Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

"టైమ్స్ ఆఫ్ ఇండియా" కాదు "టెర్రరిస్ట్ ఆఫ్ ఇండియా"

వీక్ పాయింట్, ఆంధ్రభూమి, జూలై 8, 2015

అతడు ఎనిమిదేళ్ల తరవాత మళ్లీ ముంబయికి వచ్చాడు. కాని - ఇచ్చిన మాట ప్రకారం తన ముద్దుల కూతురును దగ్గరికి తీసుకోవడానికి కాదు. గురువారం యాకుబ్ పార్థివదేహం మహీమ్ చేరినప్పుడు ఆకాశంలో కారుమబ్బులు కమ్మాయి... అతడికి అంతిమ వందనాలు అర్పించడానికి కాసేపట్లో అక్కడ గుమికూడబోయే వేలాది ప్రజల ఉద్విగ్న మనఃస్థితికి అద్దంపడుతున్నాయా అన్నట్టు.

ఏమిటిది? ఒక గొప్ప దేశభక్తుడి అంతిమయాత్ర గురించిన అద్భుత వర్ణనా? ఒక మహానాయకుడికో, ప్రజలకు ఆరాధ్యుడైన పోరాట వీరుడికో జాతి అర్పించిన భావోద్వేగ భరిత అశ్రునివాళికి అక్షర రూపమా?

కాదు. ఇరవై రెండేళ్ల కింద ముంబయిలో జనసమ్మర్దంగల 13 చోట్ల ఆర్డీఎక్స్ కూరిన బాంబులు వరసగా పేల్చి ఏ పాపమెరుగని 257 మంది అమాయకుల ప్రాణాలు బలిగొని, 1400 మందిని జీవితాంతం వికలాంగులను కావించిన ఘోర నేరానికి ఉరితీయబడ్డ ఒక నరపిశాచిని పాతిపెట్టే నికృష్ట సన్నివేశానికి - టైమ్స్ ఆఫ్ ఇండియా అనే అగ్రశ్రేణి జాతీయ దినపత్రిక మొదటి పుటలో కడుపు దేవేంత కడురమ్యంగా పెట్టిన కవితాత్మక వార్తాశోకమిది.

కన్నతల్లిని కళ్ళ చూడాలన్న కడపటి కోరిక తీరకుండానే, ఖురాన్ వాక్కులు పఠిస్తూ యాకుబ్ మెమన్ ఎంత ధీరోదాత్తంగా ఉరికంబమెక్కాడు... ఆ కిందటి రాత్రి ఎలా గడిపాడు, ఏమి తిన్నాడు, ఏమి తినలేదు... వగైరా అతి ముఖ్య వివరాలను దివ్యదృష్టితో చూసి... పేజీలకు పేజీలు ఆ అమరవీరుడి దివ్యస్మృతికి అంకితం చేసి... దేశంలోకెల్లా పెద్దదని చెప్పుకునే మేటి ఆంగ్ల దినపత్రిక ప్రజలపట్ల బాధ్యతను, వృత్త్ధిర్మాన్ని... మొత్తం పత్రికా సమాజం సిగ్గుతో తలవంచుకోవలసినంత అత్యద్భుతంగా నిర్వర్తించింది.

యాకుబ్ మెమన్ మహమ్మదీయుడు కనుకే అతడిని ఉరి తీస్తున్నారని మతోన్మాద వర్గ నాయకులు నోరు పారేసుకున్నారు కాబట్టి... ఆ మహనీయుడి ఉరితీతకు ముస్లిం సమాజం యావత్తూ విషాద సముద్రంలో మునిగిందన్న రీతిలో మోతుబరి పత్రిక మొదటి పేజీలో ఓవరాక్షను బ్రహ్మాండంగా చేసింది సరే. 

అదే రోజు ఇదే దేశంలో ఇంకో మహమ్మదీయుడి అంతిమ యాత్ర కూడా జరిగింది. మతంతో, ప్రాంతంతో, వర్గాలతో నిమిత్తం లేకుండా నూటపాతిక కోట్ల భారతీయులూ ఆత్మబంధువులా, ఆదర్శపురుషుడిలా అభిమానించిన మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం అంత్యక్రియల వార్తను ఈ గొప్ప పత్రిక ఎలా ఇచ్చింది? 13వ పేజీలో పారేసింది!

అంటే... మన మహాపత్రిక దృష్టిలో అబ్దుల్‌కలాం కంటే యాకుబ్ మెమనే గొప్పవాడు. అతడే అసలుసిసలు జాతీయవీరుడు.
వందల మంది ప్రాణాలు తీసిన ఒక టెర్రరిస్టు నికృష్ణుడికి వీరపూజ చేసే వికృత పైత్యానికి ఒక్క టైమ్స్ ఆఫ్ ఇండియాదే గుత్త్ధాపత్యం కాదు. కుడి ఎడమ తేడాల్లో దేశంలోని చాలా పత్రికలూ, టీవీ చానెళ్లూ యాకుబ్ వీరుడి ఆరాధనలో విచ్చలవిడిగా చొక్కాలు చించుకున్నవే.

ఉదాహరణకు ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అనే దక్షిణాది దినపత్రిక కలాం ఊసే ఎక్కడా లేకుండా మొదటిపేజీ అంతా యాకుబ్ స్మరణతో నింపింది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అదే ఉత్తరాది పత్రిక పెట్టిన పతాక శీర్షిక: And They Hanged Yakub (వాళ్లు యాకుభ్‌ని ఉరి తీశారు) అని. అత్యున్నత న్యాయవ్యవస్థ ఇవ్వవలసిన అవకాశాలన్నీ ఇచ్చి, ఒకటికి రెండు మార్లు పునః పరిశీలించి అత్యంత జాగ్రత్తతో చేసిన న్యాయ నిర్ణయం ప్రకారం సర్వసత్తాక భారత ప్రభుత్వం అమలు జరిపిన ఉరి శిక్షను... అదేదో జాతి శత్రువులో, అసాంఘిక శక్తులో చేసిన పని అయినట్టు ‘వాళ్లు ఉరి తీశారు’ అని చెప్పటమే పోస్ట్‌మాడరన్ జర్నలిజం!

ఉరి తీశాక శోకాలు పెట్టటం ఒకటే కాదు. మెమన్ గాడి ఉరి ఆపటానికీ మన మీడియా మల్లులు, మెదళ్లలో జిల్లేళ్లు మొలిచిన బుద్ధిలేని బుద్ధి జీవులు శాయశక్తులా పాటుపడ్డారు. న్యాయవ్యవస్థ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి చేతనైన మాయలన్నీ పన్నారు. వందల సంఖ్యలో జనాన్ని చంపిన బాంబులను తన ఇంట్లో తానే తయారు చేసినట్టు, శత్రుదేశం నడిపిన కుట్రలో తనకు ప్రమేయం ఉన్నట్టు నేరస్థుడే ఒప్పుకున్నా, అతడిని అన్యాయంగా ఇరికించినట్టు మతిలేని మేధావులు గుండెలు బాదుకున్నారు. ఆ వాదంలో పసలేదని అర్థమయ్యాక పేలుళ్ల పాపంలో భాగం ఉన్న మిగతా వాళ్లు దొరక లేదు కాబట్టి దొరికిన ఈ ఒక్కడినే ఉరి తీయటం అమానుషమని కొత్త రాగం ఎత్తుకున్నారు. బాబరీ మసీదును కూల్చటానికీ, ముస్లింలపై హింసాకాండకు ప్రతీకారంగానే బాంబులు పేలాయి కనుక. అసలు కేసుల్లో దోషులను వదిలేసి, పేలుళ్ల వాడినే ఉరి తీయటం ముస్లింలపై దుర్మార్గపు దాడి అంటూ అడ్డమైన ఆర్గ్యుమెంట్లు వినిపించారు. కరాచీ పారిపోతూ నేపాల్‌లో పట్టుబడిన టెర్రరిస్టును... బేరమాడుకుని లొంగిపోయిన వాడిగా చిత్రించారు. న్యాయపరంగా పునస్సమీక్షకు అన్ని అవకాశాలూ ఖర్చయ్యాక కూడా రాజ్యం మీద యుద్ధం ప్రకటించిన దేశద్రోహిని క్షమించమంటూ పిటీషన్లు పెట్టారు. 15 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దశలవారీగా అపీలు, రివ్యూ, క్యురేటివ్ పిటీషనులన్నీ పరిశీలించి, అవసరం లేకపోయినా ఆ తరవాతా తెల్లవారు ఝాము దాకా కూచుని చేసిన ధర్మనిర్ణయాన్ని కొనగోటితో కొట్టిపారేశారు. ఎలాగైనా మోదీ ప్రభుత్వాన్ని మోదాలన్న తమ ఏకసూత్ర కార్యక్రమంలో భాగంగా వెయ్యాల్సిన వేషాలన్నీ వేశారు. హిందూ వ్యతిరేక ‘ది హిందూ’ పత్రిక నాయకుడు... తక్కుంగల మీడియా పెద్ద తలకాయలు, లిబరల్, లెఫ్టిస్టు, ప్రజాతంత్ర, ప్రగతిశీల వగైరా భుజకీర్తుల రాజకీయులూ మొత్తానికి తలా ఒక చెయ్యి వేసి వందల మందిని కాటేసిన టెర్రరిస్టు విషసర్పాన్ని పాలుపోసి పెంచకపోతే పాపమంటూ నానా యాగీ చేశారు. షహీద్ భగత్‌సింగ్‌కు కూడా ఉరి కంబమెక్కినప్పుడు బహుశా ఇంత ప్రచారం వచ్చి ఉండదు. అతడి ఉరి ఆపమంటూ ఇన్నిన్ని గొంతులు ఇంతలేసి లేచి ఉండవు.

నేరానికి తగ్గ శిక్ష వెయ్యాలన్న ప్రాథమిక న్యాయసూత్రాన్ని తుంగలో తొక్కు. నరరూపరాక్షసుడు చంపిన వందలమందికి జరిగిన ఘాతుకాన్ని పట్టించుకోకు. తోటి మానవుడి ఉసురు తీయటం ఎంత అనాగరికమన్నదే ఎంతసేపూ ఆలోచించు. ఇదీ మన మెదళ్లు పుచ్చిన మేధావుల ఉపదేశ సారం.

"టైమ్స్ ఆఫ్ ఇండియా" కాదు "టెర్రరిస్ట్ ఆఫ్ ఇండియా" Reviewed by rajakishor on 2:31 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.