Top Ad unit 728 × 90

అనాది జాతికి ఆచార్యుడెవరు? : శ్రీ హెబ్బార్

యవక్రీతుడు అనే ఋషి కుమారుడు గంగానదీ తీరంలో ఘోరమైన తపస్సు చేస్తుండేవాడు. అలా కొంతకాలం గడిచింది. ఒక రోజున యవక్రీతుడు గంగానది మధ్యలో ఒక వృద్ధ బ్రాహ్మణుడిని చూశాడు. ఆ బ్రాహ్మణుడు ఒడ్డునుండి ఇసుకను దోసిలితో తీసుకుని వెళ్లి గంగానది మధ్యలో వేస్తుండేవాడు. అనేక రోజులపాటు ఆ బ్రాహ్మణుడు ఇదే పని చేస్తుండడం యవక్రీతుడు గుర్తించాడు. ఒకనాడు ఉత్సుకతతో ఆయన ప్రశ్నించాడు. ‘‘స్వామీ మీరు రోజంతా ఇసుకను తీసుకువెళ్లి నది మధ్యలో వేస్తున్నారు. ఎందుకని?’’ ‘‘ఈ నదికి ఇసుకతో ఆనకట్ట నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని వృద్ధుడు సమాధానం చెప్పాడు. ‘‘మీరు మహాపండితుని వలే ఉన్నారు. ఈ పిచ్చిపని ఎందుకు చేస్తున్నారు?, దోసిలితో ఇసుక తీసుకుపోయి చల్లినందువల్ల వెయ్యి జన్మలకన్నా మీరు ఆనకట్టను పూర్తిచేయగలరా?’’ అని యవక్రీతుడు నిలదీశాడు. ‘‘నీవు చేస్తున్న పిచ్చిపని ముందు నేను చేస్తున్నది ఎంత?’’ అని ఆ వృద్ధుడు తిరిగి ప్రశ్నించాడు. ఆ వృద్ధుడు ఇలా కొనసాగించాడు. ‘‘విద్య నేర్చుకొనడానికి గురువు వద్ద చేరడం ఆవశ్యకం. కాని నీవు గురువుతో నిమిత్తం లేకుండా తపస్సు ద్వారా విద్య నేర్చుకొనడానికి ప్రయత్నిస్తున్నావు. ఈ తపస్సు వల్ల నీలో అహంకారము మాత్రమే పెరుగుతుంది. అంతేకాని, లోకహితమైన విద్యలేవీ కూడ నీకు అబ్బవు. దోసిలితో ఇసుక పోసి నదికి ఆనకట్ట నిర్మించడం ఎలాగో, గురువు లేకుండా విద్యను నేర్చుకోవడం కూడా అలాగే..’’ అని ఆ వృద్ధుడు యవక్రీతుడిని యద్దేవా చేశాడు. యవక్రీతునికి కనువిప్పు కలిగింది. ఆ వృద్ధుడు ఇంద్రుడు. యవక్రీతుడు తపస్సు చాలించి గురువు వద్దకు వెళ్లి విద్య నేర్చుకోవడం ప్రారంభించాడు.
సమాజంలో ఎంతటి ఉన్నతుడైనా గురువు మార్గదర్శకం లేనిదే విద్యలు అబ్బవు. అందువల్లనే రఘురాముడు, యదుకుల కృష్ణుడు వంటి మహనీయులు సైతం గురువు వద్ద విద్యలను నేర్చుకున్నారు. ‘‘గురువు, గోవిందుడు ఒకేసారి మన ఎదుటికి వచ్చినప్పుడు ఎవరికి ముందు నమస్కరించాలి? గురువుకే నమస్కరించాలి. ఎందుకంటె గోవిందుడు దేవుడని మనకు చెప్పేవాడు గురువు మాత్రమే.’’ - గురు గోవింద్ దోవూఖడే, కాకే లాగూపాయ్? బలిహారీ గురూ ఆప్‌కీ గోవింద్ దియో బతాయ్ - అని హిందీ కవి కబీర్‌దాస్ వివరించాడు.
ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురుపౌర్ణమిగా, గురు పూజా దినోత్సవంగా అనాదిగా ప్రసిద్ధి కెక్కింది. అదే రోజున ద్వాపర యుగంలో వేదవ్యాసుడు జన్మించినట్టు ఇతిహాసం చెపుతోంది. సత్యవతీ పరాశరులకు కృష్ణద్వైపాయనుడన్న పేరుతో జన్మించాడు వ్యాసుడు , అనాదిగా ఉన్న వేదాన్ని కలియుగంలో సామాన్యులకు సౌలభ్యంగా ఉండే విధంగా నాలుగుగా విభజించాడు. అందువల్లనే ఆయనకు వేదవ్యాసుడన్న పేరు వచ్చింది. ‘‘్ధర్మేచ అర్థ కామేచ, మోక్షేచ, భరతర్షభ! యదిహాస్తి తదయన్యత్ర యనే్నహాస్తి నతత్‌క్వతిత్’’ - ధర్మార్థ కామమోక్షాల విషయంలో ఇక్కడ - మహాభారతంలో- ఉన్నది మరెక్కడైనా ఉండవచ్చు. ఇక్కడ లేనిది మాత్రం మరెక్కడా లేదు -. మహాభారతం ధర్మమార్గంలో సమాజంలో పయనించడానికి మహోజ్జ్వల దీపిక వంటిది. ఆ దీపికను వెలిగించిన వేదవ్యాసుడు తరతరాలకు గురువయ్యాడు. వరసిద్ధి వినాయకుడే వ్యాసునికి మహాభారతరచనలో లేఖకుడుగా పనిచేశాడు. అలాగే బ్రహ్మసూత్రాలను రచించడం ద్వారా వేద వ్యాసుడు బాదరాయణుడై ఆధ్యాత్మిక గురువయ్యాడు. పద్దెనిమిది పురాణాలను రచించడం ద్వారా కల్పాది నుంచి కల్పాంతం వరకు గల చరిత్రను చెప్పి చారిత్రక గురువయ్యాడు. ఇలా కలియుగం లోని ప్రజలకు వేదవ్యాసుడే తొలి గురువు.
అయితే వ్యాసునికి పూర్వం కూడా సమాజం ఉంది, గురువులు ఉన్నారు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క విలక్షణమైన శుభగుణానికి ప్రతీకగా భాసిస్తున్నాడు. అనాదిగా ఉన్న భారత జాతికి అసంఖ్యాకమైన మహనీయులు గురువులుగా ఉన్నారు. ఈ మహనీయులందరి శుభగుణాల పరంపర గురుతత్త్వంగా భాసిల్లి సమాజానికి మార్గదర్శనం చేస్తోంది. అందుకే భారతీయులు ఒక గురువును కాక గురు పరంపరను పూజిస్తున్నారు. ఈ గురు పరంపరకు ఒక వ్యక్తి ప్రతీకగా ఉండటం అసాధ్యమైన విషయం. అందుకే ఈ జాతికి చిహ్నమైన అరుణధ్వజాన్ని--- కాషాయం రంగు పతాకాన్ని -- ఆచార్యత్వానికి ప్రతీకగా భావించడం అనాదిగా వైదిక సంప్రదాయం. ఈ కాషాయ ధ్వజమే గురుకులాలపై విలసిల్లి విద్యార్జనలో మార్గదర్శనం చేసింది. ఈ కాషాయ ధ్వజమే దేవాలయాలపై రెపరెపలాడి ప్రజలను ధర్మ మార్గంలో నడిపించింది. ఈ కాషాయ ధ్వజమే పరిపాలకుల విజయ రథాలపై వెలుగొంది జాతి భద్రతను పటిష్టం చేసింది. అందువల్లనే సర్వ శుభలక్షణ శోభితమైన అరుణధ్వజాన్ని భారతజాతి గురువుగా స్వీకరించింది. వేదవ్యాసుని పుట్టిన రోజున గురు పూజను జరుపుకుంటున్నప్పటికీ జరుగుతున్న ఆరాధన వ్యాసునికి మాత్రమే కాదు. ఆయనకు పూర్వం, ఆయన తర్వాత పుట్టి ఈ దేశాన్ని నడిపించిన మహనీయులందరికీ ఇది సమ్మానం. ఈ సమ్మానాన్ని సమర్పించడానికి మాధ్యమం కాషాయధ్వజం. ఈ పతాకం ఉదయించే సూర్యుని రంగులో ఉంది. సమాజం నిరంతరం కాంతివంతమైన సంస్కృతి పథంలో సౌశీల్య మార్గంలో పయనించాలన్నదే గురుపూజ చేయడంలో గల ఆంతర్యం
అనాది జాతికి ఆచార్యుడెవరు? : శ్రీ హెబ్బార్ Reviewed by JAGARANA on 9:50 AM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.