సంస్కార కిరణాల ‘వివేక’ దీప్తి - హెబ్బార్ జి ప్రత్యేక వ్యాసం
- హెబ్బార్ నాగేశ్వర్ రావ్
సౌరమాన మకర సంక్రాంతి నాడు, చాంద్రమాన కలియుగాబ్ది 4964 దుందుభి పుష్యబహుళ సప్తమి - క్రీస్తుశకం 1863 జనవరి 12వ తేదీ నాడు నరేంద్రనాథ దత్తుడు జన్మించేనాటికి హైందవ జాతీయ సంస్కార సూర్యుడు పాశ్చాత్య భావదాస్య కేతుగ్రస్తమై ఉన్నాడు! నరేంద్రుడు వివేకానంద స్వామిగా నడయాడడం గ్రహణ విముక్తికై జరిగిన సంఘర్షణలో ప్రధాన ఘట్టం! సహ స్రాబ్దుల జాతీయ సంఘర్షణ చరిత్రలో వివేకానందుని జీవన ప్రస్థానం విజయ విభవ అధ్యాయం! ఈ సంఘర్షణ జాతీయ స్వభావాంతర్నిహితమైన సహజీవన సంస్కారం!
నరేంద్రుడు వివేకానందుడుగా వినుతికెక్కకపూర్వం క్రీస్తుశకం 1890లో ఒక రోజున వారణాసిలో సంచరిస్తుండగా కొన్ని కోతులు భయంకరంగా అరుస్తూ ఆయన వెంటపడ్డాయట! ‘‘ఈ జంతువులను ఎదిరించు...’’ అన్న ఆత్మప్రబోధం వినబడింది! నరేంద్రుడు నిలబడిపోయాడు, నిశ్చలంగా చూశాడు. నిర్భయంగా చూశాడు! కరవడానికై పళ్లు నూరిన కోతులు ఈ నిర్భయత్వం ముందు ఓడిపోయాయి. పారిపోయాయి! ఈ వైయక్తిక ప్రతిఘటనా పటిమ వికసించడానికి భూమిక జాతీయ సమష్టి సమరశీల సంస్కారం! వివేకానందుని జీవన ప్రస్థానం ఈ సంస్కారానికి విగ్రహరూపం!
సన్యాసం స్వీకరించిన తరువాత స్వామి ఉత్తర భారతంలో సంచరిస్తుండిన సమయంలో ఒక రైలు పెట్టెలో స్వామి కూర్చుండిన చోట ఇద్దరు ఐరోపావారు కూడా కూర్చు ని ఉన్నారు! స్వామి వేషాన్ని వారిద్దరూ వెక్కిరించారు! ఆంగ్లభాషలో వివేకానందుని గురించి అవమానకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. వెకిలి హాస్యంతో ఆనందించారు! ‘‘స్వామికి ఆంగ్ల భాషరాదు కనుక తమ ప్రసంగం ఆయనకు అర్థం కాదన్నది’’ వారి ధీమా! ఒక స్టేషన్‌లో రైలు ఆగింది. అందరూ ‘ప్లాట్‌ఫారమ్’ పైకి దిగారు. వివేకానందుడు ‘స్టేషన్ మాస్టర్’తో ఆంగ్లంలో ప్రసంగించడం చూసిన ఐరోపీయ ముష్కరులు ఆశ్చర్యపోయి ఉంటారు! మళ్లీ రైలు కదిలింది! ఇంత సేపు స్వామిని అవమానించిన ఆ ఇద్దరు ప్రశ్నించారు - తమ సంభాషణపట్ల స్వామి ఎందుకని నిరసన తెలుపలేదు?? మీలాంటి మూర్ఖులను చూడడం నాకు ఇది మొదటిసారికాదు - అని స్వామి సమాధానం చెప్పాడు!
క్రీస్తుశకం 1893 సెప్టెంబర్‌లో జరిగిన చికాగో సభల తరువాత అమెరికా ఐరోపాలలో పర్యటించిన స్వామి 1896లో ఇంగ్లాండులో ఈ స్వజాతీయ సమరశీల స్వభావాన్ని మరోసారి ప్రస్ఫుటింపచేశాడు. ఒక సాయం త్రం మిత్రులతో శిష్యులతో కలసి పొలాల మధ్య నడుస్తుండిన స్వామి ఒక మహావృషభాన్ని ఢీకొనవలసి వచ్చింది. పొడవైన కొమ్ములుండిన ఆ ఎద్దు పొలాల మధ్య నుండి ఈ బృందంవైపు దూసుకొనివచ్చింది. తప్పించుకొనే యత్నంలో ఆంగ్లేయులు చెల్లాచెదరైపోయారు. ఒకాయన అమిత వేగంలో సమీపంలోని ఒక గుట్ట పైభాగానికి చేరి అవతలివైపునకు అదృశ్యమయ్యా డు. ఇలా అందరూ పారిపోగలిగినప్పటికీ ‘మిల్లర్’ అన్న మహిళ మాత్రం పరుగెత్తలేక నేలపైపడి పోయింది! అంతవరకు ‘ఎద్దు’ ఆర్భాటాన్ని పట్టించుకోని వివేకానందుడు వడివడిగా వెళ్లి పడిపోయిన ‘మిల్లరమ్మ’కు రక్షణగా నిలబడ్డాడు! పురుషులను తరిమివేసిన బసవన్న తరువాత ఈ మహిళవైపునకు మళ్లింది. దూసుకొని వచ్చిన ఎద్దు చలించని వివేకానందుని చూసి ఆగిపోయింది! రంకెలు వేసింది. తీక్షణ దృక్కులను నిగిడించింది, తలపైకెత్తింది, చుట్టూ చూసిం ది, వెనక్కి మళ్ళింది, భారంగా అడుగులు వేసుకుంటూ దూరంగా కదిలింది!
దాదాపు వెయ్యేళ్ళ క్రితం వరకు భరతఖండం వెలుపలివారు వివిధ జాతులవారు మన దేశంలోని విద్యాలయాలకు వచ్చి, గురుకులాలకు వచ్చి సంస్కారాలను నేర్చుకొని వెళ్ళారు! అందువల్లనే భారత భూమి విశ్వగురువైంది! కాని శక్తివంతమైనప్పుడు భారత జాతి ఇతర జాతులను దోపిడీ చేయలేదు... ఆ దేశాలలో చొరబడి విధ్వంసకాండ జరపలేదు! ఆ దేశాల జాతులను హత్య చేయలేదు! ఎందుకంటే వివేకానందుడు వివరించినట్టు హిందూదేశపు వౌలిక జాతీయతత్త్వంలో అనాదిగా ఆర్యత్వం నిండి ఉంది! నితాంత అపార భూతదయ ఆర్యత్వం! ఇందుకు భిన్నంగా ఐరోపా జాతులవారు శక్తిమంతులైనప్పుడల్లా ఇతర దేశాలకు వెళ్లి ఆయా దేశాలలోని అనాది జాతులను హత్యచేశారు! ఇలా హత్యచేయడం అనార్యతత్త్వం! భారతీయులు భారతదేశం వెలుపలి నుంచి వచ్చిన వారయితే ఐరోపా జాతులవలెనే హత్యలు చేసి ఉండేవారని వివేకానందుడు పాశ్చాత్యులకు చెప్పాడు.
నార్యస్య దాసభావః-అని చాణక్యుడు క్రీస్తునకు పూర్వం పదహారవ శతాబ్దిలో చెప్పాడు! ఆర్యుడు దాస్యాన్ని అంగీకరించడు, ప్రతిఘటిస్తాడు! క్రీస్తునకు పూర్వం అనేక శతాబ్దులుగా దండెత్తి వచ్చిన గ్రీకు దురాక్రమణదారులు భారతీయుల ప్రతిఘటన సంస్కారాన్ని గురించి తమ గ్రంథాలలో వ్రాసుకున్నట్టు క్రీస్తుశకం 1900వ సంవత్సరం ప్రాంతంలో ‘హిందూ ఔన్నత్యం’ - హిందూ సుపీరియారిటీ-అన్న ఆంగ్ల చారిత్రక గ్రంథా న్ని రచించిన హరవిలాస్ శారద తెలిపి ఉన్నా డు. ప్రశాంతంగా ఉండిన తక్షశిల విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి చొరబడి విధ్వంసకాండకు పూనుకున్న దురాక్రమణ దారులపై అగ్నివర్షం కురిసింది, పిడుగులజడి కురిసింది. హతశేష దురాక్రమణదారులు పారిపోయారు! భారతీయుల ఆయుధ పటిమకు హరవిలాసశారద చెప్పిన ఉదాహరణ ఇది!
వేదవిజ్ఞానం అద్యంత రహితమైనదని వివేకానందుడు ప్రవచించినప్పుడు, ‘‘అదెలా సాధ్యం...?’’ అని అమెరికా ఐరో జాతులవారు ఆశ్చర్యపోయారు! ఈ ఆశ్చర్యం చికాగో సభలను ఆవహించింది! పరఃప్రసిద్ధ్యా పరోబోద్ధవ్యః- అన్న వ్యవహార సూత్రానికి అనుగుణంగా వారికి తెలిసిన విషయాన్ని ఉదహరించి వేద విజ్ఞాన ఆద్యంతరహిత స్థితిని స్వామి వివరించాడు! భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఇలా ఉన్నట్టు కనుగొనడానికి ముందు కూడా ఈ గురుత్వాకర్షణ శక్తి ఉంది. కనుగొనడం ప్రధానం కాదు, ఉండ డం ప్రధానం! ఇది ఒక అంశం మాత్రమే! ఇలాంటి అసంఖ్యాక అంశాలతో కూడిన వేదవిజ్ఞానం కూడా అనాదిగా ఉంది. ఈ విజ్ఞానాన్ని వేదద్రష్టలైన ఋషులు దర్శించడానికి ముందు ఇది ఉంది. దర్శించిన తరువాత కూడా ఉంది, మానవాళి మొత్తం ఈ విజ్ఞానాన్ని మరచిపోయినప్పటికీ ఈ విజ్ఞానం అనంతంగా విశ్వస్థితమై ఉంటుంది!! -అన్నది వివేకానందుడు చికాగో సభలో చేసిన మూడవ ప్రసంగంలోని ప్రధాన సారాంశం! ఈ ఆద్యంతర రహిత స్థితి ప్రస్ఫుటించిన మాధ్యమం హిందుత్వం!!
విజ్ఞానం, విశ్వవిజ్ఞానం ప్రపంచంలోని అన్ని జాతులకు మాత్రమే కాదు, సకల జీవరాసులకు వర్తించే సత్యం! చరాచర జగత్తును సంచలింపచేసే ‘ఋతం’ ఈ విజ్ఞానం! అయి తే ఈ సత్యాన్ని గుర్తించిన సనాతన - శాశ్వత - సంస్కారం హిందుత్వ మాధ్యమం ద్వారా ప్రస్ఫుటించింది!
గుర్తించని జాతులు, గుర్తించలేని జాతులు ‘ప్రతీదీ’ ఎప్పుడో ఒకప్పుడు పుట్టిందని, ఆరంభమైందని పాక్షిక అవగాహనకు లోనయ్యారు!! ఇందుకు భిన్నంగా సమగ్ర విజ్ఞాన ద్రష్టలైన భారతీయ ఋషులు సంపూర్ణ సత్యాన్ని సమావిష్కరించ గలిగారు. ‘పగటి వెంట రాత్రి, రాత్రి వెంట మళ్ళీ పగలువలె సృష్టి స్థితి శూన్యస్థితి ఏర్పడి ఉండడం అనాది, అనంతం’’ అన్నది ఈ సంపూర్ణ సత్యం. వేయి యుగాల ఉదయ కల్పం సృష్టిస్థితి! దీనివెంటనే వేయియుగాల ‘క్షయకల్పం’ రావడం శూన్య స్థితి! క్షయకల్పం వెంటనంటి ‘ఉదయ కల్పం’ మళ్లీ మళ్లీ వస్తోంది! ఇలా ఆద్యంత రహితమైన - సనాతనమైన - కాలం అఖండ మండలాకారం! ఈ సత్యాన్ని గుర్తించిన జాతి సనాతన జాతి! శాశ్వతమైన ఆత్యంతరహితమైన జాతి! సృష్టిగత వాస్తవాలు ఈ సనాతన జాతిలో సంస్కారాలుగా వికసించడం చరిత్ర! ఈ చరిత్రను చికాగోలో చేసిన మూడవ ప్రసంగంలో వివేకానందుడు సమావిష్కరించాడు!!
ఈ జాతి, జాతీయత ఇలా ఆత్యంతరహితమైనవన్న ధ్యాస అతిప్రధానమైన సంస్కారం! ఒక్కొక్క సంస్కారం ఒక్కొక్క మాధ్యమం ద్వారా, చిహ్నం ద్వారా, ప్రతీక ద్వారా, విగ్రహం ద్వారా, అభివ్యక్తం కావడం సహజ సిద్ధమైన సృష్టిగత వ్యవస్థ! అద్వితీయ సత్యం అసంఖ్యాక మాధ్యమాల ద్వారా అనుభూతవౌతుండడం ‘ఋతం’. కర్రద్వారా, వత్తిద్వారా, ఇతరేతర మాధ్యమాల ద్వారా నిప్పు ప్రస్ఫుటిస్తోంది! సజీవ విగ్రహాలైన మానవులు సంస్కార మాధ్యమాలు! అనంత, అఖండ, రూపనామ క్రియారహితమైన సనాతన నిత్యం నిరంతరం రూపాంతరం చెందుతున్న సృష్టి ద్వారా ప్రస్ఫుటించడం ఋతం! సత్యం ప్రస్ఫుటించడానికి మాధ్యమం ఋతం, సృష్టికర్త ప్రస్ఫుటించడానికి మాధ్యమాలు! సత్యమనే సంస్కారం హరిశ్చంద్రుడనే విగ్రహ మాధ్య మం ద్వారా ప్రస్ఫుటించింది! ‘అమ్మ’ అనే అక్షర విగ్రహం ద్వారా అమ్మ అనుభూతవౌతోంది! పూజామందిరంలోని చిన్న విగ్రహం ద్వారా అనంత అఖండ సృష్టికర్త తత్త్వం అనుభూతవౌతోంది!
ఈ ‘విగ్రహం’ ఈ జాతీయ సంస్కారమాధ్యమం...! రాజస్థాన్‌లోని అల్‌వార్ సంస్థానంలో విగ్రహతత్వాన్ని వెక్కిరించిన ‘పాలకుని’కి వివేకానందుడు కనువిప్పు కలిగించిన ఘటన ప్రబద్ధం! అందువల్ల పరిమిత విగ్రహం ద్వారా అనంత విశ్వవ్యాప్త అద్వితీయ తత్త్వాన్ని సంభావించడం అనాది సంస్కారం! వైయక్తిక జీవనంలో తల్లి అలాంటి సజీవ విగ్రహం! హైందవ జాతీయ జీవనంలో మాతృభూమి ఇలా సజీవ విగ్రహమైంది! ‘ద్యావాపృథువులు’ తండ్రి తల్లి! ఆకాశం తండ్రి, నేలతల్లి! ఇది అనాదిగా వేదఋషులు దర్శించిన సత్యం, జాతీయ సంస్కారం! సకల విధ ఇతర సంస్కారాలకు ఈ మాతృభక్తి ప్రాతిపదిక! ఈ ప్రాతిపదికగానే వైవిధ్యాల జనసముదాయం ఏకాత్మభావ నిబద్ధమైన ‘జాతి’గా ఏర్పడి ఉంది! అందువల్లనే వివేకానందుడు మాతృశక్తి సంస్కారాన్ని మహోన్నతరీతిలో ఆచరించి చూపించాడు!
మాతృభూమిపట్ల కల మమకారం నిరంతరం శ్రమజీవన సౌందర్యంగా రూపుకట్టడం వివేకానందుని జీవితం! హిమాలయాలలోని ఏకాంత ఆశ్రమంలో ధ్యాన సమాధినిష్ఠుడైపోవాలని భావించినవాడు, అఖండ భరతావనిని మొత్తం ‘అద్వైత ఆశ్రమం’గా రూపొందంచుకున్నాడు! ఈ ఆశ్రమమంతటా పరిక్రమించాడు. ప్రదక్షిణం చేశాడు!! ధనవంతుల భవనాలలోను దళితుల గుడిసెలలోను నివసించాడు! గుండె గుండెలో నివసిస్తూనే ఉన్నాడు.
మూలం : ఆంధ్ర భూమి దిన పత్రిక
మూలం : ఆంధ్ర భూమి దిన పత్రిక
సంస్కార కిరణాల ‘వివేక’ దీప్తి - హెబ్బార్ జి ప్రత్యేక వ్యాసం
Reviewed by JAGARANA
on
8:59 AM
Rating:
No comments: