అవసాన దశలో ఆర్థిక వ్యవస్థ - మాన్య శ్రీ మోహన్ జి భాగవత్
ఇండోర్ (మధ్యప్రదేశ్), ఆగస్టు 25: రూపాయితో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కూడా అవసాన దశలో (వెంటిలేటర్‌పై) ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం మన రూపాయి అవసాన దశలో ఉందని అందరూ అంటున్నారు. కానీ కేవలం రూపాయి మాత్రమే కాదు మన ఆర్థిక వ్యవస్థే అవసాన దశలో ఉందని నేను అభిప్రాయపడుతున్నా’ అని ఆయన అన్నారు. ఇండోర్‌లో శనివారం రాత్రి జరిగిన లఘు ఉద్యోగ్ భారతి అఖిల భారత సమావేశంలో ప్రసంగిస్తూ భగవత్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వతంత్ర దేశంగా ఉన్న భారత్‌కు ఇతర దేశాలు రూపొందించిన విధానాలను అనుసరించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్థికంగా, పారిశ్రామికంగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు మన పూర్వీకులు అనుసరించిన విధానాలనే ఇప్పటి నవ భారత దేశం కూడా అనుసరించాలని, తద్వారా ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కేందుకు ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలకు భారత్ సరైన ప్రత్యామ్నాయాన్ని అందించాలని ఆయన సూచించారు. చిల్లర వర్తక (రిటైల్) రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందని, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడంపై చర్చ దేనికని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారత్‌ను నియంత్రించేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నట్టయితే వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రభూమి దిన పత్రిక సౌజన్యంతో
అవసాన దశలో ఆర్థిక వ్యవస్థ - మాన్య శ్రీ మోహన్ జి భాగవత్
Reviewed by JAGARANA
on
9:55 AM
Rating:
No comments: