ఏళ్లు గడిచినా పరిష్కారం దొరకని కశ్మీర్
ఆర్.మల్లికార్జునరావు,సెల్: 9676190888
ఆంధ్రభూమి దినపత్రిక, 07/03/2015
గత జనవరి నెల 25,26,27 తేదీలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హుస్సేన్
భారత్ పర్యటనలో అనేక విషయాలలో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. దానితోపాటు
పాకిస్థాన్‌తో భారత్ సంబంధాలను కొనసాగించేందుకు ప్రభావితం చేసే ప్రయత్నం
కూడా చేసాడు. ఒబామా భారత్‌లో ఉన్నప్పుడు ‘‘పాకిస్థాన్ పౌర ప్రభుత్వం
బీభత్సకాండను ప్రోత్సహిస్తుందనే వాస్తవాన్ని’’ ప్రకటించాడు; పాకిస్థాన్‌ను
ఉగ్రవాదుల స్వర్గంగా తయారుచేయటం తమకు అంగీకారం కాదు అని పాకిస్థాన్
ప్రభుత్వానికి హెచ్చరిక కూడా చేసాడు. ఒకప్రక్క భారత్ వాదనను అంగీకరిస్తూనే
ఇంకొకప్రక్క అమెరికాకు తిరిగివెళ్ళి పాకిస్థాన్‌కు మరో ఆరువేల కోట్ల
రూపాయలు సైనిక సహాయం అందజేస్తున్నట్లు ఫిబ్రవరి మొదటివారంలో ప్రకటించాడు.
అంటే ఒబామాకు పాకిస్థాన్ అవసరం ఉంది; భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు
సాగిస్తున్నా కూడా భారత్ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా
ఉండాలని బహుశ భారత ప్రధానితో ఒబామా గట్టిగా చెప్పినట్లుగా ఉంది. ఈ
నేపథ్యంలోనే అటు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇటీవల ‘‘కశ్మీర్ సమస్య
పరిష్కారంవల్ల మాత్రమే భారత్ పాకిస్థాన్‌లలోను; దక్షిణ ఆసియాలోను శాంతి
ఏర్పడుతుంది’’ అని ప్రకటించాడు. ఈ క్రమంలోనే మన ప్రధాని నరేంద్రమోడీ
పాకిస్థాన్‌లో భారత్ విదేశాంగశాఖ కార్యదర్శి పర్యటన ఉంటుందని ప్రకటించారు.
అంటే గత ఆరునెలలుగా ఆగిపోయిన పాకిస్థాన్‌తో చర్చలు తిరిగి ప్రారంభం
కానున్నాయ. ఈ పరిణామాలను చూస్తుం టే ప్రస్తుత ప్రభుత్వంకూడా గత ప్రభుత్వం
లాగానే వ్యవహరిస్తున్నదా అనే అనుమానం వ్యక్తమవుతున్నది.
స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి పాకిస్థాన్‌తో భారత్ ప్రభుత్వం తీరు అమెరికా ఆలోచనలకు అనుగుణంగానే కొనసాగుతున్నదనేది కఠోర సత్యం. పాకిస్థాన్ ఏర్పడిన నాటినుండి కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో కలుపుకోవాలనే ఆలోచనను పాకిస్థాన్ ఏమి దాచుకోకుండా వ్యక్తం చేస్తూనే ఉన్నది. దానికి అనుగుణంగానే స్వాతం త్య్రం వచ్చిన తొలి రోజులలోనే కశ్మీర్ ఆక్రమణకు ప్రయత్నించింది. దాన్ని మన సై న్యం తిప్పికొట్టింది. కాని మన తొలి ప్రధాని వ్యవహారం కారణంగా కశ్మీర్‌లోని కొంతభాగం పాకిస్థాన్ ఆక్రమణలోకి వెళ్ళిపోయింది; ఆ కాశ్మీర్ భాగాన్ని పాకిస్థాన్ ఆజాద్ కశ్మీర్‌గా వ్యవహరిస్తూ ఉంటుంది. అంటే మిగిలిన కశ్మీర్‌ను విముక్తి చేయడం తమ లక్ష్యంగా ప్రకటించటమే. దానికోసం పాకిస్థాన్ భారత్‌తో యుద్ధాలు కూడా చేసింది. యుద్ధంలో భారత్‌తో గెలవలేమని గ్రహించి ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభించి కశ్మీరును భారత్‌ను రక్తసిక్తం చేస్తున్నది. పాకిస్థాన్ భారత్‌ను రక్తసిక్తంచేస్తున్నా ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోలేకపోతుండటం పాకిస్థాన్‌కు బలంచేకూరుస్తున్నది అనేది అక్షర సత్యం. ఈ పరిస్థితులలో భారత్ ఎట్లా వ్యవహరించాలో తేల్చుకోలేకపోతున్నదా? లేక అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడి కారణమా? ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు అమెరికాను కూడా పాకిస్థాన్‌కు సహకరించేట్టుగా చేస్తున్నదా? ఒక ప్రక్క చైనా; రెండవ ప్రక్క విస్తరిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదం కారణమా? దానికి మన దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తున్న ధోరణికి అనుగుణంగానే మన దేశం వ్యవహరించాలా? ఒకప్రక్క ఇటువంటి అంతర్జాతీయ పరిస్థితులు ఉంటే మరోప్రక్క కశ్మీర్‌లోని ముస్లిం మేధావులు భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాలను కూడా జాగ్రత్తగా గమనించాలి.
భారత్‌లోని ముస్లింలతో సర్దుబాటు కష్టం అనే భావన ఇప్పటి పాలకులలో ఉన్నది;
ముఖ్యంగా కశ్మీర్‌లో పాకిస్థాన్‌లో ఉన్న ముస్లింలను భరించటం చాలాకష్టం అనే
అభిప్రాయం ఉన్నది. కాబట్టి కశ్మీర్‌లోని ముస్లింలను అనుమానాస్పదంగా
చూస్తున్నారు; కశ్మీర్‌ను ఒక మినీ పాకిస్థాన్‌గా భావిస్తున్నారని కొందరు
ముస్లిం మేధావులు ప్రచారం చేస్తున్నారు. దానికి నేపథ్యం కశ్మీరీ పండిట్ల
విషయంలో భారత్ ఆలోచిస్తున్నతీరు, కశ్మీరీ పండిట్లకు ప్రపంచంలో అనేక
దేశాలలో పెరుగుతున్న సంఘీభావం, సానుభూతి. దానికి అనేక హిందూ సంస్థలు
వాళ్ళకు చేదోడువాదోడుగా ఉన్నాయ. ఈ ప్రభుత్వం కూడా హిం దువులకు అనుకూల
ప్రభుత్వంగా ఉన్నదనే ప్రచారం కూడా చాలా తీవ్రంగా చేస్తున్నారు. కశ్మీరీ
పండితులను స్వస్థలం నుంచి తరిమివేసి 25 సంవత్సరాలయిన నేపథ్యంలో గత జనవరిలో
అనేకచోట్ల కశ్మీరీ పండిట్లు కార్యక్రమాలు నిర్వహించారు. కేవలం ఢిల్లీలోనే
కాదు ప్రపంచంలో చాలాచోట్ల జరిగాయి. దానిని పురస్కరించుకొని కేంద్ర
ప్రభుత్వాన్ని విమర్శించటం చేస్తున్నారు. పైగా 1947లో కశ్మీర్ లోయనుండి
కశ్మీరీ ముస్లింలను తరిమేశారు. వాళ్ళు పాకిస్థాన్‌లో తల దాచుకొంటున్నారు.
ఇప్పటికి ఐదు తరాలు గడిచిపోయాయి. కాని వారికి పరిష్కారం దొరకటం లేదు.
1977లో కశ్మీరు ప్రభుత్వం పాకిస్థాన్‌లో ఉన్న ముస్లింలను తిరిగి
కాశ్మీర్‌కు రప్పించేందుకు ‘రిసెటిల్‌మెంట్ బిల్’ ప్రవేశపెడితే కశ్మీరీ
హిందువులు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ బిల్లును ఆపించారు. దాని విషయం కేంద్ర
ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు అనేది వారి వాదన. గడిచిన 25 ఏళ్ల నుండి కశ్మీర్
లోయ అభివృద్ధికి నోచుకోలేదు. దానికి కారణం ఢిల్లీలో ఉండే ప్రభుత్వాలు,
ప్రభుత్వ యంత్రాంగం. పై కొద్ది కశ్మీరీ పండిట్లను కశ్మీర్‌లోని ముస్లింలకు
వ్యతిరేకంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. కేంద్రంలో
ప్రభుత్వం అండదండలతో కశ్మీరీ పండిట్లు దేశంలో, ప్రపంచంలోని అనేక దేశాలలో
కాశ్మీరీ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు, ర్యాలీలు
తీస్తున్నారు అని తమ ఆక్రోశాన్ని వాళ్లు వెళ్లగక్కుతున్నారు.
గడిచిన జనవరి మాసంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో అనేకచోట్ల అక్కడ స్థానిక
ప్రభుత్వం సహకారంతో కశ్మీరీ పండిట్లు తమ హక్కుల పరిరక్షణకోసం నిరసన
ర్యాలీలు నిర్వహించారు. హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్, పిపిజి ఆఫ్ బ్రిటిష్
హిందూ సంస్థలవాళ్ళు బ్రిటీష్ పార్లమెంట్‌లో కశ్మీరీ పండిట్ల యొక్క హక్కుల
పరిరక్షణకు తమ వాణిని వినిపించే ప్రయత్నం కూడా చేసారు. 2015 జనవరి 20వ
తేదీన బాబు బ్లాక్‌మెన్ ఎర్లీ డే మోషన్‌ను ప్రవేశపెట్టాడు. కశ్మీరీ
పండిట్లను కశ్మీర్ లోయనుండి తరిమివేసి 25 సంవత్సరాలవుతోంది. కశ్మీరీ
పండిట్లకు న్యాయం జరగాలని బ్రిటిష్ పార్లమెంటులో సంఘీభావం తెలియజేసారు.
దానికి 15 మంది పార్లమెంటు సభ్యులుకూడా మద్దతు ప్రకటించారు. కశ్మీరీ
పండిట్ల హక్కుల పరిరక్షణకు ఒక ఫోరమ్ ఏర్పాటుచేసి కృషిచేస్తామని అన్నారు.
భారత్ సరిహద్దుల ఆవలనుండి దాడిచేస్తున్న ఉగ్రవాదులకు కశ్మీర్ లోయలోని
ముస్లింల సహకారం ఉన్నదని ఆరోపించారు. మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ
అమానుషానికి వ్యతిరేకంగా అందరూ నిలబడాలని కూడా పిలుపునిచ్చారు. ఢిల్లీలో
కూడా కశ్మీరీ పండిట్లు ర్యాలీలు తీసారు.
దేశంలో హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలను నిలబెడుతున్నారా? లేక ముస్లింలకు
వ్యతిరేకంగా హిందువులను నిలబెడుతున్నారా? ఏమి జరుగుతోందో అందరికీ తెలుసు.
ముస్లింలుగా మతం మారినంత మాత్రాన హిందువులను శత్రువులుగా మతంమారిన
హిందువులు ఎందుకు భావిస్తున్నారు? హిందువులు-ముస్లింల మధ్య సయోధ్యకు మొగలుల
కాలంలో, బ్రిటీష్ కాలంలో కూడా తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అవి ఎందుకు
సఫలంకాలేదు? దానికి అడ్డుపడుతున్న శక్తులు ఎవరు? ఈ విషయాల గురించి ముస్లిం
పెద్దలు ఎందుకు ఆలోచించరు? దేశంలో మత అసహనాన్ని ఎందుకు పెంచుతున్నారు?
దీనిని ముస్లిం మేధావులు ఎందుకు ఆలోచించరు. పైగా తమ సంఖ్యాధిక్యత ఉన్నచోట
హిందువులను ఎట్లా వ్యతిరేకిస్తున్నారో దేశంలో కశ్మీర్ ఒక పెద్ద ఉదాహరణ.
ఇంకా అనేకచోట్ల ఇదే తంతు కొనసాగుతోంది. ముస్లిం నాయకులు ఇచ్చే ఉపన్యాసాలు
అన్నీ సయోధ్యకు మార్గం చూపకపోగా విద్వేషానికి కారణభూత మవుతున్నాయ. ఆధిపత్య
ధోరణిని ప్రదర్శిస్తున్నది. దానికి తాజా ఉదాహరణను గమనిద్దాం. మొన్నటి మొన్న
కశ్మీర్ ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాని కారణంగా సంకీర్ణ ప్రభుత్వం
ఏర్పాటుకు ఎడతెగని ప్రయత్నాలు కొనసాగాయ. ఈ సమయంలో కశ్మీర్‌లోని పిడిపి
పార్టీనేత ముఫ్తీమహ్మద్ సయ్యద్ ప్రకటనను గమనిద్దాం. ‘‘్భరత్‌లో ముస్లిం
మెజారిటీ ఉన్న ఒకే ఒక రాష్ట్రం కశ్మీర్. దాన్ని అట్లాగే కాపాడాలి’’,
కశ్మీర్‌లో ముస్లిమే ముఖ్యమంత్రిగా ఉండాలి అనే ఆలోచనను పరోక్షంగా
వ్యక్తీకరించాడు. కశ్మీర్ భారత్‌లో ఉండాలో? పాకిస్థాన్‌లో ఉండాలో
స్వతంత్రంగా ఉండాలో కశ్మీర్‌లోని ముస్లిం నాయకులు ఎటుతేల్చుకోక పోతున్నారు.
కాని ముస్లిం ఆధిక్యత ఉన్నచోట ముస్లిం పద్ధతిలోనే పాలన సాగాలనేది వారి
నిశ్చితా భిప్రాయం. మిగతా దేశంతో వారికి పట్టింపు లేదు. తాము ప్రత్యేకం అనే
భావాన్ని ఎప్పుడూ వ్యక్తంచేస్తూ ఉంటారు. కేవలం ఈ కారణంగానే పాకిస్థాన్
ఏర్పడింది. 68 సంతవ్సరాల తరువాత పాకిస్థాన్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో
చూస్తూకూడా అవే భావాలు కశ్మీర్‌లో ముస్లింలలో ఈరోజు కూడా వ్యక్తం కావడం
కనిపిస్తోంది. దానికి తాజా ఉదాహరణ నిన్నటి రోజు (15.2.2015) ముఫ్తీమహ్మద్
సయ్యద్ చేసిన ఒక ప్రకటనను గమనిద్దాం. ‘‘కశ్మీర్ సమస్య పరిష్కారానికి
పాకిస్థాన్‌తో చర్చలు జరిపేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ సంకేతాలు ఇవ్వటం
అభినందనీయం’’అని అన్నాడు.
కశ్మీర్‌కు సంబంధించిన కొంత భూభాగం పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్నది. దానిని
తిరిగి స్వాధీనం చేసుకోవడమే పరిష్కారం, కాని అది భారత్ పాకిస్థాన్ మధ్య
ఉన్న సమస్య అనే భావం నాయకులలోనే ఉంటే దానిని ఎట్లా అర్థంచేసుకోవాలి. ఇదే
అతి పెద్ద సమస్య. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సరియైన దిశలో
కృషిచేస్తుందా? లేక అమెరికా సంకేతాలను అనుసరించి వ్యవహరిస్తుందా?
కశ్మీర్‌లో బిజెపి, పిడిపి పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయమై
ముఫ్తీమహ్మద్ సయ్యద్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
వైరుధ్యాలున్నా రెండు కూటములు కలిసి ప్రభుత్వం నడపటం నల్లేరుమీద బండికాదు; ఆ
అనుభవం రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది.
ఏళ్లు గడిచినా పరిష్కారం దొరకని కశ్మీర్
Reviewed by rajakishor
on
7:24 AM
Rating:
No comments: