బొక్కేసిన విదేశీయులు
ఆంధ్రభూమి సంపాదకీయం, ఏప్రిల్ 9, 2015
ప్రపంచీకరణ వ్యవస్థీకృతమైన కారణంగా జరిగిపోయిన అనేక అనర్ధాలలో విదేశీయ
సంస్థలు తాము చెల్లించవలసిన పన్నులు ఎగవేయడం ఒకటి మాత్రమే! విదేశీయ సంస్థల
ఒత్తడికి మన ప్రభుత్వం దాదాపు ఇరవై ఏళ్లుగా లొంగిపోతుండడం ఈ ఆర్థిక
వైపరీత్యాలన్నింటికీ ప్రధాన ప్రాతిపదిక..మార్చి 31వ తేదీ నాటికి మన దేశంలో
ఉత్పత్తులను పంపిణీని సేవలను కొనసాగిస్తున్న వంద విదేశీయ సంస్థలు దాదాపు
ముప్పయి ఐదు వేల కోట్ల రూపాయల పన్నులను అతి తెలివిగా ఎగవేసినట్టు ఇప్పుడు
బయటపడింది! ఈ వంద సంస్థలు ఈ పన్నులు చెల్లించాలని మన ప్రభుత్వం తాఖీదులను
జారీ చేసిందట! ఇలా పన్ను ఎగవేసిన సంస్థల సంఖ్య వందకంటే ఎక్కువగానే ఉందని ఈ
సంస్థలన్నీ కలిసి దాదాపు అరవై వేల కోట్ల రూపాయల పన్ను ఎగవేసాయని
స్పష్టమైంది. ‘మినహాయింపు’ల పేరుతో ఈ సంస్థలన్నీ ‘పెట్టుబడుల
వృద్ధి’-కాపిటల్ గెయిన్-పై చెల్లించవలసిన కనీసపు ప్రత్యామ్నాయ
సుంకాన్ని-మినిమమ్ ఆల్టర్‌నేట్ టాక్స్-ఎమ్‌ఏటి-చెల్లించకుండా ఎగవేసాయి.
‘మినహాయింపుల పేరుతో వివిధ విదేశీయ సంస్థలు పొందుతున్న అక్రమ లాభాలు మన
ఆర్థిక వ్యవస్థను గుల్ల చేస్తుండడం ప్రపంచీకరణ మాయాజాలం. ఈ మారీచ
మాయాజాలంలో ఇరుక్కుని వున్న మన ప్రభుత్వాలు బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు
భారీగా రాయితీలను ప్రకటించాయి, ప్రకటిస్తున్నాయి. నిజానికి మన ఆర్థిక
విధానాలను ఈ విదేశీయ సంస్థలు నిర్దేశిస్తుండడం మన ప్రభుత్వ రాజకీయ
నిర్వాహకులు పట్టించుకోని వాస్తవ వైపరీత్యం!. ‘ప్రత్యేక ఆర్థిక
మండలులు’-స్పెషల్ ఎకనామిక్ జోన్స్-సెజ్‌లు-నిజానికి ప్రభుత్వేతర సంస్థలు
వినియోగదారులను దోచుకొనడానికి ఉపయోగపడుతున్న ‘కాలు ష్య కేంద్రాలు’!
పరిశ్రమలను ఒకేచోట కేంద్రీకరించి కాలుష్యాన్ని సృష్టిస్తున్న ఈ ఆర్థిక
మండలాలలో పదిహేను ఏళ్లపాటు పెట్టుబడిదారులు ఎలాంటి పన్నులను చెల్లించనవసరం
లేదు! వ్యవసాయదారులకు ప్రభుత్వాలు కల్పిస్తున్న రుణ మాఫీలవల్ల, వివిధ
వర్గాలకు సమకూర్చుతున్న ‘రాయితీ’-సబ్సిడీ-లవల్ల ప్రభు త్వం చేయవలసిన
ఖర్చుకంటే ‘ఘరానా’ పెట్టుబడిదారులకు ‘మినహాయిపు’ల రూపంలో ప్రభుత్వాలు
కోల్పోతున్న ఆదాయం విలువ చాలా ఎక్కువ! ప్రపంచీకరణ వల్ల జరిగిన
వ్యవస్థీకృతవౌతున్న వాణిజ్య దురాక్రమణ స్వభావం ఇదంతా! పన్నుల మినహాయింపును
పొంది దేశమంతటా అవినీతి పుట్టలను పెడుతున్న విదేశీయ సంస్థలు చేస్తున్న
ఉత్పత్తులు ఏమిటి? శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు, పిజ్జాలు,
బర్గర్‌లు...ఇవన్నీ కూడ మన పిల్లల పెద్దల పొట్టలను రోగాలపుట్టలుగా
మార్చివేస్తున్న తీయటి విషాలు! ఐస్‌క్రీమ్‌లలో దూడల కడుపునుండి చిలికి
తీసిన మాంసం-రెన్నెట్, శీతల పానీయాలలో ఎరువులు, పురుగుల మందులు
కలిసిపోతుండడం మరో వైపరీత్యం! పన్నుల మినహాయింపు-టాక్స్ హాలిడే-లభిస్తున్న
ఆర్థిక మండలాలు మరిన్ని వైపరీత్యాలకు నిలయాలు! ఇలాంటి విష రసాయన సమ్మిళిత
శీతల పానీయ ఉత్పత్తి కేంద్రాన్ని ఒక విదేశీయ సంస్థ ఇటీవల తిరుపతి సమీపంలో
ఆరంభించిందట! పెట్టుబడులు తరలి వస్తున్న తీరు ఇది. ‘కాడ్‌బరీ’ అన్న మరో
విదేశీయ సంస్థ వారు ఐదు వందల డెబ్బయి కోట్లు వాణిజ్య సుంకాన్ని- ఎక్సైజ్
డ్యూటీ ఎగవేసిన సంగతి బయటపడడం ‘ప్రపంచీకరణ’ అవినీతికి పతాకం...
ప్రపంచీకరణ ఆరంభమై వాణిజ్య, సుంకాల సాధారణ అంగీకారం-గాట్- ‘ప్రపంచ వాణిజ్య
సంస్థ’గా వ్యవస్థీకృతమైన తొలిరోజులలో, 1990వ దశకంలో ఇప్పటి కేంద్ర అధికార
పక్షంవారు ప్రతిపక్షంలో ఉండేవారు. ప్రపంచీకరణను ఈ భారతీయ జనతాపార్టీవారు
‘పళ్లతో గోళ్లతో’ వ్యతిరేకించడం చరిత్ర...అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండిన
మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ ప్రపంచీకరణ ప్రవర్ధకుడు. కేవలం వౌలిక
పారిశ్రామిక ఉత్పాదక రంగాలలో మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి విదేశీయ
సంస్థలకు అనుమతి ఇస్తామని భాజపా వారికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన
హామీ...విద్యుత్, బొగ్గు, ఇంధన వాయు తైలాలు, సిమెంటు, ఉక్కు వంటి ఈ వౌలిక
పారిశ్రామిక ఉత్పత్తులు!! ఈ రంగాలలో విదేశీయుల పెట్టుబడులు పెరగకపోవడం,
ఉత్పత్తులు పెరగకపోవడం, తీవ్రమైన కొరతలు ఏర్పడడం మనదేశంలోని ప్రపంచీకరణ
చరిత్ర...పంపిణీ, సేవల రంగాలలో మాత్రమే విదేశీయ సంస్థలు భారీగా
ప్రవేశించాయి, పెట్టుబడులను ఉత్పత్తి చేసి తమ దేశాలకు తరలిస్తున్నాయి. ఇలా
తరలిస్తున్న సంస్థలు అరవయి వేల కోట్లరూపాలు ‘ఎమ్‌ఏటి’ని ఎగవేసాయన్నది
ప్రస్తుత ప్రభుత్వం చేసిన నిర్ధారణ!! అభినందనీయం...
గతంలో యుపిఏ ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులకు ఇది ఫలితం! ఈ మినహాయింపునకు
ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్న అర్ధం వేరు, వందలాది విదేశీయ సంస్థలు చేసిన
అన్వయం వేరు. విదేశీయ సంస్థలు చెప్పిన అర్ధాన్ని గత ప్రభుత్వం
అంగీకరించడంవల్లనే ప్రభుత్వ ఖజానాకు నలబయి వేల కోట్ల రూపాయల ‘బొక్క’
పడింది. కానీ పెట్టుబడుల వృద్ధిపై ఎమ్‌ఏటిని విధించే అధికారం ప్రభుత్వానికి
ఉందని వాణిజ్య వ్యవహారాల నిర్ణాయక మండలి- అథారిటీ ఫర్ అడ్వాన్స్‌డ్
రూలింగ్స్-వారు ఇటీవల తీర్పు చెప్పారట! అందువల్ల ఎగవేసిన పన్నులను
చెల్లించవలసిందిగా ప్రభుత్వ పన్నుల విభాగం వారు ఈ విదేశీయ సంస్థలకు
తాఖీదులను పంపించారు.! పన్నులను చెల్లించవలసిన ఈ విదేశీయ సంస్థలు ఆ పని
చేయడం మాని ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయ మండలులలో సవాలు చేయడానికి
సిద్ధవౌతున్నాయట! ‘బొక్కిన’ అవినీతి సొమ్మును ‘కక్కడం’ ఈ సంస్థలకు ఇష్టం
లేదు మరి! ఎమ్‌ఏటిని కూడ మినహాయిస్తూ నిబంధనావళిని సవరించడానికి ఈ విదేశీయ
సంస్థల దళారులు ప్రభుత్వంపై ఒత్తడి చేస్తున్నట్టు వినికిడి! నిబంధనావళిని
సవరించడానికి ప్రస్తుత ప్రభుత్వం అంగీకరించినట్టు కూడ కథనాలు
ప్రచారవౌతున్నాయి! ‘వ్యతిరేకం కాని, సుస్థిర పన్నుల వ్యవస్థ-నాన్
యాడ్వర్సిరియల్ అండ్ స్టేబుల్ టాక్స్ రిజీమ్-ను ఏర్పాటు చేయడం విదేశీయ
పెట్టుబడులను ఆకర్షించడంలో భాగం! కొనసాగుతున్న కథనాలు నిజమైనట్టయితే
మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వ ఆర్థిక నీతిని ప్రస్తుత ప్రభుత్వం మరింత నిష్ఠతో
అమలు జరపనున్నది.
సవరించిన నియమావళి ఈ ఆర్థిక సంవత్సరంనుండి కాక వచ్చే 2016-17వ ఆర్థిక
సంవత్సరంనుండి మాత్రమే అమలులోకి రానున్నదట! ఇదొక్కటే దేశ ఆర్థిక వ్యవస్థకు
విదేశీయ సంస్థల దోపిడీనుంచి కలుగుతున్న వెసులుబాటు! సవరించిన నియమావళి
అమలులోకి వచ్చినట్టయితే వచ్చే ఏడాదినుండి విదేశీయ సంస్థలు ఈ పెట్టుబడుల
వృద్ధిపై పన్ను కట్టనక్కరలేదు. ప్రస్తుతం చెల్లించవలసిన దాదాపు అరవై వేల
కోట్ల రూపాయలు సైతం ఎగ్గొట్టాలన్నది విదేశీయ సంస్థల అభీష్టం...
బొక్కేసిన విదేశీయులు
Reviewed by rajakishor
on
9:51 AM
Rating:
No comments: