"భారతీయతను ప్రపంచానికి చాటిన ధీశాలి" స్వామి వివేకానంద 150వ జయంతి ప్రత్యెక వ్యాసం
అన్నింటికీ ఆ దేవుడే దిక్కు అని అందరూ అంటూండగా దేవుడున్నాడా? ఎలా ఉంటా డు? ఈ ప్రశ్న ఆయన్ని కుమ్మరి పురుగులా తొలిచింది.ఆయన మనసెరిగిన కాలేజీ ప్రిన్సిపాల్ లిలియం హేస్ట్ దొర సలహా మేరకు దక్షిణేశ్వరంలోని రామకృష్ణుల వారి వద్దకు వెళ్ళిన నరేన్ మనసులో ఏమున్నదో పసిగట్టిన రామకృష్ణులు ‘‘ఏమిటి నీ సందేహం?’’ అని అడిగారు. ‘‘మహాశయా! దేవుడున్నాడా?’’ అని ప్రశ్నించాడు నరేన్. ‘‘ఉన్నాడు’’ అన్నారు రామకృష్ణుల వారు. ‘‘మీరు చూశారా?’’ అని అడిగాడు ఆ వెంటనే, ‘‘చూశాను. నిన్నిప్పుడు చూస్తూన్నంత దానికన్నా స్పష్టంగా చూశాను’’ అని చెప్పిన వెంటనే ‘‘మరయితే దేవుణ్ణి నాకు చూపెడతారా??’’ అని అడిగాడీసారి. ‘‘తప్పకుండా చూపెడతాను’’ అన్నారు. ‘‘సరే! చూపెట్టండి’’ అన్నాడు నరేన్. వెంటనే తన కుడికాలిపాదం నరేన్ నెత్తిన పెట్టి బొటన వేలితో మెల్లిగా పుణక మీద నొక్కారు. రామకృష్ణులయందున్న యోగీశ్వర శక్తి నరేన్‌ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇది గమనించిన రామకృష్ణులు ‘‘ఇవ్వాల్టికికచాలు’’ అని చెప్పి వెంటనే కాలు పక్కకి తీశారు. ఆయనను గురువుగా ఎంచుకుని వారి ద్వారా ఆధ్యాత్మిక సాధన పొందాడు. ఈ గురుశిష్యుల బంధం నభూతో నభవిష్యతిగా నిలచింది.
అటుపై నరేన్ న్యాయశాస్త్రం చదివేందుకై కాలేజీలో చేరాడు. కొంతకాలం తర్వాత తండ్రి మరణించడంతో పరిస్థితుల కారణంగా చదువు అటకెక్కింది. కాలగమనంలో రామకృష్ణులు గొంతు క్యాన్సర్ వ్యాధి కారణంగా పడకపట్టారు. మృత్యువు దగ్గర పడుతోందని గ్రహించి నరేన్‌ని దగ్గరికి పిలచి పక్కన కూచుండ బెట్టుకొని ‘‘నాయనా ఇకపై నీ శక్తి సామర్థ్యాలను దీనజనులకోసం వినియోగించే ప్రయత్నం చేయడం మంచిది’’ అని చెప్పి తన ఆధ్యాత్మిక సాధనా సంపత్తినంతటినీ నరేన్‌కి ధారపోసి 1816 ఆగస్టు 16న మహాసిద్ధి పొందారు. అనంతరం గురుదేవుల చితాభస్మ కలశాన్ని తీసుకొని బాలానగర్ వెళ్ళి దానిని అక్కడ ప్రతిష్టించిన మీదట ఇకపై నా శక్తి సామర్థ్యాలను జగత్కల్యాణానికై వినియోగిస్తానని ప్రతిజ్ఞచేసి ఆ క్షణం నుండి తన పేరును ‘‘స్వామి వివేకానంద’’గా మార్చుకున్నారు. సనాతన ధర్మవైశిష్ట్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసేందులకై పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు పడ్డ కష్టాలు; అవరోధాలు ఇంతా అంతా కావు.
ఈ విశ్వంలో పుణ్యభూమి అనిపించుకునే అర్హత కేవలం ఈ భారత భూమికి మాత్రమే ఉన్నది. మహోన్నత సౌజన్యం; ఉదారత్వం; పవిత్రత; ప్రశాంతత అన్నింటినీ మించి ఆధ్యాత్మికత అంతర్వీక్షణాలను మానవాళికి అందించిన మహత్తర భూమి మన భారత భూమి. ఈ నేలకు సదా కృతజ్ఞలమై ఉండాలి అని చెప్పిన మాతృదేశాభిమాని వివేకానంద. 1867లో శ్రీరామకృష్ణ మిషన్ సంస్థను స్థాపించారు.
లక్షలాది ప్రజలు ఆకలి; అజ్ఞానంతో జీవిస్తూండగా వారి గోడు ఏమాత్రం పట్టించుకోని ప్రతి వ్యక్తినీ దేశద్రోహి అనే అంటారు’’ అంటూ ఓ సభా ముఖంగా అన్నారు వివేకానంద. ప్రాపంచిక విషయాల్లో కొట్టుకొంటూ పురుగుల్లా చావడంకంటే కర్తవ్య నిర్వహణతో మరణించటమే ఉత్తమం అని కూడా చెప్పారు. చివరిగా ఓ మహాసభలో ప్రసంగిస్తూ ‘‘శ్రీరామకృష్ణ పరమహంస వారి సేవకునిగా ఎన్ని జన్మలైనా ఎత్తడానికి నేను సిద్ధమే’’ అంటూ ఆ గురుశిష్యుల సంబంధాన్ని మరోసారి గుర్తుచేసిన నిరహంకారి ఆయన. పాశ్చాత్యుల కొరకు అవతరించిన శంకర భగవత్పాదులే స్వామి వివేకానంద అని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణవారు చెప్పిన మాట తప్పక అంగీకరించాల్సిందే.
-ఎం.సి.శివశంకరశాస్ర్తీ
"భారతీయతను ప్రపంచానికి చాటిన ధీశాలి" స్వామి వివేకానంద 150వ జయంతి ప్రత్యెక వ్యాసం
Reviewed by JAGARANA
on
7:56 AM
Rating:
Post Comment
No comments: