Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ముఫ్తీ మెడలు వంచుతున్న భా.జ.పా.

ఆంధ్రభూమి సంపాదకీయం , మార్చి 23, 2015

ఉగ్రవాదుల పాశవిక హత్యాకాండను నిరసిస్తూ జమ్మూ కశ్మీర్ శాసనసభ తీర్మానించడం శుభ పరిణామం... జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సయీద్ విధానాలను శాసనసభ నిరాకరించినట్టు ఈ తీర్మానం వల్ల స్పష్టమైంది! జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ విధానాన్ని భారతీయ జనతాపార్టీ కూడ ప్రభావితం చేస్తోందన్న వాస్తవానికి ఈ విచ్ఛిన్నవాద వ్యతిరేక తీర్మానం మరో నిదర్శనం! ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన వెంటనే ఆతతాయి మూకలకు అనుకూలంగాను, పాకిస్తాన్ ప్రభుత్వానికి మద్దతుగాను ప్రకటనలు చేసిన ముఫ్తి మహమ్మద్ సరుూద్ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేశాడు! ఈ దిగ్భ్రాంతి నుండి తేరుకోక ముందే భయంకర బీభత్సకారుడైన అఫ్జల్ గురు భౌతిక అవశేషాలను కశ్మీర్‌కు తెప్పించాలని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ-పిడిపి-ప్రతినిధులు కోరడం భాజపాను ఇరకాటంలో పడవేసిన విపరిణామం! దేశ విద్రోహానికి వికృతరూపమైన మసారత్ ఆలమ్ భట్‌ను భాజపాను సంప్రదించకుండా జైలునుండి విడుదల చేసిన కశ్మీర్ ముఖ్యమంత్రి మరో రాజ్యాంగ వైపరీత్యాన్ని సృష్టించాడు! ముఫ్తి ఒడిగట్టిన దేశద్రోహ చర్యకు నిరసనగా నిలదీసిన విపక్షాలకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో సమాధానం చెప్పలేక సతమతమయిపోయింది! ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ శాసనసభ ఉగ్రవాద వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించడం భాజపాకు నైతిక విజయం..జమ్మూ కశ్మీర్ మంత్రివర్గంలో ప్రధాన భాగస్వామి పిడిపి. కశ్మీర్‌కు స్వయం పాలనను కోరుతున్న పిడిపితో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపా విమర్శలకు గురి అయింది, విచ్ఛిన్నవాదం ముందు మోకరిల్లినట్టు అపకీర్తికి గురి అయింది! అయితే ఉగ్రవాద వ్యతిరేక తీర్మానాన్ని శాసనసభలో ఆమోదింపచేయడం ద్వారా భాజపా ముఫ్తి మహమ్మద్ సయీద్ మెడలు వంచగలుగుతున్నట్టు నిరూపించుకుంది! పాకిస్తాన్ దురాక్రమిత పాకిస్తాన్-పిఓకె-లో నలబయి నాలుగు జిహాదీ హంతక శిక్షణ కేంద్రాలు పని చేస్తున్నట్టు వెల్లడి కావడం జమ్మూ కశ్మీర్ శాసనసభ ఆమోదించిన తీర్మానానికి నేపథ్యం! జమ్ములోని కథువా జిల్లాలో శుక్రవారం సైనికుల వేషం వేసుకున్న జిహాదీ హంతకులు రాజ్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి రక్తపాతం సృష్టించారు. ఈ భయంకర ఘటననుండి తేరుకునేలోగానే శనివారంనాడు సాంబా జిల్లాలోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసారు! ఈ రెండు దాడులను భద్రతా దళాలు తిప్పికొట్టగలిగినప్పటికీ నలుగురు పోలీసులు, పౌరులు బలైపోయారు. అనేకమంది గాయపడ్డారు! ఈ దాడులు చేసిన ఉగ్రవాదులతో పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధం లేదని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించడం మరో రాజ్యాంగ వ్యతిరేక, దేశ విద్రోహకర చర్య! అయితే ఉగ్రవాద వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా శాసనసభ ముఫ్తిని పరోక్షంగా అభిశంసించింది!

ఉగ్రవాదులను మన దేశంలోకి రహస్యంగా ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ బహిరంగంగా దౌత్య బీభత్సం కూడ కొనసాగిస్తోంది! పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు జమ్ముకశ్మీర్‌లోని విచ్ఛిన్న వాదులను కలుసుకొనడం ఈ దౌత్య దురాక్రమణలో భాగం..మన దేశంలోని పాకిస్తాన్ రాయబారులు కశ్మీర్‌లోని హురియత్ ముఠాలవారిని, జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన పేరుమోసిన దేశద్రోహులను కలుసుకుని చర్చలు జరపడం దశాబ్దుల వైపరీత్యం! ఈ వైపరీత్యాన్ని గత ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం నిరోధించింది! పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ బాసిత్ విచ్ఛిన్నకారుడైన షబ్బీర్ షాను కలుసుకున్నందుకు నిరసనగా మన ప్రభుత్వం గత ఆగస్టులో పాకిస్తాన్‌తో చర్చలను రద్దు చేసుకుంది! అది శుభ పరిణామం! పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశంపైకి ఉగ్రవాదులను ఉసిగొల్పడం మాననంతవరకు, విచ్ఛిన్నకారులతో చర్చలు జరపడం మాననంత వరకు ఆ దేశంతో సంభాషణలు ఉండబోవని మన ప్రభుత్వం స్పష్టం చేసింది! పాకిస్తాన్ ప్రభుత్వం తన దుర్మార్గ విధానాన్ని విడనాడలేదు! కశ్మీర్‌లో హత్యాకాండను కొనసాగిస్తూనే ఉంది! ఇందుకు నిదర్శనం కథువా, సాంబా జిల్లాలలో శుక్ర శనివారాలలో జరిగిన దాడి! అయినప్పటికీ మన ప్రభుత్వం గత నెలలో మళ్లీ పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చల ప్రక్రియను ప్రారంభించడం మన మెతకతనానికి నిదర్శనం...విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్ ఈ నెల ఆరంభంలో పాకిస్తాన్‌కు వెళ్లి వచ్చాడు. వచ్చిన వెంటనే మన దేశంలోని పాకిస్తానీ రాయబారి మళ్లీ అందుకున్నాడు! అందుకుని, పాకిస్తాన్ రాజధానిలో జయశంకర్‌తో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు జరిపిన వివరాలను కశ్మీర్‌లోని దేశ విద్రోహులకు నివేదించాడు! ఇలా నివేదించే ప్రక్రియ కొనసాగుతుండడం కశ్మీర్ శాసనసభ తీర్మానానికి నేపథ్యం! హురియత్ మెతక ముఠా నాయకుడు మీర్వాయిజ్ ఫారూక్‌ను పాకిస్తాన్ హైకమిషనర్ కలుసుకోనున్నాడట...

పాకిస్తానీ జిహాదీ పైశాచిక పదముద్రలు నానాటికీ విస్తరిస్తున్నట్టు మన రక్షణ మంత్రిత్వ శాఖ వారి వార్షిక నివేదికలో పేర్కొనడం మన విదేశాంగ నీతికి పరోక్ష అభిశంసన! పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో నలబయి నాలుగు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలున్నాయన్నది రక్షణ నివేదికలోని ప్రధానమైన అంశం... ఈ ఉగ్రవాదపు అడ్డాలలో ఆరితేరుతున్న జిహాదీ హంతకులు నిరంతరం మనదేశంలోకి చొరబడుతుండడం ఈ పదముద్రల విస్తరణకు ప్రాతిపదిక! టెర్రరిజం ప్రభుత్వ విధానంగా పాకిస్తాన్ సైనిక వ్యవస్థలో వేళ్లూని ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ పదే పదే ఉల్లంఘిస్తోంది! ఉగ్రవాదులను అధీన రేఖ దాటించి మన దేశంలోకి ఉసిగొల్పుతూనే ఉంది...ఇలా ప్రభుత్వం ఆశించిన రెండు మార్పులూ సంభవించలేదు. మొదట పాకిస్తాన్ ప్రభుత్వం మనదేశానికి వ్యతిరేకంగా జిహాదీ హత్యాకాండ జరపడం మానుకోవాలి! రెండవది, విచ్ఛిన్నకారులతో చర్చలు జరపరాదు! అందువల్ల పాకిస్తాన్‌తో మన ప్రభుత్వం సకల విధ సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలి! పాకిస్తాన్ ప్రభుత్వాన్ని టెర్రరిస్టు వ్యవస్థగా ప్రకటించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి! తద్వారా మాత్రమే పాకిస్తాన్ దారికి వస్తుంది! పాకిస్తాన్ మనకు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఉసికొల్పడం మానుకున్నట్టయితే ఆ దేశంతో మనం చెలిమి చేయవచ్చు! చర్చలు జరపవచ్చు! మానుకోనంత వరకూ పాకిస్తాన్‌తో తెగతెంపులు చేసుకోవడమే ఏకైక ప్రత్యామ్నాయం...

ఇలా విధానాలూ, వైపరీత్యాల సంకీర్ణంగా మన విదేశాంగ నీతి కొనసాగుతోంది! ఈ నీతి జమ్మూ కశ్మీర్ శాసనసభలో ప్రతిధ్వనించింది! కథువా, సాంబా జిల్లాలలో ఉగ్రవాద హత్యాకాండ జరిపిన వారికి పాకిస్తాన్ ప్రభుత్వంతో సంబంధం లేదన్నది ముఫ్తి చేసిన నిర్ధారణ! అందువల్ల జిహాదీ హత్యాకాండను ఎదిరించడంలో కలసి రావాలని పాకిస్తాన్ దొరతనానికి ఆయన పిలుపునిచ్చాడు! ఇలా నేరుగా పాకిస్తాన్‌కు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునివ్వడం దేశ వ్యతిరేకం...దీనికి భిన్నంగా శాసనసభ తీర్మానంలో పాకిస్తాన్‌ను నిలదీయవలసిందిగా మన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు...విజ్ఞత అంకురించింది!

ముఫ్తీ మెడలు వంచుతున్న భా.జ.పా. Reviewed by rajakishor on 12:06 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.