మతమార్పిడుల పట్ల అప్రమత్తం - హిందు చైతన్య శిభిర ఉద్గాటన కార్యక్రమంలో మాన్య భయ్యజి జోషి
దేశంలో సేవ ముసుగులో సాగిపోతోన్న మత మార్పిడులపై హిందూ జాతి యావత్తూ అప్రమత్తం కావాలని ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ సురేష్ జోషి (్భయ్యాజీ) సూచించారు. హిందూత్వపై జరుగుతున్న దాడిని సమర్థంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడ- గుంటూరు జాతీయ రహదారిపై శాతవాహన నగర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన హిందూ చైతన్య శిబిరానికి జోషి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భయ్యాజీ మాట్లాడుతూ హిందూత్వ అంతిమ లక్ష్యం విశ్వకల్యాణమే తప్ప విధ్వంసం కాదన్నారు. హిందూ అంటే సంప్రదాయం, సంస్కృతి మాత్రమేనని... గ్రంథపఠనం కాదన్నారు. విశ్వకల్యాణం, సమాజ సమగ్రాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ఆవిర్భవించిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అని పేర్కొన్నారు. కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ వంటి ఈశాన్య ప్రాంతాల సరిహద్దుల్లో విద్రోహ శక్తులు వీరంగం చేస్తూ దేశానికి పెనుసవాల్‌గా పరిణమించాయన్నారు. భారత సైన్యంపై దృఢమైన నమ్మకం ఉందని, ప్రజలు భాష, కులం, ప్రాంతీయ విభేదాలను మరిచి హిందూజాతి యావత్తూ ఐక్యంగా ఉండాలన్నారు. ప్రతి హిందువు తమ జాతి ఔన్నత్యాన్ని తెలుసుకొని ఐకమత్యంగా హిందూత్వంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని పిలుపిచ్చారు. ప్రస్తుతం మహిళల పరిస్థితి దయనీయంగా మారిందని, దేశ రాజధానిలోనే సురక్షితంగా సంచరించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజాన్ని క్రమశిక్షణతో ముందుకు నడిపించాలనుకునే వారిని ఛాందసవాదులుగా చిత్రీకరించడం తగదన్నారు. స్వామి వివేకానంద వంటి మహనీయుల బోధనల స్ఫూర్తితో యువత హైందవ ధర్మరక్షణతోపాటు, విశ్వకల్యాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మూడురోజుల పాటు నిర్వహించనున్న పూర్వాంధ్ర శిబిరం శక్తి సమీకరణకు దోహద పడుతుందని, ఈ శక్తితో హిందూ జాతిలో అక్కడక్కడ నెలకొన్న దోషాలను తొలగించుకుని మరింత శక్తివంతంగా తయారుకావాలని భయ్యాజీ ఆకాంక్షించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వామి పరిపూర్ణానంద సరస్వతి మాట్లాడుతూ ప్రపంచంలో భారత జాతికే నిజమైన చరిత్ర చెప్పే దమ్ము ఉందన్నారు. మన పుణ్యభూమిలో నీరు, గాలి స్వచ్ఛమైన హిందువుకు ఆయువుపట్టు అని, దేశాన్ని, ధర్మాన్ని వేరుగా చూడరాదని కోరారు. భరతమాత, హిందూధర్మం భారతజాతికి తల్లిదండ్రుల వంటివని పేర్కొన్నారు. హిందూదేశంగా ఉండాలంటే ధర్మాన్ని తప్పక కాపాడుకోవాల్సిందేనని చెప్పారు. ధర్మానికి అనుసంధానమైన గోవు, గంగ, గీత, గోవిందుడు, గురువులను హిందువులు కాపాడుకున్నప్పుడే ధర్మపరిరక్షణ సాధ్యపడుతుందని సూచించారు. నేడు దేవాలయాలు ఎ, బి, సి, డి తరగతులుగా విభజించబడి అతలాకుతలం అయ్యాయన్నారు. ధర్మపరిరక్షణలో దేవాలయాల పరిరక్షణ కూడా అంతర్గత భాగమేనని తెలిపారు. సుమారు 20 వేలమంది స్వయం సేవకుల దళం శాతవాహన నగర్‌లో భారతీయ ధర్మ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేపట్టడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి హాజరైనందుకు తానెంతో అదృష్టవంతుడినని స్వామి పరిపూర్ణానంద సరస్వతి పేర్కొన్నారు.
కార్యక్రమంలో బిజెపి జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు, జస్టిస్ పర్వతరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెలగపూడి రామకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు, క్షేత్ర ప్రచారక్ డి రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు సోమయాజులు, రాఘవులు, సురేంద్ర, భూపతిరాజు శ్రీనివాసరాజు, ఎంసికె మూర్తి, జివిడి ప్రసాద్, మంగేష్‌జీ, సూర్యనారాయణరావు, కెసి కన్నన్, మధుబాయ్, బాగయ్యజీ, రాం మదన్, అజిత్, జగదీష్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జాతీయనేత నుంచి సాధారణ కార్యకర్త వరకూ ఒకేవిధమైన దుస్తులతో స్వయం సేవకులు అత్యంత క్రమశిక్షణగా శిబిరంలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరగనున్న శిబిరంలో శనివారం కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీస్వామి స్వయం సేవకులను ఉద్దేశించి అనుగ్రహభాషణ చేస్తారు.
source : andhrabhoomi
మతమార్పిడుల పట్ల అప్రమత్తం - హిందు చైతన్య శిభిర ఉద్గాటన కార్యక్రమంలో మాన్య భయ్యజి జోషి
Reviewed by JAGARANA
on
8:34 AM
Rating:
Post Comment
No comments: