Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

సముచిత నిర్ణయం గోవధ నిషేధం


దళిత వర్గాల ప్రతినిధులం అని చెప్పుకునే వారు మహారాష్ట్రలో ఆవు, ఎద్దుల వధపై నిషేధాన్ని నిరసిస్తూ ఇటీవల కోల్ కతాలో "బీఫ్ ఫెస్టివల్" జరుపుకున్నారు. ఎద్దు మాంసాన్ని విపరీతంగా ఎగుమతి చేసే బ్రెజిల్ దేశానికి పట్టిన గతి గురించి వీరికి తెలియదు. 

భారతదేశంలో గోవును తల్లిగా పూజిస్తారు. గో జాతికే చెందిన గేదె, ఎద్దు వంటి వాటిని ఆదరభావంతో చూస్తారు. పండుగలు వచ్చినప్పుడు, శుభకార్యాలలో వాటికి పూజలు చేయడం, ప్రత్యేక అలంకారాలు చేయడం కూడా మనదేశంలో ఒక తరతరాలుగా వస్తూన్న ఒక ఆనవాయితీ. అటువంటిది మనదేశంలోనే అడ్డూ అదుపూ లేకుండా సాగే గో జాతికి చెందిన పశువుల వధ మనందరికీ తీవ్ర మనస్తాపాన్ని కలిగించేదే. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం గోవధను నిషేధించడం మనందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం.

అయితే మనదేశంలో గోవు కేవలం భక్తివిశ్వాసాలకు మాత్రమే పరిమితమైనదా? అంతకు మించిన ప్రయోజనం వాటివల్ల ఏం లేదా? పూజలందుకోవడం మాత్రమే కాకుండా మన సమాజ ఆర్ధిక వికాసానికి ఆవులు, ఇతర గో జాతికి చెందిన పశువులు ఏ విధంగా దోహదం చేస్తున్నాయి? వాటిని వధించడం వల్ల మన ఆర్ధిక వికాసానికి ఎటువంటి కోలుకోలేని దెబ్బ తగులుతోంది? ఇవన్నీ ఒకసారి పరిశీలిద్దాం.

అడ్డూ అదుపూ లేకుండా మనదేశంలో గోవు లేదా గో జాతికి చెందిన పశువుల వధ కొనసాగుతోంది. వీటి మాంసాన్ని పెద్ద మొత్తంలో విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇది మన ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది. దీనివల్ల మన పర్యావరణానికి కూడా విఘాతం కలుగుతోంది. 

ఎద్దు మాంసాన్ని తినేవారి సంఖ్య పెరగడం వల్ల కలిగే దుష్పరిణామాలలో పచ్చని భూములు ఎడారులుగా మారిపోవడం కూడా ఒకటి. ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు. కానీ అమెజాన్, బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలను గమనిస్తే అక్కడ ఎద్దు మాంసాన్ని ఎగుమతి చేయడం ద్వారా అధిక మొత్తంలో డబ్బు సంపాదించడంపై వ్యామోహం పెరగడం వల్ల ఆ దేశాలలో దట్టమైన అడవులన్నీ ఎడారులుగా మారిపోవడం ఒక వాస్తవం.

1970-80 లలో బ్రెజిల్, దక్షిణ అమెరికాలోని కోస్టారికా, ఆర్జెంటినా, హోండ్యురస్ వంటి దేశాలు ఆవులు మొదలైన పశువులు బలిష్టంగా పెరగడానికి కావలసిన పశువుల దాణా పెంచడానికి లక్షల కొద్దీ ఎకరాలలో వ్యాపించిన అడవులను నిర్మూలించేరు. పుష్కలంగా మేత మేసి బాగా బలిసిన పశువుల మాంసాన్ని ఉత్తర అమెరికాకి ఎగుమతి చేసి బాగా లాభాలు గడించవచ్చని వారి ఆలోచన. అలా బాగా బలిసిన పశువులను వధించడానికి వధశాలలు, వాటి మాంసాన్ని నిల్వ ఉంచడానికి, ఇతర అవసరాలకి కావలసిన పెద్ద పెద్ద నిర్మాణాల కోసం ఎన్నో లక్షల ఎకరాల అడవులను నిర్మూలించారు. ఇలా చేసిన మొదటి మూడు నాలుగు సంవత్సరాలలో వారికి రాబడి బాగానే వచ్చింది. కానీ తరువాతి సంవత్సరాలలో పరిస్థితి మొత్తం ప్రకృతి చేతుల్లోకి వెళ్ళిపోయింది. విస్తారమైన అడవులను నరికివేయడం వల్ల వర్షాలు కురవడం బాగా తగ్గిపోయింది. ఒకవేళ భారీగా వర్షాలు కురిసినా అడ్డూ అదుపూ లేని వరదల వల్ల మిగిలిన కొద్ది శాతం అడవులు కూడా నాశనమయ్యాయి. వర్షాభావం వల్ల పశువుల దాణా దిగుబడి తగ్గిపోవడమో లేదా వరదల వల్ల పశువుల దాణా నీట మునిగిపోవడమో జరిగి అక్కడి రైతులకు, పశు పోశకులకు విపరీతమైన నష్టాలు వాటిల్లాయి. ఒక దేశ ఆర్ధిక వ్యవస్థపై పశువుల దాణా పెంపకం కూడా పరోక్షమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీనిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. 

పశువుల దాణా పెంచడం కోసం, వాటి వధ్యశాలలు నిర్మించడం కోసం పెద్ద మొత్తంలో భూములు ఏ కొద్ది మంది ఆధీనంలోకో వెళ్ళిపోవడం వల్ల ఎంతోమంది సామానులు తమ స్వంత ఆస్తులను కోల్పోవలసి వచ్చింది. లక్షల మంది బ్రతుకు తెరువు కోసం నగరాలపై పడవలసి వచ్చింది. ఇది సామాజిక జీవనంలోని సమతౌల్యాన్ని దెబ్బతీయడమే. 

బ్రెజిల్ గురించి ఐక్య రాజ్య సమితి అందించిన నివేదిక వివరాలు ఇలా ఉన్నాయి. బ్రెజిల్ వైశాల్యంలో భారతదేశం కన్నా పెద్దది. ఈ దేశంలో పర్యావరణానికి సంబంధించి తీసిన శాటిలైట్ ఫోటోలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటపెట్టాయి. ఆదేశంలో విస్తారమైన అటవీ భూములు నిస్సారంగా తయారౌతున్నాయి. తరచుగా వచ్చే వరదల తాకిడి, గాలిలో తేమ శాతం తగ్గిపోవడం ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను బాగా దెబ్బతీస్తున్నాయి. దీనికి కారణం పశు మాంస పరిశ్రమల వల్ల ఆ దేశంలో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే. 

ఐక్య రాజ్య సమితి చేసిన హెచ్చరికలను అనుసరించి దక్షిణ అమెరికా ప్రభుత్వం అక్కడ ధన సంపాదనకై ఏర్పాటు చేయబడ్డ పశువద శాలలను మూసివేయించింది.

పశువధ నిషేధం గురించి మాట్లాడితే మన దేశంలోని వామపక్ష మేధావులు ఎక్కడలేని ఏడుపులు, పెడబొబ్బలు మొదలుపెడతారు. అలా చేస్తే ఫార్మశీ పరిశ్రమలలో కొన్ని ఔషధాల తయారీకి పశువుల ఎముకల నుండి లభ్యమయ్యే ఒక పదార్ధం దొరకదని వారి వాదన. "సహజంగా మరణించిన పశువుల ఎముకల నుండి ఈ పదార్థాన్ని సేకరించవచ్చు కదా" అంటే వీరు ఒప్పుకోరు. "వట్టిపోయిన ఆవులు, ఇతర పశువులను కబేళాలకు తరలించి వధిస్తే నష్టమేంటి?" అని అడిగేవారున్నారు. ఆవులు, గేదెలు పాలు ఇవ్వడానికి, ఎద్దులు బళ్ళు తోలడానికి, పొలాల సేద్యం చేయడానికి మాత్రమే పనికొస్తాయా? అవి శక్తి ఉడిగి ముసలివైపోతే కబేళాలలో వధించడానికి తప్ప మరెందుకూ పనికిరావా? 

భూగర్భంలోంచి వెలికి తీసిన పెట్రో ఉత్పత్తులు, బొగ్గుల వినిమయంతో ఇప్పటిదాకా ఈ ప్రపంచం నడుస్తోంది. ఇవి పూరించడానికి వీలులేని వనరులు. అంటే ఇవి పూర్తిగా తరిగిపోతే వీటిని మళ్ళీ తేలేం. అధిక వినిమయం వల్ల ఈ వనరులు అత్యంత వేగంగా తరిగిపోతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి పలు దేశాల ప్రభుత్వాలు వీటి వినిమయంపై 50 శాతం కోత విధించాల్సి వస్తుందని వారు అంటున్నారు. మరో ప్రక్క పంటలు త్వరగా, బాగా పండటానికి వాడుతున్న కృత్రిమ రసాయన ఎరువులు భూసారాన్ని తగ్గిస్తున్నాయి. భూతలాన్ని కలుషితం చేస్తున్నాయి. వట్టిపోయిన ఆవులు, ఇతర పశువుల వల్ల ఏమీ ఉపయోగం లేదనుకునేవారు ఒక విషయం గమనించాలి. అవి విసర్జించే పేడ, మూత్రము సహజ ఎరువులు. వీటి వల్ల భూమి ఏవిధంగానూ కలుషితం కాదు సరికదా భూసారం పెరుగుతుంది కూడా. అంతేకాదు, ఆవు ఇతర పశువుల పేడ నుంచి బయోగ్యాస్ తయారుచేయ్యవచ్చు కూడా. అందువల్ల శక్తి ఉడిగి, ముసలివైపోయిన పశువులను పనికిరానివిగా చూడరాదు. వాటిని సరైన రీతిలో వినియోగించుకుంటే మన పర్యావరణం దెబ్బతినకుండానే ఆర్ధిక ప్రగతి సాధించవచ్చును. 

"ఆవులు మొదైలైన గో జాతి పశువులను వధించడం వలన దేశానికి ఆర్ధిక వ్యవస్థకు కలిగే నష్టమేమిటి?" అని అడిగేవారున్నారు. మరి ప్రభుత్వం వన్య మృగ సంరక్షణ కోసం, తాబేళ్ళ సంరక్షణ కోసం కొట్లలో ధనం వెచ్చించటంలేదా? పులులను చంపిన వాళ్ళని, నెమళ్ళని, జింకలని చంపి వండుకు తిన్నవాళ్ళని నేరస్థుస్తులుగా పరిగణించి శిక్షలు విధిస్తున్నామే. మరి గోవులను వధించడం ఎందుకు నేరం కాదు? ఇది విశ్వాసాలకు సంబంధించినదిగా కాక పశు సంరక్షణ పరంగా ఎందుకు ఆలోచించరు? 

ఇక విశ్వాసాలు, భావోద్వేగాల విషయానికి వస్తే భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో పలు దేశాలలో జంతువుల విషయంలో వారి వారి భావోద్వేగాలు ప్రస్పుటించడం మన చూడవచ్చు. ఐరోపాలో గాని, అమెరికాలో గాని కుక్కలని చంపి వాటి మాంసంతో వంటకాలు చేయడం గురించి లేదా వాటి సంఖ్యను నియంత్రించడం గురించి ఎక్కడైనా ప్రస్తావిస్తే చాలు శునక ప్రేమికుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయి. మీడియాలో దీనిపై వాడి వేడి చర్చలు కూడా జరుగుతాయి. 

కాబట్టి ఏ దేశమైనా సరే వారి వారి మత విశ్వాసాలను, భావోద్వేగాలను గౌరవించుకోవాలి. అది గోవుల విషయమైనా, కుక్కలు, కుందేళ్ళు లేదా మరే జంతువుల విషయమైనా సరే. మరి మనదేశంలో గోవధ నిషేధించాలనడం అవివేకంగా, పాతకాలపు చాదస్తంగా ఎందుకు చూడాలి? 

"మనదేశంలో మైనారిటీ మతస్థులు గోవు లేదా ఎద్దు మాంసం తింటారుగా. వారి సంగతి ఏమిటి?" అని ప్రశ్నించేవారు ఉన్నారు. మనదేశంలో మైనారిటీ మతాలకు చెందినవారు కొందరు తరచుగా ఎద్దు మాంసాన్ని భుజిస్తారు. వారిలో ఎక్కువ మంది కసాయి వారే. మతము లేదా వృత్తి రీత్యా వారి ఆహార ప్రాధాన్యతను త్రోసిపుచ్చలేం. ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని తెలుసుకోవలసి ఉంది. మనదేశంలో మతపరంగానే గాక రాజశాసనాలలో కూడా వేల సంవత్సరాలుగా గోవధ నిషేధింపబడుతూనే ఉంది. అశోకుని నుండి అక్బర్ వరకు గల చారిత్రిక ఆధారాలు మనదేశంలో ఆవులను, ఇతర గో జాతికి చెందిన పశువులను వధించడాన్ని నిషేధించినట్లు తెలుపుతున్నాయి. బ్రిటిష్ పాలకులపై జరిగిన 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ జారీ చేసిన మొట్టమొదటి ఫర్మానా గొహత్యా నిషేధానికి సంబంధించినదే. 

భారతదేశంలో మతవిశ్వాసాలతో సంబంధం లేకుండా అందరు పాలకులూ గోహత్యను నిషేధించారన్నది చారిత్రిక వాస్తవం. అయితే ఈ వాస్తవాన్ని బ్రిటిష్ వారు దాచిపెట్టేసేరు. హిందూముస్లింల మధ్య గొడవలు పెట్టి అధికారంలోకి రావాలన్నదే వారి ఆలోచన కదా. పోర్చుగీసు వారి నుండి బ్రిటిష్ వారి వరకు మన దేశాన్ని ఆక్రమించుకున్న ఐరోపా దేశీయులు ఎద్దు మాంసాన్ని ఎక్కువగా తింటారు. భారత్ పై పాలనాధికారాన్ని చేజిక్కించుకున్న బ్రిటిష్ వారు గొహత్యా నిషేధాన్ని ఎత్తివేసి గోవు లేదా ఎద్దు మాంసాన్ని భుజించడం మైనారిటీ మతస్థుల అభీష్టంగా ప్రచారం చేసేరు. 

"ఇక గోవధ నిషేధం గోమాంసం భుజించేవారి ప్రాధమిక హక్కును కాలరాయడమే కదా?" అని వాదించేవారు ఉన్నారు. ఇది అర్థం లేని వాదన. గోరక్షణ అన్నది మనదేశంలోని అధిక శాతం ప్రజల మనోభావాలకు సంబంధించినది. ఎందుకంటే ఇప్పటికీ అధిక శాతం కుటుంబాలలో గోవు ఒక భాగస్వామి కూడా. వారి మనోభావాలను గౌరవించడం అందరి కనీస కర్తవ్యం.

మత విశ్వాసాల విషయానికి వస్తే ముస్లింల మనోభావాలు దెబ్బ తింటాయని సాల్మన్ రష్దీ వ్రాసిన "సాటానిక్ వర్సెస్", తస్లీమా నస్రీన్ వ్రాసిన "లజ్జా" పుస్తకాలను మన ప్రభుత్వాలు నిషేధించాయి. గత 60 ఏళ్ళలో కేవలం ముస్లింలను సంతృప్తి పరచడానికి కేంద్ర సెన్సార్ బోర్డు ఎన్నో సినిమాలను నిషేధించింది. మరి హిందువుల మనోభావాలను, వారి సంస్కృతీవిశ్వాసాలను గౌరవించనక్కర్లేదా?  హిందువులు మనుషులు కారా? 

గోవధ నిషేధం అన్నది కేవలం ప్రజల మతవిశ్వాసాలకు సంబంధించిన అంశంగానే మన ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కానీ దేశ ఆర్ధిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ కూడా గో సంరక్షణతో ముడిపడి ఉన్నాయి. హిందూ తత్త్వచింతన మాత్రమే ఈ విషయంలో సమగ్రమైన దృక్పథాన్ని ఆవిష్కరించింది. మతపరంగానే గాక ఆర్థికపరంగా, పర్యావరణపరంగా కూడా గోసంతతి మనకు శ్రేయోదాయకమన్నది అనాదిగా వస్తూన్న మన చారిత్రిక వాస్తవం. 

(ఇది శ్రీ బల్బీర్ పుంజ్ వ్రాసిన వ్యాసానికి అనువాదం. ఏప్రిల్ 4, 2015 నాటి ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికలో ప్రచురితమయ్యింది. శ్రీ పుంజ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు.)

సముచిత నిర్ణయం గోవధ నిషేధం Reviewed by rajakishor on 7:13 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.