Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఐరోపాను ఎండగట్టిన మోదీ

హెబ్బార్ నాగేశ్వరరావు , ఆంధ్రభూమి దినపత్రిక , ఏప్రిల్ 16, 2015


ఇది ఒక అద్భుత వ్యాసం. దయచేసి దీనిని చదివేసి పక్కన పడేయకండి. మన దౌర్భాగ్యం కొద్దీ మనదేశంలోని మీడియా ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ విషయాన్ని తోక్కిపెట్టేసింది. నలుగురితో ఇందులో ప్రస్తావించిన విషయాలు పంచుకోండి. వీలైతే ప్రింటు తీసి ఇతరులకి పంచండి. 

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీ హాలెండ్ అదిరిపడి ఉండవచ్చు... జర్మనీ ప్రధానమంత్రి - ఛాన్సలర్- అంజెలా మార్కెల్ అంతరంగంలో అలజడి చెలరేగి ఉండవచ్చు! భారతీయ స్వభావం గురించి అంతర్జాతీయ హితంకోసం భారతీయులు చేసిన కృషి గురించి మన ప్రధాని ప్రస్తావించిన చారిత్రక వాస్తవాలు ఈ ఆందోళనకు కారణం! ఐరోపావారి దురాక్రమణ ప్రపంచాన్ని ముంచెత్తడం చరిత్ర. భారతీయులు ఏ ఇతర దేశంలోకి చొరబడలేదని, దురాక్రమణ జరుపలేదని నరేంద్రమోదీ చారిత్రక వాస్తవాలను వినిపించడం ఈ ఐరోపా దేశాల ప్రభుత్వాధినేతలకు ఇబ్బందికరమైన పరిణామం! 

ఏప్రిల్ పదకొండవ తేదీన ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోను పదునాలుగవ తేదీన జర్మనీ రాజధాని బెర్లిన్‌లోను నరేంద్రమోదీ భారతీయుల విశ్వహిత తత్త్వం గురించి ప్రస్తవించారు! మొదటి ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావించారు, రెండవ ప్రపంచ యుద్ధం గురించి ముచ్చటించారు! ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మన దేశానికి ‘శాశ్వత సభ్యత్వం’ కల్పించాలన్న దశాబ్దుల ప్రతిపాదనకు మద్దతుగా మోదీ సహస్రాబ్దుల భారతదేశపు విశ్వహిత స్వభావాన్ని గురించి చెప్పారు! ఇందుకు భిన్నమైన విరుద్ధమైన ఐరోపావారి విశ్వవిఘాతుక చరిత్ర ఫ్రాన్స్ అధినేతకు, జర్మనీ ప్రభుత్వ అధినేతకు స్ఫురించడం అసహజం కాదు! రెండు ప్రపంచ యుద్ధాలు ఐరోపా దేశాల పరస్పర విరుద్ధ ఆధిపత్య విస్తరణ ఉద్యమాలు! ఐదువందల ఏళ్లపాటు, క్రీస్తుశకం పదహారవ శతాబ్దినుంచి, ఐరోపా దేశాల వారు ఇతర ఖండాలలోని ప్రజలను దమనకాండకు గురిచేయడం ప్రపంచ చరిత్ర!

క్రీస్తుశకం 1914వ, 1918వ సంవత్సరాల మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం, 1939వ 1945వ సంవత్సరాల మధ్య కొనసాగిన రెండవ ప్రపంచ యుద్ధం. ఐరోపా దేశాలలోని రెండు కూటముల మధ్య నడిచిన ‘ప్రాబల్య’పు పోరాటాలు! బ్రిటన్ ఒక కూటమికి జర్మనీ రెండవ కూటమికి నాయకత్వం వహించాయి. ఫ్రాన్స్ రెండు యుద్ధాలలోను బ్రిటన్ వైపున ఉంది. ఇటలీ, రష్యా వంటి దేశాలు అటూ ఇటూ ఫిరాయించాయి! 

ఐరోపావారి దృష్టిలో ఐరోపా అంటే మొత్తం ప్రపంచం... అందుకే ఐరోపా వారి అంతర్గతమైన కుమ్ములాటలు ప్రపంచ యుద్ధాలుగా విస్తరించాయి. ప్రస్తుత అమెరికా దేశం ఐరోపా స్వరూప స్వభావాలకు వారసత్వానికి విస్తృతి మాత్రమే. ప్రాచీన అమెరికాను ఐరోపావారు ధ్వంసం చేశారు! ప్రాచీన ఆస్ట్రేలియాను సైతం ఐరోపావారు రూపుమాపారు. ప్రస్తుతం అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను ఉంటున్న అధిక సంఖ్యాకులు ఐరోపా దురాక్రమణకారుల వారసులు. 

ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ వివరించిన ‘‘దురాక్రమణ జరుపని భారత్’’ ఇందుకు పూర్తి విరుద్ధమైన ఐరోపా దురాక్రమణ స్వభావాన్ని స్ఫురింపచేసింది!! తమది కానిదాన్ని ధ్వంసం చేయడం భారతదేశం వెలుపల పుట్టిపెరిగిన వికృతి! తమది కాని చిహ్నాన్ని, ఆచారాన్ని, సంప్రదాయాన్ని, మతాన్ని, భాషను, ఆలోచనా రీతిని ధ్వంసంచేసిన చరిత్ర ఐరోపా జాతులది. ఈ అమానవీయ ప్రవృత్తి భయంకర రక్తపాతాన్ని సృష్టించింది. ‘గ్రీకు’నాగరికతను ‘రోము’ నాగరికత తొలగించింది. ‘రోమ్’నాగరికతను క్రైస్తవ మతం రూపుమాపింది. ఒకదాని తరువాత ఒకటి పరిఢవిల్లాయి. ఒకదానిని దిగమింగి మరో ‘నాగరికత’ విస్తరించింది!! అంతే కాని భారతదేశంలోవలె లేదా భారతీయ సంస్కృతి పరిఢవిల్లిన ప్రాంతాలలోవలె అనేకానేక వైవిధ్యాలు, సమాంతరంగా పరిఢవిల్లిన చరిత్ర ‘ఐరోపా’కు లేదు! ఈ వైవిధ్యాలు మతాలు కావచ్చు, భాషలు కావచ్చు, ఆలోచనారీతులు కావచ్చు, ఆహార ఆహార్యాలు కావచ్చు.... దురాక్రమణకు, విధ్వంసకాండకు ఇదీ కారణం! ఈ విధ్వంసక ప్రవృత్తి ‘ఇస్లాం’ పుట్టిన తరువాత ‘జిహాద్’కు ప్రాతిపదిక కావడం తరువాతి చరిత్ర...

వివిధ ఖండాలలో పుట్టుకొచ్చిన ఇలాంటి విధ్వంసక ప్రవృత్తికల ‘జన సముదాయాలు’ పరస్పరం తలపడినప్పుడు ఓడిన వారిని గెలిచినవారు సమూలంగా నిర్మూలించడం భారతదేశానికి వెలుపలి చరిత్ర! ఈ విధ్వంసక శక్తులు భారతదేశంలోకి దురాక్రమించిన చరిత్ర కూడ ఉంది. భారతీయులు ఓడిపోయినప్పుడల్లా ‘గెలిచిన’విధ్వంసక ప్రవృత్తిగల ఈ విదేశీయ శక్తులు 'భారతీయత’ను లేదా ‘హిందుత్వాన్ని’ కూకటివేళ్లతో పెళ్లగించి పారేశారు. భారతీయ సాంస్కృతిక సీమలు క్రమంగా కుంచించుకొనిపోవడానికి ఇది కారణం! కానీ భారతదేశంపైకి దురాక్రమించిన ‘విధ్వంసక శక్తుల’ను భారతీయులు లేదా హిందువులు ఓడించినప్పుడు ఆ విదేశీయశక్తులను ‘కూకటివేళ్ల’తో కుళ్లగించలేదు. ఎందుకంటే 'భారతదేశం’ తమ వాటిని రక్షించుకొనడానికి మాత్రమే యత్నించింది, సంఘర్షణ సాగించింది.... తమవి కాని వాటిని ధ్వంసంచేయడం కాని, విదేశాలలోకి చొరబడి ‘బీభత్సం’ సృష్టించడం కాని అనాదిగా భారతీయుల స్వభావం కాదు! ఈ వాస్తవాన్ని నరేంద్రమోదీ పారిస్‌లోను, బెర్లిన్‌లోను పాశ్చాత్యులకు గుర్తుచేశారు!

డస్సాల్ట్ రాఫెల్ కంపెనీవారి యుద్ధవిమానాలను మనం కొనుగోలు చేయడం గురించి, ఫ్రాన్స్ జర్మనీ దేశాల బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు మన దేశంలో భారీ పెట్టుబడులు పెట్టడం గురించి, ‘అరేవా’కంపెనీకి, ‘లార్సన్ అండ్ టూబ్రూ’ సంస్థకూ మధ్య అణుఉత్పాదక సాంకేతిక సహకారం ఏర్పడం గురించి జరిగిపోతున్న ప్రచారం స్థాయిలో ఈ ‘వాస్తవానికి’మాధ్యమాలలో ప్రాధాన్యం లభించలేదు!

క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో మన దేశంలోకి చొరబడి బీభత్సకాండను సృష్టించడానికి యత్నించిన గ్రీకు దురాక్రమణకారుడు అలెగ్జాండర్ ఓడిపోయి పారిపోయాడు. ఈ దురాక్రమణ సందర్భంగా తక్షశిల మహావిద్యాలయం ప్రాంగణంలో తమకు జరిగిన పరాభవం గురించి గ్రీకులు స్వయంగా వ్రాసుకున్నారు. ప్రశాంతంగా ఉండిన మహావిద్యాలయం ప్రాంగణంలోకి గ్రీకు సైనికులు చొరబడినారు. అధ్యయనం చేస్తుండి విద్యార్థులు, అధ్యాపనం చేయిస్తుండిన ఆచార్యులు కాని ఈ సైనికులను పట్టించుకోలేదు. కానీ గ్రీకు సైనికులు విధ్వంసకాండను, దగ్ధకాండను మొదలుపెట్టారు. వెంటనే తమపై అగ్నివర్షం కురిసిందని, పిడుగుల జడికి అనేకమంది గ్రీకు సైనికులు మిడతలవలె మాడిపోయారని గ్రీకు చరిత్రకారులే అంగీకరించారు. మిగిలిన సైనికులు పారిపోయారు! ఇలాంటి ఆగ్నేయ అస్తప్రాటవం కలిగి ఉండిన తక్షశిల విద్యాలయం అధ్యాపకులు కాని, భారతీయ సైనికులు కాని పారిపోతుండిన గ్రీకులను వెన్నంటి తరమలేదు... పట్టి పరిమార్చలేదు. తమ శక్తిని ఇతర దేశాల విధ్వంసానికి భారతీయులు వినియోగించకపోవడం సహస్రాబ్దుల చరిత్ర! ఈ చరిత్రను మోదీ ఫ్రాన్స్, జర్మనీలలో ప్రస్తావించారు. 

అమెరికాలోని చొరబడిన ఐరోపావారు క్రీస్తుశకం పదహారవ శతాబ్దిలో నిరాయుధులైన ‘రెడ్ ఇండియన్ల’ ఊచకోతకోసి ఆ అనాది జాతిని నిర్మూలించారు. పద్దెనిమిదవ శతాబ్దిలో ఆస్ట్రేలియాలోని అనాది వనవాసులను కూడ ఐరోపావారు సామూహికంగా హత్యచేశారు.

మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలలో ఐరోపాదేశాలు తమ హితంకోసం పోరాడాయని, భారతీయులు మాత్రం ‘అన్యుల’ హితం కోసం పోరాడారని మోదీ ప్రపంచ ప్రజలకు గుర్తుచేశారు. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైన తరువాత వంద ఏళ్లు పూర్తయినాయి. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో అమరులైనవారికి అంజలి ఘటించిన మోదీ, ఆ యుద్ధంలో డెబ్బయి ఐదువేల మంది భారతీయ సైనికులు ‘విశ్వశాంతి’కోసం ప్రాణత్యాగం చేసిన సంగతిని గుర్తుచేశారు! ఆ తరువాత పారిస్‌లో భారతీయుల సమావేశంలో ప్రసంగించిన మోదీ, ‘‘మండలి’’లో శాశ్వత సభ్యత్వంకోసం మన దేశంకంటె ఎక్కువ నైతిక అధికారం కలిగిన దేశం మరొకటి లేదన్న వాస్తవాన్ని గుర్తుచేశారు. ఇదే సంగతిని జర్మనీ రాజధానిలో కూడ మోదీ ప్రస్తావించారు! ‘మండలి’లో శాశ్వత సభ్యత్వం ఉన్న ఫ్రాన్స్ దేశపు అధినేత ప్రతిస్పందించలేదు. శాశ్వత సభ్యత్వం లేని జర్మనీ కూడ మనతో కలసి ఈ విశిష్ట అధికారంకోసం పోటీపడుతున్నది. బెర్లిన్‌లో మోదీ జర్మనీకి కూడ మన దేశంతోపాటు శాశ్వత సభ్యత్వం కల్పించాలని కోరారు. కానీ జర్మనీ ప్రభుత్వం అధినేత్రి మాత్రం వౌనం వహించింది! 

బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ మాత్రం లండన్‌లో మంగళవారంనాడు మన దేశానికి ‘శాశ్వత సభ్యత్వం’ ఇవ్వాలని కోరడం వేరే కథ... బ్రిటన్ ప్రతినిధుల సభకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. బ్రిటన్‌లో భారతీయ సంతతి వోటర్లు గణనీయంగా ఉన్నారు. కామరూన్ గతంలో కూడ ఒకసారి ఇలా సమర్ధించి ఉన్నాడు. జర్మనీ రెండు ప్రపంచ యుద్ధాలలోను బ్రిటన్‌కు ప్రబల శత్రువు! రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఓడిన జర్మనీ బ్రిటన్ అమెరికాలు ఓవైపున, రష్యా మరోవైపున నిలబడి ముక్కలు చేయడం చరిత్ర! పశ్చిమ జర్మనీ ‘ప్రజాస్వామ్య దేశం’గా అమెరికా కూటమిలో చేరగా తూర్పుజర్మనీ ‘కమ్యూనిస్టు’ ఏకపక్ష వ్యవస్థను స్వీకరించి రష్యాతో జట్టుకట్టింది! బెర్లిన్ నగరాన్ని సైతం మధ్యలో గోడకట్టి విభజించడం చరిత్ర... అలా జర్మనీ బలహీనమైంది. ‘కమ్యూనిజ ఏకపక్ష నియంతృత్వ’ వ్యవస్థలు కుప్పకూలిపోయిన తరువాత 1989 నవంబర్‌లో బెర్లిన్ గోడ కూలిపోయింది. రెండు జర్మనీలు ఒకే జర్మనీగా పునరేకీకృతం అయ్యాయి. ఈ ఏకీకృత ప్రజాస్వామ్య జర్మనీ ఐరోపాలో ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకొని ఉంది! ఐరోపా సమాఖ్యలో ‘జర్మనీ బ్రిటన్ ఫ్రాన్స్ ఇటలీ’లు ఇప్పుడు ప్రాబల్యంకోసం పోటీపడుతున్నాయి. అందువల్ల జర్మనీకి ‘మండలి’శాశ్వత సభ్యత్వం ఇవ్వడం బ్రిటన్‌కు లోలోపల నచ్చని వ్యవహారం... మన దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కామరూన్ కోరడానికి ఇది కూడ ఒక కారణం...

‘‘మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పదునాలుగు లక్షల మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు... ఎవరికోసం వారు పోరాడారు?? భారత్ హితకోసం కాదు, భారత్ ప్రాబల్య విస్తరణకోసం కాదు.... ఇతరులకోసం పోరాడారు... చరిత్రను విస్మరించేవారు చరిత్రను వ్రాసే అధికారం కోల్పోతారు. తమ దేశంకోసం యుద్ధం చేయడంలేదు... ఇతర దేశాల హితంకోసం యుద్ధం చేయడంవేరు....’’ అన్న మోదీ మాటలు ఐరోపా దేశాలవారికి గతాన్ని గుర్తుచేసి ఉంటాయి! 

డెబ్బయి ఐదువేల మంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో అసువులు బాసారు. వారు బ్రిటన్ తరఫున పోరాడారు, జర్మనీకి వ్యతిరేకంగా పోరాడారు! భారతదేశం రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోను బ్రిటన్‌కు బానిస దేశం! అందుకే మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ‘నానాజాతి సమితి’- లీగ్ ఆఫ్ నేషన్స్’లో మనకు సభ్యత్వంలేదు. ‘ఐక్యరాజ్యసమితి’లో ఆ తరువాత సభ్యత్వం లభించినప్పటికీ మన స్థాయికి తగిన ప్రాధాన్యం దక్కలేదు!!

ఐరోపాను ఎండగట్టిన మోదీ Reviewed by rajakishor on 9:24 AM Rating: 5

1 comment:

  1. excellent article,, i seen most of modi news on this posts, they show live,, but this main stream media,, they dont show any of those things rather they try to show mostly pornography of various actress ,, to divert ppl minds,,lol

    ReplyDelete

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.