Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

‘ఖబడ్దార్ పాక్, కాశ్మీర్ ఖాళీచెయ్!’

పికేఎం వీరాజీ, ఆంధ్రభూమి దినపత్రిక, అక్టోబర్ 5, 2015


పాకిస్తాన్‌లో తమ ఆబోరు దక్కించుకుని సైన్యానికి సంతోషం యివ్వటానికి- పాకిస్తాన్ ‘ప్రధానమంత్రి’ యిప్పుడు అతని పేరు- నవాజ్ షరీఫ్- గతంలో మరికొందరు- ఇలా ఎవరున్నా సైన్యాన్ని ప్రసన్నం చేసుకోడానికి సమితి వేదిక మీదికెక్కి- ‘‘కాశ్మీర్‌ను భారత్ ఆక్రమించుకున్నది’’-అంటూ అరుస్తారు. మనం ఆక్రమిత కాశ్మీర్ అం టే, వాళ్లు ఆ ముక్కని - ‘ఆజాద్ కాశ్మీర్’ అంటూంటారు.

ఇది 70 సంవత్సరాలుగా- జవహర్‌లాల్‌గారి అంతర్ జాతీయ దృక్పథం పుణ్యమా అని, రావణాసురుడి కాష్టమే అయిపోయింది. ఎన్ని గవర్నమెంట్లు మారినా, రుూ తలకాయ నొప్పికి మందు మాత్రం కనిపెట్టబడలేదు. ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య అసలు పేచీ రుూ కాశ్మీరే! పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్- అప్పటి పరిస్థితుల్లో- ‘‘తటస్థంగా’’ వుండటంకోసం ఒక ఒప్పందం అవసరమయింది. అది ఇండియన్ పరిపాలకులు ఆదినుంచీ మతంతోనూ, మైనారిటీలతోను ముడిపెట్టుకుని (ఇష్! మన సెక్యులర్ విధానం దెబ్బతింటుంది) పాము చావకుండా, కర్ర విరగకుండా బండి లాగించేస్తూ పబ్బం గడుపుకుంటున్నది.

‘టైమ్ లైన్’లో వెనక్కి వెళ్తే- కాశ్మీర్ సమస్య పరిష్కారానికి- అమీ, తుమీ తేల్చుకోడానికి ఏ గవర్నమెంటూ ముందుకు రాలేదు. సమితి వేదిక మీదికెక్కి- ‘‘నాన్నా, పులి, నాన్నా పులి!’’లాంటి అరుపులు అరుస్తూ- అటు పాకిస్తాన్, ఎంచక్కా రుూ ఆక్రమిత కాశ్మీర్‌ను ఒక ‘ఉగ్రవాద శిబిరం’ చేసేసుకుంది. అవతల ప్రక్క కాశ్మీర్‌లో- అసలు కాశ్మీరీలు వున్నారా? అంటే ఇప్పుడు ‘అసలు’ జనాల్ని పంజాబీ పాకిస్తానీయులు- ‘రీప్లేస్’ చేసేశారు. అక్కడ ‘నాన్’కాశ్మీరీలే ఎక్కువట!

ఇండియా మీద నిప్పులు ఎత్తిపోయడానికి యిదో ‘అడ్డా’అయిపోయింది. అసలు, బాగా వెనక్కి వెళ్లిచూస్తే- అలనాటి ‘అమృతసర్’ ఒప్పందం ప్రకారం- మార్చి 1846న అప్పటి ఆ ప్రాంతీయ రాజు- గులాబ్‌సింగ్‌గారు- బ్రిటిష్, ఇండియా- ‘‘ఈస్ట్ ఇండియా కంపెనీ’’ దగ్గర కొనుక్కున్నాడు. అప్పుడు దానికి జమ్మూ అన్న పేరుందేమోగానీ, కాశ్మీర్ అన్నమాటే లేదు. ఈస్టిండియా కంపెనీకి, నాటి కింగ్- డెబ్భయి అయిదు లక్షల ‘నానక్ షాషీ’ రూపాయలు చెల్లించి, హస్తగతం చేసుకున్నాడు. అప్పటికి, ఆంగ్లో-సిఖ్ యుద్ధం చల్లారిపోయింది. ఆ విధంగా పరిష్కరింపబడిన ప్రాదేశిక, ప్రాంత తగాదాలలో సింధు నదికీ, ‘రావి’ నదికీ మధ్యగల ప్రాంతం అని మాత్రం ఒక యూనిట్‌గా పేర్కొన్నారు. తరువాత లడఖ్, జమ్మూకాశ్మీర్ ప్రాంతాలు అంటూ ఏర్పడ్డాయి. కథ అలా సాగి సాగి 1932లో షేక్ అబ్దుల్లా అనే, నెహ్రూగారి ‘‘జిగ్రీ దోస్త్’’- ‘‘ఆల్‌జె అండ్ కె’ ముస్లిం కాన్ఫరెన్స్ అనే పార్టీ పెట్టాడు. అప్పటికి ఇండియా- దటీజ్ భారత్. ఇలా రూపుకట్టలేదు. కానీ, 1946లో షేక్ అబ్దుల్లాగారు ‘క్విట్ కాశ్మీర్’ అంటూ అరవడం మొదలెట్టాడు.

సరిగ్గా అదే నినాదం, యివాళ ఇండియా- పాకిస్తాన్‌ని ఉద్దేశించి ‘‘ఎలుగెత్తి’’ చాటాల్సి వుంది. అది చెయ్యలేక సమితిని శరణుజొచ్చారు. ‘తటస్థ స్థితి’ అంటూ సమితి చేసిన గడుసు ఒప్పందం క్రమేపీ గుఱ్ఱపు డెక్కలాగా అల్లుకుపోయింది. జనాలు అబ్దుల్లాకు జేజేలు కొట్టారు గానీ పాకిస్తాన్‌కు మాత్రం కాదు. ఈ సంగతి నేటికీ ‘‘కన్ఫ్యూజన్’’- అది అలా ముదిరి ముదిరి యివాళ పాకిస్తాన్ తన ముల్లె ఏదో యిండియా దోచేకుంటున్నట్లు గోల మొదలెట్టింది.

నిజానికి యివాళ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను- టెర్రరిజం వ్యాప్తికి బేస్‌గా వాడుకుంటున్నది అన్న సంగతి అందరికీ తెల్సుగానీ దురదృష్టవశాత్తూ- మన దేశానికి ప్రపంచ వేదికల మీద వాయిస్ అంటే అంత పలుకుబడి లేదు. వ్యక్తిగతంగా- మహా పురుషులుగా పెరిగిపోయే నాయకులే గానీ- పాకిస్తాన్‌నీ, చైనానీ, ప్రపంచ సభ్య దేశాలచేత- ఛడామడా ‘తిట్టించలేరు’ ఎంతసేపూ సన్నాయి నొక్కులు- ‘‘పుట్టమీద కొట్టిన భుజంగంబు చచ్చునా?’’ అన్నాడు కవి-

అసలు ‘పాకిస్తాన్ ఒక భుజంగం’అని ప్రపంచం చేత అనిపించలేకపోవడం ‘ఇండియన్ డిప్లొమసీ’ వైఫల్యం, కానీ మొన్న సమితి సభలో నవాజ్ కుటిల వాక్కులు ఇండియాని తట్టిలేపాయి. ఇవాళ గవర్నమెంట్ మారింది. ‘ఉల్టేచోర్ కొత్త్వాల్ కో డాంటో’ అన్నట్లు పాకిస్తాన్ ఇండియాని తప్పుపట్టడం ఏమిటి? అన్న వివేకం యిన్నాళ్లకి కలిగింది. మన విదేశాంగ శాఖ ధైర్యంగా పాకిస్తాన్‌తో- ‘‘బాబాయ్! కాశ్మీర్‌లో నువ్వు తిష్ఠవేసిన ప్రాంతం నీ ‘యబ్బముల్లేం’కాదు. ముందు అక్కణ్నుంచి లేచిపో- అంటూ ఒక కేక వేసింది- గ్రేట్!

అమ్మో! పాక్ దగ్గర అణుబాంబులున్నాయి- అన్న భయం చాలామంది కల్పిస్తున్నారు. అంటే పాకిస్తాన్ రుూ ‘‘తగాదా ప్రాంతాన్ని’’ కేవలం టెర్రరిస్టులకోసం దక్కించుకోడానికి అణుబాంబులు మనమీద విసురుతుందా? మొత్తం పాకిస్తాన్ అంతా ఒక ‘‘ఆత్మాహుతి దళం’’ అవుతుందా? ఆ విధంగా? ఇవన్నీ డొంక తిరుగుడు కబుర్లు, చైనాకి- అడుగులకు మడుగులొత్తుతూ ఇండియా మీద ‘నిష్కారణ కక్ష’ తీర్చుకోడానికి పాక్ ఆడే ‘‘గేమ్’ ప్రమాదకరం- అంటూ వివాళ సుష్మా ఆధ్వర్యంలోగల మన విదేశాంగశాఖ చెప్పడం గొప్ప సంగతి. ఇండియా తన వేపు వున్న కాశ్మీర్‌కి ప్రత్యేక ‘‘హోదా’’, రాజ్యాంగం పైకం పెట్టుబడీ, కల్చర్, బిజినెస్- అన్నీ యిచ్చింది. పాకిస్తాన్ అక్కడి వారికి ఏమిచ్చింది? ‘‘బ్రెయిన్ వాష్’’ యిస్తోంది. సో... సరియైన భాష ప్రయోగానికి యివాళ మనవాళ్లు ధైర్యం చేశారు. పాకిస్తాన్ ముందు- ‘టెర్రరిస్ట్‌ల్ని త్రోలేయ్’అన్న పాత స్లోగన్‌కి బదులు- ‘నువ్వే ఆక్రమిత కాశ్మీర్‌ను ఖాళీచెయ్’ - లాంటి ‘మాటలాట’ మొదలెడదాం- అన్నది, సరైన ధైర్యం వున్న ‘‘మాట’’ చావుకి పెడితే గానీ లంఖణాలకి దిగదు...

బెటర్ ఆస్క్ పాక్ టు ‘‘క్విట్ కాశ్మీర్’’

‘ఖబడ్దార్ పాక్, కాశ్మీర్ ఖాళీచెయ్!’ Reviewed by rajakishor on 9:27 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.