ఉగ్రవాదంపై ఉక్కుపాదం
ఆంధ్రభూమి సంపాదకీయం , మార్చి 3, 2015
భద్రత ఛిద్రమైపోతుండటం గుజరాత్ శాసనసభ మార్చి నెల 31వ తేదీన ఆమోదించిన
ఉగ్రవాద వ్యతిరేక బిల్లునకు విస్తృత నేపథ్యం. దేశమంతటా ‘సుప్త బీభత్స
విభాగాలు’-టెర్రర్ స్లీప్‌సెల్స్- విస్తరించి పోతుండడం నిరాకరింపజాలని
నిజం. జమ్మూకశ్మీర్‌లో సైనికుల వేషాలు ధరించిన ఉగ్రవాదులు రక్తపాతం
సృష్టిస్తూనే ఉన్నారు. బెంగాల్‌లోని వర్ధమాన్ జిల్లా బీభత్స కారులకు విహార
కేంద్రంగా మారింది. నేర ప్రక్రియ వైయక్తిక రాగద్వేషాల పరిధిని ఎప్పుడో
అతిక్రమించిపోయింది. అసాంఘిక బీభత్సంగా వ్యవస్థీకృతమైపోయిన తరువాత
అదుపుతప్పి పోతోంది. దశాబ్దుల తరబడి దొంగరవాణా విశృంఖల విహారం చేస్తోంది.
ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులు, ఆభరణాల దొంగరవాణాకు అంతర్జాతీయ
విమానాశ్రయాలు ఆలవాలం అయిపోయాయి. అటవీ సంపద అంతరించిపోవడానికి ఈ
వ్యవస్థీకృత అసాంఘిక బీభత్సం కారణం. ఎర్ర చందనం చెట్లను మొదలంటా నరకుతున్న
వారు మనుషుల మెడలను తెగ నరకడం ఈ అసాంఘిక బీభత్సంలో భాగం. ఉన్న చట్టాలు
వ్యవస్థీకృత లేదా సుసంఘటిత నేరాలను నిరోధించలేకపోవడం నడుస్తున్న వైపరీత్యం.
మాదక ద్రవ్యాల ఉత్పత్తి దొంగరవాణా అసాంఘిక బీభత్సకాండకు మరో ముఖం. ఈ ముఖాల
వారు దొంగ రవాణాతో సరిపెట్టుకోవడం లేదు. ముఠాలుగా ఏర్పడి నిరోధక వ్యవస్థను
నిరంతరం హత్య చేస్తున్నారు. ప్రాణాలు తీసే ప్రవృత్తి వ్యవస్థీకృతమైన
నరపిశాచ బృందాలు వికృతంగా నర్తిస్తుండడం గుజరాత్ శాసనసభ, ‘కంట్రోల్ ఆఫ్
టెర్రరిజం అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్’- ఉగ్రవాద, సంఘటిత నేర నియంత్రణ-బిల్లును
ఆమోదించిన తరుణంలో దేశమంతటా కనిపిస్తున్న దృశ్యం. ఉగ్రవాద నిర్మూలనకు,
సంఘటిత నేర ప్రక్రియ నిరోధానికి చర్యలు తీసుకోవలసింది ప్రధానంగా కేంద్ర
ప్రభుత్వం. 2004, 2014 సంవత్సరాల మధ్య ఇలాంటి చర్యలను చేపట్టడంలో కేంద్ర
ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం అలా కూలబడి ఉండిన సమయంలో
గుజరాత్ ప్రభుత్వం ఈ గురుతర బాధ్యతను నెత్తికెత్తుకుంది..ఒక రాష్ట్రంలోనో,
రెండు రాష్ట్రాలలోనో, కొన్ని రాష్ట్రాలలోనో ఇట్టి కఠినమైన ఉగ్రవాద
వ్యతిరేక, వ్యవస్థీకృత నేర నిరోధక శాసనాలు ఏర్పడినందువవల్ల దేశమంతటా
చెలరేగుతున్న జిహాదీ హంతకుల ఆటకట్టదు, కిరాయి హంతకులు తుదముట్టరు, లైంగిక
బీభత్సకారులు అటవీ హంతకులు, మాదక చోదకులు అంతరించిపోరు. అయినప్పటికీ ఒక
రాష్ట్రం ఆదర్శాన్ని అనుసరించి మరో రాష్ట్రం ఇలాంటి నేర నిరోధకమైన
చట్టాన్ని చేసుకునే అవకాశం ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం గోవధ నిషేధం
చట్టాన్ని అమలు జరపడం ఆరంభించగానే రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు కూడ అదే
తరహా చట్టానికి రూపకల్పన చేస్తుండడం ఇందుకు నిదర్శనం. బీభత్స వ్యతిరేక శాసన
నిర్మాణంలో గుజరాత్ ప్రభుత్వం విసుగు చెందని విక్రమార్క స్ఫూర్తితో
పనిచేస్తోంది. గత పదేళ్లలో గుజరాత్ శాసనసభ మూడుసార్లు బిల్లును
ఆమోదించింది. ప్రతిసారీ రాష్టప్రతి తిరస్కరించాడు. అయినప్పటికీ నాలుగవసారి
31వ తేదీన బిల్లును మళ్లీ ఆమోదించడం నేర నిరోధం పట్ల సడలని నిష్ఠకు
నిదర్శనం...
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉండిన సమయంలో ఎన్‌డిఎవారు పటిష్టమైన
బీభత్స వ్యతిరేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. పాకిస్తానీ
తొత్తులు, పాకిస్తానీ జిహాదీలు పైశాచికంగా విరుచుకుపడి దేశమంతటా భయంకర
రక్తపాతం సృష్టించడం 2002లో రూపొందిన ‘పోటా’-ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం
యాక్ట్- రూపొందడానికి ప్రధాన కారణం. 2001 డిసెంబర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వ
ప్రేరిత ఉగ్రవాదులు న్యూఢిల్లీలో మన పార్లమెంట్ భవన ప్రాంగణంలోకి చొరబడి
భయంకర బీభత్స కృత్యాలకు పాల్పడ్డారు. అఫ్గానిస్థాన్ లోని అల్ ఖాయిదా,
తాలిబన్ దుండగులు ఖండ ఖండాంతరాలలో పైశాచికకాండను సృష్టిస్తుండిన సమయం అది.
పోటా మొదట ఆర్డినెన్స్ రూపంలో వెలువడింది. ఆ తరువాత బిల్లును పార్లమెంట్
పరిశీలిస్తుండిన సమయంలోనే 2002 ఫిబ్రవరిలో గుజరాత్‌లోని గోద్రా స్టేషన్‌లో
ఉగ్రవాదులు ఒక రైలు పెట్టెకు నిప్పంటించి అనేక మందిని సజీవంగా దహనం
చేయగలిగారు. ఇలాంటి భయంకర నేరాలకు పాల్పడుతుండిన టెర్రరిస్టులను
తుదముట్టించడం కోసం పోటా పుట్టుకొచ్చింది. ఇలాంటి బీభత్స వ్యతిరేక
శాసనాన్ని 2004లో కేంద్ర ప్రభుత్వ నిర్వహణ బాధ్యను స్వీకరించిన యుపిఎ వారు
వ్యతిరేకించడం చారిత్రక విపరిణామం. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఏర్పడిన యుపిఎ
ప్రభుత్వం 2004 డిసెంబర్‌లో పోటాను రద్దు చేసింది.
జాతీయ సమైక్యతకు, దేశ సమగ్రతకు సంబంధించిన అతి ప్రధాన అంశాలు సైతం రాజకీయ
విధాన విభేదాలకు గురికావడం మన ప్రజాస్వామ్య వైపరీత్యం...2002, 2004
సంవత్సరాల మధ్య పోటాను వ్యతిరేకించిన వారే ఇప్పుడు గుజరాత్ శాసనసభ
ఆమోదించిన బీభత్స వ్యతిరేక నేర నిరోధక బిల్లును కూడ తప్పులు పడుతున్నారు.
జిహాదీ ఉగ్రవాదానికి కాని, మావోయిస్టుల హత్యాకాండకు కాని తీవ్రంగా గురి
అవుతున్న ప్రపంచ దేశాలలో మన దేశం ఒకటి. ఈ సంగతి జాతీయ సమాజం మాత్రమే కాక
అంతర్జాతీయ సమాజం కూడ గుర్తించింది. టెర్రరిజాన్ని నిరోధించడానికి ఐరోపా
దేశాల వారు కూడ కఠినమైన చట్టాలను రూపొందించారు. కానీ మనదేశంలో రాజకీయ
పార్టీల మధ్య ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడానికి కారణం ఏమిటి? కాంగ్రెస్
పార్టీ పదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన సమయంలో 2004, 2014
సంవత్సరాల మధ్య పోటాకు ప్రత్యామ్నాయ చట్టాలు రూపొందలేదు. పోటాను ఎన్‌డిఎ
ప్రభుత్వం రూపొందించిన సమయంలో కూడ కాంగ్రెస్ పార్టీ దాన్ని తీవ్రంగా
వ్యతిరేకించింది. రాజ్యసభలో 2002 మార్చి 21న పోటా బిల్లు వీగిపోవడానికి ఈ
వ్యతిరేకత కారణం. ఆ తరువాత పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో బిల్లును
ఆమోదించవలసి వచ్చింది. పోటాతో మానవాధికారాలకు భంగకరమైన అంశాలున్నాయన్నది
కాంగ్రెస్ తదితర రాజకీయ పక్షాల వ్యతిరేకతకు కారణం. అలాంటి అంశాలు నిజంగా
ఉన్నట్టయితే వాటిని చర్చించి తొలగించవచ్చు. కానీ చట్టాన్ని రద్దు చేయడం
ద్వారా దేశ భద్రతకు తూట్లు పొడవాలా?
పోటాపై చెలరేగిన స్థాయిలోనే గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టంపై
కూడ విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే ఈసారి మాత్రం గుజరాత్ బిల్లును
రాష్టప్రతి ఆమోదించడం ఖాయం. ఎందుకంటే కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లునకు
అనుకూలంగా ఉంది. గుజరాత్ బిల్లు తరహాలోనే జాతీయ స్థాయిలో కూడ చట్టాన్ని
రూపొందించడం మేలు...గుజరాత్ చట్టం దుర్వినియోగం కాకుండాను, అమాయకులు
వేధింపులకు గురికాకుండాను నిరోధించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం
ప్రయత్నిస్తుందా? అన్నది వేచి చూడదగిన అంశం...కానీ నిందితులు పోలీసుల ఎదుట
చెప్పే విషయాలను న్యాయస్థానంలో ధ్రువపడిన సత్యాలుగా భావించడానికి వీలు
కల్పించే నిబంధనను మాత్రం ఈ కొత్త చట్టం నుండి తొలగించాలి. పోలీసులు నేర
పరిశోధకులే కాని న్యాయ నిర్ణేతలు కారు..కారాదు!
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
Reviewed by rajakishor
on
1:04 PM
Rating:
No comments: