Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

మన భాషా విధానం


భారతదేశం ఎన్నో భాషలకు నెలవు. శతాబ్దాల కాలంలో ఎందరో భారతీయ భాషలలో అత్యుత్తమ సాహిత్యాన్ని అందించేరు. బ్రిటిష్ వారు మనదేశాన్ని 175 ఏళ్ళు పాలించేరు. వారు మనపై ఆంగ్లభాషను, ఆంగ్లేయ విద్యావిధానాన్ని రుద్దారు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మనదైన భాషలలో ఏదో ఒకదానిని జాతీయస్థాయిలో సంధాన భాషగా మలచుకోలేకపోయేం. విబిన్న భాషల వారు సంభాషించుకోవాలంటే ఆంగ్లాన్ని ఉపయోగిస్తున్నాం గాని భారతీయ భాషలలో మాట్లాడుకోలేకపొతున్నాం. దేశంలో ఎవరితోనైనా ఆంగ్లంలో మాట్లాడగలగడం ఏదో ప్రగతి సాధించినట్లు మనం మురిసిపోతున్నామే గాని స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్ళు గడచినా ఏ ఒక్క భారతీయ భాషనూ జాతీయ స్థాయిలో వికసింపజేసుకోలేకపోయేం. ఆంగ్లేయులు నూరిపోసిన "ఆధునిక విజ్ఞాన యుగంలో భారతీయ భాషలు ఉపయోగపడవన్న" భావన మనలో పాతుకొనిపోవడమే దీనికి కారణం.

ఆధునికయుగంలో గ్రాంధికము, వ్యావహారికపరంగానే కాకుండా విజ్ఞానశాస్త్రపరంగా కూడా మన మేధ వికసించే దిశలో మన భాషలను వికసింపజేసుకోవాలి. ప్రపంచంలో ఎంతో ప్రాచీనమైనవి, మనోహరమైనవి అయిన భారతీయ భాషలు కేవలం కావ్య భాషలుగానే మిగిలిపోకుండా ఆధునిక వ్యవహారాలకు అనుగుణంగా వాటిని వికసింపజేసుకొని వాడుకలోకి తెచ్చుకోవాలి. ప్రపంచానికి మానవీయ విలువలను అందించిన మహోన్నతమైన సాహిత్యాన్ని నిక్షిప్తం చేసుకున్న భారతీయ భాషలు గత వైభవాలుగానే మిగిలిపోకుండా భవిష్యత్తులో కూడా మహోన్నతంగా విలసిల్లేందుకు తగిన రీతిలో ఆధునికీకరణ జరగాలి.

అమెరికా పూర్వ అధ్యక్షుడైన బుష్ అమెరికనులను హిందీ, అరబిక్ భాషలను నేర్చుకోమని ప్రోత్సాహపరిచేడు. ఎందుకంటే వారు భారతీయుల కాలగణనను అంచనా వేయలేకపోతున్నారు. వారి పిల్లలకు ప్రాధమికదశ నుండే ఈ భాషలను బోధించాలన్నాడు. కానీ ప్రపంచంలో తామే గొప్ప అన్న తలబిరుసుతనం వల్ల అమెరికన్లు ఈ భాషలను నేర్చుకోలేదనుకోండి. 

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన భాషలకు బదులుగా సామాజిక జీవనంలోని ప్రతిరంగంలోనూ ఆంగ్లభాష ఆధిక్యత కొనసాగెందుకే ఆసక్తి చూపారు. ఆ సమయంలోనే మన రాజ్యాంగ రచన జరిగింది. వివిధ శాస్త్ర శాఖల సాంకేతిక పదాలను సృష్టించుటకు చాలా కృషి చేసిన డాక్టర్ రఘువీర్ ఈ విషయంలో ఎంతో మనస్తాపానికి గురయ్యారు. ఆయన గాంధీజీ వద్దకు పోయి, "హిందీ దేశభాష కావాలి. ఎందుకంటే ఒక భాష కేవలం ఆలోచనలను పంచుకోడానికే కాదు, అది జీతిత విలువలతో ముడిపడియున్నది. అంతేకాక భాషను అనేక విజ్ఞాన, సామాజిక శాస్త్రములకు కూడా ఉపయోగించవచ్చు" అన్నారు. అందుకు గాంధీజీ, " నేను బహు భాషావేత్తను కాను. నీవు సర్దార్ పటేల్ తో కలిసి వెళ్ళి నెహ్రూను ఒప్పించు" అన్నారు. అయితే రఘువీర్ ప్రయత్నాలేవీ ఫలించలేదు. భారతీయ భాషల పట్ల నాయకులలోని ఉదాసీన వైఖరి కారణంగా మనదైన భాషను అనుసంధాన భాషగా రూపొందించుకోలేకపోయాం.

ఈ సందర్భంగా మనం టర్కీ ఉదంతాన్ని గుర్తుచేసుకోవాలి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత టర్కీ ఖలీఫాని పదవీభ్రష్టుని చేసి తీసేశారు. ముస్తాఫా కమాల్ పాషా అనే టర్క్ యువకుడు పాలకుడయ్యాడు. అతడు తన దేశంలోని అధికారులను పిలిపించి "మన పరిపాలనా వ్యవస్థ ఏ భాషలో జరుగుతోంది?" అని అడిగాడు. వారు లాటిన్ భాషలోనని సమాధానం చెప్పారు. "ఈ వ్యవహారాలన్నీ టర్కీ భాషలోకి మార్చడానికి ఎంతకాలం పడుతుంది?" అని కమాల్ అడిగాడు. దానికి ఆ అధికారులు పది సంవత్సరాలు పడుతుందని బదులిచ్చారు. దానికి కమాల్ "పది సంవత్సరాలు కాదు, పది గంటలలో అన్ని పరిపాలనా వ్యవహారాలూ టర్కీ భాషలో మొదలు కావాలి" అని ఆదేశించేడు. వెంటనే అక్కడ టర్కీలో వ్యవహారాలూ మొదలయ్యేయి. మొదట్లో ఇబ్బందిగానే అనిపించినా తరువాత టర్కీ భాషలోనే అక్కడి వ్యవహారాలూ కొనసాగించడం అలవాటయిపోయింది.

తరువాత కమాల్ పాషా తన దేశంలోని ముల్లాలను, మౌల్వీలను పిలిచి "మీరు ఏ భాషలో నమాజు చేస్తారు?" అని అడిగేడు. దానికి వారు "మేము అరబ్బీలో చేస్తాము" అని చెప్పారు. "దేవునికి ఒక్క అరబ్బీ భాషే వచ్చా? రేపటి నుండి టర్కీలోనే ప్రార్థన చేయండి" అని కమాల్ ఆదేశించాడు. దీనికి కొందరు మౌల్వీలు అయిష్టత చూపారు. వాళ్ళెవరో ముందుకి రండి అన్నాడు కమాల్. ఎవరూ బదులివ్వలేదు. అతడు చెప్పినదే బావుందని అందరూ అన్నారు. వెంటనే అక్కడ టర్కీలో ప్రార్థనలు మొదలయ్యాయి.

దురదృష్టవశాత్తూ అలా గట్టి నిర్ణయాలు తీసుకునేవారు మనదేశంలో లేకపోయారు. మనం పరాయి భాషను మన రాజ్యభాషగా అంగీకరించాము. అది 15 సంవస్తరముల వరకే అని తీర్మానించబడింది. అప్పుడు డా. అంబేద్కర్ రాజ్యాంగానికి కేంద్రభాష గూర్చి ఒక రాజ్యాంగ సవరణను ప్రతిపాదించారు. అన్నీ వివరంగా చర్చించి హిందీ అభివృద్ధి పొందేందుకు అవసరమైన 15 సంవత్సరములు ఆంగ్లభాషను కొనసాగించాలనే అంశాన్ని దానిలో పొందుపరిచారు. దానితోపాటే సంస్కృతం రాజభాష కావాలనే సవరణను డా. అంబేద్కర్ ప్రవేశపెట్టారు. హిందీ, తెలుగు మొదలైన వాటి వలె సంస్కృతం ఒక భాష కాదనీ , అది మన సంస్కృతి అనీ, అనాదియైన భారతీయ జీవనానికి ప్రతిరూపమనీ ఆయన అన్నారు. నాటి విదేశీ వ్యవహారాల సహాయమంత్రి  డా. బి.వి. కేస్కర్, శ్రీ నజీరుద్దీన్ అహ్మద్ (పశ్చిమ బెంగాల్), త్రిపుర, మణిపూర్, కూర్గ్, మద్రాస్ నుంచి ఆరుగురు అంబేద్కర్ ప్రతిపాదనని సమర్థించేరు. భారత ప్రథమ రాష్ట్రపతి ఈ 15 సంవత్సరముల లోపల  ఆంగ్లముతోబాటు సంస్కృతమును కూడా కేంద్రీయ రాజభాషగా ఉపయోగించవచ్చుననే అంశాన్ని పొందుపరిచేరు. కానీ అది అంగీకరింపబడలేదు. 15 సంవత్సరముల తరువాత హిందీ అధికార భాషగా చేయాలని అంగీకరింపబడినప్పటికీ, మార్పుచేయవలసిన సమయం వచ్చినప్పుడు నాటి ప్రధాని నెహ్రూ, "హిందీని అన్ని రాష్ట్రాలవారూ అంగీకరించారా? అలా జరిగినప్పుడే మార్పు వీలవుతుంది" అని అన్నారు. అప్పటికే రూపుదిద్దుకున్న నాగాలాండ్ లో ఆంగ్లాన్ని రాష్ట్రభాషగా చేసారు. హిందీని దేశభాషగాను, తక్కిన భాషలను ప్రాంతీయ భాషలుగాను ప్రకటించేరు. కానీ తమిళనాట హిందీని వ్యతిరేకిస్తూ తమ భాషతో పాటు మరొక భాషగా ఆంగ్లాన్నే స్వీకరిస్తామని వారు పట్టుబట్టేరు.

నిజానికి అనాదిగా మనదేశంలో విలసిల్లిన భాషలన్నీ దేశభాషలే. అవి మన సంస్కృతిని పరిపుష్ఠం చేస్తూ మన జాతి వికాసానికి దోహదం చేస్తూ వచ్చేయి. వాటిపట్ల మన నాయకులలో స్పష్టమైన, సమగ్రమైన దృక్పథం లేకపోవడం వల్లనే మన భాషలకు అధోగతి దాపురించింది. మన దేశభాషలన్నింటిపైన మనలో జాతీయ దృక్పథంతో కూడిన భావన నెలకొన్నప్పుడు మాత్రమే అవి పూర్ణ వైభవాన్ని సంతరించుకుంటాయి.

మన భాషా విధానం Reviewed by rajakishor on 7:34 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.