విహెచ్‌పి అయోధ్య 84-కోసి పరిక్రమ యాత్ర పై యుపి సర్కార్ కొరడా - అయిన ప్రారంభమయిన యాత్ర
- తొగాడియ , సింఘాల్ జీ లతోపాటు 500 లకు పైగా సాధువుల అరెస్టు
- తీవ్ర నిర్భందాన్ని కూడా దాటుకుని ప్రారంభమైన యాత్ర
- సాదువులపై నిర్భందానికి వ్యతిరేకంగా నేడు దేశ వ్యాప్త ఆందోళనకు డా ప్రవీణ్ తొగాడియా పిలుపు
- యాత్ర కొనసాగితిరుతుందన్న విశ్వ హిందూ పరిషద్
' అయోధ్యాజి హం ఆఎంగ్యే ' అని నినదిస్తున్న సాధువులు |
అయోధ్య/లక్నో, ఆగస్టు 25: ఉత్తరప్రదేశ్‌లో విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) చేపట్టిన వివాదాస్పద యాత్రను నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం యాత్రను అడ్డుకోవడానికి ప్రవీణ్ తొగాడియా, అశోక్ సింఘాల్ లాంటి విహెచ్‌పి అగ్రనేతలతో పాటుగా వందలాది మంది కార్యకర్తలను అరెస్టు చేసింది. మరోవైపు ఆదివారం విహెచ్‌పి అయోధ్యలో ఈ యాత్రను లాంఛనంగా ప్రారంభించింది. తొగాడియాను అయోధ్యలో అరెస్టు చేయగా, సింఘాల్‌ను లక్నో విమానాశ్రయంలో కస్టడీలోకి తీసుకున్నారు. స్వామి రామభద్రాచార్యతో కలిసి ఢిల్లీ నుంచి లక్నో వచ్చిన సింఘాల్ తాను అయోధ్యకు వెళ్లి తీరుతానని పట్టుబట్టడంతో ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, చౌరాసి కోసి పరిక్రమ యాత్రపై విధించిన నిషేధానికి నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేపట్టనున్నట్లు అయోధ్యలోని గోలాఘాట్ ప్రాంతంలో తనను అరెస్టు చేసిన వెంటనే తొగాడియా చెప్పారు. ఇది రాజకీయ యాత్రకాదని, మతపరమైన యాత్ర అని, నిషేధాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలను కానీ ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని ఆయన విలేఖరులతో అన్నారు. ఈ ఉద్యమం దేశంలోని ప్రతి గ్రామానికి చేరుతుందని, రేపు దేశవ్యాప్తంగా జిల్లా ప్రధాన కేంద్రాల్లో ధర్నాలు జరుపుతారని ఆయన చెప్పారు.
కాగా, అంతకుముందు యుపి ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకోవడానికే నిర్ణయించుకున్న విహెచ్‌పి నాయకుడు నృత్య గోపాల్ దాస్ అయోధ్యలోని తన ఆలయం వెలుపల పది అడుగులు నడిచి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ఆ వెంటనే పోలీసులు ఆయనను అరెస్టు చేసారు. ‘మేము యాత్రను ప్రారంభించాము. అయితే ఈ యాత్రను రాజకీయం చేయరాదు. ఈ యాత్రను ఏడాదిలో 12 నెలలూ కొనసాగిస్తాం’ అని గోపాల్‌దాస్ అన్నారు. తొగాడియా, సింఘాల్‌లనే కాకుండా అధికారులు 500 మందికి పైగా విహెచ్‌పి కార్యకర్తలను అరెస్టు చేసారు. అరెస్టయిన వారిలో ఒక బిజెపి మాజీ ఎంపి, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. విమానాశ్రయం వదిలి బైటికి రావద్దని అధికారులు కోరడంతో మండిపడిన సింఘాల్ తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో, తాను ఏం తప్పు చేసానో అధికారులు చెప్పి తీరాలని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మొగలుల పాలన ఉందని, అది సాధువులు, సంత్‌లు ప్రార్థనలు చేయకుండా ఆపుతున్నదని ఆయన అన్నారు. మీరు తిరిగి ఢిల్లీ వెళ్తారా అని అడగ్గా, ‘నేనెందుకు వెనక్కి వెళ్లాలి.. నేను అయోధ్యకు వెళ్లడానికే వచ్చాను’ అని ఆయన ఎదురు సమాధానం ఇచ్చారు. పెద్ద సంఖ్యలో విహెచ్‌పి కార్యకర్తలు విమానాశ్రయం వెలుపల రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ నిరసన ప్రదర్శనలు జరిపారు. యాత్ర ప్రారంభం కావడానికి ముందు బిజెపి మాజీ ఎంపి రామ్ విలాస్ వేదాంతిని, ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్‌చంద్ర యాదవ్‌లను అరెస్టు చేసారు. ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో పరిక్రమ యాత్రకోసం తన ఇంటి నుంచి బయలుదేరినప్పుడు వేదాంతిని అరెస్టు చేయగా, రామచంద్ర యాదవ్‌ను కూడా అయోధ్యలోనే అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. విహెచ్‌పి నేతల అరెస్టులు దురదృష్టకరమని, యాత్ర మతపరమైన వ్యవహారమని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని బిజెపి ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ చెప్పారు.
కాగా, సమాజ్‌వాది పార్టీ నిషేధించినప్పటికీ యాత్రను జరిపి తీరతామని విహెచ్‌పి ప్రకటించిన నేపథ్యంలో అయోధ్యలో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. పట్టణంలో షాపులన్నిటినీ మూసివేయడంతో పాటు యాత్ర ప్రారంభించే నయాఘాట్ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టడంతో పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. రాష్టవ్య్రాప్తంగా యాత్రలో పాల్గొనడానికి వెళ్తున్న 500 మందికి పైగా విహెచ్‌పి కార్యకర్తలను అరెస్టు చేశామని, అయోధ్యలో యాత్రను అడ్డుకోవడానికి గట్టి భద్రతా ఏర్పాట్లు చేసామని రాష్ట్ర పోలీసు శాంతిభద్రతల విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ చెప్పారు. పోలీసులు అరెస్టు చేసిన ప్రముఖుల్లో విహెచ్‌పి ప్రాంతీయ కో ఆర్డినేటర్ సావిత్రీ బాయి ఫులె, మహంత్ సంతోష్ దాస్ అలియాస్ సత్తుబాబా, మహంత్ రామ్‌శరణ్ దాస్ ప్రభృతులున్నారు. ముందుజాగ్రత్త చర్యగా అమేథీలో సగ్ర ఆశ్రమం పీఠాధిపతి అభయ్ చైతన్య వౌని మహరాజ్‌ను గృహనిర్బంధంలో ఉంచారు
ఆంధ్రభూమి దిన పత్రిక సౌజన్యంతో
విహెచ్‌పి అయోధ్య 84-కోసి పరిక్రమ యాత్ర పై యుపి సర్కార్ కొరడా - అయిన ప్రారంభమయిన యాత్ర
Reviewed by JAGARANA
on
10:05 AM
Rating:
No comments: