Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

'డేగ’ కాదు, ‘పావురం’ కాదు.. అది ‘తోడేలు’!

హెబ్బార్ నాగేశ్వరరావు , ఆంధ్రభూమి దినపత్రిక , 15-10-2015

మహమ్మదాలీ జిన్నా మంచివాడని చెప్పిపోవడానికి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి మహమ్మద్ కసూరీ మన దేశానికి వచ్చాడు! గతంలో విదేశాంగ మంత్రిగా ఉండినప్పుడు మన దేశానికి వచ్చిన కసూరీ జమ్మూకశ్మీర్‌లోని మన దేశ వ్యతిరేకులతో చర్చలు జరపడం ఆయనకు మన పట్ల కల ‘అనుభూతి’కి ఒక ఉదాహరణ మాత్రమే. ఉదాహరణలు కోకొల్లలు! అప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు అతగాడు ఇలా కశ్మీర్‌లోని విద్రోహులతో మంతనాలు సాగించడానికి అనుమతినిచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంవారు మహమ్మదాలీ జిన్నా ‘గొప్పతనాన్ని’ మరోసారి ఆవిష్కరించడానికి కసూరీకి ముంబయిలో వేదికను కల్పించారు! 

మహమ్మదాలీ జిన్నా క్రీస్తుశకం 1947లో అఖండ భారతదేశాన్ని మతోన్మాద రక్తపాత రాజకీయం ప్రాతిపదికగా బద్దలుకొట్టి, పాకిస్తాన్‌ను ఏర్పాటుచేసినవాడు! పాకిస్తాన్ ఏర్పడగానే అనాదిగా అక్కడ నివసించిన స్వజాతీయులైన హిందువులను ఊచకోత కోయించిన మహమ్మదాలీ జిన్నా ‘పాకిస్తాన్ పిత’, తొలి అధ్యక్షుడు!! అందువల్ల మహమ్మదాలీ జిన్నా మంచివాడని చెప్పిన కసూరీ ఎంత మంచివాడో ఊహించుకోవచ్చు! మహమ్మదాలీ జిన్నాను మాత్రమేకాదు, మొఘలాయి ఔరంగజేబ్ వంటి వారిని సైతం మంచివారుగా చిత్రీకరించడానికి మన దేశంలో కుట్ర కొనసాగుతోంది. అందువల్ల కసూరీ తన పూర్వుడైన జిన్నాకు ప్రదానం చేసిన ప్రశంసాపత్రం ‘పునరావృత్తి’మాత్రమే... ఆశ్చర్యపడవలసిన ప్రథమ పరిణామం కాదు!

ముంబయికి గౌరవం ఘటించడానికై తన పుస్తకం ‘డేగ కాదు, పావురమూ కాదు’ (నైదర్ ఏ హాక్ నార్ ఏ డోవ్) అన్న ఆంగ్ల గ్రంథాన్ని ముంబయిలో ఆవిష్కరించినట్టు కసూరీ అక్టోబర్ పన్నెండవ తేదీన జరిగిన ఆవిష్కరణ సభలో ఆర్భాటించాడు! జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు ప్రచార ‘మంత్రి’గా పనిచేసిన ‘గోబెల్స్’అనేవాడు బ్రిటన్ రాజధాని లండన్‌లో సభపెట్టి తన గ్రంథాన్ని ఆవిష్కరించలేదు. బద్ధశత్రువైన హిట్లర్ ముఠాలోని వారికి తమ దేశంలో సభ పెట్టుకొనడానికి బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అసంభవం కనుక!! పాకిస్తాన్ ప్రభుత్వం 1947నుంచి మన దేశంలో సాగిస్తున్న శత్రుత్వంతో పోలిస్తే జర్మనీ బ్రిటన్‌ల మధ్య రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సాగిన వైరం మరుగుజ్జు. ఆ తరువాత జర్మనీ బ్రిటన్‌లు మిత్ర దేశాలుగా మారిపోయాయి. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం నిరంతరం జిహాదీ మతోన్మాద హంతకులను మన దేశంలోకి ఉసిగొలుపుతోంది, మన ప్రజలను హత్య చేయిస్తోంది. దశాబ్దుల ఈ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండలో కసూరీకి భాగస్వామ్యం ఉంది. అయినప్పటికీ మన ప్రభుత్వం బీభత్సకారుడైన కసూరీ మన దేశంలో తన అబద్ధాల చరిత్రను ఆవిష్కరించడానికి అనుమతిని ప్రసాదించింది.

‘‘చంపదగిన యట్టి శత్రువు తనచేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసగ మేలుచేసి పొమ్మనుటే చాలు’’
విశ్వదాభిరామ వినుర వేమ!’’
అన్న వేమన యోగి సూక్తి వ్యక్తిగత జీవితానికి సంబంధించినది, సమాజ సమష్టి హితానికి సంబంధించినది కాదు. సమాజ సమష్టి హితానికి సంబంధించినది, ‘‘శామ్యేత్ ప్రత్యపకారేణ నోపకారేణ దుర్జనః’’- అన్న మహాకవి కాళిదాస సూక్తి. ‘‘దుర్జునుడు ప్రతిగా ఉపకారం పొందడంవల్ల కాక, అపకారం పొందిన తరువాతయే అణగిపోతాడు!’’ అయినప్పటికీ మన ప్రభుత్వం వ్యక్తిగత జీవితాలకు మాత్రమే అన్వయించే వేమన సూక్తిని సమష్టి జాతీయ హితానికి వ్యతిరేకంగా అన్వయించింది. అందువల్ల కసూరీ మన దేశంలో తన గ్రంథాన్ని ఆవిష్కరించగలిగాడు.

ముంబయి గౌరవ ఘటించడానికి పాకిస్తాన్ ప్రతినిధిగా కసూరీకున్న ‘అర్హత’ల్లో అతి ప్రధానమైనది 2006లో ఆయన పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ఉండడం, 2006 జూలై పదకొండవ తేదీన పాకిస్తాన్ ప్రభుత్వం ముంబయిలో జరిపించిన పేలుళ్లలో 188 మంది హతులయ్యారు. 800 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 1993నుంచి కూడ పాకిస్తాన్ ప్రభుత్వం ముంబయిలో అనేకసార్లు పేలుళ్లు జరిపించింది, బీభత్సకాండను నిర్వహించింది! అందువల్ల ఈ పాకిస్తానీ శత్రుత్వానికి కొనసాగింపు 2006 జూలైలో జరిగిన పేలుళ్లు. ఇస్లాం మతేతర ప్రజలను నిష్కారణంగా హత్యచేయడం ‘జిహాద్’. ప్రపంచంలోని ఇస్లామేతర ప్రజలకు జీవించే హక్కులేదన్న జిహాదీల శతాబ్దుల విశ్వాసానికి కొనసాగింపు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండ! అందువల్ల 2006 జూలై 11నాటి బీభత్స రక్తపాతం జరిపించినవాడు ఈ మహమ్మద్ కసూరీ! తుపాకీ పట్టుకొని మన దేశ ప్రజలను చంపినవారు మాత్రమే, పేలుళ్లు జరిపి ప్రాణాలను తీసినవారు మాత్రమే జిహాదీ బీభత్సకారులు కాదు, జరిపించిన పాకిస్తాన్ ప్రభుత్వం అసలు నేరస్థురాలు... 

‘‘కర్తా కారయితా చైవ ప్రేరకాశ్చ అనుమోదకాః, సత్కృతే దుష్కృతేశ్చైవ, చత్వారః సమభాగినః’’ అన్నది సనాతన న్యాయసూత్రం! ‘‘చేసినవాడు, చేయించినవాడు, ప్రేరేపించినవాడు, ఆమోదించినవాడు- ఈ నలుగురూ మంచి పనిలో కాని చెడ్డ పనిలోకాని సమాన భాగస్వాములు’’! 

రెచ్చగొట్టే ప్రసంగం చేయడం- హేట్‌స్పీచ్-, పురికొల్పడం ‘అబెట్‌మెంట్’- వంటివి ఆధునిక దండనీతి ప్రకారం కూడ నేరాలు కావడానికి ఈ ‘సనాతన న్యాయసూత్రం’ ప్రాతిపదిక! 

అందువల్ల మన దేశంలో ‘జిహాదీ’ రక్తపాతం జరిపినవారు ‘కర్తలు’, జరిపించిన పాకిస్తాన్ ప్రభుత్వం ‘కారయిత’, జిహాద్ సిద్ధాంతంపై ఏర్పడి ఉన్న ఇస్లాం మత రాజ్యాల కూటమి ‘ప్రేరకుడు’! మన దేశంలో జిహాదీలు హత్యాకాండ సాగించినప్పుడల్లా హర్షం ప్రకటిస్తున్న సౌదీ అరేబియా తదితర ‘ఇస్లాం మత రాజ్యాల’లోని అధిక సంఖ్యాక ప్రజలు అనుమోదకులు... అందువల్ల కసూరీ ముంబయికి గౌరవ ఘటించడం ‘‘సమయోచితమైన చర్య’’. ఎందుకంటె 2006 జూలైలో హత్యాకాండకు గురిఅయిన వారి ‘గాయాలు’ ఇంకా మానలేదు. హంతకులలో ఐదుగురికి మాత్రమే సెప్టెంబరు 30న న్యాయస్థానంవారు మరణశిక్ష విధించడం ‘గాయాల’ను కెలికిన ఘటన! కసూరీ ‘రాక’ గాయాలను మరోసారి కెలిగింది!!

సతుల సుతుల నెడబాసిన
భాగ్య హీన జనుల కథలు,
పతుల, మతుల కోల్పోయిన
పడుతుల జీవన వ్యథలు,
విష పిశాచి కోరలతో
నమలిన వికృత ధ్వనులు.....
కాలమందుకలసిపోక
కదలాడు విషాద స్మృతులు!’’

ముంబయిలో 2006లో ఇలా పేలుళ్లు జరిపించిన తరువాత ఈ ఘటనలతో తమ దేశం వారికి సంబంధం లేదని కసూరీ బుకాయించాడు. ముంబయిలో 1993లో పేలుళ్లుజరిపి పాకిస్తాన్‌కు నక్కిన దావూద్ ఇబ్రహీం, హిజ్‌బుల్ ముజాహిదీన్ బీభత్సపు ముఠాకు చెందిన సయ్యద్ సలావుద్దీన్ నిర్దోషులని 2006లో కసూరీ ప్రకటించి ఉన్నాడు. ఈ దుండగులను మన దేశానికి తరలించవలసిందిగా మన ప్రభుత్వం కోరడం, 2006 జూలై 21న ఈ కోర్కెను కసూరీ తిరస్కరించడం ఇపుడు బహుశా మన ప్రభుత్వానికి గుర్తులేదు! జిహాదీ టెర్రరిస్టులను మన భద్రతా అధికారులు పాకిస్తాన్‌కు వెళ్లి విచారించడానికి కూడా కసూరీ తిరస్కరించాడు.

 ఇలాంటి కసూరీని ‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’ అన్న సంస్థవారు ముంబయికి పిలిపించి గౌరవించడం దేశవిద్రోహకర చర్య. దేశ విద్రోహకరమైన ‘రీసెర్చి ఫౌండేషన్’ చర్య ఉదాత్తమైన మత సామరస్యానికి ప్రతీకగాను, ఈ చర్యను వ్యతిరేకించిన జాతీయతా నిష్ఠగల వారి ‘నిరసన’ను మతోన్మాదంగాను చిత్రీకరించినవారు, ప్రచారం చేసిన వారు కూడా  దేశద్రోహులే! అందువల్ల ‘అబ్జర్వర్ రీసెర్చి ఫౌండేషన్’ సంస్థ అధ్యక్షుడు సుధీర్ కులకర్ణి మరో ‘అజ్మల్ కసబ్’ అని మహారాష్ట్ర ‘శివసేన’ వారు అభివర్ణించడం అన్యాయం కాదు, అతార్కికం కాదు. భరతమాత ముఖానికి మరకలు అంటించడానికి యత్నించిన ఈ కులకర్ణి వంటి వారి ముఖానికి ‘శివసేన’ కార్యకర్తలు రంగు పూశారు.

అసలు సమస్యను వదలి రంగు పూయడం గురించి పాకిస్తానీ భక్తులు రాద్ధాంతం చేస్తుండటమే విచిత్రం. ఇలా నిరసనలు తెలుపడం ‘సర్వమత సమభావ’ స్ఫూర్తికి భంగకరమని పాకిస్తాన్ ప్రభుత్వం వ్యాఖ్యానించిందట! ‘‘ఇలా పాఠం చెప్పే నైతిక హక్కు మీకు లేదు... అసలు పాకిస్తాన్‌లో సర్వమత సమభావం రాజ్యాంగం ఉందా? మీ దేశం సహిష్ణుతకు రూపమన్నట్టుగా నీతులు బోధించకండి’’ అని మన విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు తిప్పికొట్టడం హర్షణీయం. కానీ కసూరీని అసలు రానిచ్చింది ఎందుకు??

మహమ్మదాలీ జిన్నా ముస్లింలు మాత్రమే ఉండే పాకిస్తాన్ ఏర్పడాలని 1947కు పూర్వం పదే పదే ప్రకటించి ఉన్నాడు. ‘‘మా దేశంలో పది కోట్లమంది ఉండాలి, అందరూ ముస్లింలు మాత్రమే...’’ అన్నది పాకిస్తాన్ ఏర్పాటు సందర్భంగా ఆయన ధ్యేయ వాక్యం. ఎస్.గురుబచన్ తాలిబ్ రచించిన ఆంగ్ల గ్రంథం ‘ముస్లిం లీగ్ అటాక్ ఆన్ సిర్స్ అండ్ హిందూస్ ఇన్ ది పంజాబ్ 1947’’ అన్న ఆంగ్ల గ్రంథంలో జిన్నా, జిన్నా అనుచరుల మతోన్మాద బీభత్సం గురించి ఎన్నో వివరాలు ఉన్నాయి. అలాంటి జిన్నాను కసూరీ ముంబయిలో పొగిడాడు. ‘దేశ విభజన’ తప్పుకాదన్న భావాన్ని కసూరీ ధ్వనింపచేశాడు. 

‘‘మమ్మల్నిభారత్‌నుండి ఎందుకు విడగొట్టారు?’’ అని 1947లో లాహోర్ నగరంలోని హిందువులు జవహర్‌లాల్ నెహ్రూను అడిగారట! ‘‘అరే వందల ఏళ్ళు ముస్లింలు దేశాన్ని పాలించారు. ఇపుడు కూడా మీ దేశాన్ని ముస్లింలు పాలిస్తారు. అపుడు లేని ఇబ్బంది ఇపుడెందుకు?? మీరు పాకిస్తాన్‌లోనే ఉండండి’’ అని నెహ్రూ హిందువులకు సలహా ఇచ్చినట్టు కసూరీ ముంబయిలో చెప్పాడు! నిజమే, కానీ, ‘‘జిహాదీలు మమ్ములను ఉండనివ్వరు, బతకనివ్వరు..’’ అని జవహర్‌లాల్ నెహ్రూకు లాహోర్ హిందువులు చెప్పిన సమాధానాన్ని మాత్రం కసూరీ వెల్లడించలేదు. 

లాహోర్‌లోని హిందువులను మాత్రమే కాదు 1947 ఆగస్టు 14వ తేదీ నాటి పాకిస్తాన్ జనాభాలో 24 శాతం ఉండిన హిందువులను మహమ్మదాలీ ప్రభుత్వం పర్యవేక్షణలో జిహాదీలు నిర్మూలించడం చరిత్ర. 1948 ఆరంభం నాటికి పాకిస్తాన్ జనాభాలో ఒక శాతం హిందువులు కూడా లేని స్థితి ఏర్పడింది. 

అనాదిగా అఖండ భారత్‌లో సర్వమత సమభావ తత్త్వమైన ‘హిందుత్వం’ జాతీయత. ఈ హిందుత్వ జాతీయ స్వభావంకారణంగానే 1947 ఆగస్టు 15 తరువాత ఖండిత భారత్‌ కూడా సర్వమత సమాన రాజ్యాంగ వ్యవస్థను ఏర్పరచుకొంది. అన్యమతాలను హత్య చేసి ‘ఇస్లాం ఏక మత రాజ్యాన్ని’ నడిపిస్తున్న పాకిస్తాన్ పాలకులు ‘సర్వమత సమభావం’ గురించి మాట్లాడుతున్నారు!! నిర్లజ్జ, దుర్మా ర్గం...!

తమ విదేశాంగ విధానం ‘డేగ’ వంటిది కాదని, ‘పావురం’ వంటిది కాదని కసూరీ చెప్పుకొచ్చాడు! అంటే తాము దురాక్రమణదారులు కాదని జమ్మూకాశ్మీర్‌లో మూడువంతులు దురాక్రమించినవారు చెబుతున్నారు. ఓడిపోయే ‘పావురం’ వంటి విధానం కూడా తమది కాదని నాలుగు యుద్ధాలలో ఓడినవారు చెప్పడం నిర్లజ్జకు రూపం! 

అవును! పాకిస్తాన్ ‘డేగ’ కాదు, ‘పావురము’ కూడా కాదు... నిజానికి పాకిస్తాన్ జిహాదీ వ్యవస్థ ‘తోడేలు’... ‘ఆవుల’ మందలోకి దూకుతూనే ఉంది!!

'డేగ’ కాదు, ‘పావురం’ కాదు.. అది ‘తోడేలు’! Reviewed by rajakishor on 7:50 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.