Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

క్రొత్త తరహా అస్పృశ్యత


ఇటీవల సభ్య సమాజానికి దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఒకటి బీహారులో జరిగింది. డా. రామ్ మనోహర్ లోహియా ప్రముఖ సోషలిస్టు నాయకుడు. వారి సంస్మరణార్థం బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ లోహియా విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించేరు. వెంఠనే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్.జె.డి.) విద్యార్థి విభాగానికి చెందిన కార్యకర్తలు, లోహియా విచార్ మంచ్ కార్యకర్తలు కలసి వెళ్ళి లోహియా విగ్రహాన్ని నీళ్ళతో కడిగి శుద్ధి చేసేరు. దురదృష్టవశాత్తు సామ్యవాద, ప్రజాస్వామ్య, సెక్యులర్ మేధావులెవరూ ఈ సంఘటనపై నోరు మెదపలేదు. ఎందుకంటే ఈ సంఘటన లోహియా గారి వారసులమని చెప్పుకునే నితీష్-లాలూల ఏలుబడిలో ఉన్న రాష్ట్రంలో జరిగింది కాబట్టి.

మహారాష్ట్ర ప్రభుత్వం డా. అంబేద్కర్ స్మారక మందిరాన్ని నిర్మించడానికి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ సంస్థతో చేసుకున్న ఒప్పందంపై సంతకం చేసింది. అక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ (భా.జ.పా.) నాయకత్వంలోని ప్రభుత్వం కాబట్టి ఈ వార్తకు మీడియాలో పెద్దగా ప్రాచుర్యం లభించలేదు.

భా.జ.పా.కి వ్యతిరేకంగా జనతా పరివార్ గా జట్టుకట్టిన రాజకీయ పక్షాలవారు, సామాజిక న్యాయం గురించి, లౌకికవాదం గురించి బడా కబుర్లు చెప్పుకునే మేధావులూ అవలంబిస్తున్న క్రొత్త తరహా అస్పృస్యతను పై రెండు సంఘటనలూ తెలియజేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం పట్ల ద్వేషంతో అస్పృశ్యతను పాటించే వీళ్ళంతా తమ ఏలుబడిలో నున్న ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో నిరాదరణకు గురౌతున్న నిమ్న వర్గాల విషయంలో నోరెత్తరు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మంజీ ముఖ్యమంత్రి హోదాలో గతంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ బీహార్ రాష్ట్ర ప్రభుత్వ భవనం "బీహార్ నివాస్"లో బస చేసేరు. తన పని పూర్తీ చేసుకుని ఆయన బీహార్ భవన్ ఖాళీ చేసి వెళ్ళిపోయేక ఆ భవనాన్ని నీళ్ళతో కడిగి శుద్ధి చేసేరు. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మధుబని జిల్లాలో ఒక దేవాలయాన్ని సందర్శించగా తరువాత ఆ ఆలయాన్ని నీళ్ళతో కడిగి శుద్ధిచేసారు. నిమ్నకులస్థుడైనందు వల్ల ఒక ముఖ్యమంత్రికే ఇలా అవమానం జరిగినప్పుడు ఇక సామాన్య ప్రజల విషయం యేమని చెప్పాలి? 

2014 లోక్ సభ ఎన్నికల్లో బీహారులో తన పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు నితీష్ కుమార్. తను చెప్పినట్లు వినే జితన్ రామ్ మంజీని ముఖ్యమంతి పీఠంపై కూర్చోబెట్టాడు. 

అయితే మంజీ నితీష్ ని నిర్లక్ష్యం చేస్తూండడంతో సహేతుకమైన కారణాలు ఏవీ లేకుండానే అతడిని ముఖ్యమంత్రి పదవినుండి తొలగించి ఆ పీఠం పైకి ఎక్కారు నితీష్ కుమార్. మరి అంతకు ముందు పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నితీష్ రాజీనామా చేసారనడంలో అర్థమేముంది?

రామ్ మనోహర్ లోహియా కుల వివక్షతకు వ్యతిరేకంగా వెనుకబడిన వర్గాల వారందరినీ ఒకే తాటి మీదకు తెచ్చి పొరాడారు. అలాంటిది లోహియా పేరు చెప్పుకుంటూ, సామాజిక న్యాయం గురించి మాట్లాడే నితీష్ కుమార్ మాత్రం మంజీ పట్ల కుల వివక్ష వైఖరినే ప్రదర్శించేరు. మంజీని వ్యతిరేకించడంలో వైరి పార్టీలో గల తన కులం వారితో చేతులు కలపడానికి కూడా వెనుకాడలేదు నితీష్. మరి ఇది అస్పృశ్యత కాదా? 

ప్రజాస్వామ్యం అంటూ గొంతు చించుకునే ములాయం, లాలూ ప్రసాద్, నితీష్ కుమార్ వంటి పెద్ద మనుషులే దేశంలో వారసత్వ రాజకీయాలకు పెద్దపేట వేస్తున్నారు. ఎప్పుడూ సామాజిక న్యాయం గురించి మాట్లాడే ఇలాంటి నేతలే నిమ్న వర్గాలవారిని చాలా అగౌరవంగా చూస్తున్నారు. అంతేకాదు ఈ పెద్ద మనుషులే నేడు దేశానికి క్రొత్త తరహా అస్పృశ్యతను పరిచయం చేస్తున్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్ సెక్యులరిజం పేరు చెప్పి 1996లో కేంద్రంలో అటల్ బిహారీ వాజ్ పాయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించేడు. తన స్వార్థం కోసం పదిహేనేళ్ళ పాటు భా.జ.పా.తో కలిసి బీహారులో ప్రభుత్వం నడిపిన నితీష్ కుమార్ దేశ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని భా.జ.పా. ప్రకటించడాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నాడు. తాను సెక్యులరిస్టు కాబట్టి మతతత్వవాదులైన భా.జ.పా.తో చేతులు కలపలేనని తన చర్యను సమర్థించుకున్నారు. గత పదిహేనేళ్ళుగా భా.జ.పా.తో చెలిమి చేసినప్పుడు కనబడని సెక్యులరిజం ఇప్పుడు ఈయనగారికి గుర్తుకొచ్చింది. 

ములాయం సింగ్, మాయావతి, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు - వీరేవ్వరికీ ఒకరంటే ఒకరికి పడదు. కానీ భా.జ.పా.కు వ్యతిరేకంగా వీరంతా జనతా పరివారంగా గుంపు కట్టేరు. వీళ్ళంతా మోదీకి, భా.జ.పా.కి వ్యతిరేకంగా నూతన అస్పృశ్యతా విధానాన్ని నిర్వచిస్తున్నారు. ఇదీ లోహియా వారసులమని చెప్పుకునే ఈ పెద్దమనుషుల పచ్చి అవకాశవాదం.



ఒకప్రక్క బీహార్ శాసనసభ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. మరోప్రక్క సామాజిక న్యాయం పేరుతో అవకాశ వాదమే పరమావధిగా రాజకీయ అస్పృశ్యత వికృత పోకడలు పోతోంది. తమ రాజకీయ స్వార్థం కోసం కులం కార్డుని వాడుతున్న ఈ పెద్ద మనుషులు ఒక విషయం మరచిపోతున్నారు. అదేమిటంటే కులపరమైన లేదా మరే విధమైన ప్రత్యేకవాదం కంటే డా. అంబేద్కర్ దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యాన్నిచ్చేరు. ఆయన చెప్పిన మాటలని పెడచెవిన పెడితే మన సమాజంలో మరిన్ని అసమానతలు పెరుగుతాయి. అప్పుడు సామాజిక న్యాయమనేది ఒక నినాదంగానే మిగిలిపోతుంది.
క్రొత్త తరహా అస్పృశ్యత Reviewed by rajakishor on 5:30 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.