'ఆపా'త్ములా? పాపాత్ములా?
వీక్ పాయింట్, ఆంధ్రభూమి, ఏప్రిల్ 25, 2015
స్క్రిప్టు అదిరింది. యాక్షన్ పేలింది. డైరెక్షన్ మోతమోగింది.
క్రేజీవాలాల స్ఫూర్తితో ఆమ్ ఆద్మీలు సమర్పించిన ‘‘రైతు ఆత్మహత్య’’ చిత్ర విచిత్రానికి ఎన్ని ఆస్కార్ అవార్డులు ఇచ్చినా తప్పులేదు.
ముఖ్యంగా ‘‘మీ నాన్న మరణాన్ని అడ్డుకోలేకపోయిన పాపినమ్మా నేను’’ అంటూ టీవీ
చానెల్ చర్చలో వెక్కివెక్కి ఏడ్చిన ‘ఆప్’ అధికార ప్రతినిధి అశుతోష్‌కి ఈ
ఏటి ఉత్తమనటుడి అవార్డు కళ్లు మూసుకుని ఇచ్చెయ్యవచ్చు.
జంతర్ మంతర్ ర్యాలీ జరిగి మూడురోజులు అయినా, దాని హైలైట్ అయిన రైతు
ఆత్మహత్య గురించి ప్రపంచం ఇంకా మాట్లాడుకుంటూనే ఉంది. పట్టపగలు వేలమంది
చూస్తుండగా, మీడియా యావత్తూ మోహరించి ఉండగా, ముఖ్యమంత్రి మొదలుకుని రాష్ట్ర
ప్రభుత్వ పాలకవర్గం మొత్తం కళ్లప్పగించి చూస్తూండగా, భారీ పోలీసు
బందోబస్తు మధ్య ఒక ఆత్మహత్య యథావిధిగా జరిగింది.
చితికిన రైతుల వెతలను అందరి దృష్టికి తేవడానికి ఇప్పటికి ఎన్నో పార్టీలు
లెక్కలేనన్ని ర్యాలీలు జరిపాయి. రైతులను ఆత్మహత్యలకు పురికొల్పుతున్న
పరిస్థితుల గురించి ప్రతి నాయకుడూ లబలబలాడేవాడే. అలాంటి ఉత్తుత్తి
ఏడుపులవల్ల లాభం లేదని, క్లయిమాక్స్‌లో ఆత్మహత్యాయత్నం సీను ఉంటేగానీ
ర్యాలీ రక్తికట్టదని కనిపెట్టిన ఘనత ఆలిండియాలో ‘ఆపా’త్ములకు మాత్రమే
దక్కింది.
ఢిల్లీ ర్యాలీలో పేద రైతు ఆత్మహత్య’ గురించి పార్లమెంటు లోపలా, వెలుపలా
అన్ని పార్టీల నాయకులూ పోటీలు పడి ఇంకా శోకాలు పెడుతూనే ఉన్నారు. దేశమంతటా,
అత్యధిక రాష్ట్రాల్లో రైతుల బతుకులు బండలు చేసి, బలవన్మరణాలకు
ప్రేరేపిస్తున్న దారుణ దురవస్థలపై ఈ రకంగానైనా ఒకింత దృష్టి పడటం మంచిదే.
నిజానికి మరణించిన వాడు పేదరైతూ కాడు. అది కావాలని చేసుకున్న ఆత్మహత్యా
కాదు.
నాటకంలో బికారి వేషం వేసేవాడు నిజజీవితంలోనూ బికారి కానక్కర్లేదు. ఢిల్లీ
ర్యాలీలో ఆత్మహత్య డ్రామాను పండించబోయిన గజేంద్రసింగూ బడుగు రైతు కాడు.
రాజస్థాన్‌లో వాళ్లది జాగీర్దార్ల వంశం. సొంత ఊళ్లో వారిది 15 ఎకరాల కమతం.
ఇంట్లో ఏ వేళ అయినా ఆరుగురు పనివాళ్లు ఉండే పెద్ద లోగిలి. ఆ పరగణాలో వారిది
సంపన్న కుటుంబం. పెద తండ్రి సర్పంచ్. మనవాడూ రాజకీయాల్లో రాటు తేలినవాడు.
బిజెపిని వదిలి సమాజ్‌వాదీ పార్టీలో చేరి 2008 అసెంబ్లీ ఎన్నికల్లో
జయప్రదంగా ఓడిపోయాడు. కిందటి ఎన్నికల్లో సమాజ్‌వాదీలు టిక్కెటు ఇవ్వకపోయే
సరికి ఆమ్ ఆద్మీ చీపురు పట్టాడు.
సరదా కొద్దీ అప్పుడప్పుడూ కుటుంబ కమతంలో పొలం పనులు చేసినా గజేంద్ర సింగుది
ప్రధానంగా తలపాగాల వ్యాపారం. దానికో వెబ్‌సైటు పెట్టాడు. ఫేస్‌బుక్ అకౌంటు
తెరిచాడు. కంప్యూటరు మీద బిజినెసు చేసుకుంటూ, జైపూర్, ఆగ్రా, ఢిల్లీ లాంటి
సిటీల్లో స్టార్ హోటళ్లకు వెళ్లి హైక్లాసు కస్టమర్లకు రాజస్థానీ తలపాగాలు
చుడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇంకో వారంలో పెళ్లికావలసి ఉన్న
పెద్ద మేనకోడలికి ఖరీదైన మోటార్ సైకిలు పెళ్లి కానుకగా ఇచ్చి బిజినెసు
పనిమీద ఢిల్లీ వచ్చాడు. ‘ఇక్కడ రావలసిన డబ్బులు లక్షన్నర వచ్చాయి; పెళ్లి
ఖర్చులకు పనికొస్తాయి’ అని పెద్దక్కకు ఫోన్ చేసి చెప్పాడు. ‘జంతర్ మంతర్
ర్యాలీకి వెళుతున్నా - సాయంత్రానికి ఇంటికొస్తా’ అని అన్నకూ కబురంపాడు.
అలా వెళ్లిన వాడు కాసేపట్లో చెట్టుకు వేలాడి శవమయ్యాడు. ‘‘మిత్రులారా! నేను
పేద రైతును. వడగండ్ల వానకు నా పంట పాడైంది. మా నాన్న నన్ను ఇంట్లోంచి
వెళ్లగొట్టాడు. ఇంకో వారంలో మా మేనకోడలి పెళ్లి. ఎలా చేయాలి? ఇంటికి ఎలా
వెళ్లాలి? పిల్లల్ని ఎలా బతికించుకోవాలి’’ అంటూ అతడి జేబులో ఒక కాగితం
ముక్క కనిపించింది. దాన్ని సూసైడ్ నోట్ అని అందరూ అన్నారు. కాని అది అతడి
చేతిరాత కాదు. నిజంగా చావాలన్న ఉద్దేశం అతడికి ఎంతమాత్రమూ లేదు.
లోగుట్టు పెరుమాళ్లకెరుక. ఇప్పటికి బయటపడిందల్లా ర్యాలీకి కొన్ని గంటల
ముందు గజేంద్రసింగు కేజ్రీవాల్‌కి కుడిభుజం అయిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రిని
ఇంటి దగ్గర కలిశాడని! మధ్యాహ్నం ర్యాలీ మొదలైనప్పటినుంచీ ఒక చెట్టుమీద
కూచుని బిజెపినీ, రైతులకు మోదీ సర్కారు చేస్తున్న ద్రోహాన్నీ తిట్టిన
తిట్టు తిట్టకుండా తిట్టిపోశాడని. చావు దిగులు ఎంతమాత్రమూ లేకుండా ఆప్
మార్కు చీపురు చేతపట్టి, చెట్టు కొమ్మకు కట్టిన తువాలు కొసను మెడకు
చుట్టుకుని బోలెడు గడబిడ చేశాడని. అల్లంత దూరంలో వేదికమీద వేంచేసిన ఆమాద్మీ
కామందులు ఆ తమాషాను తిలకిస్తూ తమ స్పీచులు తాము దంచారని.
చస్తా చస్తా అని తాను హడావుడి చేస్తే, చుట్టూ ఉన్న వాళ్లు తనను
అడ్డుకుంటారని, ఆ తరవాత నాయకులు తనను వేదికమీదికి పిలిస్తే రైతు
ఆక్రోశాన్ని మీడియా కెమెరాల ముందు ఎంచక్కా వినిపించి, అమాంతం పెద్ద
పబ్లిసిటీ కొట్టెయ్యవచ్చని తల పాగాలవాడు ప్లాను బాగానే వేశాడు. అందుకే
‘చూస్తూ ఉండు. మరికాసేపట్లో నేను టీవీలో కనిపిస్తా’ అని ఇంటి దగ్గరి
చెల్లెలికి సెల్‌ఫోన్‌లో చెప్పాడు. అతడిని పిలిపించి మాట్లాడించే ఘట్టానికి
ఇంకా టైము ఉన్నది కనుక వేదిక మీది నాయకులూ తమగోలలో తామున్నారు.
అంతలో అనుకోనిది జరిగింది. కథ అడ్డం తిరిగింది. చెట్టుచుట్టూ చేరిన చీపురు
జనం తనను ఎంతకీ ఆపకపోగా చప్పట్లు కొడుతూ రెచ్చకొట్టేసరికి తికమకపడ్డాడో -
పోలీసులొచ్చి నిచ్చెనవేసి తనను దింపి పట్టుకుపోతారనేసరికి బెంబేలెత్తాడో -
తనను పట్టుకోవటానికి చెట్టెక్కిన వారిని తప్పించుకోదలిచాడో తెలియదు.
గజేంద్రసింగు చెట్టుకు వేలాడాడు. వారూ వీరూ కలిసి కిందికి దింపేసరికే
ప్రాణం పోయింది.
పోలీసులు అక్కడే ఉండీ అఘాయత్యాన్ని ఆపకుండా చోద్యం చూశారని చీపురు దొరలూ,
చీపురు జనం తమను దగ్గరికి వెళ్లనివ్వకుండా అడ్డుకుని, చచ్చేవాడిని
రెచ్చగొట్టారని పోలీసులూ వాదులాడటం చాలా బాగుంది. ఢిల్లీ ప్రభుత్వ నాయకుల
మీద ఢిల్లీ పోలీసులు కేసులు పెట్టటం, పోలీసు కేసులకు ప్రతిగా సర్కారువారు
మేజిస్ట్రేటు దర్యాప్తును ప్రయోగించటం చూడముచ్చట. చేయాల్సిందంతా చేసి
తప్పంతా మోదీ సర్కారు మెడకు చుట్టాలని చూడటం ఆపాత్ముల తెలివికి గొప్ప
గుర్తు. పత్రికల్లో, చానెళ్లలో ఎడతెగని వాగ్యుద్ధాలకు దిమ్మెర పోతున్న
సామాన్యుడికి అంతుబట్టనిదల్లా ఒక్కటే: రైతుకాని రైతు ఎలా చచ్చాడు? ఎవరు చంపారు?
'ఆపా'త్ములా? పాపాత్ములా?
Reviewed by rajakishor
on
9:00 AM
Rating:
కొత్తగా చెప్పాల్సిండి ఏమీలెదు..
ReplyDeleteకాని మీరు ఈవస్తవాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళగలరు????