Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

కమ్యూనిస్టుల దేశద్రోహం

ఎస్. ఆర్. రామానుజన్, ఆంధ్రభూమి దినపత్రిక, ఏప్రిల్ 17, 2015

నెహ్రూవియన్ సామ్యవాదులు, కమ్యూనిస్టులు...లెఫ్ట్ చరిత్రకారుల సహకారంతో పరస్పర సమన్వయంతో పనిచేసి మధ్య, ఆధునిక యుగ భారత చరిత్రను పూర్తిగా వక్రీకరించి, ఎవ్వరికీ సంబంధం లేనిదిగా తయారు చేశారన్నదాంట్లో రహస్యమేం లేదు. ఒక గొప్ప హీరో, నిష్కళంక దేశభక్తుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అయిన సుభాష్ చంద్రబోస్‌పై... దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గూఢచర్యం కొనసాగించాడన్న విస్పష్టమైన, వివాద రహిత సమాచారం బయటకు పొక్కడంతో, అంతటి గొప్ప మనీషిపై ఒక పద్ధతి ప్రకారం కొనసాగించిన తప్పుడు ప్రచారం కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించారన్న తప్పుడు సమాచారాన్ని మాత్రమే ప్రచారం చేశారు. 

విమాన ప్రమాదం చోటు చేసుకోలేదని తైవాన్ ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించినా, రెండు మూడు కమిషన్లు విమాన ప్రమాదం సత్యదూరమని నిగ్గు తేల్చినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు! పశ్చిమ బెంగాల్‌ను మూడు దశాబ్దాల పాటు పాలించిన కమ్యూనిస్టులు, నేతాజీ విషయంలో అస లు నిజాన్ని వెలుగులోకి రాకుండా తొక్కిపట్టడానికి కారణం, సుభాష్‌ను ఖైదు చేసి హత్య చేయించింది స్టాలిన్ కావడం వల్లనే!

అర్యులు విదేశీయులని, వీరు మనదేశంపైకి దురాక్రమణకు పాల్పడ్డారన్న దగ్గరినుంచి చరిత్ర వక్రీకరణ ప్రారంభమైంది. వలసవాదులు తమ స్వప్రయోజనాలకోసం సైద్ధాంతీకరించిన అంశాలనే, హిందూ వ్యతిరేక చరిత్రకారులు, కమ్యూనిస్టులు దౌర్జన్యంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా హిందూ జాతీయ వాదులను నిందిస్తూ.. ‘మీరు కూడా మొఘల్స్, ఐరోపా వలస వాదుల మాదిరిగానే దురాక్రమణ దారులు’ అంటూ యెగతాళి చేశారు. ఇదంతా చాలా జాగ్రత్తగా అల్లిన కట్టు కథ అని ఎటువంటి అనుమానం లేకుండా రూఢి అయింది.
అసలు ఆర్యుల దురాక్రమణ జరిగిందా? ఇందుకు స్టీఫెన్ నాప్ అనే మేధావి రాసిన పుస్తకాలను చదివితే తెలుస్తుంది. ఆయన ఆధ్యాత్మికత, వైదిక సంస్కృతి, తూర్పు తత్వశాస్త్రాలపై అనేక పుస్తకాలు రాశాడు. ఆయన ఈవిధంగా పేర్కొన్నాడు, ‘‘ఆర్యులు భారత్‌పై దురాక్రమణ జరిపారన్నది కేవలం కుట్ర మాత్రమే. 1866, ఏప్రిల్ 10న లండన్‌లో జరిగిన రాయల్ ఆసియాటిక్ సొసైటీ రహస్య సమావేశంలో కావానే ఈ తప్పుడు చరిత్రను సిద్ధాంతీకరించాలని నిర్ణయించారు. ఆర్యులు కూడా విదేశీ దురాక్రమణ దారులేనన్న సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తే, ఇంగ్లీషువారు విదేశీయులని ఏ భారతీయుడు చెప్పడానికి వీలుండదు. భారత్ మొదట్నుంచీ విదేశీయుల పాలనలోనే కొనసాగిందన్న ప్రచారం చేయడం వల్ల, దయాళువులైన క్రైస్తవుల పాలనలో దేశం బానిసగా మిగిలిపోవాలి. ఈ రాజకీయ నిర్ణయాన్ని, సిద్ధాంతాన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో అమలు జరిపారు.’’ 

బాగానే ఉంది కానీ 2004 నుంచి పదేళ్ల పాటు దేశం మళ్లీ క్రైస్తవ పాలన కిందికి వెళ్లడం పురాకృతం తప్ప మరోటి కాదు!
పరమత విద్వేషులైన ఇస్లాం చొరబాటుదార్లు కత్తులు చేతబూని తమను నానా హింసల పాల్జేసిన చరిత్రను హిందువుల స్మృతిపథం నుంచి తొలగించడానికి యత్నిస్తున్న భారత మేధావులను కోయిన్‌రాడ్ ఎల్‌స్ట్ తన పుస్తకం ‘నెగాషియనిజం ఇన్ ఇండియా’లో దుయ్యబట్టాడు. ‘హిందూ ముస్లింల మధ్య సంఘర్షణ కొనసాగిందన్న అంశాన్ని చాలామంది భారతీయ చరిత్రకారులు, జర్నలిస్టులు, రాజకీయ వేత్తలు తీవ్రంగా ఖండిస్తారు,’ అని కూడా ఆయన పేర్కొన్నారు. గంగా-యమునా మైదానం ముఖ్యంగా ఈ దొంగల, దోపిడీదార్ల దురాక్రమణకు గురైంది.
మనదేశానికి చెందిన కమ్యూనిస్టులు, ఉదారవాదులు ఈ తిరస్కారాన్ని కేవలం హిందువులను ఎగతాళి చేయడానికి చాలా అలవోకగా వాడారు. కమ్యూనిస్టులు భారత్ లేదా దేశ ప్రజలకు ఎన్నడూ విధేయులుగా ఉండలేదు. వీరిపై బహుళ ప్రాచుర్యం పొందిన ఒక సామెత ఉండనే ఉంది. ‘‘ రష్యాలో వానలు పడితే భారత కమ్యూనిస్టులు గొడుగులు తెరుస్తారు’’ అన్నదే ఆ సామెత. అటువంటి కమ్యూనిజం ప్రపంచంలోని చాలా దేశాల్లో కుప్పకూలిపోయింది. ఇప్పటి వరకు కమ్యూనిజాన్ని నెత్తిన మోసిన చైనా..దాన్ని పక్కన పెట్టింది. ప్రస్తుతం భారత కమ్యూనిస్టులు, ‘అంతరించి పోయే జాతి’! మరి కమ్యూనిజాన్ని పునరుద్ధరించాలన్న ఆశతో ఉన్న వీరు చైనా విషయంలో నోరు మెదపరు!
దాన్నట్లా ఉంచుదాం. చరిత్ర వక్రీకరణ అంశానికి మళ్లీ వద్దాం. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చెప్పే మరో సిద్ధాంతం ఏమంటే.. ముస్లిం పాలకులు ఎన్నడూ హిందూ దేవాలయాలను కూలగొట్టలేదని. కాశీలోని విశ్వనాథుని ఆలయాన్ని ధ్వంసం చేసింది ఔరంగజేబు కాదని, కేవలం హిందువులు మాత్రమే అంతర్గత కలహాలతో దాన్ని ధ్వంసం చేశారంటూ ఈ ‘జోకర్లే’ చెబుతారు. సీతారామ గోయెల్ రాసిన ‘హిందూ టెంపుల్స్-వాట్ హాపెన్డ్ టు దెమ్’ పుస్తకంలో ఈ విధంగా రాశారు. ‘‘1985, అక్టోబర్ 21న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన లేఖలో, మధురలోని కేశవానంద దేవాలయాన్ని ధ్వంసం చేసి ఈద్గా మైదానాన్ని రూపొందించిన ఔరంగజేబును సమర్ధిస్తూ పనె్నండు మంది మార్క్సిస్టు ప్రొఫెసర్లు ర్యాలీ నిర్వహించారు..ఈ మార్క్సిస్టు ప్రొఫెసర్లు ఒక రాజకీయ కారణాన్ని కనిపెట్టారు. హిందూ దేవాలయాలు రాజకీయ కుట్రలకు కేంద్రాలుగా మిగిలాయి. అందువల్ల సుల్తానులు తప్పని సరిగా వీరిని అణచివేయాల్సి వచ్చింది. ఈ విధానంలో తప్పనిసరి పరిస్థితుల్లో హిందూ దేవాలయాలు ధ్వంసమైతే వారిని తప్పు పట్టలేం. ఈ సుల్తానులు ప్రజల సుఖ శాంతులకోసం ఎంతగానో కృషి చేశారు.’’
తప్పుడు సమాచారం ఇవ్వడం, కల్లబొల్లి కబుర్లు చెప్పడంలో కమ్యూనిస్టులకు మించిన వారు లేరు. 

‘విమాన ప్రమాద’ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం ద్వారా నేతాజీని భారత్‌కు ఆవలే ఉంచడంలో కమ్యూనిస్టులు..నెహ్రూలోని పదవీ లాలస, ఈర్ష్యను బయటపడకుండా ఉంచేందుకు ఎంతో సహాయం చేశారు. 

మైసూర్ నిరంకుశ పాలకుడు టిప్పు సుల్తాన్‌ను తీసుకోండి. మలబార్ ప్రాంతానికి చెందిన దాదాపు లక్షమంది హిందువులను, 70వేల మంది క్రైస్తవులను జైళ్లలో పెట్టి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాడు. వందల మంది నాయర్ కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లలను శ్రీరంగపట్టణానికి అపహరించుకొని రావడమో, డచ్ వారికి బానిసలుగా అమ్మేయడమో చేశాడు. పాల్‌ఘాట్ కోటను పట్టుకున్న తర్వాత, అమాయక హిందూ బ్రాహ్మణుల తలలను కోటలో వేళాడదీసి హిందువుల్లో భయోత్పాతాన్ని సృష్టించాడు. టిప్పు ఒక మత ఛాందస వాది. అతని సమాధిమీద ‘‘హైదరీ సుల్తాన్ మత విశ్వాసం కోసం మరణించాడు’’ అని చెక్కి వుంది. మరి మన కమ్యూనిస్టులకు అతనొక స్వాతంత్య్ర సమరయోధుడు! 

స్వాతంత్య్ర సమరయోధుడనేవాడు, తన స్వదేశానికి చెందిన ఇతర మతస్తులను సమూలంగా నాశనం చేస్తాడా? మత మార్పిడులకు పాల్పడతాడా? మలబార్ ప్రాంతంలోని నిస్సహాయులైన హిందువులపై అతను జరిపిన దాష్టీకాలను ఎవ్వరూ ఎన్నటికీ మరువలేరు. శ్రీరంగపట్టణం సమీపంలోని మెల్కొటెకు చెందిన ప్రజలు నేడు కూడా దీపావళి పండుగను జరుపుకోరు. ఈ దేవాలయ పట్టణంలో అదే రోజున ఎంతోమంది బ్రాహ్మణులను టిప్పు సుల్తాన్ దారుణంగా హతమార్చాడు. 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దూరదర్శన్ ‘టిప్పు స్వోర్డ్’ పేరిట ఒక సీరియల్‌ను ప్రసారం చేసింది. అందులో టిప్పు సుల్తాన్‌పై పొగడ్తల వర్షమే ఉంటుంది. తనను తాను ఒక ఉదారవాదిగా చెప్పుకునే ఒక కన్నడ నటుడు ఈ విగ్రహ విధ్వంసకుడికోసం ఎప్పడూ గొంతెత్తుతూనే ఉంటాడు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల వ్యవహారశైలి ఈవిధంగా ఉన్నప్పుడు నిజమైన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్ గురించిన అసలు వాస్తవాలను మరుగున పరచడం పెద్ద ఆశ్చర్యకరం కాదు.
అసలు దేశంలో వంశపారంపర్య పాలనకు బీజం వేసినవాడు మోతీలాల్ నెహ్రూ అన్న సంగతి మీకు తెలుసా? మీకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే నెహ్రూ కుటుంబానికి అంతటి అత్యున్నత స్థాయి కల్పించారు. అందువల్ల వారి అసలు రంగు ఎవ్వరికీ తెలియదు. 1928, జూలై నెలలో నాయకత్వం విషయంలో కాంగ్రెస్ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, మోతీలాల్ నెహ్రూ... గాంధీకి ఒక లేఖ రాశారు. పార్టీని ‘జవహర్’ లాంటి యువకుల చేతిలో పెట్టాలన్నది ఆ లేఖ సారాంశం. అధ్యక్ష పదవికి సర్దార్ పటేల్ సరైన వాడన్న ఉద్దేశం పార్టీ వర్గాల్లో సుస్థిరంగా నాటుకొని ఉన్నప్పటికీ, మరుసటి సంవత్సరం నెహ్రూ పార్టీ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. అంటే వంశపారంపర్యత అనేది నెహ్రూ కుటుంబ సభ్యుల జన్యువుల్లోనే ఉంది. అందువల్ల రాహుల్ గాంధీకి ప్రోత్సాహమిస్తున్న సోనియాను తప్పు పట్టడంలో అర్థం లేదు. ఆమె కేవలం తన మామగారి తండ్రిని అనుసరిస్తున్నదంతే! కానీ మన ఉదారవాదులను ప్రశ్నించండి..నెహ్రూ ఆయన కుటుంబ సభ్యులను ప్రజాస్వామ్యానికి ప్రతీక అంటూ ఊదర కొట్టేస్తారు.
ఇక ఛత్రపతి శివాజీని కూడా ఈ సూడో చరిత్రకారులు వదల్లేదు. ఒక చిన్న పాటి దోపిడీ దారుగా మాత్రమే చిత్రించారు. మరి వీరంతా, అరబిందో, రామకృష్ణ, వివేకానంద లేదా రవీంద్రనాథ్ ఠాగూర్‌లను అంగీకరిస్తారా? వీరసవార్కర్ హిందూత్వ భావనను వ్యక్తంచేసినందుకు ఆయన్ను ఎగతాళి చేశారు. తన జీవితకాలమంతా దేశంకోసమే త్యాగం చేసిన అతనికి సమానమైన త్యాగమూర్తి కాంగ్రెస్‌లో ఎవరైనా ఉన్నారా? బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలేలు వీరి దృష్టిలో దేశభక్తులు కారు! వారంతా నిజమైన దేశభక్తులు కావడం, హిందూ జాతీయ వాదానికి పూర్తిగా మద్దతు తెలపడమే అందుకు కారణం. ఈ సందర్భంగా వారు తమ కుటుంబాలను గురించి పట్టించుకోలేదు కూడ. అదే కమ్యూనిస్టులకు మాత్రం చైనా మరియు రష్యాలంటే ఎంతో మక్కువ. నెహ్రూ మాత్రమే కమ్యూనిస్టులతోను, లార్డ్ వౌంట్ బాటన్‌తోను సన్నిహితంగా మెలిగారు. తద్వారా తనలోని చీకటికోణాన్ని బయటపడకుండా జాగ్రత్తవహించి చరిత్రను వికృతం చేశారు. ఇప్పుడు సమర్ధించరాని వ్యక్తిని ఎవరు సమర్ధిస్తున్నారు? కేవలం చరిత్ర కారుల ముసుగు కప్పుకున్న వామపక్షాల వారు మాత్రమే!!

కమ్యూనిస్టుల దేశద్రోహం Reviewed by rajakishor on 9:58 AM Rating: 5

1 comment:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.