మీద బాగా పని చేసింది. ఇంగ్లిషు చదువే చదువు, ఇంగ్లిషు సంస్కృతే సంస్కృతి, ఇంగ్లిషు వాళ్లు అల్లిన చరిత్రే చరిత్ర అని నమ్మే మెకాలే మానస పుత్రుల సంతతి కుక్కగొడుగుల్లా వ్యాపించింది. ఫలితంగా జాతి యావత్తూ నైతికధృతి సడలి, దిక్కుతోచని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న చారిత్రక ఘట్టంలో భారతీయుల పుణ్యఫలంగా, దేవుడిచ్చిన వరంలా వివేకానందుడు పుట్టాడు. మహాద్భుతం సాధించాడు.
వివేకానంద జన్మించిన సమయాన దేశంలో రాజకీయ చైతన్యం కలలో మాట. భారతీయుల మెదళ్లను కంట్రోలు చేసి, శాశ్వతంగా తమ గుప్పిట్లో పెట్టుకోవటం కోసం పిటీషన్లతో పొద్దుపుచ్చే ఇండియన్ నేషనల్ కాంగ్రెసు దుకాణాన్ని తెల్లవాళ్లు ఇంకా తెరవనే లేదు. గాంధీ ఇంకా పుట్టనే లేదు. నలభై నిండకుండా 1902 జూలై 4న వివేకానందుడు జీవయాత్ర చాలించే నాటికి బారిస్టరు గాంధి దక్షిణాఫ్రికాలో ప్లీడరు ప్రాక్టీసులో కిందా మీదా పడుతున్నాడు. లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి జాతీయ నాయకులకు ప్రజలను సమీకరించి, పోరాటం చేయవచ్చన్న ఆలోచన కూడా ఇంకా రాలేదు.
రాజకీయమంటే బ్రిటిషు సర్కారు వారికి వినయ విధేయతలతో అర్జీలు పెట్టటం, ప్రభుత్వానికి అభ్యంతరం లేని విధంగా విద్యాధిక వర్గాల్లో చర్చించడం, డ్రాయింగు రూముల్లో కబుర్లాడటం, ప్రభువుల సన్నిధికి ప్రతినిధి వర్గాలను పంపడం, చట్టసభల్లో అదృష్టవశాత్తూ ప్రవేశం దొరికితే అనుమతించిన మేరకు మాట్లాడటం అనుకుంటున్న కాలంలో...
జనమే జాతికి వెనె్నముక అనీ, జన సామాన్యాన్ని మేలుకొలిపితే గానీ దేశానికి మేలు జరగదనీ మొట్టమొదట ప్రబోధించిన వాడు వివేకానంద. బలమైన శత్రువును ఎదుర్కోవడానికి అహింస ప్రజల చేతిలో అమోఘ అయుధమని - గాంధిగారు సత్యాగ్రహ ప్రయోగాలకు, అహింస ప్రవచనాలకు ఉపక్రమించడానికి చాలా ఏళ్ల ముందే కనిపెట్టిన వాడు వివేకానంద. కుల వివక్షకు, కింది కులాలను అగ్రవర్ణాలు కాలరాచి వేయడానికి వ్యతిరేకంగా అంబేద్కర్ చైతన్య శంఖం పూరించడానికి దశాబ్దాల పూర్వమే కుల వ్యవస్థ మీద, కుల వివక్ష మీద, అగ్రవర్ణాల దురహంకారం మీద ధ్వజమెత్తిన వీరుడు వివేకానంద.
బాల్య వివాహాలు, సతీ సహగమనాలు సాధారణ విషయాలై స్ర్తిల అక్షరాస్యత హీనాతి హీనమై, ఆడపిల్ల చదువుకోవటం, ఆడది ఇంటి గడప దాటటం; తానూ మనిషేనని, తనకూ మానవ హక్కులు కావాలని నోరు తెరవటం మహాపరాధంగా, మహాపచారంగా పరిగణిస్తూ, అబలల అణచివేత విశృంఖలంగా చెలరేగుతున్న రోజుల్లో...
స్ర్తి శక్తే జాతికి జీవగర్ర అని చాటి, పురుష దురహంకారాన్ని నిశితంగా ఖండించిన సంస్కర్త వివేకానంద.
జనాన్ని కదిలిస్తే అరాచకాలు, అనర్థక విప్లవాలు వస్తాయని లాల్, పాల్, బాల్ వంటి మహానాయకులే భయపడిన సమయంలో - జన చైతన్యమే జాతి పునరుజ్జీవనానికి మార్గమన్న వివేకానందుడి ఉపదేశం జాతీయోద్యమానికి దారి చూపింది. విదేశీ పద ఘట్టనల కింద నలిగి, హిందూ మతం నిస్తేజమై, నిర్వీర్యమైన సమయంలో హిందూ మతం ప్రపంచ మతాలన్నింటికీ తల్లి అని, అది విశ్వమతమనీ, లోకానికి దారి దీపమనీ విశ్వ వేదికపై ఆయన నిరూపించిన తీరు డీలాపడ్డ హిందూ సమాజానికి ఆత్మస్థైర్యాన్నిచ్చి పైకి లేపింది.
వివేకానందుడిని చదవటం వల్ల భారతదేశం మీద తన ప్రేమ నూరింతలు పెరిగిందని గాంధీగారన్నారు. నీరసించిన హిందూ మేధస్సుకు వివేకానందుడు టానిక్‌లా పని చేశాడని నెహ్రూగారు మెచ్చుకున్నారు. వివేకానంద ఇండియాను కాపాడాడు; హిందూమతాన్ని రక్షించాడు; ఆయన లేకపోతే మనకు మతం మిగిలేదే కాదు; స్వాతంత్య్రం వచ్చేదే కాదు - అని రాజాజీ పొగిడాడు. వివేకానందుడే మాకు ఆదర్శం. ఆయన మా ఆరాధ్య దైవం అని ఈ నూరేళ్లలో వివిధ జీవన రంగాల్లో జాతిని వెలిగించిన మహామహులందరూ ముక్తకంఠంతో చాటారు.
బాగానే ఉంది. కాని - ఇందరిందరు మహాత్ములు, మహానుభావులు, మహానాయకులు కలిసి, తలా ఒక చెయ్యి వేసి కష్టపడి నిర్మించిన జాతీయ సౌధం వివేకానందుడి బోధలకు ఎంత దగ్గరగా ఉంది? స్వతంత్ర భారతానికి మన పెద్దలు నిర్దేశించిన వ్యవస్థలు, ఇప్పటిదాకా అవి నడిచిన దారి, నడుస్తున్న తీరు వివేకానంద తత్వానికి, ఆయన చూపిన మార్గానికి ఎంత దగ్గరగా ఉన్నాయి?
ఉన్నమాట చెప్పాలంటే స్వతంత్ర భారత నిర్మాణంలో, జాతీయ విధానాల రూపకల్పనలో వివేకానందుడు మన పెద్దలకు పనికి రాలేదు. భారత జాతికి జీవధాతువు, మూలశక్తి అని ఆయన వేటినైతే పేర్కొన్నాడో సరిగ్గా వాటినే, అవేవో విష పదార్థాలైనట్టు వర్జించి, అరువు తెచ్చుకున్న ఇసుక పునాదుల మీద జాతి నిర్మాణానికి వారు పూనుకున్నారు.
ప్రతి జాతికి దానికి మాత్రమే ప్రత్యేకమైన ఒక ఆత్మ ఉంటుంది. అభివృద్ధికి దాని పద్ధతి దానికి ఉంటుంది. భారతదేశపు ఆత్మ ఆధ్యాత్మికత. పాశ్చాత్య దేశాల్లో రాజకీయ ఆదర్శాలు జాతీయ ఐక్యతకు ప్రాతిపదిక. సాంఘిక, ఆర్థిక ఉద్యమాలు కూడా ఐరోపా జాతులను కదిలిస్తాయి. భారతీయులకు అవి ఎక్కవు. మన ప్రజలు ప్రధానంగా నమ్మేది మతాన్ని. అనుసరించేది ఆధ్యాత్మిక జీవన విధానాన్ని. ఇక్కడ పల్లెల్లో మామూలు రైతుకు కూడా దేవుడంటే తెలుసు. మతమంటే తెలుసు. సామాజిక ఉద్యమాలు, ఆర్థిక వాదాలు, రాజకీయ పోరాటాలు అతడికి పట్టవు. అతడి జీవితమంతా, దైనందిన దినచర్య యావత్తూ మతంతో మొదలై మతంతో ముగుస్తుంది. అతడికి చట్టమంటే తెలియదు. కాని దైవమంటే తెలుసు. చట్ట్భయం లేకపోవచ్చు. కాని తప్పుచేస్తే దేవుడు శిక్షిస్తాడన్న భయం ఉంటుంది. ప్రభుత్వం పట్టుకుంటుందనో, కోర్టు శిక్షిస్తుందనో భయపడని వాడు కూడా పాపం చేస్తే నరకం తప్పదని భీతి చెందుతాడు. మతం, ఆధ్యాత్మికత అనేవి భారతీయుల రక్తమాంసాల్లో జీర్ణించి పోయాయి. మతం, తత్త్వం మన జీవరక్తం. అదే భారత జాతీయతకు మూలాధారం.
ఇదీ వివేకానందుడు చెప్పిన మొదటి పాఠం. దురదృష్టమేమిటంటే అనేక సందర్భాల్లో అనేక ఉపన్యాసాల్లో వివేకానంద స్వామి జాతికి జీవశక్తిగా పరిపరి విధాల నొక్కి చెప్పిన ‘మతం’, ‘ఆధ్యాత్మికం’ మన జాతి నిర్మాణంలో వ్యర్థ పదార్థాలయ్యాయి. హిందువులు, ముస్లింలు రెండు జాతులన్న జిన్నా సిద్ధాంతాన్ని అంగీకరించి, మతం ప్రాతిపదికన దేశాన్ని చీల్చి పెట్టిన నాయకులు. ఇండియాలో మిగిలిన రెండో జాతికి మాత్రం మతాన్ని నిరాకరించారు. మైనారిటీ మతాలను ఆదరించాలంటే, మెజారిటీ మతాన్ని నిరాదరించాలన్న వింత సిద్ధాంతం ఎత్తుకున్నారు. అదే సిసలైన సెక్యులరిజమని అడ్డంగా వాదించారు.
ప్రపంచంలో మన లాంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. మనలాంటి ప్రజాస్వామ్య రాజ్యాలూ చాలా ఉన్నాయి. మెజారిటీ ప్రజలు అనుసరించే మతానికి గౌరవ స్థానం మిగతా అన్ని దేశాల్లోనూ ఉంది. పార్లమెంటుకు పుట్టినిల్లయిన బ్రిటన్‌లోనూ, ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్యమనుకునే అమెరికాలోనూ కూడా ముఖ్యమైన వేడుకల్లో క్రిస్టియన్ మతాచార్యుల ప్రమేయం ఉంటుంది. ఇస్లాం మినహా మరో మతాన్ని గుర్తించని, సహించని ఇస్లామిక్ రాజ్యాల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆయా దేశాలన్నిటినీ నాగరిక దేశాలుగా గుర్తించటానికి, ఆయా ఆనవాయితీలను ఆమోదించడానికి మన మేధావి గణానికి అభ్యంతరం ఉండదు. అదే ప్రకారం మన దేశంలోనూ ప్రధాన మతానికి సముచిత గౌరవం ఉండాలంటే మాత్రం అది హిందూ మతోన్మాదంలా, సెక్యులరిజానికి అపచారంలా, జాతి ఎంచుకున్న జీవన విధానానికి గొడ్డలి పెట్టులా మన ప్రగతిశీల, ప్రజాస్వామిక, సెక్యులర్, లిబరల్ తక్కుంగల విశేషణాలు గల బుద్ధిజీవులకు అనిపిస్తుంది. మెజారిటీ మతాన్ని సింహాసనం ఎక్కించనక్కర్లేదు. కిరీటాలు తొడగనక్కర్లేదు. ప్రత్యేక హక్కులేవీ ప్రసాదించనవసరం లేదు. కనీసం మైనారిటీలకు ఉన్నపాటి హక్కులను, రాయితీలను, రాజకీయ ప్రాముఖ్యాన్ని, గౌరవాన్ని అయినా మెజారిటీ మతానికి అనుమతించాలని అడగడం కూడా మనవారి దృష్టిలో మతోన్మాదమే.
జాతికి జీవశక్తి అని వివేకానందుడు చెప్పిన మతానికి జాతీయ జీవనంలో చోటు లేకుండా ఎప్పుడైతే వేశాయో అప్పుడే జాతికి, పాలక వ్యవస్థకు మధ్య సంబంధం లేకుండా పోయింది. మత విశ్వాసం మనిషి సంకల్ప బలాన్ని పెంచుతుంది. ధైర్యశాలిని చేస్తుంది. ధర్మమార్గం తప్పకుండా నిలబెడుతుంది. దైవత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అదే పదవీ రాజకీయమో? మనిషిని స్వార్థపరుడిని చేస్తుంది. అవినీతిపరుడిగా
మారుస్తుంది. అసుర ప్రవృత్తిని రెచ్చగొడుతుంది.
మహా తెలివిగల మనం మతాన్ని మూఢత్వం కింద లెక్కగట్టి, ఆధ్యాత్మికత అంటే వేదాంతపు గోలగా, అర్థం కాని అబ్రకదబ్రగా భావించి పదవీ రాజకీయాలను పాలుపోసి పెంచాం. మత రహిత లౌకిక రాజ్యం అని పేరు పెట్టి మతతత్వ పూరిత కుహనా సెక్యులరిజాన్ని నెత్తికెత్తుకున్నాం. మతంలో ఉన్న మంచిని విడనాడి, మతంలో ఉన్న చెడును మాత్రం జాగ్రత్తగా కాపాడుతున్నాం.
ప్రతి మానవుడి శరీరంలో నిత్యం లక్షలాది క్రిములు ఉంటాయి. రక్తం స్వచ్ఛంగా, బలంగా ఉన్నప్పుడు శరీరాన్ని ఏ విష క్రిమీ బాధించదు. ఏ వ్యాధి కారక క్రిమీ రక్తంలోకి చొరబడలేదు. అదే - శరీరంలో జీవశక్తి తగ్గి, రక్తం కలుషితమైనప్పుడు రకరకాల క్రిములు శరీరాన్ని పట్టి జబ్బులతో పీడిస్తాయి. జాతి జీవితమూ అంతే. మతమే, తత్వమే మన జీవరక్తం. అది స్వచ్ఛంగా, దృఢంగా ఉన్నంత వరకే జాతికి స్వస్థత’’ - అన్నాడు వివేకానందుడు. మనం ఆలకించలేదు. అందుకే జాతికి జీవశక్తి, నైతిక ధృతి సన్నగిల్లి, రకరకాల విష క్రిములు జాతి జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. అవినీతికి, అక్రమాలకు, ద్రోహాలకు, విద్రోహాలకు, జాతి శత్రువుల వీరంగాలకు అడ్డు, అదుపు లేకుండా పోయాయి. విలువలు భ్రష్టమయ్యాయి. వ్యవస్థలు పతనమయ్యాయి. రాజకీయ వ్యవస్థ దాదాపుగా దివాలా తీసింది. ఇంటా బయటా సమస్యలు ఈగల్లా ముసిరాయి. జాతి భద్రతే ప్రమాదంలో పడింది. ప్రజల బతుకు దినదిన గండమైంది.
వివేకానందుడు జాతీయతకు మతం ముఖ్యమన్నాడు. మనం కాదన్నాం. వివేకానందుడు కులం వద్దన్నాడు. కుల వివక్షతో పేదలను తొక్కివేయడం తగదన్నాడు. దిగువ కులాల అణచివేత మహాపాపమన్నాడు. మనం ఔనన్నాం. ఔనంటూనే కులాన్ని బహు పదిలంగా కాపాడుకొస్తున్నాం. ఎంత చదువుకున్నవారమైనా, ఎంత ఎత్తుస్థానాల్లో ఉన్నా ఇప్పటికీ ప్రతిదీ కులదృష్టితోనే ఆలోచిస్తున్నాం. బడుగు, బహుజన, దళిత సామాజిక వర్గాలకు రాజ్యాధికారం దక్కకుండా, జాతి జీవనంలో సముచిత గౌరవ స్థానం దొరకకుండా దుష్ట రాజకీయ శక్తులు, దోపిడీ వర్గాలు అడ్డమైన పన్నాగాలు పన్నుతుంటే చూస్తూ ఊరకున్నాం.
ఇండియాలో రెండు మహా దోషాలున్నాయి. ఒకటి కుల వివక్ష. రెండోది మహిళల అణచివేత - అన్నాడు వివేకానందుడు. మొదటి దానిలాగే రెండోదాన్నీ మనం కడు నిష్ఠగా కొనసాగిస్తున్నాం. పరాధీనంగా, దయనీయంగా స్ర్తిలు బానిస బతుకులు బతకకూడదు. వారికి అన్ని రంగాల్లో సమాన హక్కులుండాలి అని స్వామి కోరాడు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు తెస్తున్నట్టు, పాస్ చేయబోతున్నట్టు ప్రతి లోక్‌సభలో మనం నాటకాలాడుతూంటాం. అడుగు ఏనాటికీ ముందుకు పడకుండా అన్ని పార్టీల మగధీరులం కానరాని ఐకమత్యంతో అడ్డు పడుతూంటాం.
ఆడవారు అబలలు కాదు. వారు ఆత్మరక్షణ నేర్చుకోవాలి. ఝాన్సీరాణిలా పరాక్రమం చూపాలి - అని బోధించాడు వివేకానందుడు. స్వతంత్రం వచ్చిన అరవై ఆరేళ్లకు కూడా నడిచే బస్సుల్లో, తిరిగే దారుల్లో అతివలను క్రూరంగా చెరిచి రోడ్డు మీద పారేసి మగ మృగాలు వివేకానందుడికి గొప్ప ‘నివాళి’ అర్పిస్తూనే ఉన్నాయ. ‘నిర్భయ’ చట్టం వచ్చాక కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు స్ర్తిలపై అఘాయిత్యాలు, రాక్షస కృత్యాలు విచ్చలవిడిగా సాగుతున్నాయ. ఇంకా మనం ‘ఆకాశంలో సగం’ గురించి నంగిరి మాటలు వింటూనే ఉన్నాం.
వివేకానందుడు దేశాన్ని ప్రేమించమన్నాడు. దేశాన్ని పూజించమన్నాడు. భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడమన్నాడు. శరీరంలో అణువణువూ దేశభక్తితో నిండిపోవాలన్నాడు. వివేకానందను ఆదర్శంగా తీసుకున్నామని చెప్పే చాలామంది కనీసం జాతీయ గీతాన్ని గౌరవించరు. జాతీయ గేయంగా రాజ్యాంగం గుర్తించిన ‘వందేమాతరా’న్ని పాడమంటే నాలుక పీక్కుంటారు.
వివేకానందుడు మనది గొప్ప చరిత్ర, గొప్ప నాగరికత.. మన పూర్వులు మహాజ్ఞానులు, మహాద్రష్టలు - అని పరవశించి పొగిడాడు. జ్ఞానదంతాలు నోటినిండా ఒంటినిండా మొలిచిన మన ఆధునిక మేధావి గణానికేమో మనది సిగ్గుపడవలసిన చరిత్ర; ముదనష్టపు నాగరికత, మన పూర్వులు మూర్ఖులు, భష్ట్రులు.. అని మెకాలే బళ్లో చదువుకున్న పాఠమే భగవద్గీత! మహావీరులను మహాక్రూరులుగా, మహా క్రూరులను మహావీరులుగా, ఒక మత వర్గపు మనోభావాలు ఎక్కడ గాయపడతాయోనని, ఇబ్బందికరమైన ఘట్టాలను ఎత్తేస్తూ... చిత్రిస్తూ... చరిత్ర పాఠాలను ఎంత బాగా సెన్సార్ చేస్తే మనవారి దృష్టిలో చరిత్రకు, సెక్యులరిజానికి అంత న్యాయం జరిగినట్టు.
వివేకానందుడిలో ఉన్నది ధైర్యం. లేనిది కపటం. మన జాతికి ఇవాళ లేనిది ధైర్యం. అడుగడుగునా ఉన్నదే కపటం. ద్వంద్వ నీతులు, ద్వంద్వ ప్రమాణాలు, ప్రతి తలలో రెండు నాల్కలు, అన్ని రంగాల్లో, అన్ని స్థాయిల్లో మనకు చాలా మామూలు విషయాలు.
కోట్ల జనం ఆకలితో, అజ్ఞానంతో మగ్గినంత వరకూ వారి గోడు పట్టించుకోని ప్రతి విద్యావంతుడూ తన దృష్టిలో ద్రోహేనని వివేకానందుడు గర్జించాడు. అలాంటి ద్రోహుల సంతతి వివేకానంద కాలంలో కంటే ఈనాడు నూరింతలు వెయ్యింతలు పెరిగింది. దేశ ప్రజల దారిద్య్రాన్ని చూసి వివేకానందుడు కన్నీరు మున్నీరుగా విలపించడమే కాదు తన చేతిలో రూపాయి లేకపోయినా భిక్షాపాత్ర, చింకిపాత మినహా ఏ ఆస్తీ లేకున్నా అంతులేని ఆత్మవిశ్వాసంతో, మొక్కవోని పట్టుదలతో వారి దారిద్య్రాన్ని పోగొట్టటానికి నడుం కట్టాడు. దేశాంతరాలు వెళ్లాడు. మేధాశక్తితో ప్రపంచాన్ని జయించాడు. దరిద్రనారాయణులకు తాను చేయగలిగింది చేశాడు. ఇనప్పెట్టెల్లో, బ్యాంకు లాకర్లలో, స్విస్ బ్యాంకుల్లో ఎంత డబ్బు మూలుగుతున్నా, కరెన్సీ నోట్లతో తమను తగలేయగలిగినంత సంపద ఉన్నా వివేకానందగారి ఈకాలపు సోకాల్డ్ భక్తులకు మాత్రం దరిద్రగొట్టు దరిద్రపు గీత ఎంత దిగజారినా పట్టదు. చీమ కుట్టినట్టయినా చలనం ఉండదు.

చికాగోలో జయభేరిని మోగించిన తరవాత అమెరికన్ శ్రీమంతులు తన గౌరవార్థం గొప్ప విందు ఇచ్చి, హంసతూలికా తల్పం మీద శయనించమంటే వివేకానందుడు కటిక నేల మీద పడుకుని తన దేశాన్ని, తన దైన్యాన్ని తలచుకుని రాత్రంతా దుఃఖించాడట. అదే స్వామి ఇప్పుడు కనుక మన దేశాన్ని దర్శిస్తే అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించినందుకు గర్విస్తాడా? తన దేశవాసుల పోకడను, మైండ్ సెట్‌ను చూసి రోదిస్తాడా? ఊరూరా ఇంటింటా తన బొమ్మలను పూజిస్తున్నందుకు సంతోషిస్తాడా? నేను చెప్పిందేమిటి, మీరు చేస్తున్నదేమిటి అని తన సహజ శైలిలో ఉతికి ఆరేస్తాడా?

వివేకానంద మనకు వరం వివేకానందకు మనం శాపం - కొత్త కోణంలో వివేకానంద Reviewed by JAGARANA on 8:02 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.