125 వ జయంతిన డాక్టర్జీ కి ఘన నివాళులు అర్పించిన హిందూ సమాజం
స్ఫూర్తి ప్రధాత, సామజిక పరివర్తకుడు, దేశ సామాజిక పురోభివృద్దిలో ఎనలేని కృషిచేసిన పరమ పూజనీయ డాక్టర్ జీ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్తాపకులు) గారి 125 వ జన్మదినం సందర్బంగా యావత్తు ప్రపంచం నేడు ఆయనను స్మరించుచున్నది - రాష్ట్ర చేతన .
డా. హెడ్గెవార్ 1889 వ సంవత్సరంలో హిందువులకు నూతన సంవత్సరమైన ఉగాది నాడు జన్మించారు. డా. కేశవ్ రావు బలిరాం పంత్ హెడ్గెవార్ (ఏప్రిల్ 1, 1889 – జూన్ 21, 1941) ఆర్.ఎస్.ఎస్ ప్రథమ సరసంఘచాలకులు మరియు వ్యవస్తాపకులు. డాక్టర్ జీ సంఘాన్ని 1925 నాగపూర్ లో దేశీయ భావజాలంతో కూడిన వ్యక్తులను తయారుచేసి తద్వారా సమైక్య భారతాన్ని నిర్మించాలనే ఉద్దేశ్యంతో ప్రారంబించారు. స్వామి వివేకానంద, వీర్ సావర్కర్ మరియు అరవిందో మొదలగు సామాజిక, ఆధ్యాత్మిక నాయకుల స్పూర్తే వారికి సంఘ స్థాపనకు దారి తీసాయి.
సంక్షిప్త జీవితం :
డాక్టర్ జీ ఏప్రిల్ 1, 1889 న హిందువుల పరమ పవిత్రమైన రోజు, నూతన సంవత్సరం (ఉగాది)నాడు నాగపూర్ లోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. డాక్టర్ జీ పూర్వికులు నిజామాబాద్ జిల్లా బోధన్ తాలుకాలోని కందుకుర్తి గ్రామ వాస్తవ్యులు. అక్కడ వారు ముస్లింల హింసను భరించలేక నాగపూర్ కి వలస రావడం జరిగింది. కేశవ్ తల్లి తండ్రుల పేర్లు రేవతి మరియు బలిరాం పంత్ హెడ్గెవార్. తండ్రి సంప్రదాయ మత గురువు. ఆ కుటుంబమంటే నిరడంబరతకు మారు పేరు. కేశవ్ కు 13 ఏండ్ల వయసులోనే తల్లి, తండ్రి ప్లేగు వ్యాదికి గురై తనువు చాలించారు. దానితో కేశవకు చిరు ప్రాయంలోనే అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి కాని తన ధైర్య సాహసంతో వాటిని ఎదురొడ్డి నిలిచాడు. కుటుంబ భారం తన చదువు మీద పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. దానితో అన్నయ్య మహదేవ్ పంత్ మరియు సీతారాం పంత్ కేశవ్ ని బాగా చదివించాలి అని నిర్ణయించారు. నీల్ సిటీ స్కూల్ లో చదువుతున్న రోజుల్లో బ్రిటిష్ వారు వందేమాతరం పాడకూడదనే నిబందనకు వ్యతిరేకంగా చిన్నపాటి ఉద్యమానికి తెరలేపాడు. ఫలితంగా తను అక్కడి నుండి యావత్మల్ లోని రాష్ట్రీయ విద్యాలయకి మారడం జరిగింది. విక్టోరియ మహా రాణి జన్మదిన వేడుకలను కూడా చిన్నతనం లోనే అడ్డుకున్నాడు. పై చదువుల కోసం డా. B.S మూంజే గారి సహాయంతో కేశవ్ 1910 లో కలకత్తా చేరుకున్నారు. అక్కడే మెడిసిన్ లో L.M&S పూర్తి చేసి 1915 లో తిరిగి నాగపూర్ కి డాక్టర్ పట్టాతో వచ్చారు.
నాగపూర్, ఒక కర్మభూమి :
నాగపూర్ లో డాక్టర్ జీ అనేక సామాజిక కార్యక్రమాలలో అలాగే బాలగంగాధర్ తిలక్ తో కలిసి అప్పటి కాంగ్రెస్ తో కూడా పనిచేసారు. ఆ సమయంలో ఆయన డా. మూంజే గారి సలహాలను తీసుకునేవారు. 1920 లో జరిగిన కాంగ్రెస్ మహా సభలకు డాక్టర్ జీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ వాలంటీర్ గా ఎన్నికయ్యారు. 1920 లోనే డాక్టర్ జీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చాల విస్తృతంగా చేపట్టారు. దానితో ఒక సంవత్సరం పాటు జైలు జీవితం కూడా అనుభవించారు.
సంఘ ఆవిర్భావం :
భారతీయులలో సంఘటనని నిర్మాణం చేయాలి, వారిలో దేశభక్తిని, క్రమ శిక్షణను పెంపొందించాలి అనే ఉద్దేశ్యంతో డాక్టర్ జీ సంఘాన్ని స్థాపించారు. తరువాత అది 28 సెప్టెంబర్ , 1925 విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గా నామకరణం చేయబడింది. సంఘ ప్రారంభ రోజుల్లో డాక్టర్ జీ తో పాటు B.S మూంజే, బాపూజీ సోని మొదలగు వారు డాక్టర్ జీకి సహాయం అందించేవారు. నాగపూర్ ప్రాంతంలో సంఘ విస్తరణకి డా. మూంజే, L.V పరాంజపే అనేక విశిష్ట వ్యక్తులను కలిసారు.
డాక్టర్ జీ సంఘ విస్తరణకు ఒకే ఒక పద్దతిని ఎంచుకున్నారు. వారు రోజు గంట సేపు సమయం ఇచ్చే కొంత మంది పిల్లలను కలిసారు. వారితో కేవలం సాధారణ ఆటలే కాకుండా దేశ భక్తితో కూడిన పాటలు, కథలు చెప్పించడం మొదలు పెట్టారు. దానితో సాధారణంగానే రోజు అనేక మంది యువకులు డాక్టర్ జీ ని కలవడం జరిగేది. దానితో డాక్టర్ జీ ఆ యువకులకు నిత్యం ఒక గంట సేపు శాఖ పేరుతో మనం కలవాలని సూచించారు. ఈ ఒక గంట సమయమే వారిని దేశ భక్తులుగా, దేశాన్ని నడిపించే నాయకులుగా తీర్చి దిద్దగలదని డాక్టర్ జీ బలంగా నమ్మేవారు.
డాక్టర్ జీ మంచి కార్య నిర్వహణాదక్షుడు . ఆయన ఈ దేశమంతా విస్తారంగా పర్యటిస్తూ స్వయం సేవకులను తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. వారు స్వయం సేవకులకు మీరంతా పెద్ద చదువులు చదవాలి అందుకు వివిధ ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. ముందుగా స్వయం సేవకులు పెద్ద చదువులు చదివితేనే సమాజంలో తగిన గుర్తింపు ఉంటుంది తద్వారా మనం సంఘ కార్యాన్ని విస్తారంగా, చాల సులువుగా చేపట్టవచ్చు అని చెప్పేవారు.
"నేను ఈ రోజు స్వప్న భారతాన్ని చూస్తున్నాను. నేను ఒకప్పుడు స్వయం సేవకుడిని అనే మాట మీ నోటి నుండి ఎప్పటికీ రాకూడదు. అంతగా మనమంతా సంఘ కార్యంలో మమేకమవ్వాలి".
నిరంతర దేశ పర్యటనతో వారికి విశ్రాంతి లేకపోవడంతో డాక్టర్ జీ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. వారు దీర్గకాళిక వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. అయిన కూడా అనునిత్యం స్వయం సేవకులకు దిశా నిర్దేశం చేస్తూనే వస్తున్నారు. దానితో వారు తన భాద్యతని శ్రీ గురూజీ కి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. 1940 లో జరగిన సంఘ శిక్షా వర్గలో తన చివరి ప్రసంగంలో మాట్లాడుతూ "నేను ఈ రోజు స్వప్న భారతాన్ని చూస్తున్నాను. నేను ఒకప్పుడు స్వయం సేవకుడిని అనే మాట మీ నోటి నుండి ఎప్పటికీ రాకూడదు. అంతగా మనమంతా సంఘ కార్యంలో మమేకమవ్వాలి".
డాక్టర్ జీ జూన్ 21, 1940 న ఉదయం భారత మాత ఒడిలో చేరిపోయారు.
డాక్టర్ ఇచ్చిన ప్రేరణ అందరి హృదయాలలో నాటుకుపోయింది. ఎంతగా అంటే మన జాతీయ పతాకం మీద మనకున్న ప్రేమ ఎంత అని అడిగితే చెప్పగలమా? అది నేడు ప్రపంచమంతా వివిధ రూపాల్లో మనకు వ్యక్తమవుతుంది. వేల మంది కార్యకర్తలు డాక్టర్జీ ఇచ్చిన ప్రేరణతో తమ జీవితాలను రాష్ట్రాయ స్వాహా అంటూ ఈ దేశ హితం కొరకు అర్పించి పనిచేస్తున్నారు. ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లాలని నిరంతరం శ్రమిస్తున్నారు.
నేడు సంఘం ప్రపంచంలోనే అతి పెద్ద సామాజిక సంస్థగా పేరు గాంచింది. సంఘం పేరు, డాక్టర్ జీ పేరు ఎరుగని వారు ఈ రోజుల్లో చాల అరుదు. మరి ఇంతటి మహోన్నత కార్యాన్ని, మనకు దిశా నిర్దేశాన్ని చూపించిన డాక్టర్ జీ మార్గంలో నడవడమే వారికి మనం సమర్పించే నిజమైన నివాళి. కాబట్టి మనమంతా ఆ మహా యోగి తలపెట్టిన ఈ మహోన్నత కార్యాన్ని సాదించే దిశలో అడుగులు వేద్దాం. భారత మాతకు జయము పలుకుదాం.
125 వ జయంతిన డాక్టర్జీ కి ఘన నివాళులు అర్పించిన హిందూ సమాజం
Reviewed by JAGARANA
on
4:27 PM
Rating:
No comments: