నేతాజీపై నిఘా ఎందుకు?
ప్రొ. ముదిగొండ శివప్రసాద్, ఏప్రిల్ 25, 2015
మహాత్మాగాంధీ 1942లో బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
మొదలుపెట్టారు. అది దేశంలోని వివి ధ ప్రాంతాలకు వ్యాపించింది. ఐతే 1944
నాటికి ఉద్యమ తీవ్రత తగ్గిపోయింది. ఆ దశలో నేతాజీ సుభాష్ చంద్రబోస్
బెర్లిన్ వెళ్లి అడాల్ఫ్ హిట్లర్‌ను కలిశారు. మర్యాద పూర్వక సంభాషణలు
ముగిశాక నేతాజీ తాను వచ్చిన పని చెప్పారు. "ప్రస్తుతం గాంధీ ఉద్యమం
సన్నగిల్లింది. బ్రిటీషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏ దేశాలు నాకు
సహాయం చేస్తాయో వాటినన్నింటినీ ఒకే తాటిమీదికి తీసుకురావాలని
ప్రయత్నిస్తున్నాను. అందుకై మీరు నాకు సహాయం చేయండి. మీ సైన్యాన్ని ధనాన్ని
ఇవ్వండి. వారిని నా ఇండియన్ నేషనల్‌ఆర్మీతో కలిపి పోరాటం సాగిస్తాను.
‘‘స్వాతంత్య్రం వచ్చిన వెంటనే వడ్డీతో సహా మీ డబ్బు మీ సేవలు మీకు
అప్పగిస్తాను’’ అన్నారు నేతాజీ.
అందుకు హిట్లర్ అంగీకరించలేదు. ‘మీ దేశంలో సంస్థానాధిపతులు బ్రిటీషు పాలనే
బాగుంది- అని లండన్‌కు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మద్రాసులో జస్టిస్
పార్టీ బ్రిటీషువారే భారతదేశాన్ని పాలించాలి అని వాదిస్తున్నారు. ఇలాంటి
దశలో నా సైన్యాన్ని నేను దుర్వినియోగపరచుకోలేను’ అని నిర్మొహమాటంగా హిట్లర్
సమాధానం ఇచ్చారు. ఐతే నేతాజీ తన పట్టు వీడలేదు. వివిధ ప్రాంతాలు
పర్యిటించి బ్రిటీషు వ్యతిరేక శక్తులనన్నింటినీ సంఘటితం చేస్తున్నారు.
ఇంతలో 1945 ఆగస్టు 23వ తేదీ తైవాన్‌లోని తాయ్‌పే విమానాశ్రయంలో ఒక విమానం
కూలిపోయిందనే వార్త వచ్చింది. అందులో నేతాజీ ఉన్నారని ఒక పత్రిక
ప్రచురించింది. ఈ వార్త భారతీయులను దిగ్భ్రాంతులను చేసింది. నేతాజీ కుటుంబ
సభ్యులు కలకత్తాలో నేతాజీకి దశదినకర్మ మొదలుపెట్టారు. వెంటనే మహాత్మాగాంధీ
జోక్యంచేసుకొని వారించారు. ఎందుకని?? నేతాజీ చనిపోలేదని గాంధీగారి వద్ద
ఏమైనా సమాచారం ఉందా??
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెసువారు సుగతరాయ్ చేత నేతాజీ మిస్టరీపై
ఒక గ్రంథం వ్రాయించారు. అందులో తాయ్‌పే విమాన ప్రమాదాంశం వివరాలున్నాయి.
అలాగే నేతాజీ అదృశ్యంపై కొన్ని కమిషన్లను ఏర్పాటు చేశారు. ఖోస్లా కమిషన్
ముఖర్జీ కమిషన్, షానవాజ్ కమిషన్, వాజపేయిగారు నియమించిన మరొక కమిటీ. అవి
తమతమ నివేదికలు సమర్పించాయి. ఐతే ఇందులో తాయ్‌పే విమానాశ్రయానికి
షానవాజ్‌ఖాన్ కాని, ముఖర్జీగారు కాని వెళ్లకుండానే నివేదికలు సమర్పించారు.
కారణం, చాంద్, కైషేక్ దేశానికి వెళ్తే చైనాకు కోపం వస్తుందని భావించారు.
1952లో తొలిసారి నేతాజీ అదృశ్యంపై పార్లమెంటుకు ఆనాటి కాంగ్రెసు ప్రభుత్వం
ఒక నివేదిక సమర్పించింది. అందులో వారు తాయ్‌పే విమాన దుర్ఘటనను
ధృవీకరించారు. ఐతే నేతాజీ కుటుంబ సభ్యులు దీనితో విభేదించారు. దాదాపు
పదిహేడువేల పుటల నేతాజీ అదృశ్య- నివేదికలు పార్లమెంటు ఆర్కీవ్స్‌లో
భద్రపరచారు. కాని రహస్య చట్టం పుణ్యమాని వెలుగుచూడలేదు. స్టాలిన్
ప్రోత్సాహంతో నేతాజీని పట్టుకొని మంచూరియా ప్రాంతంలో జైలులో పెట్టారనే
వార్త వెలుగులోకి వచ్చింది. దానిని కాంగ్రెసు ప్రభుత్వం అంగీకరించలేదు.
నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్ర్తీ, ఇందిరాగాంధీ, మొరార్జీదేశాయ్, గుజ్రాల్,
దేవెగౌడ ఇలా ఎందరు ప్రధానులు మారినా ఈ ఫైళ్లు మాత్రం అలాగే రహస్యంగా
ఉండిపోయాయి. చివరకు వాజ్‌పేయిగారు కూడా ఈ వంద ఫైళ్లను ప్రజలముందు ఉంచలేదు.
ఇందుకు ప్రధాన కారణం ఇండో-రష్యన్ స్నేహ సంబంధాలు దెబ్బతింటాయని చెప్పారు.
2014 మే నెలలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల తర్వాత ఈ
ఫైళ్లకు సంబంధించిన వార్తలు వివిధ ఎలక్ట్రానిక్ మీడియాలలో ఆందోళనను
సృష్టించాయి.
ఈ పరిణామక్రమంలో కొన్ని ఆసక్తికరమైన వార్తలు వెలుగుచూచాయి. 1948 నుండి 1968
వరకు దాదాపు రెండు దశాబ్దాలు భారత నిఘా సంస్థ నేతాజీ కుటుంబ సభ్యుల
కదలికలను అనుక్షణం గమనిస్తూ నివేదికలు పంపింది. ఈ కుటుంబ సభ్యులు
ఇండియాలోనే కాక బెర్లిన్ వంటి ప్రాంతాలల్లో కూడా ఉన్నారు. ‘రా’ సంస్థ తాను
సేకరించిన నివేదికలను యునైటెడ్ కింగ్‌డంలో కలిసి పంచుకున్నది. నేతాజీ
బ్రతికి ఉంటే భారతదేశానికి తొలి ప్రధానమంత్రి అయి ఉండేవారు. కాబట్టి
నేతాజీ అదృశ్యం వలన లాభపడేదెవరు? అంటే నిస్సంశయంగా పండిత జవహర్‌లాల్
నెహ్రూగారే. ఇది ఇలా ఉండగా 1996లో పి.వి.నరసింహారావుగారు ప్రధానమంత్రిగా
ఉన్నప్పటి కొన్ని రహస్య పత్రాలు వెలుగులోకి వచ్చాయి. వాటి కథనం ఇలా ఉంది:-
18 జనవరి 1996నాడు జాయింట్ సెక్రెటరీ ఆర్.పి.నారాయణ్ నేతాజీ అదృశ్యంపై
విచారణ ప్రారంభించారు. రష్యా గూఢచార సంస్థ కె.జి.బి నుండి ఇందుకు
సంబంధించిన రహస్య పత్రాలు భారత్‌కు అందజేయవలసిందిగా ఒక లేఖ వ్రాశారు. ఐతే
నారాయణ్‌ను ఎవరో మందలించినట్లున్నారు. అందుకని 18 నవంబరు 1996నాడు తిరిగి
నారాయణ్ మరొక నోట్ వ్రాస్తూ, అలాంటి అవసరం కనిపించటం లేదు అని తేల్చారు.
అంటే జనవరికి నవంబరుకు మధ్యలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఈ రెండు
ఉత్తరాలు ఇప్పుడు పత్రికల వారికి అందుబాటులోకి వచ్చాయి. మొత్తం ఫైళ్లల్లో
కొన్ని ఇందిరాగాంధీ పాలనా కాలంలో అదృశ్యమైనాయి. ఈ పని ఎవరు చేశారు? లేక
ఎవరు చేయించారు? తెలియదు.
2015 ఏప్రిల్ 14వ తేదీ శ్రీ నరేంద్రమోడీ బెర్లిన్ వెళ్లినప్పుడు అక్కడ
నేతాజీ మేనల్లుడి మునిమనుమడు సూర్యబోస్ భారత ప్రధానిని కలిసి తమ కుటుంబంపై
కాంగ్రెసు హయాంలో జరిగిన నిఘా వ్యవహారం దాదాపు నలభై అయిదు నిమిషాలు
వివరించారు. అంతేకాదు మొత్తం నేతాజీ అదృశ్య చరిత్రకు సంబంధించిన ఫైళ్లను
బహిర్గతం చేయాలని కోరారు. అందుకు నరేంద్రమోడీ అంగీకరించారు. ఈ పని త్వరలో
జరిగితే ఇంకా చాలా విషయాలు ప్రజలకు తెలుస్తాయి. ‘ఇది కక్ష సాధింపు చర్య’
అని కాంగ్రెసు నాయకులు ఆరోపిస్తున్నారు. ఎవరి మీద కక్ష సాధింపు?? చరిత్ర
తెలియని వాడు చరిత్ర హీనుడవుతాడు. అసత్య చరిత్రను అల్లటం ద్వారా ఒక జాతిని
మోసం చేయటం భయంకరమైన నేరం అవుతుంది. వంద ఫైళ్లు న్యూఢిల్లీలోని
ఆర్కివ్స్‌లో ఉన్నాయి. మరి కలకత్తాలోని ఆర్కీవ్స్‌లో దాచిన ఫైళ్ల సంఖ్య 67
అంటున్నారు. వాటిని బయట పెడితే ఆవేశపూరితులైన కలకత్తా ప్రజలు ఆందోళనలకు
దిగుతారని ఒక సంజాయిషీ చెప్పారు. అంతటి చిదంబర రహస్యం ఈ ఫైళ్లల్లో ఏముంది??
ఈ ఫైళ్లు వెలుగులోకి వస్తే ఇండో రష్యా సత్సంబంధాలు దెబ్బతింటాయా?? అంటే
స్టాలిన్ నెహ్రూలు కలిసి ఏదైనా చేయకూడని పని చేశారా? ఈ విషయంపై ఎవరి
ఊహాగానాలు వారివే. నేతాజీ సుభాష్ చంద్రబోసు పర్సనల్ సెక్రెటరీ కంఫిజీషన్
మాట్లడుతూ నేతాజీ తనతో 1950 ప్రాంతాలలో మాట్లాడారని చెప్పటం అబద్ధం
అనుకోవాలా?? ఎందుకంటే విమాన ప్రమాదంలో కాకున్నా మంచూరియా జైలులోనైనా
నేతాజీ, కెజిబి ఏజంట్ల చేత హతుడై ఉండాలి. అలాంటప్పుడు 1950లో మాట్లాడే
అవకాశం ఎక్కడిది?? ఈ అనుమానాలు తీరాలంటే మొత్తం రహస్య సమాచారం
వెలుగుచూడవలసిందే.
సమాచార హక్కు చట్టం కింద ప్రజలకు ఆ రహస్య పత్రాలల్లో ఏముందో తెలుసుకునే
అర్హత ఉంది. ఐతే దీనికి (ఆర్.టి.ఐ) ఒక ప్రతిబంధకం ఉంది. ఒఎస్‌ఎ అంటే
అఫీషియల్ సీక్రెట్ యాక్ట్- దీనికింద రహస్య పత్రాలను విడుదల చేస్తే ప్రమాదం
అంటూ గత అరవై సంవత్సరాలుగా కాంగ్రెసు ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ఇందులో
చట్ట బద్ధత విషయం అటుంచి నేతాజీ రహస్య పత్రాలు విడుదల చేస్తే నెహ్రూ కుటుంబ
పరపతికి హాని ఏర్పడుతుందనే భావం కాంగ్రెసు నాయకులలో ఉంది. నేతాజీ
చితాభస్మం నదులల్లో కలిపిన డెబ్బది సంవత్సరాల తర్వాత ఈ విషయంపై చర్చ
పరిశోధన అనవసరం అని కాంగ్రెసు వాదించింది. ఐతే ముఖర్జీ కమిషన్ నివేదికలో ఒక
విషయం ఉంది. గజం మిధ్య పలాయనం మిధ్య అని తెలుగులో ఒక నానుడి ఉంది. 1944లో
తాయ్‌పేలో ఒక విమానప్రమాదం జరిగిన మాట వాస్తవమే. కాని 1945 ఆగస్టు 18నాడు
విమాన ప్రమాదం జరుగలేదు. ప్రమాదమే లేనప్పుడు నేతాజీ మరణం అసత్యం కదా! అని
ముఖర్జీ కమిటీ వాదం- ఇదీ ఇందలి సున్నితమైన ధర్మసూక్ష్మం. ఈ తర్కాన్ని
ఛేదించాలంటే మొత్తం ఫైళ్లు బయటపెట్టవలసిందే- ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వం
పాక్షికంగా సహకరిస్తున్నది. అమెరికన్ ప్రభుత్వం ఉదారంగా ఉంది. ఇప్పుడు
నరేంద్రమోడీ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. యూనియన్ లా సెక్రెటరీ, డిపిఒటి
సెక్రటరీ,హోం సెక్రెటరీ ఇందులో సభ్యులు. వారు పి-కె.మల్హోత్రా,
ఎల్-సి.గోయల్, సంజయ్ కొఠారిగార్లు. వీరు నేతాజీ రహస్య పత్రాలను లోకానికి
అందించే ప్రయత్నంపై చర్చలు జరుపుతారు. లోగడ 1962 ఇండో చైనా యుద్ధంలో ఇండియా
ఎందుకు ఓడిపోయిందో పరిశీలించి హిండర్‌సన్ రిపోర్టు వెలుగుచూడకుండా
కాంగ్రెస్ ప్రభుత్వం అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అనే సాకులో దాచిపెట్టింది. (అంటే చైనాతో నెహ్రూ కుమ్ముక్కవడం వల్ల భారత్ ఓడిపోయిందా? - రాజకిశోర్)
ఈ సందర్భంలో ఒక డికెక్టివ్ కథను మనం గుర్తు చేసుకోవాలి. సద్దాం హుస్సేన్
అనే ఇరాకీ నాయకుణ్ణి జార్జ్ బుష్ ప్రభుత్వం పట్టుకొని హత్యచేసినప్పుడు
కొన్ని రహస్య పత్రాలు భూమికింద బంకర్లలో బయటపడ్డాయ. అందులో భారత దేశంలోని
ప్రముఖులు చమురు కొనుగోళ్లకు పొందిన కమిషన్ల గూర్చిన వివరాలున్నాయ. ఇవి
ఎటువంటి పరిస్థితుల్లోను బయటపడే అవకాశం లేదు. ఈ విధంగా కాంగ్రెస్ అవినీతి
భూస్థాపితం చేయబడింది. బుష్ గారి పుణ్యమాని భూగ ర్భం నుండి ఈ రహస్య పత్రాలు
వెలుగులోకి వచ్చాయ.
నేతాజీ మరణానికి సంబంధించిన ఫైళ్లు అంత రహస్యంగా దాచిపెట్టవలసిన అవసరం
ఏముంది? దీనివల్ల ఇండో-రష్యా సంబంధాలు దెబ్బతింటాయని కాంగ్రెస్ వాదించింది.
అంటే నేతాజీ అదృశ్యం వెనుక నెహ్రూ హస్తం వున్నదనే అనుమానానికి ఇంకా బలం
చేకూర్చినట్లవుతుంది. ఫైళ్లను బయట పెడితే ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ
బెంగాల్‌లో బలపడుతుందనేది కూడా ఒక సాకు మాత్రమే. నెహ్రూ, గాంధీ గార్ల
ఒత్తడికి తట్టుకోలేక నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి
ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త పార్టీని స్థాపించారు. ఇది ప్రస్తుతం
బెంగాల్‌లోని వామపక్ష కూటమి కింద అనుబంధంగా ఉంది.
1944లో నేతాజీ వెళ్ళి హిట్లర్‌ను కలిసినందుకు రష్యన్లకు కోపం వచ్చింది.
రష్యన్ అనుబంధ సంస్థ అయన ఇండియన్ కమ్యూనిస్టు పార్టీ వారు నేతాజీని కుక్కతో
పోల్చారు. తరువాత పదేళ్లకు తాము చేసింది చారిత్రక తప్పిదం అని
ఒప్పుకున్నారు. మోదీ ప్రభుత్వం భారత ప్రజలకు ఎన్నో హామీ లిచ్చింది. 370వ
అధికరణను రద్దు చేస్తానన్నది. నేతాజీ అదృశ్య రహస్యాన్ని ఛేదిస్తామన్నది.
అందుకు సమయం వచ్చింది. అటు హిండర్ సన్ నివేదికను, ఇటు పదిహేడు వేల రహస్య
పుటలను ప్రజల ముందు ఉంచండి. నిజానిజాలు ప్రజలే నిర్ణయంచుకుంటారు.
రష్యన్ నిఘా సంస్థ కెజిబి రహస్య పుటల్లో చంద్రబోసు అనే పేరు సుభాష్ బాబుకు
వాడారు. ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవ వ్రత విశ్వాస్ (2015,
ఏప్రిల్ 17) హైదరా బాద్‌లో మాట్లాడుతూ నేతాజీకి సంబంధించిన 164 రహస్య
నివేదికలను వెంటనే బయట పెట్టాలని కోరారు. నేతాజీ విమాన ప్రమాదంలో
చనిపోలేదని, 1945, ఆగస్టు 18న విమాన ప్రమాదమే జరుగలేదని తేల్చి చెప్పారు.
ఇదొక అంతర్జాతీయ కుట్ర..అన్నారు దేవవ్రత విశ్వాస్.
నేతాజీపై నిఘా ఎందుకు?
Reviewed by rajakishor
on
10:01 AM
Rating:
No comments: