Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

మాతృమూర్తి పాదాల ముందర జ్వలించిన చైతన్య జ్వాల - ప్రీతిలతా వడేదార్

ప్రీతిలత వాడేకర్ 
ఒక్క సినిమాలో నటిస్తే చాలు... ఆ హీరోయిన్‌కి ఎంత పేరొస్తుందో! పక్కపక్కనే అభిమానుల కోలాహలం. ఆపైన పూలవర్షం. ఆమె నడిస్తే న్యూసు. కాలు బెణికితే బ్రేకింగ్ న్యూసు. ఇంతకూ ఆమె చేసిందల్లా తనకోసం కష్టపడటం. కాని సంపాదన, సంసారం, సంతానం జీవిత లక్ష్యం కాకుండా ప్రాణాల్ని తృణప్రాయంగా దేశం కోసం, సంఘం కోసం అర్పించినవారు అసలైన స్ఫూర్తి ప్రదాతలు. అలాంటి చైతన్యజ్యోతి - ప్రీతిలత వడేదార్. 21 ఏళ్లకే మరణించిన ప్రీతిలత... మొగ్గగానే రాలిపోయిన లతిక!



‘కుక్కలకు, భారతీయులకు ఇక్కడ ప్రవేశం లేదు’ - ఆ బోర్డుకి పది అడుగుల దూరంలో ఉంది ప్రీతిలత. రాత్రి పదయింది. కారు చీకటి. ఆ అక్షరాలు అగ్నిపర్వతాల్లా భగభగమంటున్నాయి. ఆమె వెనుక పదిమంది. అందరి చేతుల్లోనూ బాంబులు, తుపాకులు, కత్తులు. వారిలో సగం మంది అమ్మాయిలే. మెడలో బంగారు గొలుసుల్లేవు. పొటాషియం సైనైడ్ లాకెట్లు వేళ్లాడుతున్నాయి. ఆ విప్లవ యోధులంతా వేటాడే పులుల్లా ఉన్నారు.
మొదటిసారి ఆ బోర్డుని చూసినప్పుడు ప్రీతి ఒంట్లోని కణకణమూ నిప్పు కణికైంది. నరాల్లోని రక్తం లావాలా ఉబికింది. ఇక్కడి సంస్కృతిని నాశనం చేసి, హిందూ-ముస్లిం ఐక్యతను కూల దోసి, ప్రాంతాలుగా, మతాలుగా, కులాలుగా భారతీయ సమాజాన్ని విడ దీసి, ప్రజల్ని బానిసల్ని చేసి, పీల్చి పిప్పి చేసిన తెల్లదొరల అమానుషాన్ని, అహంకారాన్ని సహించలేకపోయింది.



వారికి భారతీయుల శక్తి ఏమిటో రుచి చూపాలనుకుంది. అందుకే హింసాత్మక తీవ్రవాదం వైపు మొగ్గింది. ఆయుధం పట్టింది. ఇదిగో ఇప్పుడీ దాడికి నాయకురాలైంది.



ఆ బోర్డు ఉన్నది ఓ రైల్వే ఆఫీసర్స్ క్లబ్ ముందు. చుట్టూ చిమ్మ చీకటి. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. కీచురాళ్లు మూలుగుతున్నాయి. పొదల్లో దాక్కుని ఉన్నారు సాయుధులైన ఆ వీరులంతా.



క్లబ్ లోపల ఉన్నది పదుల మంది ఆంగ్లేయులు. శనివారం కావడంతో వారాంతాన్ని సుఖంగా అనుభవిస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. ఆడ, మగ తేడా లేకుండా మత్తు అందర్నీ చిత్తు చేస్తోంది. వాలిన కళ్లతో, నిషా ఎక్కిన ఒళ్లుతో తూగి, ఊగి, సోలిపోతున్నారు. వారంతా ఆంగ్ల అధికారులే. సైనికోద్యో గులు కూడా ఉన్నారు. అంతటి దిగజారుడుతనంలో నిజంగానే భారతీయ సంస్కారులకు ప్రవేశం లేదు!



ప్రీతిలత తనవారిని అప్రమత్తం చేసింది. క్లబ్‌నంతటినీ చుట్టుముట్టేశా రంతా. బాంబులు వేశారు, కాల్పులు జరిపారు. క్షణకాలం లోపలి వారికేమీ అర్థం కాలేదు. అంతలోనే తేరుకుని వారు కూడా కాల్పులు జరిపారు. తామున్నది పదిమంది. వారున్నది వందమంది. పరిస్థితి అర్థమైపోయింది ప్రీతికి. తన అనుచరుల్ని పారిపొమ్మని ఆదేశించింది.



తాను ఒంటరిగా కాల్పులు జరిపింది. గంటసేపు హోరాహోరీ పోరాడింది. చివరకు బ్రిటిష్ సైనికులకు చిక్కింది. చుట్టూ ఎనిమిది మంది సైనికులు చేరి ఆమెపై తుపాకీలు ఎక్కుపెట్టారు. విడిపించుకునే పరిస్థితి లేదు. దొరికిపోయి జైలుపాలై బానిస అవ్వాలా? పారిపోవాలా? అర్థం కాలేదు ఒక్క నిమిషం ప్రీతికి.
21 ఏళ్ల వయసు అమ్మాయిలో ఇంతటి దేశభక్తా? సాహసమా? ఉద్యోగమో, పెళ్లో చేసుకుని బతికేయక దేశం కోసం ఇంతలా పోరాడటమా?
అసలామె గతమేమిటి? మనోగతమేమిటి?



చుట్టూ కొండలతో, గుట్టలతో, దట్టమైన చెట్లతో, గుబురులతో ఉండే ప్రాంతం - చిట్టగాంగ్. ఆనాటి అఖండ భారతావనిలో బెంగాల్ రాష్ట్రంలోనిది చిట్టగాంగ్. నేటి బంగ్లాదేశ్‌లోని అపురూప స్థలమిది. స్వాతంత్య్ర సమర కాలంలో వీరయోధులకు పురుటిగడ్డ అది.



అలాంటి చోట 1911 మే 5న జన్మించింది ప్రీతిలత - ధాల్‌ఘాట్ గ్రామంలో. తండ్రి జగబందు వడేదార్ మున్సిపల్ ఆఫీసులో గుమస్తా. దేశభక్తుడు. విదేశీ వస్త్రాల్ని బహిష్కరించినవాడు. అమ్మ ప్రతిభామాయి దేవి ఇంటి పనులు చూసుకునేది. నలుగురు పిల్లల్లో పెద్దది ప్రీతి. కర్ణపులి నది ఒడ్డున పచ్చపచ్చని ప్రకృతి ఒడిలో ఆమె బాల్యం సాగింది.



స్థానిక కస్తగిరి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఆమె చదువు మొదలైంది. అక్కడ 8వ తరగతిలో ఉన్నప్పుడే తొలిసారి సూర్యసేన్‌ని చూసింది. అతగాడికి అప్పటికి 30 ఏళ్లు. యవ్వనంలో ఉన్నప్పుడు, ఆలోచనలు ఘనీభవిస్తున్నప్పుడు బెంగాల్ విభజన, వందేమాతరం ఉద్యమాల్ని కళ్లారా చూశాడు. గాంధీజీ అహింసావాదంతో బ్రిటిషర్ల దాష్టీకాల్ని ఆపలేమని సూర్య సేన్ అనుకున్నాడు. అతివాదుల ఆలోచనలు విన్నాడు. విప్లవాత్మక హింసావాదమే శరణ్యమని నమ్మాడు. సమరం మొదలెట్టాడు.



ఊరూరా తిరిగి అందరినీ పోగేసి, సమరశీల జాతీయవాదాన్ని చెప్పేవాడు. ఓసారి ధాల్‌ఘాట్‌లో సూర్యసేన్ ఉపన్యసించాడు. అప్పుడే 13 ఏళ్ల ప్రీతిలతకు దేశభక్తి గుండెల్నిండా నిండుకుంది.



ప్రీతిలత చదువులో, ఆటల్లో అన్నింటిలోనూ చాలా చురుగ్గా, మెరుగ్గా ఉండేది. స్కౌట్స్‌లో ముందుండేది. మరోపక్క స్వాతంత్య్ర పోరాటం గురించి తెలుసుకుంటూ ఉండేది. 



ఢాకా విశ్వవిద్యాలయ పరిధిలో ఈడెన్ కాలేజీలో చేరింది. అప్పట్లో చిట్టగాంగ్ ఓ ప్రధాన విప్లవ కేంద్రం. గుళ్లు, బళ్లు, వ్యాయామ కేంద్రాలు, క్రీడాస్థలాలు... ఒక్కటేమిటి, అన్నీ విప్లవకారుల్ని తయారుచేసే ఫ్యాక్టరీలయ్యాయి. ఆ వాతావరణం ప్రీతిని తీవ్రంగా ప్రభావితం చేసింది.



స్థానిక స్త్రీ చైతన్య సంఘాలతో కలిసి పనిచేసేది. తీవ్రవాద నేతలతో రహస్య మంతనాలు జరిపేది. అలాగని పుస్తకాల్ని విసిరి పారేయలేదు. యూనివర్సిటీ స్థాయిలో ఫస్టొచ్చింది. 1929లో ఇంటర్ పూర్తయ్యాక, కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరాలనుకుంది. ప్రవేశ పరీక్షలు రాసింది. 1930లో బీఏ ఫిలాసఫీ కోర్సులో కలకత్తాలోని బెథూన్ కాలేజీలో చేరింది.



విప్లవాత్మక కార్యక్రమాల్లో ఆమె నేరుగా పాల్గొనడం మొదలైంది ఇక్కడే. బ్రిటిష్‌వారిని భారతదేశం నుంచి తరిమికొట్టాలన్న ప్రగాఢ కాంక్ష ఆమెకి బలీయమైంది ఇప్పుడే. తన కన్న, చదువుల కన్న దేశం మిన్న అని ఆమెకు అనిపించింది అప్పుడే!




కలకత్తాలోని అలీపూర్ జైల్లో రామకృష్ణ బిశ్వాస్ అనే విప్లవకారుడు ఉండేవాడు. 20 ఏళ్ల యువకుడు. బ్రిటిష్ అధికార్లను ఎదిరించిన వీరుడు. జైలు గోడల మధ్య పుస్తకాలు చదువుకుంటూ ఉరిశిక్ష కోసం ఎదురుచూసిన భరతమాత బిడ్డడు - బిశ్వాస్. అతన్ని కలుసుకునేందుకు జైలుకి వెళ్లింది ప్రీతి. అతని చెల్లెల్నంటూ అబద్ధమాడింది. మారుపేర్లతో, వేర్వేరు వేషాలతో రోజు విడిచి రోజు ములాకత్ పొంది అతన్ని కలిసేది. అలా ఏకంగా నలభైసార్లు సమావేశమైంది. ప్రాణం పోయినా పర్వాలేదు, దేశం బాగుపడితే చాలనుకుంది. ఆమెలో నిద్రాణంగా ఉన్న శక్తి ఉబికి వచ్చింది అతని మాటల వల్ల!



ఈ విషయం బ్రిటిష్ అధికారులకు చూచాయిగా తెలిసింది. ప్రీతిపై నిఘా పెట్టింది ప్రభుత్వం. ఆమె తీవ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నట్లు ఆధారాలు సేకరించింది. దాంతో ప్రీతి డిగ్రీ పరీక్షలు రాసినా ఫలితాల్ని మాత్రం నిలిపి వేసింది పరాయి సర్కారు.



అంతలో తండ్రి రిటైరయ్యాడు. చిట్టగాంగ్ వెళ్లిపోయింది. కుటుంబ భారం ప్రీతిపై పడింది. అపర్ణ చరణ్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా చేరింది.



అయినా మనసంతా దేశ స్వాతంత్య్రం మీదనే. అందుకనే రహస్యంగా తీవ్రవాద కార్యకలాపాల్లోనూ పాల్గొనేది. తనకు దేశంపై ప్రేమ కలిగేలా చేసిన సూర్యసేన్‌ని కలుసుకుంటూ ఉండేది. అంతేకాదు సూర్యసేన్ బృందంలో చేరింది. అప్పటికే నాలుగేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించిన సూర్యసేన్ సూర్యగోళంలా మండిపోతూండేవాడు.
దీపావళి సంఘ్ నిర్వహించే లాఠీ, తుపాకీ, కత్తి తదితరాలలో శిక్షణ పొందింది ప్రీతి. నిర్మల్‌సేన్ అనే వీరుడు ఆమెకు తర్ఫీదు నిచ్చాడు. 1932 జూన్13న ధనఘాట్‌లో సావిత్రీదేవి అనే దేశ భక్తురాలి ఇంటిలో సూర్యసేన్ బృందం సమావేశమైంది. సూర్యసేన్, అపూర్వసేన్, నిర్మల్‌సేన్, అంబికా చక్రవర్తి, గణేశ్ ఘోష్ తదితరులతో పాటు ప్రీతి కూడా హాజరైంది.



లోపల సమావేశం జరుగుతూండగా హఠాత్తుగా బ్రిటిష్ సైన్యం కాల్పులు జరిపింది. కెప్టెన్ కామ్‌రూన్ నేతృత్వంలోని ఆంగ్ల బలగం గుళ్ల వర్షం కురిపించింది. లోపలి వీరులకు పోరాటం తప్ప మార్గం లేదు. విప్లవకారులు ఆయుధాలందుకున్నారు. కేవలం శిక్షణ మాత్రమే పొందిన ప్రీతి ఇంకా దాడుల్లో పాల్గొనలేదు. ఇప్పుడేమో హఠాత్తుగా తెల్లవారు మీమీదికొచ్చేస్తున్నారు. ఏదైతే అది అవుతుందని ప్రాణాలకు తెగించి కాల్చింది. మిగిలిన యోధులంతా బాంబులు వేస్తూ, బుల్లెట్లు పేలుస్తూ చెల్లా చెదురైపోయారు.



ఆ దాడిలో కెప్టెన్ కామ్‌రూన్‌తో పాటు అపూర్వసేన్, నిర్మల్‌సేన్‌లు మరణించారు. తనకు సైనిక శిక్షణ ఇచ్చిన గురువు నిర్మల్‌సేన్ బ్రిటిష్ సైన్యానికి బలి కావటం ప్రీతిని తీవ్రంగా కలచివేసింది. సూర్యసేన్, ప్రీతి తప్పించుకుని కాటాని గ్రామానికి వెళ్లిపోయారు.



ఆ పోరాటం తర్వాత ప్రీతిలతపై సూర్యసేన్‌కు నమ్మకమొచ్చింది. రైల్వే ఆఫీసర్స్ క్లబ్‌పై జరిపే దాడికి ఆమెనే నేతృత్వం వహించమన్నాడు. 1932 సెప్టెంబర్ 23న ఆమె బృందం క్లబ్‌పై దాడి చేసింది. భారతీయుల్ని కుక్కలతో పోల్చిన ఆంగ్లేయుల కండకావరాన్ని తన తుపాకీ కాల్పులతో సరిచేయాలనుకుంది.
చివరకు వారికి దొరికిపోక తప్పలేదు. అయినా ఆమె కంగారు పడలేదు. బాధపడలేదు. బ్రిటిష్ అధికార్లకు లొంగిపోయి, బానిస బతుకు బతకడం కన్నా చావడం మేలనుకుంది. మెడలోని సైనైడ్ లాకెట్‌ని మింగేసింది. భరతమాత ఒడిలో కన్నుమూసింది.







ప్రీతిలత వడేదార్ మరణించిన 80 ఏళ్లకు కలకత్తా విశ్వవిద్యాలయం డిగ్రీ పట్టాని ప్రధానం చేసింది. అప్పట్లో ఆమె ఫలితాల్ని రాజద్రోహానికి పాల్పడుతున్నదన్న ఆరోపణలతో బ్రిటిష్ ప్రభుత్వం నిలుపు చేసింది. ప్రీతిలతకు ప్రాణ స్నేహితురాలు కల్పనాదత్తా. తిరుగుబాటుపై అషుతోష్ గోవర్కర్ రూపొందించిన ‘ఖేలే హమ్ జీ జాన్‌సే’ చిత్రంలో ప్రీతి పాత్రను విశాఖ సింగ్, కల్పన పాత్రను దీపికా పదుకొనే పోషించారు.

-ఆకెళ్ల రాఘవేంద్ర ( రచయిత )

సాక్షి సౌజన్యంతో 
మాతృమూర్తి పాదాల ముందర జ్వలించిన చైతన్య జ్వాల - ప్రీతిలతా వడేదార్ Reviewed by JAGARANA on 5:50 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.