Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

అబ్దుల్ కలాం - నీకు భారతావని కన్నీటి 'సలాం' : ప్రత్యేక వ్యాసం

తన నిండైన జీవితాన్ని, తరగని మేధస్సును జాతికి అంకితం చేసిన కలాం సోమవారం తొలి ఏకాదశి రోజున కన్నుమూయడం సమత, మమత సామర స్యానికి యాదృచ్ఛిక సంకేతం. భిన్న రంగాల్లో రాణించి ఉన్నత ప్రమాణాలను పాదుగొల్పిన కలాం సేవల్ని భారత జాతి ఎన్నటికీ మరిచిపోలేదు. ఆయన ఆలోచనామృతాలు అనునిత్యం యువతకు భవిష్య దీపకాంతులు. అజ్ఞానాంధకారాన్ని తొలగించే చైతన్య కిరణాలు.

యావద్భారతం కన్నీటి పర్యంతమైన విషాదమిది. ఓ మహనీయుడు, దేశాన్ని, జాతిని, యువతను తన వెంట నడిపించిన స్ఫూర్తి ప్రదాత అబ్దుల్ కలాం ఆకస్మిక మరణం గుండెలు పిండేసే బాధామయ క్షణం. భారతావనికి, దేశ యువతకు, దేశ సాంకేతిక ప్రగతికి దిశానిర్దేశన చేసిన మహోన్నత వ్యక్తిత్వం, నిరుపమాన సామర్థ్యం కలాం సొంతం. ఆయన ఏ రంగంలో ఉన్నా తనదైన ముద్ర వేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్వితీయంగా భారత్ రాణిస్తోందంటే.. కేవలం అంతరిక్ష ప్రయోగాలతోనే సరిపెట్టకుండా గ్రహాంతర ప్రయోగాలనూ చేస్తున్నదంటే దాని వెనుక కలాం కృషి ఉంది. ఆయన వేసిన బాట ఉంది. పేద కుటుంబంలో పుట్టినా భారత దేశానికే పెద్ద దిక్కు అయ్యారు. తన అనుభవాలనే పాఠాలుగా మార్చి యువతకు మార్గదర్శకుడయ్యారు. ఎందరో రాష్టప్రతులు వచ్చారు. ఎవరి ఘనత వారిది. ఎవరి ప్రత్యేకత వారిది. దేశ పదకొండో రాష్టప్రతిగా కలాం పని చేసిన సంవత్సరాలన్నీ నిరుపమానమైనవే. తన నిరాడంబరతతో రాష్టప్రతి పదవికే వనె్న తెచ్చిన కలాం అనంతర కాలంలోనూ అదే స్ఫూర్తితో రాణించారు. ఎనిమిది పదులుదాటినా నిత్య ఉత్తేజంతో, నిరంతర చైతన్యంతో దేశ యువతకు కొలమానంగా మారారు. యువతకు ఆయన మాటలు దీపకాంతులు. అంధకారాన్ని ఛేదించి జీవితాలను తేజోమయంగా మార్చుకోవడమెలాగో యువతకు నేర్పించారు. అనుభవం నేర్పిన పాఠాలతో, విజ్ఞానం అందించిన అణుకువతో, మేధస్సు నుంచి ఉద్భవించిన నిరంతర ఆలోచనల కాంతి పుంజాలతో దేశ ప్రజల నీరాజనాలందుకున్నారు. తన విశాల దృక్పథంతో, ఎల్లల్లేని ఆదరణ భావనతో యువతకు తలమానికమయ్యారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగా, కేవలం తన స్వీయ ప్రతిభతో సమున్నత పదవిని అధిష్ఠించిన కలాం అందరికీ ఆదర్శపాత్రుడయ్యారు. ప్రతి ఒక్కరూ ‘మా కలాం’ అంటూ సలాం చేసేంతగా తన విశాల దృక్పథంతో, వివేచన, విచక్షణతో ప్రత్యేక ముద్రను వేయగలిగారు. అంతకు ముందు వచ్చిన రాష్టప్రతులందరూ రాష్టప్రతి భవన్‌కు, అధికారిక కార్యక్రమాలకే పరిమితమైతే కలాం కొత్త ఒరవడి సృష్టించారు. అసలు రాష్టప్రతి అంటే ఎలా ఉండాలో.. ఎంత ఆదర్శనీయంగా, ఎంత నిరాడంబరంగా ఉండాలో తన ఉన్నత వ్యక్తిత్వం ద్వారా నిరూపించారు.
కేవలం రాష్టప్రతి భవన్‌కే పరిమితం కాకుండా.. యువత అభ్యున్నతే ధ్యేయంగా కలాం వ్యవహరించారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు ఇలా దేశ వ్యాప్తంగా వేలాది విద్యా సంస్థల్ని సందర్శించి యువతకు తిరుగులేని రీతిలో ఆత్మ విశ్వాసాన్ని అందించారు. తనదైన శైలిలో కలాం చేసిన ప్రసంగాలన్నీ యవతను ఉత్తేజితం చేశాయి. రాష్టప్రతిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలతో మమేకమైన విధానం ఆయన్ని ‘ప్రజల రాష్టప్రతి’ని చేశాయి. ఎవరూ కలాంను రాష్టప్రతిగా చూడలేదు. తమను ఉద్దరించడానికి, తమ జీవితాలను తీర్చిదిద్దడానికి వచ్చిన మహనీయుడిగానే భావించారు. ఆయన మాటలకు పులకించిపోయారు. ఆయన వేసిన బాటల్లో రాణించి లక్షలాది మంది యువతీ యువకులు తమ భావి జీవితాలను తీర్చిదిద్దుకున్నారు. రాష్టప్రతిగా ఎంత క్రియాశీలకంగా వ్యవహరించారో అనంతర కాలంలోనూ ఆయన అదే స్ఫూర్తిని అన్నింటా కనబరిచారు. చివరి క్షణం వరకూ యువత జీవితాలను తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేశారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా కలాం జీవితం అన్ని రంగాల్లోని ఉన్నత వ్యక్తుల సహచర్యంతోనే సాగింది. భారత దేశ క్షిపణి పితామహుడిగా ఘన కీర్తులందుకున్న కలాం పోఖ్రాన్ పరీక్షల్లో కీలక భూమిక పోషించి భారత దేశ సార్వభౌమత్వానికి మరింత ధీమాను చేకూర్చారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా కలాంలో సృజనాత్మక జిజ్ఞాసకు పదేళ్ల ప్రాయంలోనే బీజం పడింది. తన తండ్రి ఓ పడవను సొంతంగా తయారు చేయడాన్ని గమనించిన కలాం ఎప్పుడు దాని నిర్మాణం పూర్తవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసే వారు. ఆ చిరు ప్రాయంలో ఏర్పడ్డ సృజనాత్మక ఆలోచనలే ఆయన్ని అనంతర కాలంలో జాతి గర్వించ దగ్గ, యావద్భారతావని అక్కున చేర్చుకుని ఆరాధించదగ్గ సమున్నతుడ్ని చేశాయి. స్కూలు దశలో కూడా కలాం కనబరిచిన ప్రతిభాసంపత్తులు ఆయన అధ్యాపకుల్నే విస్మయపరిచేవి. సందేహాల ద్వారానే కొత్త ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచనలే ఆయా వ్యక్తుల జీవితాలనే కాదు, తాము భాగంగా ఉన్న సమాజాలనూ తీర్చిదిద్దుతాయి.
కలాం బాల్యంలో ఎదురైన పరిస్థితులే ఆయన్ని ప్రతి అడుగూ ఆచితూచి వేసేలా చేశాయి. ఏ విషయాన్నీ తేలిగ్గా పరిగణించకుండా దాని లోతుల్లోకి వెళ్లి మరి అంతుచూసే పట్టుదలను, నిబద్ధతను అందించాయి. భౌతిక శాస్త్రంలో పట్టా తీసుకున్న కలాం ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో చేరి పైలట్ కావాలనుకున్నారు. ఆయన ఆ కోరిక తీరక పోవడం వల్లే భారత దేశానికి క్షిపణి మహనీయుడు దక్కాడు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్‌డిఓలో చేరడంతో కలాం ఆలోచనలు కొత్త పుంతలు తొక్కాయి. విక్రం సారాభాయ్ వంటి మహోన్నతులతో పరిచయం కలాంలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందించింది. భారత దేశం మొట్ట మొదటి సారిగా పూర్తి దేశీయ విజ్ఞానంతో రూపొందించిన ఉపగ్రహ ప్రయోగ వాహకం (ఎస్‌ఎల్‌వి) నిర్మాణంలో కలాం నిర్వహించిన పాత్ర నిరుపమానం. పోఖ్రాన్ అణు పరీక్షలతో నేరుగా సంబంధం లేకపోయినా అప్పటి ప్రధాని ఇందిర ఆహ్వానం మేరకు ఆ ప్రయోగాన్ని వీక్షించిన కలాం తర్వాత ప్రాజెక్టు డెవిల్, ప్రాజెక్టు విక్రాంత్ పేరిట స్వదేశీ సాంకేతిక విజ్ఞానంతో బాలిస్టిక్ క్షిపణి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆ విధంగా భారత దేశ శాస్త్ర సాంకేతిక ప్రగతిలో చోటుచేసుకున్న ప్రతిమలుపులోనూ కలాం ముద్ర ఉంది. తన ఆలోచనలతో ఇతరులను అద్భుతంగా ప్రభావితం చేయగలిగిన కలాం తాను ఎంచుకున్న ప్రతి రంగంలోనూ అంతే ఉన్నతంగా నిలువగలిగారు. గల్ఫ్ యుద్ధ సమయంలో అప్పటి సంకీర్ణ సేన సాంకేతికంగా సాధించిన విజయమే కలాంలో భారత దేశ రక్షణ పాటవాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చాలన్న ఆలోచనకు దారితీసింది. దేశం కోసం మనం ఏమి చేయగలమంటూ వందలాది మంది శాస్తవ్రేత్తలతో ఆయన నిర్వహించిన సదస్సు అనంతర కాలంలో భారత దేశానికి క్షిపణి రక్షణ కవచాన్ని అందించింది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు శత్రువును జయించాలంటే అతడి టెక్నాలజీతోనే దెబ్బకొట్టాలన్న సూత్రాన్ని నమ్మిన కలాం ఆ విధంగా భారత్‌ను తీర్చిదిద్దారు. శాస్తవ్రేత్తగా, మేధావిగా, విద్యా వేత్తగా కలాం అందుకోని పురస్కారం లేదు. ‘్భరత రత్న’, ‘వీర్‌సావర్కార్’ సహా ఎన్నో పురస్కారాలను అందుకున్న కలాం నిరంతర ఆద్యుడు. ఆరాధ్యుడు. అందలాలు కొందరికి ఆశయాలైతే మరి కొందరికి అవి దేశానికి అంకితమయ్యేందుకు సోపానాలు. పదవిని హోదా కోసం కాకుండా ప్రజాసేవకే వినియోగించిన మహోన్నతుడు అబ్దుల్ కలాం. తన నిండైన జీవితాన్ని, తరగని మేధస్సును జాతికి అంకితం చేసిన కలాం సోమవారం తొలి ఏకాదశి రోజున కన్నుమూయడం సమత, మమత సామర స్యానికి యాదృచ్ఛిక సంకేతం. భిన్న రంగాల్లో రాణించి ఉన్నత ప్రమాణాలను పాదుగొల్పిన కలాం సేవల్ని భారత జాతి ఎన్నటికీ మరిచిపోలేదు. ఆయన ఆలోచనామృతాలు అనునిత్యం యువతకు భవిష్య దీపకాంతులు. అజ్ఞానాంధకారాన్ని తొలగించే చైతన్య కిరణాలు.
అబ్దుల్ కలాం - నీకు భారతావని కన్నీటి 'సలాం' : ప్రత్యేక వ్యాసం Reviewed by JAGARANA on 6:52 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.