Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

మాయలేడిలా మోసం చేస్తున్న ఎన్జీవోలు


టీవల వెలుగు చూసిన కొన్ని సంఘటనలు మనదేశంలో పనిచేస్తున్న ఎన్జీవో (నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్) ల కార్యకలాపాల గురించి ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. ఈ సంఘటనలు ఎన్జీవో కార్యకలాపాలకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలలోని వాస్తవికతను బలపరుస్తున్నాయి. మనదేశంలోని ప్రముఖ ఎన్జీవో సంస్థ "గ్రీన్ పీస్ ఇండియా" అకౌంటులను స్వాధీనం చేసుకొని, ఆ సంస్థ లైసెన్సును రద్దు చేసిన భారత ప్రభుత్వం ఫోర్డు ఫౌండేషన్ కార్యకలాపాలపై నిఘా ఉంచింది. మనదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే రీతిలో కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న ఇతర ఎన్జీవో సంస్థలకు మన ప్రభుత్వం యొక్క ఈ చర్య ఒక గట్టి హెచ్చరిక కానున్నది. మనదేశంలో అనుమానాస్పద కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఎంజీవోలపై ఎన్నో ఏళ్ళుగా ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా కొనసాగుతోంది.

ప్రభుత్వానికి, ఎన్జీవో సంస్థలకు మధ్య కొనసాగుతున్న విభేదాలు మనకి కొత్తవి కావు, మనదేశానికే పరిమితమైనవి కావు. ప్రపంచంలో పలు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రభుత్వాలకూ, ఎన్జీవో సంస్థలకు మధ్య విభేదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

మనదేశంలో ఎన్జీవోల కార్యకలాపాలను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. 2009 నాటికి మనదేశంలో ముప్పై లక్షల ఎన్జీవోలు పనిచేస్తున్నాయి. అయితే దేశ సమగ్రత, భద్రతల విషయంలో వీటి కార్యకలాపాల విశ్వసనీయత ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. మనదేశంలో విదేశాల నుండి సమకూరే విరాళాల ద్వారా పని చేసే ఎన్జీవో సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఇవి దేశ ఆంతరంగిక కార్యకలాపాలలో చీటికీ మాటికీ జోక్యం చేసుకుంటూ ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులు సవ్యంగా సాగకుండా అడ్డు తగులుతున్నాయి. ఎన్జీవోలకు వచ్చే విదేశీ విరాళాలలో ఇరవై శాతం అనుమానాస్పద కార్యకలాపాలకు వినియోగమౌతున్నాయని దేశ అంతరిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ తెలిపిన వివరాలు మరింత దిగ్భ్రాంతికి గురిచేసేవిగా ఉన్నాయి. మనదేశంలో 1400 ఎన్జీవో సంస్థలు తాము నిర్వహించే స్వయం ఉపాధి, శిక్షణ పథకం కోసం విదేశాల నుండి భారీగా విరాళాలు సేకరిస్తున్నాయి. అయితే వీటిలో 90 శాతం కార్యకలాపాలు వట్టి భోగాస్ అని తేలింది. ఎన్జీవోలకు చెందిన సంస్థలు అసలు ఎటువంటి శిక్షణ ఇవ్వటంలేదని తేలింది. సమాజంలో పేరుప్రతిష్ఠలున్న ఈ సంస్థలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాయి.

ఫోర్డ్ ఫౌండేషన్ పైన నిఘా వుంచడం, గ్రీన్ పీస్ ఇండియా కార్యకలాపాలను రద్దు చేయడం పట్ల వివరణ ఇవ్వాలంటూ అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత ప్రభుత్వం యొక్క ఈ చర్య పలు ఎంజీవోలను భయాందోళన లకు గురిచేస్తోందని అమెరికా వ్యాఖ్యానించింది.

ఏది ఏమైనా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారం విషయంలో జోక్యం చేసుకునే, ప్రశ్నించే అధికారం ప్రపంచంలో ఎవరికీ, ఏ దేశానికీ లేదు. మనదేశ భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా దేశ సమగ్రతను కాపాడవలసిన ప్రాధమిక బాధ్యత భారత ప్రభుత్వానిదే.

మనదేశంలోని వివిధ ఎన్జీవోలకు ఫోర్డ్ ఫౌండేషన్ ద్వారా వచ్చే నిధులపై నిఘా ఉంచుతున్నామనీ, Foreign Contribution Regulation Act 2010 లోని 46వ సెక్షన్ పేర్కొన్న అధికారాలను ఉపయోగించి వీటిపై నియంత్రణ విధిస్తామని కేంద్ర హొమ్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే భారత రిజర్వు బ్యాంకు ద్వారా వివిధ సంస్థలకు అందే విదేశీ నిధులపై దేశీయ వ్యవహారాల శాఖ పర్యవేక్షణ ఉండాలని ఆ బ్యాంకు కోరుతోంది.

మనదేశంలోని మీడియా మాత్రం ఎన్జీవోలకు వచ్చే విదేశీ నిధులపై నిఘా పెట్టడాన్ని తప్పు పడుతూ పెద్ద రాద్ధాంతం చేస్తోంది. అయితే మనదేశంలోకి వచ్చే విదేశీ నిధులు సక్రమ పద్ధతిలో వినియోగించేటట్లు చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదు కదా.

దేశ ద్రోహకర కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఎంజీవోలపై భారత ప్రభుత్వం నిఘా పెట్టడాన్ని ఎన్జీవోల గొంతు నొక్కే చర్యగా శ్రీ నరేంద్ర మోదీ తరహా అభివృద్ధిని వ్యతిరేకించే వారు ఆరోపిస్తున్నారు. నిజానికి మనదేశంలో ఎన్జీవో కార్యకలాపాలపై నిఘా పెట్టి విచారణ జరపడం అనేది మోదీ ప్రధాని అయ్యేక మొదలు కాలేదు. 2012లోనే నాటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఎన్జీవోలకు వ్యతిరేకంగా బహిరంగంగానే పెద్ద ఎత్తున దాడికి దిగారు.  ఈ విషయంలో అన్ని వివరాలనూ బయటపెట్టి దేశ ప్రజలకు ఒక స్పష్టతనివ్వాలని అప్పటి ప్రధాన ప్రతిపక్షం బి.జె.పి. మన్మోహన్ సింగ్ ని కోరింది కూడా. కానీ మిగతా కేసుల్లాగే అప్పటి యు.పి.యే. ప్రభుత్వం ఈ కేసుని కూడా పెద్దగా పట్టించుకోకుండా వదిలేసింది. గ్రీన్ పీస్ ఇండియా లాంటి సంస్థల విషయంలో చూసీచూడనట్లు ఊరుకుంది.

అయితే గతంలో యూపీఏ ప్రభుత్వం మూడు ఎన్జీవో సంస్థల లైసెన్సులను రద్దు చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. గ్రీన్ పీస్ వంటి ఎన్జీవో సంస్థలు న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు, మైనింగ్, జెనెటిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వంటి వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా మనదేశ ఆర్ధిక వ్యవస్థ బలపడకుండా అడ్డుకుంటున్నాయని జూలై 2014లో ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక పేర్కొంది. తమిళనాడులోని కుడంకులం వద్ద న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా అమెరికా సహాయంతో పనిచేస్తున్న ఎన్జీవో సంస్థలు ఆందోళనలు చేసినట్లు డా. మన్మోహన్ సింగ్ అన్నట్లు ఈ నివేదికలు పేర్కొన్నాయి. భారతదేశంలో వ్యవసాయ రంగంలో జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిని ప్రవేశపెట్టేందుకు కొన్ని సంస్థలకు అమెరికా నుండి నిధులు సమకూరాయని డా. మన్మోహన్ సింగ్ అన్నారు కూడా.  కాబట్టి మనదేశీయ వ్యవహారాలలో ఏ విదేశీ సంస్థలూ జోక్యం చేసుకోకుండా చూడవలసిన బాధ్యతా మన ప్రభుత్వానికి ఉంది. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి గాని ఇతరుల జోక్యం అనవసరం.


ఇటీవల వెలువడుతున్న వార్తలు ఎన్జీవోలు, వాటి లబ్దిదారుల పట్ల గల అపోహలను తొలగించేవిగా ఉన్నాయి. 2009-10, 2010-11, 2011-12 సంవత్సరాలలో వార్షిక ఇంకం టాక్స్ రిటర్న్స్ సమర్పించని కారణంగా ఈ మధ్యనే 8,975 ఎంజీవోల లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేసింది. 

మరి ఫోర్డ్ ఫౌండేషన్ కి వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకోవాలి?

ఎడ్సేల్ మరియు హెన్రీ ఫోర్డ్ లు 1936లో స్థాపించిన ఫోర్డ్ ఫౌండేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) లలో ఒకటి. 1952 నుండి భారతదేశంలో ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. పైకి ఎన్నో అభివృద్ధి, సేవా కార్యక్రమాలను విర్వహిస్తున్నా బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో చీకటి కోణాలు ఫోర్డ్ సంస్థలో ఉన్నాయి. ఫోర్డ్ ఫౌండేషన్ సంస్థకి అమెరికా నుండి నిధులు సమకూరుతాయన్నదే చాలా మందికి తెలుసు. కానీ అమెరికా గూఢచారి సంస్థ సి.ఐ.ఏ. ఏజెంట్లు ఈ సంస్థ ద్వారా పలుదేశాలలో తమ రహస్య కార్యకలాపాలను కొనాసాగిస్తున్నారన్నది విచారణలో తేలిన విషయం.

అమెరికా సహకారంతో పనిచేస్తున్న ఎన్జీవోలు దేశీయ వ్యవహారాలలో ప్రత్యక్షంగానే జోక్యం చేసుకొంటూ దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. న్యాయ వ్యవస్థలో ఫోర్డ్ ఫౌండేషన్ జోక్యం పెరిగిపోయిందనీ, భారత రక్షణ వ్యవస్థ ప్రతిష్ఠను ఆ సంస్థ దెబ్బతీస్తోందనీ ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2002లో గుజరాత్ అల్లర్ల తరువాత వివాదాస్పద వ్యక్తిగా నిలచిన తీస్తా సతిల్వాద్ కు ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టాయి కూడా. ఇస్లాంకి అనుకూలంగా ఆమె ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది కూడా. తనకి ముట్టిన ముడుపులను తీస్తా సతిల్వాద్ గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత్ లోను, బయటి దేశాలలో కూడా ప్రచారం చేయడానికి ఉపయోగించినట్లు విచారణలో తేలిందని గుజరాత్ రాష్ట్ర హొమ్ మంత్రి రంజిత్ పటేల్ అన్నారు. 

ఎన్జీవోల విషయంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హొమ్ శాఖ అధికార ప్రతినిధి, "Foreign Contribution Regulation Act (FCRA) ప్రకారం రిజిస్టర్ కాని సంస్థలకే ఫోర్డ్ ఫౌండేషన్ పెద్ద మొత్తంలో నిధులను సమకూరుస్తోంది. ఇది FCRA 2010 చట్టాన్ని అతిక్రమించడమే. FCRA ప్రకారం రిజిస్టర్ అయిన సంస్థలకు నిధులు అందజేయడంలో ఫోర్డ్ ఫౌండేషన్ పై ఎటువంటి ఆంక్షలూ లేవు. అయినా ఆ సంస్థ చట్టాన్ని అతిక్రమిస్తోంది" అని అన్నారు.

మరి ఇతర దేశాలు ఏం చేస్తున్నాయి? 


తమ దేశాలలోని ఎన్జీవోలకు విదేశీ నిధులు అందడాన్ని రష్యా, చైనా లు తీవ్రంగానే పరిగణిస్తున్నాయి. విదేశీ నిధులు అందుతున్న ఎన్జీవోల వల్ల వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆ దేశాలు ఇటీవలే కొత్తగా చట్టాలు చేసాయి కూడా. 


విదేశాల నుండి ఎంజీవోలకి అందే ఆర్థిక, సాంకేతిక, లేక మరే ఇతర సహాయమైనా సరే అది రష్యా రాజ్యంగ వ్యవస్థకు భంగకరంగా ఉండటాన్ని రాజద్రోహ నేరంగా పరిగణిస్తూ, అలాంటి సహాయాలను నిషేధిస్తూ 2012లో పుతిన్ ఒక చట్టాన్ని చేసేరు. అంతేకాది విదేశీ నిధులు అందుకుంటున్న ఎన్జీవోలను విదేశీ ఏజెంట్లుగా పరిగణించే అధికారాన్ని న్యాయ మంత్రిత్వ శాఖకి కల్పిస్తూ రష్యాలో 2014లో మరో చట్టాన్ని చేసేరు. 

విదేశాల నుండి నిధులు అందుకునే ఎన్జీవోల నుండి ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోడానికి చైనా ఓకే కొత్త చట్టం రూపొందించబోతోంది. దీని ప్రకారం ఆ ఎన్జీవోల కార్యకలాపాలపై నిఘా ఉంటుంది. తమ దేశంలోని ఎన్జీవో కార్యకలాపాల ముఖ్య ఉద్దేశ్యం కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టడమే నని చైనా పాలకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలనే పరిగణనలోకి తీసుకుంటే మనదేశంలోని ఎన్జీవోల వల్ల మన భద్రతకు ఎంత ప్రమాదం పొంచి ఉందో అవగతమౌతుంది. ఎందుకంటే చుట్టుప్రక్కల దేశాలతో పోలిస్తే మనదేశ ఆంతరంగిక భద్రతకు పటిష్ఠమైన ఏర్పాట్లు లేవు. 

గ్రీన్ పీస్ సంస్థ కార్యకలాపాలు కెనడాకు చెందిన మౌలిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనీ, ఇది ఆ దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితికి దారితీయవచ్చనీ కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ (CSIS) 2008లో సమర్పించిన నివేదిక పేర్కొంది.  కెనడా ప్రభుత్వం గ్రీన్ పీస్ సంస్థపై చర్యలు తీసుకుంది కూడా. ఆ తరువాత దేశ రాజకీయాలలో జోక్యం చేసుకోవడం ద్వారా గ్రీన్ పీస్ సంస్థ కెనడా ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యింది.

తమ దేశంలో ఒక పొలిటికల్ అజెండాతో పనిచేస్తున్నందుకు గ్రీన్ పీస్ సంస్థకు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోడానికి కల్పించిన హోదాను న్యూజిలాండ్ ప్రభుత్వం 2010లో రద్దుచేసింది. అయితే ఒకదేశంలో సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థకి ఆ దేశ రాజకీయాలలో కూడా పాల్గొనే అవకాశం ఉండాలని న్యూజిలాండ్ సుప్రీంకోర్టు 2014లో తీర్పునిస్తూ గ్రీన్ పీస్ సంస్థకు వెనుకటి హోదా వచ్చేలా చేసింది. న్యూజిలాండ్ న్యాయ వ్యవస్థపై ఎన్జీవోల ప్రభావం ఎంతగా ఉందో దీనిని బట్టి తెలుస్తోంది.


అమెరికాలో కూడా ఎన్జీవోల రాజకీయ జోక్యాన్ని ప్రశ్నిస్తూ ఆ దేశ కాంగ్రెస్ సంభ్యులు ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేసారు. 

సాధారణంగా ఎన్జీవోలు కార్పోరేట్ పద్ధతిలో పనిచేస్తాయి. ఆ సంస్థలు చేసే ఏ ఆందోళనలోనైనా స్థానికులు తక్కువ సంఖ్యలోనే పాల్గొనడం మనం గమనించవచ్చు. అంతేకాదు ప్రధానమైన ఆందోళనలను ఎన్జీవోలు హైజాక్ చేసి తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.

అమెరికా, ఐరోపాలలో ఎన్జీవోలు కారోరేట్ సంస్థల ప్రతినిధులుగానే పనిచేస్తూ వాటి వ్యాపార అవసరాలను తీరుస్తున్నాయి. ముఖ్యంగా ఆసియా, లాటిన్ అమెరికా దేశాలలో ఎక్కడైతే కేపిటలిజం బలంగా వెళ్ళూనుకోలేదో అక్కడ ఎన్జీవోలు తమ కార్యక్షేత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆయా దేశాలలో తమదైన పద్ధతిలో ఆక్రమణలు జరపడానికి ఎన్జీవోలు చాలా కుతంత్రాలు పన్నుతాయి.


దీనినిబట్టి మన సామాజిక సమస్యల పరిష్కారానికి ఎన్జీవోలను ప్రోత్సహించడం ఎంత ప్రమాదకరమో స్పష్టమౌతోంది. రాజ్యాంగ స్ఫూర్తితో నడిచే మన ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ సంస్థలు బ్రష్టు పట్టిస్తున్నాయి.


మనదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో సారథ్యం కొరవడటమే ఈ ఎన్జీవో సంస్థల కార్యకలాపాలు పెచ్చు పెరిగిపోవడానికి ప్రధాన కారణం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఏ రంగాలలో వైఫల్యం చెందుతున్నాయో, ఎవరికి న్యాయం చెయ్యలేకపోతున్నాయో అక్కడ తమ కార్యకలాపాల ద్వారా ఎన్జీవోలు చొచ్చుకుపోతున్నారు. ఈ ఎన్జీవోల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలంటే మనదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను అన్ని స్థాయిలలోనూ పటిష్టం చేయాలి. వాటి సామర్థ్యం, ఉత్పాదకత పెరగడానికి తగిన చర్యలు తీసుకోవాలి. మనదేశంలో జాతీయాదర్శాలతో పనిచేసే సంస్థలు కూడా జాతి శ్రేయస్సును, సమాజ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్జీవోలకు అడ్డుకట్ట వేయడానికి కృషి చేయవలసిన అవసరం ఉంది.

మాయలేడిలా మోసం చేస్తున్న ఎన్జీవోలు Reviewed by rajakishor on 1:07 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.