Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

స్వధర్మ నిష్ఠను తెలిపే శ్రీ గురుపౌర్ణమి



గుశబ్దస్త్వంధకారస్యాత్ రుశబ్దస్తన్నిరోధకః 
అంధకారనిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే 
-- ‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే వెలుతురు. చీకటిని పారద్రోలేవాడు గురువు అని ద్వయోపనిషత్తు చెప్తోంది. 

షాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి పేరు చెప్పగానే మనకు సుదీర్ఘమైన సాంస్కృతిక నేపథ్యం గుర్తుకు వస్తుంది.  ఆషాఢ పూర్ణిమనాడు వేదవ్యాసుడు జన్మించినట్టు పౌరాణికమైన కథ ఉంది. ఇతని కాలం నేటికి సుమారు ఐదువేల సంవత్సరాలు. వేదవ్యాసుడు అప్పటికే దుర్గమంగా ఉన్న వేదాలను వింగడించి తన శిష్యులకు అందించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయించాడు. వేదాలు భారతదేశంలోని సరస్వతి నదీ తీరంలో పుట్టినా అవి కేవలం భారతీయులకు మాత్రమే పరిమితమైనవి కావు. అవి విశ్వమానవాళికి చెందిన అనర్ఘ సంపద. విశ్వ శ్రేయస్సు వాటి పరమలక్ష్యం. 

గురుపూర్ణిమనాడు మనం వ్యాసభగవానుని పూజిస్తాం. గురువులు రెండు, మూడు రకాలుగా ఉంటారు. ఒకటి మనకు పాఠం చెప్పిన గురువు. రెండు ఆధ్యాత్మిక గురువు. మూడు మనకు సాంస్కృతిక వారసత్వం అందించిన ఋషి. అందుకే ప్రతి మానవుడికి జన్మసిద్ధంగా మాతృ, పితృ ఋణాలతో పాటు ఋషి ఋణం కూడా సంక్రమిస్తుంది. దీన్ని తీర్చుకోవలసిన బాధ్యత జన్మసిద్ధంగా ప్రతిమానవుడి మీద ఉంటుంది.

వాల్మీకి మహర్షి పుట్టకపోయినట్టయితే రాముడు ఎవరో ఎవరి తెలుస్తుంది? వ్యాసుడు మహాభారతాన్ని రాయకపోయినట్టయితే ఘనశ్యాముడు ఎవరో ఎవరికీ తెలియదు. వ్యాసుడు అష్టాదశ పురాణాలను రచించాడు. భగవద్గీతను అందించాడు. శివ సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్ర నామాలు... ఇవన్నీ వ్యాసుడు అందించినవే కదా! అంటే మొత్తం భారతీయ సంస్కృతికి వ్యాసుడు పెట్టినదే బిక్ష. అందువల్లనే గురుపూర్ణిమను మనం వ్యాసపూర్ణిమ అనే పేరుతో ఆరాధిస్తున్నాము. 

భారతదేశంలో శైవ, వైష్ణవ, గాణాపత్య, సౌర, శాక్తేయ సిద్ధాంతాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఈ సంప్రదాయాలకు చెందినవారందరూ వారి వారి గురువులను ఆషాఢ పూర్ణమి నాడు పూజించుకుంటారు. ఆషాఢ పూర్ణిమనుండి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. అంటే గురువులు, పీఠాధిపతులు, నిరంతరం దేశ సంచారం చేసే పరివ్రాజకులు, స్థిరంగా ఒకచోట ఉండిపోతారు. అక్కడే వారు ధర్మ ప్రచారం చేస్తుంటారు. ఈనాడు దేశంలో ఉన్న వివిధ మార్గాలకు చెందిన భక్తులు ఆషాఢపూర్ణమి నాడు తమ తమ గురుస్థానాలకు వెళ్ళి పూజలు జరుపుకొని ఆశీర్వాదాలు స్వీకరిస్తారు. 

అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశమేమంటే ఈ గురువులందరికీ కన్నతల్లి ఎవరు? 

రామునికి వశిష్టుడు గురువు. మరి వశిష్ఠునికి ఎవరు గురువు? కృష్ణునికి సాందీపుడు గురువు. కానీ సాందీపునికి కూడా ఒక గురువు ఉన్నాడు కదా? ఆధునిక యుగంలో పాశ్చాత్య దేశాలకు భారతీయ సాంస్కృతిక సుధను అందించిన స్వామి వివేకానందుడికి రామకృష్ణ పరమహంస గురువు. ఆ రామకృష్ణునికి కాళీమాత గురువు. కాళీమాత వేరు, భారతమాత వేరు కాదు.

లౌకికమైన మన గురువులందరినీ కన్నతల్లి భారతమాతయే. అందుకే ఋగ్వేదంలో "మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యాః" - ఈ పృథ్వి మాకు తల్లి. నేను ఆమెను పుత్రుణ్ణి - అనే ఒక మంత్రం ఉంది. అంటే ఈ భారతదేశాన్ని ప్రాచీన కాలం నుండి పరమ గురువుగా ఇక్కడి ప్రజలు భావించారు. భారతదేశం కొన్ని వేల సంవత్సరాల క్రితం విశ్వగురువుగా ఉండేది.

ఇంతకీ భారతదేశం అంటే ఏమిటి? కేవలం 125 కోట్లమంది ప్రజలు మాత్రమేనా? ఇక్కడి నదీనదాలు, శైవ, వైష్ణవ, శాక్తేయ క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అసంఖ్యాకమైన ధార్మిక పీఠాలు, ధర్మ గ్రంథాలు, పంచ ‘గ’కారములు అని చెప్పబడే గంగ, గోవు, గాయత్రి, గీత, గోపాలుడు..వీరిపై పూజ్యభావం ఇక్కడి సుజలములు, సుఫలములు, సస్యశ్యామలములు అయిన బంగారు భూములు కోటి కోటి కంఠములతో భారత దేశ ఔన్నత్యాన్ని కీర్తించే ప్రజాశక్తి శ్రామిక సౌందర్యం ఇక్కడి అజంతా, ఎల్లోరా, హళిబీడు, వేయిస్తంభాలగుడి, ఇక్కడి కూచిపూడి భరతనాట్యం, మణిపురి, కథక్, పేరిణి శివతాండవం, ఇక్కడి బతుకమ్మ పండుగ, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పూర్ణిమ, హోలీ పండుగలు, పబ్బాలు, ఆచార వ్యవహారాలు ఇదంతా కూడా భారతీయత కిందికే వస్తుంది. ఈ దేశంలోని భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా అందరి హృదయాలలో ఉన్న దివ్యశక్తి భారతమాతయే అన్నవిషయం లోగడ రవీంద్రుడు, అరవిందుడు, వివేకానందుడు ఎన్నోసార్లు పునరుద్ఘాటించారు. గురుపూర్ణిమ మనకు ఈ మహత్తర సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తుకు తెస్తున్నది.

ఈ దేశంమీద గత వేయి సంవత్సరాలుగా ఎన్నో దండయాత్రలు జరిగాయి. దేవాలయాలు నేలకూలాయి. సంస్కృత గ్రంథాలను తగులబెట్టారు. భారత్‌మాతాకీ జై అన్నవారిని జైల్లో పెట్టారు. భారతదేశాన్ని ప్రేమించేవాళ్ళను ఛాందసులు అన్నారు. ఫాసిస్టులు అన్నారు. గంగలో ఎవరైనా స్నానం చేస్తే అతడిని ఏం పాపం చేశావు? అంటూ సామ్యవాదులు ప్రశ్నించారు. పుష్కర స్నానాలను ద్వేషించారు. కుంభమేళాలను అపహసించారు. భారతదేశం తన అస్తిత్వాన్ని తిరిగి చాటుకోవాల్సిన అవసరం ఉంది? ఈ మౌలికమైన ఆవశ్యకతని గురుపూర్ణిమనాడు ప్రతి భారతీయుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

పాశ్చాత్యులు మన విద్యావిధానాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారు. ఆర్యులు విదేశాలనుంచి వచ్చారని ప్రచారం చేశారు. అలెగ్జాండర్ చేతిలో పురుషోత్తముడు ఓడిపోయాడని చరిత్ర గ్రంథాలు రాశారు. రాణాప్రతాప్, శివాజీ మహారాజుల పేర్లు లేకుండా అవమానించారు. అగ్బర్ ది గ్రేట్ అన్నారు. ఔరంగజేబు మత సహనానికి పర్యాయపదం అన్నారు. వందే కృష్ణం జగద్గురుం అని మనం విశ్వ గురువుగా భావించిన కృష్ణుడిని, రాముడిని అవమానించారు. పాశ్చాత్యులు వచ్చిన తరువాతనే ఇక్కడ సాంస్కృతిక వికాసం ప్రారంభమైందని ప్రచారం చేశారు. ఇది నిజమా? అమెరికా పుట్టి మూడువందల సంవత్సరాలైంది. కానీ జగద్గురువైన భారతమాతకు మూడు లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్నది. బైబిలు, ఖురాను పుట్టకముందే ఋగ్వేదం పుట్టింది. గురుపూర్ణిమ పర్వదినం నాడు భారతీయులంతా ఈ సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసుకోవలసిన కర్తవ్యం ఉంది.

భగవాధ్వజము - గురువు

పూర్వము భరతుడనే చక్రవర్తి దేవతలా తరఫున రాక్షసులటు యుద్ధం చేస్తున్నప్పుడు రక్తంతో తడిసిన అతడి ఉత్తరీయం జారి క్రింద పడిపోయింది. యుద్ధంలో లీనమైపోయిన ఆ రాజు అది పట్టించుకోలేదు. ఆ ఉత్తరీయం గాలికి ఎగురుతూ వచ్చి సంచారంలో ఉన్న సప్త ఋషులపై పడింది. వారు దివ్యదృష్టితో విషయం గ్రహించి ఆ వస్త్రమును తీసుకుని భరతుని వద్దకు వెళ్ళేరు. సుదీర్ఘ ప్రయాణముచేత వారి శరీరాలు చిందిన స్వేదంతో తడవడం వల్ల ఆ వస్త్రానికి అంటిన ఎరుపు రంగు కాస్త వెలిసి కాషాయ వర్ణంలోకి మారింది. సప్తర్షుల కరస్పర్శచే పునీతమైనది కాబట్టి నాటి నుంచి భరతుడు ఆ వస్త్రమునే తన ధర్మధ్వజముగా స్వీకరించేడు. భరతుడు పాలించిన భూమి భారతదేశం. కాబట్టి నాటి నుండి ఆ కాషాయధ్వజమే రాష్ట్రధ్వజముగా, ధర్మధ్వజముగా, భగవాధ్వజముగా మనకు నిరంతరం మార్గదర్శనం చేస్తూ ప్రేరణగా ఉంది. 

హిందూ సంఘటన ద్వారా దేశ పునర్నిర్మాణానికి పూజ్యశ్రీ డాక్టర్ కేశవరావ్ బలీరాం హెడ్గేవార్ 1925వ సంవత్సరంలో విజయదశమీ పర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించేరు. 

ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, పురాణ పురుషుడైనా కావచ్చు. కానీ అతడు ఎల్లప్పుడూ అందరికీ ఆదర్శంగా నిలవలేడు. అతనిలోని ఏమైనా లోపాలు గానీ, తమకి నచ్చని గుణాలు కానీ ప్రజలను వారి నుండి దూరం చేయవచ్చు. కానీ తత్త్వం అలా కాదు. అది ఏ ఒక్క వ్యక్తికో పరిమితమైనది కాదు. అది శాశ్వతమైనది. అది అన్ని కాలాలలోనూ అందరికీ ప్రేరణనిస్తుంది. కాబట్టి వ్యక్తినిష్ఠకి బదులు తత్త్వనిష్ఠకి ఆయన ప్రాధాన్యతనిచ్చేరు. 

ఇంతకీ ఆ తత్త్వం యొక్క మౌలికత ఏమిటి? శౌర్యము, త్యాగము. ఎరుపు రంగు శౌర్యానికి ప్రతీక.  స్వేదం శ్రమకు, త్యాగానికీ ప్రతీక. తన శౌర్యపరాక్రమాలతో దానవులతో యుద్ధం చేస్తున్న భరతుని రక్తంతో తడిసిన వస్త్రం ఎర్రగా మారింది. క్షత్రియులు శౌర్య ప్రియులు కదా. ఆ వస్త్రమును తీసుకుని భరతుని వెళ్ళిన సప్తర్షుల స్వేదంతో తడవడం వల్ల అది కాషాయ వర్ణంలోకి మారింది. ఋషులు త్యాగతపో జీవనులు కదా. అంటే త్యాగశౌర్యములను తెలిపే అనాదియైన మన తత్త్వమునకు ప్రతీక ఈ కాషాయ ధ్వజము. అనాదియైన ఈ మన తత్త్వము ధర్మములో ఉంది. అందుకే కాషాయ ధ్వజము మనకు ధర్మధ్వజము, భగవాధ్వజము అయ్యింది. 

అనాదిగా మహనీయమైన ఋషి జీవనానికి, మహోన్నతమైన క్షాత్ర పరంపరకు మనం వారసులం. సకల మానవాళికీ శాశ్వత సుఖాలను చేకూర్చే ధర్మమేదైతే ఉందో దానిని మన త్యాగశౌర్యముల చేత రక్షించుకోవాలి.  తనుమనధన సర్వార్పణతో మన మాతృభూమి కార్యాన్ని కొనసాగించాలి. అందుకు కావలసిన నిరంతర ప్రేరణ మనకు భాగావాధ్వజం నుండి లభిస్తుంది. అది తెలియజేసేదే ఈ గురు పౌర్ణమి పర్వదినం. 

యోగులు సాగిన మార్గమిది లోకములేలిన దుర్గమిది శాశ్వత శాంతుల స్వర్గమిది భగవాధ్వజ ఛాయలలో మాయని రతావని దిగ్విజయమిది .. 

స్వధర్మ నిష్ఠను తెలిపే శ్రీ గురుపౌర్ణమి Reviewed by rajakishor on 12:36 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.