Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

సమర్థ భారత్ ‘స్వామి’ స్వప్నం! - కే వేణు గోపాల్ రెడ్డి


భారత్ సమర్థ భారత్ అయినప్పుడే తన వైశ్విక బాధ్యతను నిర్వర్తించగలదని ఆయన దృఢంగా విశ్వసించారు. స్వతంత్రంగా, నూతనోత్సాహంతో, కొత్త మెరుగులతో సనాతన ఔన్నత్యాన్ని రాణింపచేసుకునే భారత్‌ను ఆయన స్వప్నించారు. భారత్ మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించారు. ఆయన వ్యాఖ్యానాలు, రచనలూ అన్నీ భారత భవ్యతను చెప్పడంతో మొదలై, దాని ప్రస్తుత దుస్థితిని వివరించి, దాని బంగారు భవిష్యత్తుపై భరోసా ఇవ్వడంతో ముగిసేవి. ఈ మహత్తర లక్ష్యసాధనకుగాను యువతరానికి ప్రేరణ ఇవ్వడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు.

వెలుగుకు మారుపేరైన దేశం చిమ్మచీకట్లో ఉన్నప్పుడు చిరుదివ్వెలా...
బానిస భారతం సంకెళ్లు తెగతెంచే సమ్మెటలా...
మూఢాచారమే మతంగా, వివక్షే కులంగా వికటిం చిన కాలంలో వేదాంతమూర్తిలా...
తెల్లతోలువాడు ఏమి చెప్పినా అదే విజ్ఞానంగా భావించే బానిస యుగంలో స్వాభిమానపు, ఆత్మవిశ్వా సపు అద్భుత రూపంగా...
స్తబ్దుగా పడున్న సమాజానికి వేకువ వార్త చెప్పే వైతాళికుడిలా...
భారతీయుల బద్ధకాన్ని భగ్నం చేసే భగవద్దూతగా...
పరాక్రమ భారతపు ప్రభాత గీతంగా...
దౌర్బల్యానికి వైరిగా, వేదాంతపు భేరిగా వచ్చాడు వివేకానందుడు.

స్వామీజీ జీవితమంతా భగవదన్వేషణలో గడిచింది. ఇదే అన్వేషణ ఆయన్ని దక్షిణేశ్వర్‌లో ఒక ఉసిరిచెట్టు కింద మాసినగడ్డంతో, చిన్న అంగవస్త్రమే ఆచ్ఛాదనగా, అర్థనిమీలిత నేత్రాలతో, దిన్యోన్మాదంతో ధ్యాన ముద్రలో ఉన్న రామకృష్ణ పరమహంస దగ్గరకు తీసుకెళ్లింది. అదొక అద్బుత సమాగమం. దైవాన్ని చూసినవాడు, దైవాన్ని చూడబోయేవాడు ఒక్కచోట ఒక్కటైన మహోజ్వల ఘట్టం అది. 

శ్రీరామకృష్ణుల వంటి మహత్తర ఆధ్యాత్మిక విభూతి తన దైవీ వ్యవసాయపు దివ్య ఫలసాయాన్ని వివేకానందుని రూపంలో కన్నులారా చూసిన మహాద్భుత క్షణం అది. వియత్తలానికి వ్యాపించబోయే వివేక వృక్షపు విత్తును కళ్లముందు కాంచిన కాంచన ఘడియ అది. నరేంద్రుడిని చూడగానే రామకృష్ణుడు ‘‘వచ్చావా... నీ కోసం ఎన్నాళ్లుగానో చూస్తున్నాను. ఎదురుచూస్తున్నాను... ఇన్నాళ్లకు వచ్చావా?’’ అన్నాడు పరమా నందంతో...

రామకృష్ణుడి కోరిక మేరకు నరేంద్రుడు ‘‘చలో మన నిజనికేతన’’ అన్న భజన గీతాన్ని ఆలపించాడు. అలా నరేంద్రుడు తన నిజనికేతనానికి చేరుకున్నాడు.‘‘మీరు దైవాన్ని చూశారా? నాకు కూడా చూపించగలరా?’’ అంత సమ్మోహన సమయంలోనూ నరేంద్రుడు తన ప్రశ్నను మరిచిపోలేదు.

‘‘నేను దేవుడిని చూశాను. నిన్నెలా చూస్తున్నానో అలాగే... అంత దగ్గరగా చూశాను. నీకు కూడా చూపిస్తాను’’ అన్నాడు పరమహంస. అంతే.. నరేంద్రుడు రామకృష్ణ దాసుడైపోయాడు. అనంతర కాలంలో ‘‘గదిలో కాళీమాత సాక్షాత్కారమవుతుంది... ఏం కావాలో కోరుకో’’ అని రామకృష్ణుడు చెప్పాడు. ఒకటి కాదు... రెండు కాదు... మూడుసార్లు అమ్మవారు దర్శనమిచ్చింది. మూడుసార్లూ నరేంద్రుడు ‘జ్ఞాన భక్తి వైరాగ్యాల’నే కోరుకున్నాడు తప్ప ఐహికమైనదేదీ అడగలేదు. ఆ క్షణమే ఆయన నరేంద్రుడన్న ఆవరణను తొలగించుకుని, వివేకానందుడయ్యాడు.

భారతమాతే చరమదైవం
అలా దైవసాన్నిధ్యాన్ని, దైవీతాదాత్మ్యాన్ని పొంది సిద్ధి సాధకుడైన వివేకానం దుడు తన ఇహలీలా చరమాంకంలో మరో మహోజ్వల పతాక సన్నివేశాన్ని ఆవిష్కరించారు. 1897లో ఆయన ఈ అరవై నాలుగు కోట్ల దేవీ దేవతలను కట్ట కట్టి నీట వదిలేయమన్నాడు. ఈ దేశానికి, ఈ జాతికి, ఈ జాతి యువతకు ఒక్క భారత మాతే ఆరాధ్య దేవత కావాలన్నాడు. ఆ భారత మాతనే ఆరాధించమ న్నాడు. ఆమెనే ఆవాహన చేయమన్నాడు. అర్పణలు, తర్పణలు, సమర్పణలు, సర్వస్వార్పణలు ఆ ఒక్క తల్లికే చెందాలన్నాడు. కోటాను కోట్ల దేవీ దేవతలందరి సారసమ్మిళిత రూపమే భారతమాత అన్నాడు.

ఇంతటి విప్లవాత్మక ప్రకటన కేవలం వివేకానంద మాత్రమే ఇవ్వగలడు. ప్రపంచ చరిత్రలోనే ఇలా దేవోన్ముఖుడు దేశోన్ముఖుడుగా రూపెత్తిన ఘట్టం మరొకటి లేదు. దేవుడినే చూసిన వ్యక్తి దేవుళ్లందరినీ పక్కనపెట్టి భారతమాతనే ఏకైక ఆరాధ్య దేవతగా చేయండని చెప్పడం నిజంగా మహోజ్వల ఘట్టమే. భారత జాతికి స్వామీజీ చేసిన మహత్తర దిశాదర్శనం ఇది. నిద్రాణ భారత్‌ని జాగృత భారత్‌గా, జాగృత భారత్‌ని వివేక భారత్‌గా, విజ్ఞాన భారత్‌గా, ప్రజ్ఞాన భారత్‌గా, సంస్కార భారత్‌గా, సహకార భారత్‌గా చేసి, సమర్థ భారత్‌గా చేయమన్న సందేశాన్ని ఇచ్చేందుకే స్వామి ఈ మాటల న్నాడు. బానిస బంధనాలను తెగతెంచుకునే మహోద్యమ మహోధృతి నుంచి భారత మాతృభావన ఆవిర్భవించింది. చీకటి ఘడియల్లో మిణుగురులు వెలుగు చూపిస్తాయి.

దాని వెనువెంటనే ఆకాశంలో నక్షత్రాలు పుట్టుకొచ్చి వెలుగులు పంచుతాయి. తరువాత వెన్నెల చందమామ కాంతులు విరజిమ్ముతాడు. రాబోయే వేకువ సందేశాన్ని ఇస్తాడు. బానిస భారతానికి వివేకానందుడు వెన్నెల చందమామలా ఆత్మవిశ్వాసం, ఆత్మప్రబోధాల వెలుగుల్ని విరజిమ్మాడు. అత్యంత చీకటి ఘడియల్లోనే వేకువ విత్తు నాటుకుంటుంది. వెలుగు విత్తనం నైరాశ్యపు నేలను చీల్చుకుని మొలకెత్తుతుంది. తూరుపు ఎర్రై సూర్యుణ్ణి ప్రసవిస్తుంది. చీకటి పొరల్ని ఛేదించి వెలుగుల మహావృక్షం ఆకాశంలో శాఖోప శాఖలై విస్తరిస్తుంది.

ఒక నవ్యదేవత ఆవిర్భావం
వేల ఏళ్ల బానిసత్వపు విషవలయంలో చిక్కిన భారత్ 1857 విప్లవ వైఫల్యంతో నైరాశ్యపు చీకట్లో కూరుకుపోయింది. 1857 వైఫల్యం తరువాత సరిగ్గా పద్దెనిమిదేళ్లకే అంటే 1873లో బెంగాలీ కవి కిరణ్‌చంద్ర బందోపాధ్యాయ ‘భారత మాత’ అనే నాటికను రచించారు. దేశ చరిత్రలో భారతమాత అన్న పదం మొట్ట మొదటిసారి వినిపించింది ఆనాడే. చీకట్లో చివికిపోతున్న దేశానికి వెలుగులిచ్చే నవ్యాతినవ్య దేవత అవతారధారణకి అంకురార్పణ ఆ క్షణమే జరిగింది. 

అవిభక్త బెంగాల్‌లో ఆ నాటకం సంచలనం సృష్టించింది. మరో తొమ్మిదేళ్లకి అంటే 1882లో బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ ‘ఆనందమఠం’ నవల ఆవిర్భవించింది. ఆ నవలలోని వందేమాతర గీతం మంత్రమైపోయింది. వందేమాతరం స్వాతంత్య్రోద్యమ విప్లవనినాదమై నిలిచింది. దేశం యావత్తూ దేశాన్ని మాతృ రూపిణిగా ఆరాధించి, పులకించి తరించింది. అవనీంద్రనాథ్ టాగోర్ అక్షర రూపంలో ఉన్న మాతకు ఆకారాన్ని ఇచ్చాడు. విజ్ఞానానికి ప్రతీక అయిన పుస్తకం ఒక చేతిలో, వైభవానికి ప్రతీకయైన వరికంకులు మరో చేతిలో, ఐహిక శేముషికి ప్రతీకగా ధవళ వస్త్రం మూడో చేతిలో, ఆముష్మికానికి ప్రతీకగా మాలను నాలుగో చేతిలో ధరించిన కాషాయంబరధారిణిగా ఆయన భారతమాతకు ఆకారం ఇచ్చాడు. శిక్షాదీక్షా అన్నవస్త్రదాత రూపంలో ఆమెను సాకారం చేశాడు. 

కొన్ని దశాబ్దాల్లోనే స్వాతంత్య్రం, సాకారం కాని స్వప్నం కాస్తా వదలలేని వాస్తవిక ఆకాంక్షగా మారింది. భారతమాత అందరి ఆరాధ్యదేవత అయింది. శిక్షాదీక్షా అన్నవస్త్రాల సామాజిక, ఆర్థిక న్యాయ ఆకాంక్ష ఉద్యమ నినాదమైంది. దేశవ్యాప్తంగా జాతీయ విద్యావ్యాప్తి ఉద్యమం ఊపిరి పోసుకుంది. పావన నగరి కాశీకి చెందిన సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, సాతంత్య్ర సమరయోధుడు శివప్రసాద్ గుప్త కాశీ విద్యాపీఠ్‌ను స్థాపించారు.

పదివేల రూపాయల తొలి విరాళంతో బనారస్ హిందూ యూనివర్సిటీకి బాటలు వేశారు. విజ్ఞాన వ్యాప్తికి దేశంలోని మొట్టమొదటి హిందీ దినపత్రిక ‘ఆజ్’ను ఆరంభించారు. ఆయనే దేశంలోని మొట్టమొదటి భారతమాత మందిరాన్ని స్థాపించారు. 1936లో దీన్ని ప్రారంభిం చిన మహాత్మాగాంధీ ‘‘ఈ మందిరం హరిజనులతో సహా అన్ని మతాలు, కులా లు, వర్గాల వారికి ఉమ్మడి వేదిక అవుతుందని, దేశంలో మతాల సమైక్యతను, శాంతిని, ప్రేమభావాన్ని పెంపొందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంద’’ని ఆకాంక్షించారు.

ఒక తీర్థ స్థానం... ఒక తీర్థ స్నానం...
ఈ భారతమాత ఆరాధనకు పునాదులు వేసి, యావద్దేశవ్యాప్తంగా శాఖోపశాఖ లుగా విస్తరింపచేసిన మహాద్రష్ట వివేకానందుడు. ఆయన ముప్ఫయి మూడు కోట్ల దేవతలకు జననిగా భారతమాతను పరిగణించారు. ఇంగ్లండు, అమెరికా వంటి సమృద్ధ దేశాలను వదిలి భారతదేశానికి తిరిగివస్తుండగా కొందరు వివేకానందుడిని భారతదేశంపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు. దానికాయన ‘‘నేను ఇప్పటి వరకూ భారతదేశాన్ని ప్రేమించాను. కానీ ఇప్పుడు భారత భూమిలోని ప్రతి ధూళికణము నాకు అత్యంత పవిత్రం. 

అది నాకు ఒక తీర్థ స్థానం’’ అని జవాబిచ్చారు. పాశ్చాత్య దేశాల్లో హైందవ ధర్మ విజయ వైజయంతి తరువాత భారతదేశానికి ఆయన వచ్చి సాగరతీరం చేరగానే నేలకు సాష్టాంగ ప్రమాణం చేశారు. అంతేకాదు. ఈ మట్టిని ఒళ్లంతా చల్లుకున్నారు. స్వాగత సత్కారాలను, వేలాది మంది హర్షధ్వానాలను పక్కనపెట్టి నేల తల్లి ఒడిలో పసిపాపడైపోయారు. ‘‘ఇంతవరకూ నా శరీరం భౌతికవాదంతో కొట్టు మిట్టాడే పాశ్చాత్య దేశాల్లో ఉండి కలుషితమైంది. కాబట్టే ఈ పవిత్ర ధూళితో నన్ను నేను పవిత్రుడిని చేసుకుంటున్నాను’’ అని ఆయన అన్నారు. భారతదేశాన్ని ఒక దేవతగా, ఒక జగజ్జననిగా ఆయన భావించారు.

భారత్ సమర్థ భారత్ అయినప్పుడే తన వైశ్విక బాధ్యతను నిర్వర్తించగల దని ఆయన దృఢంగా విశ్వసించారు. స్వతంత్రంగా, నూతనోత్సాహంతో, కొత్త మెరుగులతో సనాతన ఔన్నత్యాన్ని రాణింపచేసుకునే భారత్‌ను ఆయన స్వప్నిం చారు. భారత్ మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించారు. ఆయన వ్యాఖ్యానాలు, రచనలూ అన్నీ భారత భవ్యతను చెప్పడంతో మొదలై, దాని ప్రస్తుత దుస్థితిని వివరించి, దాని బంగారు భవిష్యత్తుపై భరోసా ఇవ్వడంతో ముగిసేవి. ఈ మహత్తర లక్ష్యసాధనకుగాను యువతరానికి ప్రేరణ ఇవ్వడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు.

వివేకానందుని అంతేవాసి అయిన స్వామి అఖండానంద వివేకానందుని గురించి చెబుతూ ఆయనది దేశభక్తి కాదు. ఆయనది దేశాత్మబోధం అని అన్నారు. దేశంపై భక్తి ప్రపత్తులుండటం సామాన్యుల లక్షణం. అది దేశభక్తి. కానీ దేశమే నేనని భావించగలిగే తాదాత్మ్యతే దేశాత్మబోధం. వివేకానందుని అణువణువునా దేశాత్మబోధమే వెల్లివిరిసేది. 

దేశ ప్రజల సుఖదుఃఖాలు, ఆనంద విషాదాలు, ప్రమోద ప్రమాదాలు, వారి వర్తమాన, భూత భవిష్యత్తుల గురించే ఆయన అనునిత్యం ఆలోచించేవారు. తనను కలిసిన వారిని కూడా ఆయన దేశాత్మ బోధంతో వెల్లివిరిసే వ్యక్తులుగా మార్చేసేవారు. ఉదాహరణకు 1897లో పండిత్ హీరానంద గోస్వామి అనే యువకుడు స్వామీజీని కలుసుకున్నారు. అప్పటికి గోస్వామి లాహోర్‌లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీలో గణితం ప్రొఫెసర్‌గా ఉండే వారు. ఆయన స్వామీజిని కలిసిన మరుక్షణం సర్వసంగ పరిత్యాగిగా మారి పోయారు. స్వామీజీ అమెరికా వెళ్లిన తొమ్మిదేళ్లకు ఆయన కూడా అక్కడకు వెళ్లి ఆచరణాత్మక వేదాంతాన్ని బోధించారు. ఆ మహావ్యక్తే స్వామీ రామతీర్థ. 

ఆయన కూడా తనను తాను భారతదేశంగా భావించుకునేవారు. నేను నడిస్తే ముప్ఫై కోట్ల భారతీయులు నడుస్తున్నట్టు ఉంటుందని ఆయన అనేవారు. అలా మనిషిని మనీషిగా మార్చేయగలిగే శక్తి వివేకానందునికి ఉండేది. వివేకానందుడికి ఇండియా అనేది అయిదక్షరాల పదం కాదు. ఆయనకు ఇండియా అన్న పదంలో ప్రేమ, మోహం, గర్వం, కాంక్ష, భక్తి, సాహసం వంటి గుణాల సమాహారం కనిపించేది. ఇండియాలోని ప్రజలు, వారి చరిత్ర, వారి భవన నిర్మాణ కళ, వారి సంస్కృతి, సభ్యత, అక్కడి నదులు, పర్వతాలు, మైదానాలు, సంస్కృతి, వారి ఆధ్యాత్మిక భావాలు అన్నీ ఆయనలో ఉత్సుకతను రేకెత్తిస్తాయి అని ఆయన శిష్యురాలైన సిస్టర్ క్రిస్టీన్ పేర్కొంది.

సమర్థ భారత్ - ఎందుకు? ఎవరి కోసం?
వివేకానంద దేశం అత్యంత క్లిష్ట ఘడియల్లో ఈ పుడమికి వచ్చారు. దేశం బాని సత్వంలో మగ్గుతూ, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, సంస్కృతి, జీవన విధానాల విషయంలో అత్యంత ఆత్మన్యూనతలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వచ్చారు. రాబోయే రోజుల భారత జాతీయ సాంస్కృతిక పునర్ జాగరణా ప్రభాతానికి తొలి వెలుగు రేఖగా వచ్చారు. ఆయన దృష్టిలో భారతదేశానికి ఒక నిర్దిష్టమైన దైవీ బాధ్యత ఉంది. అదే ప్రపంచాన్ని ఆధ్యాత్మీకరించడం. ఇదే విషయాన్ని ఆయన షికాగో విశ్వమత సమ్మేళనం నుంచి తిరిగి రాగానే కొలం బోలో చేసిన తొలి బహిరంగ ప్రసంగంలో చెప్పారు. 

అగ్ని పర్వతంపై పాశ్చాత్య ప్రపంచం
పాశ్చాత్య ప్రపంచం బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతంపై కూర్చుందని స్వామీజీ ఆనాడే హెచ్చరించారు. ఆయన ఈ హెచ్చరిక చేసేనాటికి మొదటి ప్రపంచ యుద్ధం తాలూకు తొలి సూచనలు కూడా స్పష్టం కాలేదు. దాని దుష్ప రిణామాలు ప్రపంచాన్ని ఎలా తల్లడిల్ల చేస్తాయో గ్రహించారు. అందుకే ఆయన ప్రపంచాన్ని హెచ్చరించడంతో పాటు రాజుకోబోతున్న ఆ అగ్గిని ఆర్పడం ఒక భారతీయ ఆధ్యాత్మికతకే సాధ్యమని కూడా అన్నారు.

‘‘లే... భారత్... లేచి నీ ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని జయించు. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుందని, ద్వేషం ఎన్నటికీ ద్వేషాన్ని జయించలేదని ఈ నేలపైనే తొలిసారి మన పూర్వీకులు ప్రవచించారు. భౌతికవాదం, దానివల్ల కలిగే క్లేశాలను భౌతికవాదంతోనే జయించడం అసాధ్యం. పాశ్చాత్యాన్ని ఆధ్యాత్మికత గెలుచు కోవాలి. యూరప్ యావత్తు బద్దలవడానికి సిద్ధంగా ఉన్న ఒక అగ్నిపర్వతంపై కూర్చుంది. ఇది రేపే బద్దలు కావచ్చు. వారు భౌతికవాదపు భోగలాలసతలో మునిగితేలి, అది పూర్తిగా వ్యర్థమని గ్రహించారు. ఇప్పుడు భారతదేశపు ఆధ్యా త్మికత ఆధారంగా ప్రపంచాన్ని గెలవాలి. ఇది తప్ప మరోదారి లేదు’’.

భారత్ లేకపోతే...?
భారతదేశం లేకపోతే ఏమవుతుందో కూడా ఆయన చెప్పారు. ‘‘భారతదేశమే లేక పోతే ప్రపంచం నుంచి ఆధ్యాత్మికత అంతరించిపోతుంది. నైతిక ఔన్నత్యమంతా నశించిపోతుంది. ధర్మహృదయాల సానుభూతి అంతరించిపోతుంది. ఆదర్శా లన్నీ అంతరించిపోతాయి. వాటి స్థానంలో వాంఛలు, వైభోగాలే దేవతలవు తాయి. డబ్బే పౌరోహిత్యం చేస్తుంది. మోసం, బలాత్కారం, పోటీతత్వాలే కర్మ కాండలుగా మారతాయి. మానవీయ ఆత్మ బలిపెట్టడం జరుగుతుంది. అలా ఎన్నటికీ జరగకూడదు’’ అన్నారు వివేకానంద. 

ఇంకొక సందర్భంలో ఆయన ఇలా అన్నారు. ‘‘ఒక మనిషి ఎంత సంపాదించుకోవచ్చు? ఏదో ఒక విధంగా మనిషి ఎంత అధి కారాన్ని చేజిక్కించుకోగలడు? న్యాయమో అన్యాయమో దానికి ఏ పద్ధతిని వాడినా ఫర్వాలేదు అని యూరప్ ఆలోచిస్తుంది. క్రూరమైన, హృదయమే లేని, వెన్నులో చలిపుట్టించే పోటీతత్వమే యూరోపియన్ నాగరికతల సందేశం. చరి త్రను పరిశీలించినప్పుడు యూరప్ లక్ష్యంగా కనిపించేది ఒక్కటే. ఇతర ప్రపంచ దేశాలలోని ప్రజలందరినీ తుదముట్టించి, తాము ఒక్కరమే జీవించడం వారి లక్ష్యం’’. ఆయన చెప్పిన ఈ మాటల్లోని నిజాన్ని కాలం నిరూపించింది.

భారతదేశం అనే జీవన నౌక యుగాలుగా నాగరికతను పంచుతూ ప్రయా ణించిందని, తన జ్ఞానసంపదతో ప్రపంచాన్ని సమృద్ధవంతం చేసిందని స్వామీజీ చెప్పారు. ‘‘ఈ రోజు ఈ నౌకకు చిల్లుపడింది. ఇది దెబ్బతిన్నది. కానీ ఇదంతా మీ లోపంవల్లే జరిగింది. ఈ పరిస్థితిని తిట్టుకుంటూ, మీలో మీరు కొట్టుకుంటూ గడిపేద్దామనుకుంటున్నారా? ఈ పడవకు పడ్డ చిల్లును పూడ్చేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు మీరందరూ కలిసికట్టుగా ముందుకు రాకుండా ఉండిపోతారా? మన గుండెల వెచ్చని నెత్తురును సంతోషంగా అర్పిద్దాం. 

ఒక వేళ మనం విఫలమైతే ఈ పడవతోనే కలిసి మునిగిపోదాం. ప్రాణాలర్పిద్దాం - శాపనార్థాలు పెడుతూ కాదు... ఆశీర్వాదాలను పంచిస్తూ చనిపోదాం’’ అని ఉద్బోధించారు స్వామీ వివేకానంద. కళ్లముందు కనిపించే పతనావస్థ కరిగిపోయి, పరమ వైభవం మళ్లీ వస్తుందని స్వామీజీ స్వప్నించారు. ‘‘పైపైన కనిపించే ఈ మరణావస్థ కింద మన జాతీయ జీవన స్ఫులింగం ఇంకా రగులుతూనే ఉంది’’ అని వివేకానంద ఎలుగెత్తి ఘోషించారు. భారత్ మళ్లీ నిదురలేస్తుందని ఆయన గట్టిగా నమ్మారు. అదే మాట చెప్పారు.

‘‘మునుపెన్నడూ కనీవినీ ఎరుగని విశిష్టత సముపార్జించుకున్న భారతదేశం రూపుదిద్దుకుంటుంది. లేవండి... మేల్కొనండి! అమరమై, మహోన్నత స్థానంలో నూతన యువప్రాయంతో ఇంతవరకూ లేని మహిమాన్విత కాంతితో భారత మాత విరాజిల్లుతుండటం చూడండి’’.

సమర్థ భారత్ ‘స్వామి’ స్వప్నం! - కే వేణు గోపాల్ రెడ్డి Reviewed by JAGARANA on 8:43 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.