మోదీ ప్రభుత్వంపై కత్తిగట్టిన చర్చి
ఎస్.ఆర్. రామానుజన్
ఆంధ్రభూమి దినపత్రిక , ఏప్రిల్ 10, 2015
గుడ్ ఫ్రైడే నాడు సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన
న్యాయమూర్తి (సిజెఐ) తీసుకున్న నిర్ణయంపై అదే కోర్టుకు చెందిన న్యాయమూర్తి
జస్టిస్ జోసెఫ్ కురియన్ వ్యక్తం చేసిన తన నిరసనలో ‘వ్యక్తిగతం ఏమీ లేదు’
అన్నారు. నిజమే ఇందులో ‘వ్యక్తిగతం’ ఏమీ లేదు. ఎందుకంటే విస్తృత
ప్రాతిపదికన ఒక ప్రణాళికా బద్ధంగా ‘చర్చి’ నిర్వహిస్తున్న కుట్రను అమలు
జరపడంలో ఆయన కూడ ఒక సైనికుడుగా ఉన్నాడు! భారత్‌లోని శాంతి కాముకులైన
క్రైస్తవుల పట్ల మోదీ ప్రభుత్వం అసహనంతో వ్యవహరిస్తున్నదంటూ ప్రపంచ
వ్యాప్తంగా ప్రచారం చేయడమే ఆ కుట్రలోని అంతరార్థం. ఈ వ్యూహాత్మక ప్రణాళికకు
సెక్యూలర్ పోరాటవాదులైన మీడియా సంపూర్ణ మద్దతు. భారత్‌లోని క్రైస్తవులు
ముట్టడిలో చిక్కుకున్నారని వీరి ప్రచారం. జాతి ప్రయోజనాలకు భంగకరంగా
వ్యవహరిస్తున్న దేశంలోని ఒకే ఒక సంస్థ, జాతీయ మీడియా. దానికి ప్రతి రోజూ
ఏదో ఒక వివాదం కావాలి. దాన్ని రచ్చ చేసి ఎంపిక చేసుకున్న రీతిలో విషాన్ని
విరజిమ్మాలి. కోల్‌కతాలోని బేలూర్ మఠంలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనపై,
అదేవిధంగా క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయంటూ ఊహాగానాలు కల్పించడంలో
జాతీయ మీడియా ఎంతటి వివక్షాపూరితంగా వ్యవహరించిందో మనం చూశాం.
పరిస్థితులు ఏవిధంగా పరిణమిస్తున్నాయో పరిశీలించండి. ప్రజా జీవితానికి సంబంధించి వివిధ రంగాల్లోని ప్రముఖులు చర్చి విద్వేషపూరిత ప్రోత్సాహంతో ఏవిధంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి..జస్టిస్ జార్జ్ కురియన్ లేఖ రాస్తూ, ‘ఇటువంటి సమావేశాలకు, కేవలం క్రైస్తవుల పర్వదినాలనే ఎందుకు ఎంచుకుంటున్నారు? దసరా, దీపావళి, ఈద్ వంటి ఇతర పండుగలను ఎందుకు ఎంపిక చేయరు?’ అని ప్రశ్నించారు. దీనికి సిజెఐ సమాధానమిస్తూ, ‘ప్రతివారు వ్యక్తిగత ప్రయోజనం కంటే జాతి ప్రయోజనాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి’ అని స్పష్టం చేశారు. అంతకు ముందు ఇదే మాదిరిగా ఒక మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టు జడ్జి రాసిన లేఖకు సిజెఐ బదులిస్తూ, ‘ఒక వేళ మీకు కష్టం వాటిల్లిందని భావిస్తే...తక్షణమే దానిపై పిటిషన్ వేయవచ్చు’నని స్పష్టం చేశారు.
మరి ఇటువంటివన్నీ ఫలితాలనివ్వనప్పుడు సహజంగానే ‘బంతి చర్చి కోర్టు’కు చేరుతుంది. ఈ విషయంలో కూడా సరీగ్గా అదే జరిగింది. గుడ్‌ఫ్రైడేకి వారం రోజుల ముందు క్యాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా సిజెఐకి ఒక లేఖ రాసింది. అందులో ‘క్రైస్తవుల చట్టబద్ధమైన మనోభావాలను, పరిగణలోకి తీసుకోవాలి’ అని వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. వీటన్నింటిని పరిశీలిస్తే మనకు ఒక్కటి స్పష్టమవుతోంది. ఉన్నత స్థాయిలో ఉన్న క్రైస్తవ అధికార్లకు, చర్చికి మధ్య గాఢమైన సంబంధమున్నదన్న వాస్తవం వెల్లడైంది. వారు జూలియస్ రబిరో, అడ్మిరల్ సుశీల్ కుమార్, జస్టిస్ కురియన్..ఏవరైనా కావచ్చు.
ఒకవేళ జస్టిస్ కురియన్‌కు తన మత విశ్వాసం ప్రకారం చట్టబద్ధంగా సెలవు తీసుకోవాలనుకుంటే..సిజెఐ ఛాంబర్‌లోకి వెళ్లి, ఈ సమావేశానికి హాజరు కాకుండా తనకు మినహాయింపునివ్వాలని కోరవచ్చు. అందులో తప్పేం లేదు. అందుకు బదులుగా ఆయన దీనికి మతం రంగు పులమడానికి యత్నించారు. ఈవిధంగా చేయడం ద్వారా చర్చి ఈ విషయంలో కలుగజేసుకోవడానికి కావాలనే అవకాశం కల్పించినట్టయింది. ఇక దీనికితోడు ఛానళ్లవారు ఎలాగూ సిద్ధంగానే ఉన్నారు. ఇటువంటి సంఘటనలకు విపరీత ప్రచారం కల్పించి, మోదీ ప్రభుత్వ ప్రతిష్ఠను మంటగలపాలని మీడియా శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా మైనారిటీల పట్ల మోదీ ప్రభుత్వం అసహనంతో వ్యవహరిస్తోందంటూ విపరీతంగా ఊదరగొట్టడమే వీటి పని. 2014కు ముందు నుంచీ వారు ప్రచారం చేసేది దీనే్న. కాకపోతే ఇప్పుడు తమను తాము సమర్ధించుకోవడానికి ఋజువులకోసం యత్నిస్తున్నారంతే.
తాను మతంరంగు పులమడానికి యత్నించలేదంటూ తర్వాత జస్టిస్ కురియన్ వివరణ
ఇచ్చారు. కానీ అది కేవలం తాను చేసిన పనినుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే.
ఎందుకంటే ఆయన తన లేఖలో ఇతర పండుగలతో ఎందుకు సరిపోల్చాల్సి వచ్చింది?
గుడ్‌ఫ్రైడే ఎంతో ప్రాధాన్యమైన పండుగ. క్రైస్తవులు అత్యంత భక్తి
ప్రపత్తులతో దీన్ని పాటిస్తారు. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు. గుడ్‌ఫ్రైడే
అనేది జాతీయ సెలవుదినమన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ అసలు
ప్రశ్న ఏమంటే...మొత్తం జనాభాలో కేవలం మూడుశాతం ఉన్న క్రైస్తవులకోసం మిగిలిన
80శాతం మంది మెజారిటీ ప్రజలు ఎందుకు పనిచేయకుండా ఉండాలి? దేశం స్తంభించి
పోవాలా? మైనారిటీల ప్రయోజనం కోసం మెజారిటీలు సాధనంగా మారాలా?
అనారోగ్యగ్రస్తులైన మన ఉదారవాదులు..తాము ప్రజాస్వామ్యానికిచ్చే నిర్వచనం
ప్రకారమే వ్యవహరిస్తారు. ఎంత అద్భుతం!?
ఇప్పుడు మన మీడియా పాత్ర విషయానికి వద్దాం. తాము చేసే ప్రచారాన్ని ఆమోదించేవారికోసం అది చూస్తున్నది. ఆర్థిక వేత్త జగదీశ్ భగవతి వీరి ప్రచారాన్ని ఆమోదించకపోవడంతో, వెంటనే రిటైర్డ్ అడ్మిరల్‌ను రంగంలోకి దించి తమ ఎజెండాను ఆమోదింపజేసుకుంది. ఎప్పుడూ టివి ఛానళ్లలో కనిపించని ముంబయికి చెందిన ఒక సిస్టర్ చేత..మోదీ ప్రభుత్వానికి నాజీలకు తేడాలేదని చెప్పించారు. మరో ప్యానలిస్టు వెంటనే ఆమె మాటలను ఖండిస్తే...యాంకర్ రంగంలోకి దిగి ‘కేవలం ఉపమానం కోసమే ఆమె అలా అన్నారు’ అంటూ వెనకేసుకురావడానికి యత్నించాడు. ఆమె ఆవిధంగా సరిపోల్చడం తప్పని సదరు యాంకర్ ఒక్కమాట కూడా అనలేదు. అనడు..!ఎందుకంటే వారిద్దరిదీ ఒకే ఎజెండా మరి!
ఏప్రిల్ నెలలో ఆంధ్ర ప్రదేశ్/తెలంగాణల్లో రెండు ముఖ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఒక మత ప్రచారకుడిపై ఆరోపణలు వచ్చాయి. దేవుడికి ఇష్టం కనుక మహిళలు నగ్నంగా ప్రార్ధనలు చేయాలంటూ అతగాడు ఒత్తిడి తీసుకొచ్చాడట! ఖమ్మం జిల్లా చర్లమండలం, దేవన్నపేట గ్రామంలో మరో సంఘటన జరిగింది. 22 ఏళ్ల గిరిజన బాలికపై 40 ఏళ్ల మత ప్రచారకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదైంది. మరి ఈ వార్తలు ఏ జాతీయ ఛానల్‌లోనైనా ప్రసారమయ్యాయా? కానీ పశ్చిమ బెంగాల్‌లో కానె్వంట్ విద్యార్థుల బెదిరింపు అనేది మాత్రం జాతీయ స్థాయి వార్త! మరి ఇదెందుకు జరిగిందంటే..‘క్రైస్తవం ముట్టడిలో ఉన్నది’ అని ప్రచారం చేయడానికి! చెన్నై నుంచి ప్రచురితమయ్యే ఒక డైలీ మాత్రం ఈ వార్తను ప్రచురించే సమయంలో తగిన ‘జాగ్రత్తలు’ తీసుకుంది. సదరు ‘మత ప్రచారకుడి’ మతాన్ని మాత్రం రాయలేదు!
ఇదే సమయంలో ఒక ఛానల్‌ను మాత్రం ఈ సందర్భంగా మెచ్చుకోవాలి. సామాజిక మీడియా ఈ ఛానల్‌ను ‘అవమాన’ పరచినప్పటికీ..అది ప్రసారం చేసింది మాత్రం వాస్తవం. చర్చిలపై జరిగిన దాడులపై కొన్ని గణాంకాలను విడుదల చేసింది. వీటిని పరిశీలిస్తే యుపిఎ ప్రభుత్వం హయాంలో జరిగిన, దాడులు, ప్రస్తుతం జరిగిన దాడులు సమానంగానే ఉన్నాయి. 2013, మే 26 నుంచి, 2014, మార్చి 31 వరకు ‘క్రైస్తవ వ్యతిరేక దాడుల’’ సంఘటనలు కేవలం పది మాత్రమే జరిగాయి. వీటిల్లో సగానికి సగం ఇంతవరకు పరిష్కారం కాలేదు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 మార్చి వరకు 11 కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు చర్చిల్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కేసులు కూడా ఉన్నాయి. అయితే రానాఘాట్ సంఘటనకు బంగ్లాదేశ్ మూలాలున్నట్టుతేలింది.
కోస్తా ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి గ్రామంలో చర్చ్‌లు ఉన్నాయి. వీటిని ఇండియా టుడే వ్యక్తీకరణలో చెప్పాలంటే ‘స్వేచ్ఛా ప్రచారకులు’(ఫ్రీలాన్సర్స్ ఆఫ్ గాడ్) నిర్వహిస్తున్నారు. దేశంలో స్వంతత్ర చర్చిల సంఖ్య విపరీతంగా పెరిగితోతున్నదని, వీటికి విదేశీ నిధులు పుష్కలంగా అందుతున్నాయని ఇదే మ్యాగజీన్ కొనే్నళ్ల క్రితం రాసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రశ్న..‘‘మీడియా సహకారంతో చర్చ్ ఎందుకింత గగ్గోలు పెట్టడం?’’ మోదీ ప్రభుత్వం పుణ్యమాని బిలియన్లకొద్దీ తమకు వస్తున్న విదేశీ నిధులకు ఎక్కడ గండి పడుతుందోనన్న అనుమానమే వీరినిలా పురికొల్పుతోంది. జిత్తులమారితనంలో చాలా ఎన్‌జిఒలు నిరుపేద దళితులను, గిరిజనులను మతమార్పిడులు చేస్తున్నాయి. అటువంటి ఎన్‌జిఒలు స్కానర్ కిందికి రావచ్చు. ఇదిలావుండగా ‘ఘర్‌వాపసీ’ కార్యక్రమం మత మార్పిడులపై చర్చకు దారితీసి చివరకు మతమార్పిడుల నిరోధక చట్ట రూపకల్పనకు దారితీస్తుందేమోనన్న భయం కూడా చర్చిని పీడిస్తోంది. ఒకవేళ ఆ చట్టానికి రూపకల్పన జరిగి కచ్చితంగా అమలు జరిపితే పరిస్థితి ఏమిటన్నది కూడా అవి ఆందోళన చెందుతున్నాయి. ‘మతమార్పిడుల’కు రాజ్యాంగం హామీ ఇచ్చిందన్న తప్పుడు అభిప్రాయం తో అవి ఉన్నాయి. భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. మతాన్ని అవలంబించడం,ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛను కల్పిస్తోంది. ఇక్కడ ప్రచారం అంటే మతమార్పిడి కాదు!
మత మార్పిడి అనేదే తప్పు. ఏ నాగరిక సమాజం దాన్ని ఆమోదించదు. ‘సర్వధర్మ
సమభావా’నికి అది పూర్తి విరుద్ధం. దీన్ని మన ఉదారవాదులు దీన్ని ఎప్పుడూ
ఉదహరిస్తుంటారు. దీనికి ఎంతో కొంత విలువ ఉన్నదనే వారి భావం. ఒక్కసారి
నువ్వు మతమార్పిడి చేసావంటే, నీ మతమే గొప్పదని..ఇతర మతం నీ మతం కంటే తక్కువ
అని బావిస్తున్నట్టు లెక్క. ప్రపంచంలోని పెద్ద మతాలన్నీ తప్పుకాని, ఒప్పు
కాని తాము మాత్రమే భగవంతుడు లేదా స్వర్గానికి తీసుకెళ్లగలమని, ఇతర మతాల
వారు తప్పుడు దేవతలను పూజిస్తున్నారన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ‘సర్వమత
సమభావన’ అనేది కేవలం హాస్యాస్పదంగా మిగిలిపోతుంది. మరటువంటప్పుడు సద్భావం
ఎక్కడ ఉంది?
మోదీ ప్రభుత్వంపై కత్తిగట్టిన చర్చి
Reviewed by rajakishor
on
9:58 AM
Rating:
No comments: