కర్ణాటకలో మాతృమాధ్యమం
ఆంధ్రభూమి సంపాదకీయం, ఏప్రిల్ 4, 2015
మాతృభాషా మాధ్యమంగా విద్యాబోధనకు దోహదం చేసే రెండు బిల్లులను కర్ణాటక
రాష్ట్ర శాసనసభ ఆమోదించడం విప్లవాత్మక పరిణామం. భారతీయ భాషలలో విద్యాబోధన
చేసే పద్ధతి క్రమంగా అంతరించి పోతుండడం ఈ బిల్లుల ఆమోదానికి నేపథ్యం.
కర్ణాటక రాష్టమ్రంతటా ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు అన్నిపాఠశాలలోను
మాతృభాష మాధ్యమంగా ప్రాథమిక విద్యాబోధన జరగాలని మొదటి బిల్లు
నిర్దేశిస్తోంది. అంటే రాష్టల్రో దశలవారీగా ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక బోధన
ఆగిపోతుందన్నమాట. ప్రాథమిక స్థాయి విద్యాబోధన మాతృభాషా మాధ్యమంగా
జరగాలన్నది అంతర్జాతీయంగా అన్ని దేశాలలోను మేధావులు చేస్తున్న ప్రచారం.
కానీ మనదేశంలో మాత్రం మాతృభాషా మాధ్యమ బోధనకు ఆంగ్ల గ్రహణం పట్టి ఉండడం
అన్ని రాష్ట్రాలలోను కొనసాగుతున్న వైపరీత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో ప్రభుత్వమే పూనుకొని ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీషు విద్యను
తెలుగు శిశువులకు మప్పాలన్న విధానం 2009 నుంచి అమలు చేస్తోంది. అందువల్ల
గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీషును తప్పించుకొని బతికి బట్టకట్టిన తెలుగు
మాధ్యమ విద్య కూడ ఇప్పుడు అవసాన దశకు చేరుకుంది. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి
వరకు తెలుగు మాధ్యమం, ఇంగ్లీషు మాధ్యమం సమాంతరంగా కొనసాగడం అధికార
విధానమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాలల తెలుగు మాధ్యమ బోధన క్రమంగా అటకెక్కడం
నడచిపోతున్న వైపరీత్యం. ఒకటి నుంచి పది వరకు తరగతులలో తెలుగు మాధ్య బోధనను
మాత్రమే బోధించిన జాతీయతా నిష్ఠకల స్వచ్ఛంద సంస్థలు కూడ ఇప్పుడు ఇంగ్లీషు
మీడియంను నెత్తికెత్తుకున్నాయి. తెలుగు మాధ్యమ విద్య పేదరికానికి, ఆంగ్ల
మాధ్యమ విద్య సమృద్ధికి ప్రగతికి చిహ్నమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
చేసిన ప్రచారం తెలంగాణ, అవశేషాంధ్ర రాష్ట్రాలకు వారసత్వంగా సంక్రమించింది. ఈ
నేపథ్యంలో కర్ణాటక శాసనసభ ఆమోదించిన బిల్లులు భారతీయ మాతృభాషలను
మరణించకుండా నిలబెట్టడానికి పాక్షికంగానైనా దోహదం చేయగలవు. ఒకటవ తరగతి
నుండి పదవ తరగతి వరకు కర్ణాటక రాష్ట్ర పాఠశాలలన్నింటిలోను కన్నడ భాషను
తప్పనిసరిగా బోధించాలన్నది కర్ణాటక శాసనసభ మార్చి నెల 31న ఆమోదించిన రెండవ
బిల్లు. అయితే ఈ బిల్లుల పరిధి నుంచి కేంద్ర ప్రభుత్వ
నిర్ధారిత-సిబిఎస్‌సి, ఐసిఎస్‌ఇ-పాఠ్య ప్రణాళికలను అమలు చేస్తున్న ఏడువందల
పాఠశాలలను కర్ణాటక ప్రభుత్వం మినహాయించింది. అందువల్ల ఈ కేంద్రీయ
పాఠశాలల్లో ఇంగ్లీషుమీడియం యధావిధిగా కొనసాగుతుంది. ఈ కేంద్రీయ పాఠశాలల
సంఖ్య పెరగదన్న నమ్మకం లేదు.
మనదేశంలోని భాషా వైవిధ్యాలు సాంస్కృతిక ఏకత్వాన్ని నిలబెట్టడానికి దోహదం
చేయడం సహస్రాబ్దుల చరిత్ర. ఎందుకంటె అన్ని ప్రాంతీయ భాషలు కూడ ఒకే భారతీయ
సాంస్కృతిక భూమికపై వికసించాయి. అందువల్ల ఏ భారతీయ భాషా మాధ్యమంగా
విద్యాబోధన జరిగినప్పటికీ విద్యావంతునిలో భారతీయతా నిష్ఠ బలపడుతుంది. ఈ
భారతీయతా నిష్ఠ కేవలం రాజకీయ సిద్ధాంతాలకు, పదవీ బాధ్యతలకు అధికారాలకు
పరిమితమైన కృత్రిమ నిబద్ధత కాదు. జాతీయ సహజ జీవన ప్రవృత్తికి సకల విధ
స్వరూప స్వభావాలకు సంబంధించినది. ఈ ప్రవృత్తి ఈ మాతృభూమిపై సహస్రాబ్దులుగా
అద్వితీయ సంస్కృతి. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన మాతృభాషా స్ఫూర్తి ఇదే.
మాతృ భాషను మాట్లాడం మాతృభాషలో విద్యనభ్యసించడం, మాతృభాషలో పాలన సాగించడం,
మాతృభాషా మాధ్యమం ద్వారా న్యాయాన్ని వ్యవస్థీకరించడం- ఇవీ ఇలాంటివి మాతృ
సంస్కృతిని నిలబెట్టుకొనడంలో భాగమన్నది ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్ర
విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ- యునెస్కో- 1999లో చేసిన ప్రకటన సారాంశం. భారత
రాజ్యాంగంలో 351వ అధికరణం స్ఫూర్తి కూడ ఇదే. వివిధ ప్రాంతీయ భాషల ద్వారా
ప్రస్ఫుటమవుతున్న అద్వితీయ జాతీయత ఒక్కటేనన్నది భారత చరిత్ర చాటుతున్న
వాస్తవం. ఇలా అనేక మాతృభాషల ద్వారా ఒకే మాతృ సంస్కృతి అభివ్యక్తం కావడం
మనదేశపు విలక్షణ తత్వం. మరే దేశంలోను ఇన్ని మాతృభాషలు లేవు. అందువల్ల
కర్ణాటక మాత్రమే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలలోను కూడ ప్రాథమిక విద్యను
ఆయా ప్రాంతీయ మాతృ భాషలలో బోధించడం భారతీయతా పరిరక్షణకు మార్గం.
కర్ణాటక బిల్లులో కన్నడ భాషా మాధ్యమంగా మాత్రమే కాక మాతృభాషా మాధ్యమంగా కూడ
ప్రాథమిక విద్యను బోధించాలని నిర్దేశించడం ఈ భాషా వైవిధ్య రక్షక
ప్రవృత్తికి నిదర్శనం. కర్ణాటకలో తెలుగు, తమిళ, మరాఠీ, మలయాళీ, కొంకణి,
తుళు, భాషలను కూడ మాట్లాడే జన సముదాయాల వారున్నారు. ఈ భారతీయ భాషలలో ఏ భాష
ప్రాథమిక విద్యామాధ్యమమైనప్పటికీ కూడ చిన్నారుల స్వభావం భారతీయతా భావ
నిబద్ధం కాగలదు. భాషలు విభిన్నం... కానీ భావం భారతీయం. ఈ జాతీయ జీవన
వాస్తవానికి ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక విద్య విఘాతకరంగా మారింది. ‘‘చిట్టి
చిలకమ్మా, అమ్మ కొట్టిం దా!’’ అని ‘‘వాన ల్లు కురవాలి వానదేవుడా వరిచేలు
పండాలి వానదేవుడా’’ అని వల్లించిన చిట్టినోళ్లు ‘బ్లాక్‌షీప్’ గురించి
మురిసిపోవడం ఈ విఘాతకరమైన ప్రక్రియకు ప్రతీక. ‘రైన్ రైన్ గోఅవే-వానావానా
రావద్దు వెళ్లిపో’’ అని వల్లించడం భారతీయ జీవన పద్ధతికి వ్యతిరేకం.
ఇంగ్లీషు భాషను భాషగా నేర్చుకొనడం వేరు. ఆరవ తరగతి నుండి డిగ్రీ వరకు ఒక
పాఠ్యాంశంగా ఇంగ్లీషు నేర్చుకోవచ్చు. కానీ ఇంగ్లీష్ మాధ్యమంగా ప్రాథమిక
స్థాయి నుండి, పూర్య ప్రాథమిక-కానె్వంట్-స్థాయినుండి విద్యను అభ్యసించడం
వల్ల భారతీయ స్వభావం పాశ్చాత్య భావజాలంలో సంకరమైపోతోంది. విద్యావంతుల జీవన
పద్ధతి భారతీయతకు దూరమైపోయి, అమెరికా కల్చర్‌కు దగ్గరై పోతోంది. కర్ణాటక
రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా ఈ వైపరీత్యాన్ని అడ్డుకట్ట వేస్తోంది.
కర్ణాటక స్ఫూర్తితో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ ప్రాథమిక విద్యను
తెలుగు మాధ్యమంలోను భారతీయ భాషల మాధ్యమంలోను మాత్రమే బోధించే విధంగా చట్టం
చేయాలి. మాతృభాషా తెలుగు భాషా ఉద్యమ సంస్థల వారు ఇందుకోసం
పరిశ్రమించగలగాలి.
కర్ణాటక ప్రభుత్వం ఇలా ప్రాథమిక విద్యను ఇంగ్లీష్ మాధ్యమం నుంచి,
కార్పొరేట్ సంస్థల కబంధ బంధం నుండి విడిపించడానికి దశాబ్దానికి పైగా కృషి
చేస్తోంది. ప్రాథమిక బోధనా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలని గతంలో కర్ణాటక
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు
రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది. అందువల్ల శాసనసభలో బిల్లును ఆమోదింప
చేయడానికి కర్ణాటక ప్రభుత్వం పూనుకొంది. రాజ్యాంగంలోని ఏడవ అనుబంధంలోని
ఉమ్మడి జాబితాలో విద్యను ఉల్లేఖించారు కనుక బిల్లును రాష్టప్రతి
ఆమోదించవలసి ఉంది. రాష్టప్రతి ఆమోదం లభించే అవకాశాలే ఎక్కువ...
కర్ణాటకలో మాతృమాధ్యమం
Reviewed by rajakishor
on
8:08 AM
Rating:
No comments: