భారతాంబ దాస్య విముక్తి సమరంలో రాలిన మరో మొగ్గ - 'మాస్టర్ దా' సూర్యసేన్
- ఆకెళ్ల రాఘవేంద్ర
‘‘చావు నా తలుపు తడుతోంది. అనంత ఆలోచనలతో నా మనసు నిండిపోయింది. మృత్యువు ఇప్పుడు నా హితురాలు. ఈ పవిత్ర ఆనంద సమయంలో మీకేం మిగిల్చి వెళ్తున్నాను? నా కలను. భారతదేశాన్ని బంగారంలా చూసుకునే స్వప్నాన్ని. నేలతల్లి రుణం తీర్చుకోండి. కలిసి నడవండి. నడుం బిగించి దూకండి. దేశాన్ని దోచుకునేవారి పని పట్టండి’’ - సూర్యసేన్ మాటలివి. ఎవరితను? బ్రిటిష్‌వారితో పోరాడి ప్రాణాలొడ్డిన వీరుడు. ఈ ధీరుడి కథ తెలుసుకున్నవారు - స్వార్థం మరిచిపోతారు. దేశం కోసం పోరాడతారు.
చిట్టగాంగ్ జైల్లో ఉన్నాడు సూర్యసేన్. అతని బ్యారక్ అంతా చీకటి. మురికి కంపు. దోమలు. బాధ లేదు. ‘నా దేశం ఈ కారాగారానికి వెలుపల ఇలాగే ఉంది కదా’ అనుకున్నాడు. చిన్న గుడ్డి దీపం. తన మిత్రులు పంపిన ఉత్తరం చదువుకుంటున్నాడు. జైలు నుంచి ఎలా తప్పించుకోవాలో చెబుతున్న దారిపటం అందులో ఉంది. కానీ తనకు తెలుసు. ఇంకో రెండు రోజుల్లో తనను ఉరితీసేస్తారని!
అందుకు దుఃఖం లేదు. ఉన్నదల్లా ఈ దేశ స్వాతంత్య్రాన్ని చవిచూడకుండా కన్నుమూయాల్సి వస్తోందనే! ఖైదు గది ఊచల్లోంచి ఆకాశం కేసి చూశాడు. దూరంగా చుక్కలు. తన స్వప్నమూ అలాగే ఉంది. దగ్గరగా మృత్యువు.
అంతలో సైనికులొచ్చారు. సూర్యసేన్‌ని బయటకెక్కడికో తీసుకెళ్లారు. నానా హింసలూ పెట్టారు. ఒళ్లంతా చాకుతో గీసేశారు. కారం పూసేశారు. భరించలేని మంట. పెద్ద సుత్తితో పళ్లపై కొట్టారు. ఫటిల్మని పగిలి నేలరాలాయి దంతాలు. రక్తం. అదే సుత్తితో కాళ్లపై, కీళ్లపై మోదారు - నరకం కనిపించేలా! అరచేతిలో మేకులు కొట్టారు.
ఇక గాట్లు పెట్టడానికి ఆ శరీరంపై చోట్లు లేవు. ఇంత చేసినా సూర్యసేన్ కళ్లల్లో కాంతి. మోముపై నిర్జీవపు నవ్వు. రక్తపు మడుగైన ఆ మాంసపు ముద్దను ఉరితీశారు బ్రిటిష్ అధికారులు. పార్థివ దేహాన్ని ఇనప్పెట్టెలో పెట్టి సముద్రంలో విసిరి పారేశారు. ఈ పాపం తమది కాదన్నట్టు! అలా కాకుంటే ఆ వార్త దావానలమవుతుంది. విప్లవ వీరులే కాదు సామాన్యులూ తిరగబడి బ్రిటిష్ కార్యాలయాల్ని ధ్వంసం చేసేస్తారు.
ఇంతకూ సూర్యసేన్ చూపిన తెగింపేమిటి? చిట్టగాంగ్. ఆనాటి అవిభక్త భారతదేశపు భాగం. నాడు బంగ్లాదేశ్‌లో ఓ ప్రాంతం. కర్ణపురి నదికి అభిముఖంగా ఉంటుంది. బంగాళాఖాతానికి ఆనుకుని ఉంటుంది. కొండలతో గుట్టలతో నిండి ఉంటుంది. అభివృద్ధికి దూరంగా ఉంటుంది. అక్కడ 1894 మార్చి 22న పుట్టాడు సూర్యసేన్ - బోల్‌ఖాలీ గ్రామంలో. నాన్న రమణరంజనిసేన్ ఉపాధ్యాయుడు. చిన్నప్పుడు అందరి పిల్లల్లాగానే మామూలుగా పెరిగాడు. 1905లో ఆంగ్ల సర్కారు బెంగాల్‌ని విభజించింది. దేశ ప్రజల్లో చీలిక చిచ్చు పెట్టింది. అది స్వదేశీ ఉద్యమంగా ఎగసింది. అప్పటికి సూర్యసేన్ 12 ఏళ్ల కుర్రాడు. దేశభక్తి అంటే ఏమిటో తెలీదు. కానీ వందేమాతరం అని నినదించాడు. పిట్ట కొంచెమైనా ఆ కూత ఘనమై నరనరానా కణకణనా భారతమాత అంటే వల్లమాలిన ప్రేమగా మరలుతుందని అప్పటికా పిల్లాడికి తెలీదు. 1915లో బెర్హాంపూర్ కాలేజీలో బీఏలో చేరాడు.
పరాయి పాలనను పాలదోలడం కోసం బెంగాల్‌లోనే కాదు, దేశమంతా ఉద్యమాలు ఉధృతంగా జరుగుతున్న రోజులవి. అప్పుడు స్పష్టంగా దేశభక్తి అంటే ఏమిటో అర్థమైంది 20 ఏళ్ల సూర్యసేన్‌కి. కాలేజీ అయ్యాక ఊరంతా తిరిగేవాడు. కొండలు, గుట్టలు ఎక్కేవాడు. చెట్ల కింద కూచునేవాడు. నదుల్లోకి దూకేవాడు. ఈదుకుంటూ ఆ దరి చేరేవాడు. ఒక్కటి అర్థమైంది. నువ్వు ఏమీ అడక్కపోయినా నీకు అన్నీ ఇస్తున్నాయి - ఈ చెట్లు, పుట్టలు, నదులు. అలాంటిది మనిషిగా పుట్టిన నువ్వు ఈ దేశానికి ఏమీ ఇవ్వకపోతే ఎలా?
ఇంకొక్కటి అర్థమైంది. దేశమంటే, బానిసత్వమంటే, అన్నార్తుల వేదన అంటే, దోపిడీ అంటే, భరతమాతను చిత్రహింసలు పెట్టే దగా కోరులంటే... ఏమిటో తెలీని, ఏమీ పట్టని విధంగా బతకడం జంతువులకు చెల్లింది. ప్రాణమున్న, చీమూ నెత్తురూ ఉన్న మనిషిగా పుట్టాక, ఈ మట్టి రుణం తీర్చుకోవాలన్న స్పృహ లేకపోతే ఎలా?
ఇలా ఆలోచించడంతో సూర్యసేన్ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వెన్నుముక నిటారైంది. కళ్లు తీక్షణమయ్యాయి. నుదురు విశాలమైంది. చూపు వాడైంది. ఆలోచన వేడైంది. నా జీవితమంతా దేశం కోసమే అని అర్థమైంది. ఈ శక్తి ముందు ఎన్ని చిత్రహింసలున్నా లెక్కే లేదు. 1918లో డిగ్రీ పూర్తయింది. నందన్ కనన్‌లో జాతీయ పాఠశాలలో టీచర్‌గా చేరాడు. పిల్లలకు పాఠాలతో పాటు మాతృదేశంపై ప్రేమను రంగరించేవాడు. ఊరంతా... చిట్టగాంగ్ ప్రాంతమంతా కాలినడకన కలియ తిరిగేవాడు. అందరితోనూ కలిసిమెలిసి తిరిగేవాడు. తన భావాల్ని పంచుకునేవాడు. యువతనంతటినీ పోగు చేసుకునేవాడు. అసలైన ఉపాధ్యాయుడు అనిపించుకున్నాడు. అందుకే సూర్యని అంతా ఆప్యాయంగా మాస్టర్‌జీ అనేవారు.
అప్పుడప్పుడే భారత జాతీయోద్యమ యవనికపై గాంధీ ప్రభావం ప్రారంభమవుతోంది. శాంతి, అహింసల ద్వారా ముందుకు సాగాలన్న గాంధీతత్వం యువకులకు నచ్చలేదు. జలియన్ వాలాబాద్ ఉదంతం, సహాయ నిరాకరణోద్యమాన్ని గాంధీ నిలిపివేయడం లాంటివి ఈ యువతను మరింత రెచ్చగొట్టాయి.
సాయుధ సంఘర్షణే మార్గమన్నారు వీరు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ధ్వంసం చేయాలన్నారు.
పాలనావ్యవస్థను అస్తవ్యస్తం చేయాలని పిలుపునిచ్చారు. సాయుధ దాడులే శరణ్యమని నమ్మారు. అప్పుడే పాలకుల్లో గుండె దడ పుడుతుంది. ప్రజల్లో ఆలోచన రేకెత్తి, అది చైతన్యంగా మారుతుంది.
అంతే ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టేశాడు సూర్యసేన్. విప్లవోద్యమానికి పునాదయ్యాడు. కొంతకాలం భారత జాతీయ కాంగ్రెస్ చిట్టగాంగ్ శాఖకు అధ్యక్షుడయ్యాడు. ఆపై హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌కు స్థానిక బాధ్యతలు చేపట్టాడు. యువకులకు రాజకీయ తరగతులు నిర్వహించాడు. వ్యాయామ శిక్షణ, ఆయుధాల ప్రయోగంలో మెళకువలు నేర్పాడు. క్రమంగా సూర్యసేన్ కార్యకలాపాలు బ్రిటిష్ అధికారులకు తెలిసిపోయింది. 1924లో 30 ఏళ్ల సూర్యను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. నాలుగేళ్ల కారాగారవాసం. 1928లో విడుదల. రాటు తేలింది సూర్యసేన్ మనసు.
‘దా’ అంటే స్థానిక బెంగాలీలో అన్నయ్య అని అర్థం. సూర్యసేన్‌ని ప్రజలంతా మాస్టర్ దా అని ఆప్యాయంగా పిలిచేవారు. ప్రతి ఊరునీ, ప్రతి ఇంటినీ, ప్రతి వ్యక్తినీ పలకరించి విప్లవ ప్రబోధం చేసేవాడు సూర్యసేన్. నెత్తురు మండే, శక్తులు నిండే సైనికులుగా యువతీ యువకుల్ని తయారుచేశాడు. ఇదంతా దేనికోసమని ఓసారి ఓ వితంతువు అడిగితే, ‘దేశ సౌభాగ్యం కోసం. అది లేని దుస్థితి ఎలాంటిదో నీకు తెలుసు కదా చెల్లెమ్మా’ అన్నాడు.
1930లో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. అలాంటి మెతకవాద పథంపై సూర్యసేన్‌లాంటి వారికి నమ్మకం లేదు. సామ్రాజ్యవాదులను గట్టిదెబ్బ కొట్టాలని సూర్యసేన్ అనుకున్నాడు. అంబికా చక్రవర్తి, అనంతసింగ్, అనురుప్‌సేన్, నిర్మల్‌సేన్, గణేష్ ఘోష్ లాంటి సహచర వీరులు సరేనన్నారు. ప్రీతిలతా వడేదార్, కల్పనాదత్తా... వెంట వస్తామన్నారు.
ఓ రాత్రిపూట విప్లవకారుల రహస్య సమావేశం జరిగింది. కార్యక్రమాన్ని వివరించాడు సూర్యసేన్. చిట్టగాంగ్‌లోని ప్రభుత్వ కార్యక్రమాన్ని వివరించాడు సూర్యసేన్. చిట్టగాంగ్‌లోని ప్రభుత్వ ఆయుధ గిడ్డంగిని స్వాధీనం చేసుకోవాలి. పోలీస్ బ్యారక్‌పై దాడిచేసి తరిమికొట్టాలి. టెలిగ్రాఫ్ ఆఫీసుని వశం చేసుకోవాలి. రైలు మార్గాల్ని ధ్వంసం చేయాలి. టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌ని నాశనం చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే - బ్రిటిష్ ఇండియా నుండి చిట్టగాంగ్ వేరుపడాలి. విముక్తమవ్వాలి. మనకు ఆయుధాల్లేవు. వాటిని కొల్లగొట్టాలి. వాటితోనే శత్రువుని వెళ్లగొట్టాలి.
ఈ దాడులన్ని ఒక్కటొక్కటిగా ఒకదాని తర్వాత ఒకటిగా కాదు... ఏకకాలంలో మెరుపుల్లా చప్పుళ్లేని ఉరుముల్లా జరగాలి. కనురెప్ప వాలి తేలేలోపు అంతా తేలిపోవాలి. తెల్లారేలోపు నన్ను కన్న నా చిట్టగాంగ్ స్వేచ్ఛావాయువులు పీల్చాలి. కామ్రేడ్స్... అంతా రెడీయేనా అన్నాడు సూర్యసేన్ - కంఠం దగ్గర నాళాల్లో రక్తం జుమ్మని పారుతున్న వేళ!
ఆ రోజు రానే వచ్చింది. 1930 ఏప్రిల్ 18 రాత్రి 10 గంటలకు విప్లవ వీరులంతా త్యాగానికి సిద్ధపడి వచ్చారు. దాడుల అనంతరం తేడా వస్తే బ్రిటిష్‌వారు తాట తీసేస్తారని తెలుసు. అయినా ఆ అరవైమంది యువకులూ పెళ్లికి వచ్చినట్లు వచ్చారు. వారిలో 14 ఏళ్ల కుర్రాడు. ఉగ్గుపాలతో ధైర్యాన్ని, బొడ్డు తాడుకి ఆయుధాన్ని తెంచుకొచ్చాడు. ఆ చిచ్చరపిడుగు - సుబోధ్ రాయ్.
బోనులోంచి ఒక్కసారిగా దుముకిన పులిపిల్లల్లా అందరూ మెరుపు దాడులు చేశారు. అన్నింటినీ ధ్వంసం చేసేశారు. మేజర్ ఫెరోల్, మరో ఇద్దరు సైనికులూ నేలకొరిగారు. హఠాత్పరిణామంతో భీతిల్లిన బ్రిటిష్ సైనికులు పారిపోయారు. దొరికినన్ని ఆయుధాల్ని వీరులు మూటగట్టారు. చిట్టగాంగ్ ఆయుధ భాండాగారంపై దేశమాత చిత్రపటాన్ని ఎగరేశారు. చిట్టగాంగ్ స్వాతంత్య్రాన్ని ప్రకటించారు.
కచ్చితంగా నాలుగు రోజులపాటు సూర్యసేన్ బృందం పాలనలోనే చిట్టగాంగ్ సాగింది. అంతలో బ్రిటిష్ ప్రభుత్వం తేరుకుంది. ఉక్కుపాదంతో అణచి వేసింది. వీరులంతా జలాలాబాద్ కొండల్లోకి పారిపోయారు. వందకు పైగా శత్రు సైనికుల్ని మట్టుపెట్టినా, ఆంగ్ల సైన్యం ముందు వీరు నిలబడకపోయారు. చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు.
సూర్యసేన్ పటియాలోని సావిత్రిదేవి అనే వితంతువు ఇచ్చిన ఆశ్రయాన్ని పొందాడు. ఆపై తిరిగి గ్రామాల్లో తిరిగాడు. ప్రజల హృదయాల్ని దేశభక్తి జ్యోతుల్లా వెలిగించాడు. సూర్యసేన్‌ని బంధించటానికి ప్రభుత్వం నానాపాట్లు పడింది.
మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు సూర్యసేన్. నేత్రసేన్ అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నాడు. కాని ప్రభుత్వం ఇచ్చే పారితోషికానికి కక్కుర్తిపడి గుట్టు విప్పేశాడు నేత్ర. బ్రిటిష్‌వారు సూర్యని బందీ చేశారు. జైల్లో వేశారు. ప్రభుత్వం విచారణ జరిపింది. న్యాయస్థానాలు ఉరిని ఖరారు చేశాయి.
1934 జనవరి 13న ఉరికి అన్నీ సిద్ధం చేశారు. నేరుగా ఉరి తీయకుండా, సూర్యని కుళ్లబొడిచి కసి తీర్చుకుని అప్పుడు ఉరికంబం ఎక్కించారు. మృత్యు ఒడిలో కూడా సాహసిగా నిలిచిన సూర్యసేన్ చెప్పిందొక్కటే.
‘‘సోదరులారా! లేవండి. మన మాతృదేశ దుస్థితిని చూడండి. చలించండి. మీ గుండెల్లో దేశద్రోహులపై పగ పెంచుకోండి. ప్రతీకార జ్వాల రగిలించండి. నిన్ను కన్న నేల గురించి నువ్వు ఆలోచించడం లేదంటే... రెండు కాళ్ల జంతువుగా మారావన్నమాట. ఆనాడు చిట్టగాంగ్ ప్రకృతి నాకు బోధించిన తత్వమిదే’’
సౌజన్యం: సాక్షి దిన పత్రిక
భారతాంబ దాస్య విముక్తి సమరంలో రాలిన మరో మొగ్గ - 'మాస్టర్ దా' సూర్యసేన్
Reviewed by JAGARANA
on
9:59 AM
Rating:

Post Comment
No comments: