దేవతామూర్తులను పారవేయకండి
హిందూ సమాజం భగవంతుని యొక్క నిరాకారాన్ని ఎంత పవిత్రంగా భావిస్తుందో భగవంతుని భావాత్మక, గుణాత్మక, భౌతిక రూపాన్ని కూడా అంతే పవిత్రంగా ఆరాధిస్తుంది. అనాదిగా మనదేశంలో వెలసిన వివిధ దేవతామూర్తుల ఆలయాలు, ఆరాధనా పద్ధతులు, నియమాలు, సంప్రదాయాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
అంతేకాదు వివిధ పర్వదినాలలో బహిరంగంగా ఆయా దేవతామూర్తులను ప్రతిష్ఠ చేసి పెద్ద ఎత్తున ఉత్సవాలు చేయడం కూడా మనకు పరిపాటే. ఇళ్ళలో కూడా పండగలలో దేవతా మూర్తులను ప్రతిష్ఠ చేసి కుటుంబమంతా కలిసి పూజలు చేస్తాం. తరువాత ఆ విగ్రహాలను సముద్రంలోనో, నదులలోనో నిమజ్జనం చేయడం, లేదా ఇళ్ళలో అయితే దేవుని మందిరంలో ఉంచడం చేస్తాం.
అయితే మన ఇళ్ళలో పాతబడిపోయిన, పాడైపోయిన, విరిగిపోయిన లేదా జీర్ణమైన దేవతా విగ్రహాలు గానీ చిత్రపటాలు గానీ ఏంచేయాలి? ఏం చేస్తాం?
ఈ సమస్య, ప్రశ్న అందరికీ ఉండేదే.
మనలో చాలా మంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలను కాని చిత్రపటాలను కానీ ఏ దేవాలయంలోని చెట్టు క్రిందో, ఎవరూ తిరగని ప్రదేశంలోనో వదిలేసి హమ్మయ్య అనుకుంటారు. అంతటితో తమ బాధ్యతా పూర్తయ్యిందనుకుంటాం.
అలా ఎవరికీ పట్టకుండా వదిలిపెట్టేసిన ఆ దేవతా మూర్తులపై దారిన పోయేవారు పారేసే చెత్త పేరుకుపోవడమో లేదా అటుగా తిరిగే పశువులూ, పక్షులూ పాడుచేయడమో, చెదలు పట్టడమో జరుగుతుంది. అప్పటివరకూ మనం ఎంతో పవిత్రంగా పూజించుకున్న దేవతామూర్తులకు ఇలా దౌర్భాగ్యం పట్టడానికి బాధ్యులం మనమే.
కాబట్టి అలా చేయడంకన్నా ఉత్తమమైన మార్గం ఉంది. అదేమిటంటే శిథిలమైన దేవతల చిత్రపటాలకు అగ్నిసంస్కారం చేయడం మంచిది. "అదేంటి దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా ఎక్కడైనా?" అని సందేహించక్కర్లేదు. అగ్ని సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు. కనుక పవిత్రాగ్నిలో దేవల చిత్రపటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పుకాదు.
ఇక విరిగిపోయిన విగ్రహాలను నదిలో విడిచిపెట్టండి. ప్రవహిస్తున్న నదిలో వేయడం ద్వారా నీరు కలుషితం కాదు. అంతేకాదు మనచే పూజలందుకున్న ఆ దేవతామూర్తుల పవిత్రత నదీ తరంగాల ద్వారా పరిసర ప్రాంతాలలో వ్యాపిస్తుంది.
"శరీరమాద్యం ఖలు ధర్మసాధనః" అని కదా ఆర్యోక్తి. అంటే ధర్మసాధనకు, ధర్మాచరణకు మన శరీరమే ముఖ్య ఉపకరణం. మన జీవనధర్మానికి ఆలంబనగా నిలచిన శరీరాన్ని ఎవరికీ పట్టకుండా బైట పారవేసి ఊరుకోము. దానికి చితి మంటలలో అగ్నిసంస్కారం చేసి, తరువాత చితాభస్మమును, అస్తికలను పవిత్ర నదీ జలాలలో నిమజ్జనం చేస్తాం.
అలాగే మన పూజలను అందుకున్న దేవతా మూర్తులు లేదా చిత్రపటాలకు అగ్ని, జల సంస్కారములనొనర్చినప్పుడే మనపూజా ధర్మం పరిపూర్తి అవుతుంది.
అయితే అగ్ని, జల సంస్కారములనొనరిస్తున్నప్పుడు ఆ దేవతా మూర్తులకు మనస్పూర్తిగా నమస్కరించి "గచ్ఛ గచ్ఛ సుర శ్రేష్ఠః స్వస్థానం పరమేశ్వరః" అంటూ మీ విధిని పూర్తిచేయండి.
దీనిని గురించి మీ మిత్రులకూ తెలపండి. ధర్మాచరణ చేయండి. ధర్మాన్ని కాపాడండి.
దేవతామూర్తులను పారవేయకండి
Reviewed by rajakishor
on
2:02 PM
Rating:
No comments: