"ఘర్ వాపసి" ఈనాటిది కాదు !
హిందూ ధర్మం నుండి అన్యమతాలలోకి మారినవారిని తిరిగి హిందూధర్మంలోకి తీసుకురావడం గురించి "ప్రబుద్ధ భారతి" పత్రిక ప్రతినిధి 1899 ఏప్రిల్ లో స్వామీ వివేకానందతో చేసిన సంభాషణ ఇలా ఉంది [The Complete works of Swami Vivekananda, Vol.V. pp.233 - 234]:
ప్రతినిధి: ‘‘హిందూ మతానికి దూరమైన వాళ్ల గురించి చెప్పండి స్వామీ! వారిని వెనక్కి తీసుకోవాలని మీ అభిప్రాయమా?’’ అని అడిగాడు స్వామి వివేకానందను 1899 ఏప్రిల్‌లో ‘‘ప్రబుద్ధ భారత’’ పత్రిక ప్రతినిధి.
వివేకానంద: ‘‘కచ్చితంగా! వారిని వెనక్కి తీసుకోవచ్చు. తీసుకుని తీరాలి కూడా’’ అని కాసేపు ఆలోచించి ‘లేకపోతే మన సంఖ్య తగ్గిపోతుంది. మహమ్మదీయ చరిత్రకారులందరిలోకీ పాతవాడైన ఫెరిస్టా చెప్పిన దాని ప్రకారం మహమ్మదీయులు వచ్చే నాటికి దేశంలో అరవై కోట్ల హిందువులుండేవారు. ఇప్పుడు మనం సుమారు ఇరవై కోట్ల మందిమి. హిందూ సమాజం నుంచి ఒకడు బయటికి వెళుతున్నాడంటే మనకు ఒకడు తగ్గడమే కాదు. ఒక శత్రువు పెరుగుతున్నాడు".
‘‘పైగా ఇస్లాంలోకో, క్రైస్తవంలోకో వెళ్లినవారు కత్తి భయానికి చేరినవారు. వారి వంశీకులే ఇప్పటివాళ్లు. వారిని తక్కువగా చూడటం అన్యాయం’’ అన్నాడు స్వామి.
ప్రతినిధి: ‘‘మరి పుట్టుక నుంచీ విజాతీయులైన వారి సంగతో?’’
వివేకానంద: ‘‘ఒకప్పుడు వారూ హిందువులే. గుంపులుగా మతం మార్చబడ్డవాళ్లే. అదే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది’’
ప్రాయశ్చిత్తాల గురించి వారి సంభాషణ ఇలా సాగింది:
వివేకానంద: ‘‘ఇష్టపడి వేరే మతంలోకి వెళ్లినవారు స్వధర్మానికి తిరిగి వస్తామంటే ప్రాయశ్చిత్త కర్మకాండ చేయడం అవసరమే. కాని కాశ్మీర్, నేపాల్‌లో రాజ్యం మొత్తం అన్య మతస్థుల కైవసం కావడం మూలంగా మనకు దూరమైన వారికి ప్రాయశ్చిత్తం విధించకూడదు. అలాగే జన్మతః విదేశీయులై ఇష్టపడి మనలో చేరగోరే వారికి కూడా ప్రాయశ్చిత్తంతో పనిలేదు’’
ప్రతినిధి: ‘‘మతంలోకి తిరిగి వచ్చేవారు ఏ కులానికి చెందుతారు స్వామీ? వారికంటూ ఒక కులం ఉండాలి. లేకపోతే హైందవ బృహత్ వ్యవస్థలో వారెప్పటికీ కలిసిపోలేరు కదా?’’
వివేకానంద: ‘‘మన నుంచి వెళ్లిపోవడానికి ముందు వారిది ఏ కులమో, అ కులాన్ని తిరిగి వచ్చాక వారు పొందుతారు. కొత్తగా చేరేవారికంటూ వేరే ఒక కులం ఉండాలి. వైష్ణవ మతంలో ఈ పని ఇప్పటికే జరిగింది. వివిధ కులాల నుంచి, వేరే జాతుల నుంచి వైష్ణవంలో చేరినవారు ఆ పతాకం కింద కూడి, తామే ఒక కొత్త కులంగా ఏర్పడ్డారు. అది ఎంతో గౌరవపాత్రమైంది కూడా. రామానుజుల నుంచి వంగ దేశంలో చైతన్య వరకూ గొప్ప వైష్ణవాచార్యులందరూ అలాగే చేశారు.’’
ప్రతినిధి: ‘‘మరి పేర్ల సంగతేమిటి? విజాతీయులకు, అన్య మతాలలోకి వెళ్లినవాళ్లకు హిందూ మతంలోకి వచ్చాక కొత్త పేర్లు పెట్టాలి కదా? కులసంబంధమైన పేర్లు వారు పెట్టుకోవచ్చా?’’
వివేకానంద: ‘‘తప్పకుండా. పేరులోనే చాలా ఉంది’’
శతాబ్దాలుగా మనదేశంపై జరిగిన విదేశీ దండయాత్రలను రెండు రకాలుగా విభజించవచ్చు. గ్రీకులు, శకులు, హూణులు, యవనులు జరిపిన దండయాత్రలు. వీరిని మనం సమర్థవంతంగా ఎదుర్కొని ఓడించేం. మిగిలినవారిని మనలో కలిపేసుకోగలిగేం. కానీ అరబ్బులు, మొఘలాయిలు, పోర్చుగీసు వారు, డచ్ దేశస్థులు, బ్రిటిష్ వారు జరిపిన దాడులు అంతకు ముందు జరిగిన దాడుల కన్న భిన్నమైనవి. వారు తమతో పాటు తమ మతాలను వెంటబెట్టుకు వచ్చేరు. మనదేశంలో సాంస్కృతిక విధ్వంసం సృష్టించేరు.
విదేశీ దురాక్రమణదారులను పరాక్రమంతో ఎదిరించడము, స్వధర్మ రక్షణలో బలిదానాలు చేయడం మాత్రమే కాదు వారిని తనలో కలుపుకోవడంలో కూడా హిందూ సమాజం ఎప్పుడూ సిద్ధంగానే ఉండేది.
భారతదేశంపైకి దండెత్తి వచ్చిన అలేగ్జాండర్ సేనాధిపతి సెల్యూకస్ ని ఓడించిన మౌర్య చంద్రగుప్తుడు అతడి కూతురిని వివాహం చేసుకుంటాడు. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో ఉత్తర భారతాన్ని ఆక్రమించుకున్న శకులను శాతవాహన మహారాజు తల్లి ఆదేశంతో ఆ శకరాజు కూతురు జయశీలను వివాహం చేసుకుంటాడు.
వేల సంవత్సరాల చరిత్రలో ఎందరో విదేశీయులు తనపైకి దండెత్తి వచ్చి, ఎన్నెన్ని మతాలను, విశ్వాసాలను తనపై రుద్దాలని ఎంతగా చెలరేగినా, కాలక్రమంలో ఆయా విజాతీయులను, వారి తెగలను, మత విశ్వాసాలను తన నిరంతర జీవన స్రవంతిలో భారతదేశం కలిపేసుకోగలిగింది. యవనులు, హూణుల వంటి తొలి తరాల ముష్కరులు మాత్రమే కాదు; మహమ్మదీయుల తొలి దండయాత్రలను కూడా ఆర్యావర్తం తట్టుకుని నిలబడింది. తన మతం మార్చజూసిన ముసల్మాన్లనే నెమ్మదిగా తన మతంలో కలిపేసుకుంది.
క్రీ.శ.712లో పర్షియా పాలకుడి తరఫున మహమ్మద్‌బిన్ కాశిం హిందూ రాజ్యమైన సింధ్ పైకి దండెత్తాడు. రాజధాని దేవళ్ నగరంలోని పురుషులందరినీ నిశ్శేషంగా నరికేశాడు. మహిళలను చెరబట్టి బానిసలుగా మార్చాడు. అలోర్, నిరుణ్, ముల్తాన్, కిరాజ్ నగరాల మీదా విరుచుకుపడి దేవాలయాలను, బౌద్ధారామాలను నాశనం చేసి, ఎదిరించిన వారినల్లా ఊచకోత కోసి, స్త్రీ బాల వృద్ధులను వేల సంఖ్యలో బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్పించాడు. దేవాలయాలను పడగొట్టి వాటి శిథిలాల మీద మసీదులను కట్టించి, ఎక్కడికక్కడ ముస్లిం గవర్నర్లను నియమించి ముప్పూటలా నమాజ్ ఘోషతో దిక్కులు మారుమోగుతుండగా మూడేళ్ల తరవాత స్వదేశానికి తిరిగి వెళ్లాడు.
కాశీం తిరిగి వెళ్ళిన తరువాత సింథ్‌లో అరబ్ ప్రాభవం క్షీణించడమే గాక కొత్తగా మతం మారిన వారిలో అత్యధిక సంఖ్యాకులు తమ పూర్వ ధర్మంలోకి తిరిగి వెళ్లారు. కస్సాలో మినహా భారత ప్రజలు విగ్రహారాధనకు మరలిపోయారు. ఇది స్వయానా చూసిన అల్ బైలాదురి అనే చరిత్రకారుడు "ముసల్మాన్లకు భద్రత కరవైంది" అని చెప్పాడు. "ఇస్లాం" గంధకర్త అయిన సర్ డెన్‌సియన్ రాస్, "ఆతరువాత సింధునది పడమటి తీరంలోని ముస్లింలు కూడా హిందూధర్మంలో చేరిపోయారు. సింధ్‌లో ముస్లిం రాజధాని అయిన మన్సురాలో వారు హిందూధర్మాన్ని స్వీకరించారు" అని వ్రాసాడు. మహమ్మద్ బిన్ కాశిం దండయాత్ర తరవాత పన్నెండేళ్ళకు హషీం ఖలీఫా అయ్యేనాటికి సింధ్‌లో మతం మారినవారు దాదాపుగా అందరూ హిందూధర్మంలోకి తిరిగి వెళ్లారు. సింధ్ ప్రాంతంలో ఎన్నో వేల మందిని మెడ మీద కత్తిపెట్టి, బలవంతంగా మహమ్మదీయ మతంలోకి మార్పించినా, క్రమేణా వారందరూ హైందవ ధర్మంలోకి తిరిగి రాగలిగారు. దీనిని బట్టి దౌర్జన్యంగా మతమార్పిడి జరిగిన వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకోగలిగిన ఔదార్యం, విశాల దృక్పథం నాటి హిందూ సమాజంలో ఉందని తెలుస్తుంది.
అన్య మతాలలోకి మార్చబడిన వారిని హిందూ ధర్మంలోకి తిరిగి తీసుకున్న సంఘటనలు చరిత్రలో మనం చూడవచ్చు.
పదవ శతాబ్దంలో దేవలస్మృతి ప్రాచుర్యంలోకి వచ్చింది. బలవంతంగా ముస్లింలుగా మార్చబడిన హిందువులను తిరిగి హిందువులుగా మార్చడానికి మార్గనిర్దేశనం చేసింది. హిందూ స్త్రీలు మ్లేచ్ఛులచేత చెరచబడినా, వారి వల్ల గర్భధారణ అయినా తిరిగి వారిని హిందూ ధర్మంలోకి స్వీకరించవచ్చని దేవలస్మృతి పేర్కొంది. అదే విధంగా 12వ శతాబ్దంలో జీవించిన విజ్ఞానేశ్వరుడు యాజ్ఞవల్కస్మృతిపై భాష్యం వ్రాస్తూ అనేక స్మృతులలోని శ్లోకాలను పేర్కొంటూ హిందూ స్త్రీ మ్లేచ్చుల చేత చెరచబడినా ఆమెను శుద్ధి చేసిన తరువాత ఆమె ఏ కులానికి చెందినదో అదే కులంలోకి స్వీకరించాలని ఆదేశించాడు. ఆ స్మృతినే ఆనాడు ఉత్తర , దక్షిణ భారతాలలో అనుసరించినట్లు తెలుస్తోంది.
క్రీ.శ. 1398-99లలో విజయనగర రాజు దేవరాయలు పొరుగు రాజైన ఫిరోజ్ షాపై దండయాత్ర చేసాడు. అదే సమయంలో ఫిరోజ్ షా రెండు వందల మంది బ్రాహ్మణ యువతులను తన సైన్యంతో చేరబడతాడు. బ్రాహ్మణుల విజ్ఞప్తి మేరకు దేవరాయలు ఫిరోజ్ షాతో సంధి చేసుకుని హిందూ యువతులను విడిపిస్తాడు. ముస్లిం సైనికులచే అపవిత్రం కాబడిన ఆ స్త్రీలను శుద్ధి చేసి తిరిగి హిందూ సమాజం స్వీకరించినట్లు "తాహరిక్ ఫెరిస్తా " పేర్కొంది.
ఒకసారి శివాజీ పన్హాలాగఢ్ ని ముట్టడించాడు. స్వరాజ్య సేనాధిపతి నేతాజీ పాల్కర్ సకాలానికి అక్కడికి చేరుకోలేక పోయాడు. ఫలితంగా ముట్టడి విఫలమైంది. దానికి శిక్షగా పాల్కర్ ని సర్వసేనాపతి పదవి నుండి తొలగించాడు శివాజీ. అందుకు కోపగించి పాల్కర్ ముస్లింగా మారి సర్దార్ మహమ్మద్ కులీఖాన్ పేరుతొ ఔరంగజేబును ఆశ్రయిస్తాడు. తరువాత ఔరంగజేబు ఇతడినే శివాజీపై యుద్ధానికి పంపిస్తాడు. తన తప్పు తెలుసుకున్న నేతాజీ పాల్కర్ పశ్చాత్తాపంతో శివాజీ సన్నిధికి చేరుతాడు. శివాజీ అతడిని తన కుమారుదిగానే ఆదరిస్తాడు. 1676 జూన్ 19న శుద్ధి కార్యక్రమం ద్వారా అతణ్ణి నేతాజీ పాల్కర్ గా హిందూ సమాజంలోకి ఆహ్వానిస్తాడు. అతడికి సమాజంలో సముచిత గౌరవ స్థానం కల్పించేందుకు తన సన్నిహిత బంధువులలో ఒక కన్యను ఇచ్చి వివాహం చేస్తాడు.
చైతన్య మహా ప్రభు ప్రభావంతో చాలామంది మహమ్మదీయులు భక్తి ఉద్యమంలోకి వచ్చి చేరారు. వివేకానంద స్వామి మార్గరెట్ నోబుల్‌కి బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి నివేదితగా పేరు మార్చాడు. మిస్ మాడలైన్ స్లేడ్ మహాత్మాగాంధీ ప్రభావంతో మీరాబెన్ అయింది. అన్నట్టు వీరబ్రహ్మంగారి ముఖ్య శిష్యుడు సిద్దయ్య కూడా మహమ్మదీయుడే.
ఆధునిక కాలంలో ‘శుద్ధి’ ప్రక్రియకు ఆద్యుడు ఆర్యసమాజ్ సంస్థాపకుడు దయానంద సరస్వతి స్వామి. 1877లో డెహ్రాడూన్‌లో జన్మతః మహమ్మదీయుడైన వాడికి వైదిక శుద్ధికరణ చేసి "అలకధారి" అని పేరు పెట్టాడు ఆయన. కాని ఆ దయానందుడు ఒక ఉద్యమంగా ‘పునరాగమన’ ప్రక్రియను చేపట్టలేదు.
మల్కానాలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారూ ఒకప్పుడు హిందువులే. శ్రేష్ఠమైన రాజపుత్ర వంశీకులే. అయితే మొగల్ దండయాత్రల దరిమిలా వారి పూర్వీకులు ఒత్తిళ్లులను, వేధింపులను తట్టుకోలేక తప్పనిసరై ఇస్లాం మతం పుచ్చుకున్నారు. మతమార్పిడి జరిగిన మిగతా వారిలా వారు తమ పూర్వాచారాలను, సంప్రదాయాలను వదులుకోలేదు. ఆఖరికి హైందవ మత చిహ్నాలనూ విడనాడలేదు. హిందువుల్లాగే వారూ శిఖనూ, యజ్ఞోపవీతాన్నీ ధరిస్తారు. ఆచార వ్యవహారాల్లో వారికీ హిందువులకూ తేడా ఉండదు. అసలు వారిని చూసినవారెవరైనా సరే వాళ్ళు ముసల్మాన్లంటే నమ్మరు.
మల్కానాలు హిందూ ధర్మంలోకి తిరిగి రావాలని చాలాకాలంగా తహతహలాడుతున్నారు. ఈ విషయమై వారు దయానంద సరస్వతి శిష్యుడైన స్వామీ శ్రద్ధానందను ఆశ్రయించారు. అప్పటికి పద్ధెనిమిదేళ్ల కింద కొంతమంది మల్కానాలకు ఆర్య సమాజ్ వారు ప్రాయశ్చిత్తాలు చేసి వైదిక మతంలోకి తిరిగి తెచ్చినా రాజపుత్ర సమాజం వారిని తమలో కలుపుకోవడానికి నిరాకరించిన సంగతీ శ్రద్ధానందకు తెలిసిందే. అప్పటి నుంచీ స్వామి శ్రద్ధానంద గట్టి ప్రయత్నాలు చేసి రాజపుత్ర సభ వారికి నచ్చచెప్పి వారి మనసు మార్చేడు. [Hindu Sangathan, Saviour of the Dying Race, Shraddhananda Sanyasi, p.125].
హిందూసమాజం నుండి బయటకు వెళ్ళిన వారిని వెనక్కి తెచ్చుకునే హక్కు హిందువులకు ఉంది. అనేక శతాబ్దాలుగా దేశంలో తమ సంఖ్యను మతమార్పిడుల ద్వారానే ముస్లింలు, క్రైస్తవులు పెంచుకుంటూ వచ్చినప్పుడు అదే పనిని హిందువులు చేస్తే ఎందుకు తప్పు పట్టాలి?
అయితే ఈ ఘర్ వాపసీ లేదా పునరాగమనం లేదా శుద్ధి కార్యక్రమం హిందువుల సంఖ్యను పెంచుకునే మార్గంగా కాకుండా ఒక సామాజిక సంస్కరణ సాధనంగా సాగాలి.
ఆర్య సమాజ స్థాపకులైన దయానంద సరస్వతి పునరాగమనం అనేది హిందూ సమాజం తనని తాను సంస్కరించుకోవడం వంటిదనీ, మన సమాజంలోని లోపాల వల్లనే మన సోదరులు కొందరు మనకి దూరమయ్యే పరిస్థితి దాపురించిందనీ అన్నారు.
"ఘర్ వాపసి" ఈనాటిది కాదు !
Reviewed by rajakishor
on
7:54 AM
Rating:
No comments: