శాశ్వత సభ్యత్వ స్వప్నం..
ఆంధ్రభూమి సంపాదకీయం , ఏప్రిల్ 15, 2015
మన దేశానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న
దశాబ్దుల నాటి ప్రతిపాదనను నరేంద్ర మోదీ మళ్లీ గుర్తు చేశారు. ఫ్రాన్స్‌లో
భారతీయులనుద్దేశించి ప్రసంగించిన సమయంలోను, జర్మనీలో ప్రధాని-్ఛన్సలర్-
అంజేలా మార్కెల్‌తో కలిసి ఏప్రిల్ 14వ తేదీన బెర్లిన్‌లో మాధ్యమ
ప్రతినిధులతో మాట్లాడిన సమయంలో మన నరేంద్ర మోదీ ‘మరుగున పడివున్న’ ఈ
ప్రతిపాదనను ప్రపంచ దేశాలకు మళ్లీ గుర్తు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఫ్రాంకోరుూ హాలెండ్ కాని, అంజేలా మార్కెల్ కాని ఈ ప్రతిపాదనను
‘‘సమర్ధిస్తున్నాము..’’ అని విస్పష్టంగా ప్రకటించకపోవడం మోదీ పర్యటన
సందర్భంగా ప్రస్ఫుటించిన ప్రధాన విపరిణామం. ఫ్రాన్స్‌లో భారతీయులను, భారతీయ
సంతతి వారిని ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో చెప్పిన వాస్తవాన్ని..జర్మనీ
ఛాన్సలర్‌తో కలిసి మాధ్యమ ప్రతినిధులతో ప్రసంగించిన సందర్భంగా మోదీ
పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్య సమితి ఏర్పడకముందు, ఏర్పడిన తరువాత విశ్వశాంతి
కోసం మనదేశం చేసిన, చేస్తున్న కృషి ఈ వాస్తవం. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో
డెబ్బయి ఐదు వేలమంది భారతీయ సైనికులు ప్రపంచ శాంతి కోసం పోరాడి
అమరులయ్యారు. యుద్ధంలో పాల్గొన్న భారతీయ సమరుల సంఖ్య పదునాలుగు
లక్షలు..ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తరువాత వివిధ దేశాలలోని శాంతి పరిరక్షక
దళాల-పీస్‌కీపింగ్ ఫోర్స్-లో అధికాధికంగా పనిచేస్తున్న, ప్రాణాలర్పిస్తున్న
సైనికుల్లో భారతీయులున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం నాటికి భారతదేశం
బ్రిటిష్ వారి దమనకాండకు బలైపోయి వుంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కూడ
భారత్‌కు స్వాతంత్య్రం లభించలేదు. అయినప్పటికీ రెండు యుద్ధాల సమయంలోను
భారతీయ సైనికులు విశ్వశాంతి కోసం పోరాడిన సంగతిని ప్రధాని మోదీ గుర్తు
చేశారు. 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడడం, 1947లో భారత్‌కు రాజకీయ
స్వాతంత్య్రం లభించడం సమాంతరంగా జరిగిన సంఘటనలు. అయినప్పటికీ విశ్వశాంతి
కోసం దశాబ్దుల తరబడి కృషి చేస్తున్న మనదేశానికి మండలిలో శాశ్వత సభ్యత్వం
లభించకపోవడం అన్యాయమన్నది ఫ్రాన్స్, జర్మనీ వేదికలపై మోదీ చెప్పిన మాట. ఏ
దేశంపై కూడ దురాక్రమణ జరుపకపోవడం మోదీ చెప్పిన మరో వాస్తవం. ఈ వాస్తవం
ఐరోపా దేశాలకు ప్రధానంగా జర్మనీకి తమ దురాక్రమణ చరిత్రను గుర్తు చేసి
ఉండవచ్చు. ఐరోపా దేశాలు, ఇతర ఖండాల ప్రజలపై దురాక్రమణ జరుపడం, ఈ ప్రాబల్య
విస్తరణలో భాగంగా హత్యాకాండ సాగించడం పరస్పరం కలహించడం ఐదు దశాబ్దుల
చరిత్ర...
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న మన
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనను ఐరోపా దేశాలు పట్టించుకోకపోవడం
ఆశ్చర్యకరం కాదు... మన దేశానికి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య
దేశానికి, సమితిలో నిర్ణాయక నిరోధ-వీటో-అధికారం లేకపోవడం చైనా, అమెరికా,
ఐరోపా దేశాల వ్యూహంలో భాగం. అందువల్ల ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఏప్రిల్
పదకొండవ తేదీన మోదీ చేసిన ప్రతిపాదన పట్ల ఐరోపా దేశాల ప్రతిస్పందన ‘వౌనం’
మాత్రమే కావడం అనుకోని పరిణామం కాదు. ఈ ‘వౌనం’ కొనసాగుతున్న దశాబ్దుల
వైపరీత్యం. మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగింపు సందర్భంగా ఈ ప్రతిపాదన చేశారు.
ఫ్రాన్స్ ప్రభుత్వం నోరు మెదపలేదు. జర్మనీ పర్యటన సందర్భంగా నరేంద్ర మోదీ
తన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. సమితిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం
ఇవ్వడమన్నది దశాబ్దులుగా ‘ఎండమావిలో తీయని నీరు..’ ఈ శతాబ్ది ఆరంభం నుండి ఈ
ప్రతిపాదనకు బోలెడంత ప్రాచుర్యం లభించింది. కానీ హఠాత్తుగా మూడేళ్ల క్రితం
చర్చ ఆగిపోయింది. ఇలా చర్చ ఆగిపోవడం కథాకథిత ఆగ్రదేశాల ప్రాబల్య
పరిరక్షణలో భాగం.
అమెరికా-చైనా విభిన్న విరుద్ధ అంతర్జాతీయ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం
వహిస్తున్నాయి. కానీ ఐక్యరాజ్య సమితిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం
కల్పించరాదన్న విషయంలో మాత్రం ఉభయదేశాలు సమాన విధానాన్ని పాటిస్తున్నాయి.
పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ బీభత్స కాండ అంతర్జాతీయ స్వరూప స్వభావాలను
సంతరించుకున్న నేపథ్యంలో అమెరికా తన దృష్టిని మొత్తం ఈ ఉగ్రవాదాన్ని అంతం
చేయడానికి కేంద్రీకరించినట్టు అభినయిస్తోంది. అందువల్ల సమితి భద్రతామండలి
విస్తరణ గురించి పట్టించుకొనే తీరిక లేదు. భారత వ్యతిరేకత ప్రాతిపదికగా
ఆసియాలోను, అంతర్జాతీయంగాను ప్రాబల్య విస్తరణకు పాటుపడుతున్న చైనా
ప్రభుత్వం కాని, తమతో పాటు మనదేశాన్ని మండలిలో సమాన ప్రతిపత్తి ఉండడం ఇష్టం
లేదు. ఐరోపా దేశాలకు మన దేశానకి తమ ఎగుమతులను పెంచడం మాత్రమే లక్ష్యం.
ప్రధాన మంత్రి ఫ్రాన్స్, జర్మనీల పర్యటన ఇతివృత్తం, ఇదే కావడం ఈ ఎగుమతుల
విధానానికి అనుగుణమైన పరిణామం. ఫ్రాన్స్, జర్మనీ దేశాలలోని భారతీయుల,
భారతీయ సంతతి వారిని ఉద్దేశించి ప్రసంగించడం నరేంద్ర మోదీ పర్యటనలోని మరో
ప్రధాన విశేషం.
ఇలా మన దేశానికి ఎగుమతులను పెంచడం, ఆయుధాలను అమ్మడం
లక్ష్యమైన ఐరోపా దేశాలు మోదీ ప్రతిపాదనను పట్టించుకోకపోవడం అందువల్ల
ఆశ్చర్యకరం కాదు. కనీసం జర్మనీ, ఫ్రాన్స్ ప్రభుత్వాలు సైతం ‘‘అవును
భారత్‌కు సమితి మండలిలో శాశ్వత స్థానం ఇవ్వవలసిందే..’’ అని ప్రకటించకపోవడం
ఐరోపా దేశాల కలిసికట్టు భారత వైముఖ్యానికి సరికొత్త నిదర్శనం.
సమీపగతంలో ఐరోపా సమాఖ్య దేశాలు కలసికట్టుగా భారత్‌పట్ల నిరసన వ్యక్తం చేయడం
మోదీ పర్యటనకు నేపథ్యం. 2012లో మన ఇద్దరు మత్స్యకారులను హత్య చేసిన ఇటలీ
హంతకులను శిక్షించకుండా వదలిపెట్టాలని ఐరోపా సమాఖ్య పార్లమెంటు ఇటీవల
తీర్మానించింది. మన ప్రధానమంత్రి ఐరోపా పర్యటనకు ఈ తీర్మానం నేపథ్యం
వైపరీత్యం. మోదీ ఫ్రాన్స్, జర్మనీల పర్యటన సందర్భంగా ఐరోపా సమాఖ్య, భారత
ప్రభుత్వాల శిఖరాగ్ర సభ జరుగవలసి ఉండింది. కానీ సమాఖ్య వారు ఆ శిఖర సభను
హఠాత్తుగా రద్దు చేయడానికి ఒక ప్రధాన కారణం ఇటలీ హంతకుల విడుదల సమస్య. తమ
ఒత్తడికి లొంగి హంతకులను మన ప్రభుత్వం విడిచిపెట్టకపోవడం పట్ల ఐరోపా దేశాల
ప్రభుత్వాలు ఆగ్రహంతో ఉన్నాయి.
జర్మనీ కూడ మండలి శాశ్వత సభ్యతం కోసం
యత్నిస్తోంది. మనదేశానికి శాశ్వత సభ్యత్వం లభించకపోవడానికి జపాన్, జర్మనీ
కూడ పోటీ పడుతుండడం ప్రధాన కారణం. ఐరోపాకు చెందిన రష్యా, బ్రిటన్,
ఫ్రాన్స్‌లకు మండలిలో శాశ్వత సభ్యత్వం ఉంది. అతిపెద్ద ఖండమైన ఆసియాకు ఏకైక
ప్రతినిధి చైనా. ఆసియా శాశ్వత ప్రాతినిధ్యాన్ని ‘రెండు’కు పెంచాలని శాశ్వత
ప్రాతినిధ్యంలేని దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలకు శాశ్వత ప్రాతినిధ్యం
కల్పించాలని ప్రతిపాదనలు వినబడుతూనే ఉన్నాయి. కానీ జర్మనీకి కూడ మండలిలో
శాశ్వత సభ్యత్వం ఇవ్వడం సాధ్యం కాదు. ఆసియా నుండి రెండవ శాశ్వత సభ్యత్వం మన
దేశానికి కాక జపాన్‌కు కట్టబెట్టాలన్నది అమెరికా అభీష్టం. మండలి శాశ్వత
సభ్యత్వ విస్తరణ ప్రతిపాదన కూలబడి పోవడానికి ఇదంతా నేపథ్యం!
శాశ్వత సభ్యత్వ స్వప్నం..
Reviewed by rajakishor
on
9:14 AM
Rating:
No comments: