Top Ad unit 728 × 90

ఈ ప్రశ్నకు బదులేది?

ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, ఆంధ్రభూమి దినపత్రిక, 14/04/2015

‘‘భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చింది ఎవరు??’’
‘‘మహాత్మాగాంధీ. పండిత జవహర్‌లాల్ నెహ్రూ’’
‘‘ఏ విధంగా?’’
‘‘అహింసా మార్గంలో.’’
ఎవరిని అడిగినా ఇదే జవాబు వస్తుంది. అన్ని పాఠ్యగ్రంథాలల్లో ఆధునిక భారతదేశ చరిత్రలో ఇదే సమాధానం.
ఐతే నేతాజీ సుభాష్‌చంద్రబోసు మాటేమిటి?
చంద్రశేఖర అజాద్, భగత్‌సింగ్, రాజగురు, అల్లూరి సీతారామరాజు, లాలాలజపతిరాయ్, శ్రద్ధానంద వంటివారు చేసిన బలిదానాల మాటేమిటి??
దీనికి ఎవరు సమాధానం చెపుతారు??

నేతాజీ సుభాష్‌చంద్రబోసు కాంగ్రెసు అధ్యక్షునిగా నిలబడితే ఆయన మీదికి భోగరాజు పట్ట్భాసీతారామయ్యను పోటీ గా నిలబెట్టింది గాంధీగారే. భోగరాజువారు ఓడిపోతే ‘ఇది నా వ్యక్తిగత ఓటమి’అన్నారు మహాత్మాగాంధీ. 1939లో నేతాజీ సుభాష్‌చంద్రబోసు ఒక లేఖవ్రాస్తూ ‘నాకు పండిత జవహర్‌లాల్ నెహ్రూ వల్ల జరిగినంత అపకారం మరెవ్వరివల్లా జరుగలేదు’అన్నారు. ఈ చారిత్రక వాస్తవాలు గత అరవై సంవత్సరాల కాంగ్రెసు పాలనలో ఎన్నడూ చర్చకు రాలేదు. ఇప్పుడు సమాచార హక్కు చట్టం వచ్చింది. కాబట్టి నేతాజీగారికి సంబంధించిన ఫైళ్లను ప్రజలముందు ఉంచవలసిన బాధ్యత హోంమంత్రి శ్రీ రాజనాథ్‌సింగ్‌వారి ముందు ఉంది. ఇంగ్లీషులో సీజరు భార్య పతివ్రత అని ఒక సామెత ఉంది. భారతదేశంలో నెహ్రూ కుటుంబం తప్పు చేయదు అనే నానుడి ఉంది.

10 ఏప్రిల్ 2015 శుక్రవారం ఒక ఇంగ్లీషు టివి ఛానల్‌లో నేతాజీపై సుదీర్ఘ చర్చ జరిగింది. అందులో నేతాజీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఆ చర్చలో స్వతంత్ర భారతదేశం ఇప్పటివరకు ఎరుగని కొన్ని తీవ్రమైన విషయాలు బయటకు వచ్చాయి. పండిత జవహర్‌లాల్ నెహ్రూ ఎప్పుడో తన రాజకీయ ఆధిపత్యానికి నేతాజీ సుభాష్‌చంద్రబోసు అడ్డుపడుతాడని భయపడుతూ ఉండేవారు. నేతాజీని రష్యా సైనికులు పట్టుకున్నారు. సైబీరియాలోని ఒక జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారన్న ఆరోపణ లున్నాయ. నెహ్రూ భారత ప్రధాని ఐన తర్వాత దాదాపు రెండు దశాబ్దాలపాటు నేతాజీ కుటుంబ సభ్యులు శిశిర్‌ఘోష్, శరత్‌ఘోష్, అమియా బోసులపై గూఢచారులను నియమించారు. వారి కదలికలు నిరంతరం గమనించి తనకు నివేదిక ఇవ్వవలసిందిగా నిఘా వర్గాలను కోరారు. అంతేకాదు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా నేతాజీ విషయంలో నెహ్రూజీ, బ్రిటీషువారికి నేతాజీ విషయంలో రహస్య నివేదికలు పంపించారు. ఈ విషయం ఇన్ని దశాబ్దాలూ కాంగ్రెసువారు ఎందుకు దాచిపెట్టారు??
ఖోస్లా కమిషన్ నేతాజీ మరణంపై విచారణ జరిపింది. ఆ కమిషన్ నివేదిక నుండి ఎన్నో రహస్య పత్రాలు మాయమైనాయి. ఈ పని ఎవరుచేశారు? ఇరవై ఆరువేల మంది నేతాజీ సైనికులు బలిదానాలు చేశారు. వారికి ఊరూపేరూ లేకుండాచేశారు. నేతాజీ సుభాష్‌చంద్రబోసు హత్యకు సంబంధించిన రహస్య ఫైళ్లు కొన్ని బెంగాల్‌లోను ఎక్కువ భాగం హోంశాఖ- న్యూఢిల్లీవద్ద ఉన్నాయి. వాటిని అరవై సంవత్సరాలపాటు కాంగ్రెసు ప్రభుత్వం బయటకురాకుండా తొక్కిపట్టింది.
ఇక కాశ్మీరు సమస్య తీసుకుంటే నెహ్రూజీ కాశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందినవాడు. ఐతే షేక్‌అబ్దుల్లా మీద ఉన్న వ్యామోహంతో కాశ్మీరీ పండిట్లకు అన్యా యం జరుగుతుంటే ఏమీచేయకుండా మిన్నకున్నారు. దాదాపు 60వేల మంది కాశ్మీరీ పండిట్లు కట్టుబట్టలతో కాశ్మీరీలోయనుండి తరిమివేతకు గురయ్యారు. 2014 లో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీరీ పండిట్లకు తమ జన్మస్థానమైన కాశ్మీరులో పునరావాస కేంద్రాలు గృహసముదాయాలు నిర్మించాలని భావిస్తే కొత్తగా ఏర్పడిన ముఫ్తిమహమ్మద్ సరుూద్ ప్రభుత్వం అది జరుగనిపని అని ఈనెల 10న స్పష్టంగా చెప్పింది. ఎందుకని? ఇప్పుడు కాశ్మీరులో ముస్లిం మెజారిటీ ప్రభుత్వం ఉంది. పండిట్లు తిరిగి వెనుకకువస్తే ముస్లిం మెజారిటీ తగ్గిపోతుంది. (డెమోగ్రఫీ ఛేంజ్.) అంటే జనాభా నిష్పత్తి మారిపోతుంది. బలవంతంగా పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీరులోని కొంత భాగం (అజాద్ కాశ్మీరు) ఆక్రమిస్తే నెహ్రూగారు చూస్తూ ఊరుకున్నారు. తన మిత్రుడు వి.కె.కృష్ణమీనన్‌ను యుఎస్‌కు పంపి ‘ఇది అన్యాయం’అని వాదింపజేయటం కన్నా మరేమీచేయలేదు. నెహ్రూగారు 1948లో రగిలించిన రావణకాష్టం 2015కు కూడా ఇంకా చల్లారలేదు సరికదా రోజురోజుకూ పాకిస్తాన్ పెట్రేగిపోతున్నది.
నెహ్రూ యుగంనుండి సోనియా యుగంవరకు దాదాపు 70 సంవత్సరాలు భారతదేశాన్ని ఒకే నెహ్రూ కుటుంబం పాలించింది. కాశ్మీరు- వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా జాతిని మభ్యపెట్టింది. బొంబాయిపై దాడిచేసి 166 మంది పౌరులను పొట్టనపెట్టుకున్న లక్వీ-అనే నర హంతకుణ్ణి పాకిస్తాన్‌వాళ్లు 10 ఏప్రిల్ 2015నాడు లాహోరులో స్వేచ్ఛగా వదిలిపెట్టారు. కాశ్మీరులో భారత సైన్యాన్ని ప్రజలనూ చంపే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను స్వతంత్ర సమర వీరులుగా చిత్రీకరిస్తున్నారు. ఎర్రగులాబీ చేసిన తప్పుకు రక్తం ఏరై పారింది. ఇందుకు నెహ్రూ- ఆయన కుటుంబ సభ్యులు బాధ్యత నుండి ఎలా తప్పించుకోగలరు??
చైనీయులు అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమిస్తే ‘పోనిద్దూ- అది మంచుకొండ గడ్డిపోచ కూడా మొలవదు. మనం ఏం చేసుకుంటాము?’ అని ఫార్లమెంటులో నెహ్రూగారు చేసిన ప్రకటన ఎంత ప్రమాదకరంగా మారిందో ఇప్పుడు తెలుస్తున్నది. మన అరుణాచలప్రదేశ్‌లో మాజీ రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ వర్తమాన భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ పర్యటనకు వెళ్తే... అది చైనాలో అంతర్భాగం. అక్కడ భారత నేతలు ఎలా పర్యటిస్తారు??’’అని చైనా ఆక్షేపణ తెలిపింది. దీనికి బాధ్యులెవరు? 1962 ప్రాంతంలో చౌఎన్‌లై ఇండియాకు పర్యటనకు వస్తే ఆయనతో నెహ్రూగారు చెట్టాపట్టాలు వేసుకొని ‘పంచశీల’అనే కంచు నగారా మ్రోగించారు. పంచశీల అనేది ఒక బౌద్ధమత సిద్ధాంతం. ఆధునిక పంచశీల నెహ్రూగారి సిద్ధాంతం. ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించుకోకూడదు అనేది పంచశీలలో ఒక కీలక సిద్ధాంతం. సరిగ్గా చేఎన్‌లై భారత పర్యటన జరుపుతున్న సమయంలోనే నెహ్రూగారు హిందూ చీనీ భారుూ భాయ్ అని నినదిస్తున్న సమయంలోనే హిమాలయ భూభాగాలలోకి చైనా చొచ్చుకువచ్చి యుద్ధం ప్రకటించింది. తన కళ్లముందు తన సిద్ధాంత సౌధాలు కూలిపోవటంతో నెహ్రూగారు దిగులుతో ఆ తర్వాత (1964) మరణించారు.

అంతా మనుషులే- అంతా సమానమే- ఐతే కంప్యూటర్ సత్యంరాజుకు ఏడేండ్ల జైలుశిక్ష వేశారు. అలాంటి ఆర్థిక నేరమే చేసిన మన్మోహన్‌సింగ్‌ను కోర్టుకు హాజరుకానక్కరలేదు అన్నారు. అంటే లోకంలో అంతా సమానంకాదు. అన్ని జాతులూ అన్ని మతాలూ ఒకటి కాదు. ఎవరి సిద్ధాంతాలు వారివే. టిబెట్టులో ఆరు లక్షల మంది బౌద్ధులను చంపే అధికారం చైనాకు ఎవరిచ్చారు? ఈ ప్రశ్నకు సిపియం ఏం సమాధానం చెపుతుంది?? షడారణ్యం అంటే తమిళంలో ఆర్కాడు అంటారు. ఈ ప్రాంతమంతా వెంకటేశ్వరస్వామివారి ఆస్తి. శేషాచల ప్రాంతాన్ని నిషిద్ధ ప్రదేశం (ప్రొహిబిటరీ ఏరియా)గా ప్రకటించారు. అక్కడికి వందలాది తమిళ మాఫియాలు మారణాయుధాలతో ఎందుకు ప్రవేశిస్తున్నారు?? దూడ మేతకోసం. గడ్డికోసుకోవటంకోసం - ఈ మానవ హక్కుల సంఘంవారు పౌర హక్కుల సంఘంవారు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. దూడలు ఎర్రచందనం దుంగలు తింటాయా? దేవుడిపై విశ్వాసంలేని ద్రవిడ ముఠాలు భాషాప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి మొత్తం తమిళనాడులో ఏప్రిల్ 8వ తేదీ నుండి (2015) తెలుగు భాషీయుల ఆస్తులమీద దాడులుచేస్తుంటే అటు కేంద్రమూ ఇటు న్యాయవ్యవస్థ తమకు పట్టనట్లు ఎందుకు ఊరుకున్నాయి?? ఈ ప్రశ్నకు బదులేది??

సారాంశమేమంటే ... 
1. అరవైవేల మంది కాశ్మీరీ పండిట్లను కాశ్మీరునుండి వెళ్లగొట్టింది ఎవరు? 1984లో ఢిల్లీలో వేలాది సిక్కులను ఊచకోత కోసింది ఎవరు? దీనికి సోనియాగాంధీ సమాధానం చెప్పాలి. లేదా ఆమె వందిమాగధ దేశీయబృందం దిగ్విజయసింగులూ జయరామ రమేశులూ- మణిశంకర అయ్యరులు- అభిషేక్ సింఘ్వీలు సమాధానం చెప్పాలి. 

2. ప్రపంచంలో యూదు జాతీయులు ఎక్కడ ఉన్నా వారిని చంపటమో తరిమివేయటమో జరిగింది. జీసస్ క్రైస్ట్, కారల్‌మార్క్స్ ఐన్‌స్టీన్ వంటి మేధావులంతా యూదు జాతీయులే. 1948లో వారు ఇజ్రాయిల్ అనేచోట ఒక స్వదేశం ఏర్పాటుచేసుకుంటే అక్కడ కూడా వారిని పాలస్తీనీయ ముస్లిములు వేటాడటం మొదలుపెట్టారు. అలాంటి పాలస్తీనా నాయకుడు యాసిర్ అరాఫత్ వంటి వారిని ఇందిరాగాంధీ ప్రోత్సహించింది. యూదుల దేశానికి గుర్తింపుకూడా కాంగ్రెసుపార్టీ ఇవ్వలేదు. ఎందుకు?? యూదులు మనుషులు కారా? వారికి పౌర హక్కులు ఉండవా??

3. అన్ని పౌరహక్కులు నరహంతక ముఠాలకు మాత్రమే ఉంటాయా?? ఔను. పోలీసులకు పౌరహక్కులు ఉండవు. యూదు జాతీయులకూ హిందూ జాతీయులకూ పౌర హక్కులు ఉండవు. 

4. ‘‘కాంగ్రెసు పార్టీని రెండుగా చీల్చండి. అందులోని ముస్లిము ఎం.ఎల్.ఎలకు బిజెపి- హిందూ మతతత్వ బూచిని చూపించి మన పార్టీలో కలుపుకోండి’’ ఈ మాట అన్నది ఎవరో తెలుసా?? సాక్షాత్తు అరవింద్ కేజ్రీవాలా- అవినీతి అనే మాట కూడా సహించలేని నిష్కలంక నాయకుడు. అంజలి దమానియా, ప్రశాంతభూషణ్ యోగేంద్రయాదవ్ వంటి వారిని పార్టీలో నుండి తరిమివేసిన అభినవ హిట్లర్. ఇతనికి ఢిల్లీని పాలించే అధికారం ఉందా? ఈ ప్రశ్నకు బదులేది??

భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ ఏప్రిల్ 9వ తేదీ నుండి యూరప్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ సోమవారం జర్మనీలో ఉన్నప్పుడు నేతాజీ మేనల్లుని వంశానికి చెందిన సూర్యబోసు వచ్చి కలిశారు. తమ కుటుంబంపై ‘‘రా’’ నిఘా సంస్థ 1948-68 మధ్య సాగించిన కార్యకలాపాలను వివరించారు. శ్రీ నరేంద్రమోడీ అందుకు స్పందించారు. ఇక ఏం జరుగుతుందో చూద్దాం!

ఈ ప్రశ్నకు బదులేది? Reviewed by rajakishor on 9:19 AM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.