Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

చైనా బౌద్ధ ‘మత’ రాజకీయం!

క్లౌడే ఆర్పి (niticentral.com)
ఆంధ్రభూమి దినపత్రిక , 24/03/2015


(చిత్రం) చైనాలోని ఫామెన్ దేవాలయం

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈనెల 19న ఒక అసాధారణ సంఘటన జరిగింది. టిబెట్ అధ్యాత్మిక గురువు దలైలామా, శ్రీలంకకు చెందిన సీనియర్ బౌద్ధ సన్యాసుల ప్రతినిధి బృందాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా బౌద్ధారామాల్లో పాటించాల్సిన నియమనిబంధలు ‘వినయ’పై చర్చలు జరిగాయి. ఇది ఎంతో అరుదైన సంఘటన. ఎందుకంటే బుద్ధుని బోధనలపై వచ్చిన వివిధ వ్యాఖ్యలపై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకోవడమనేది బుద్ధుడి అనుయాయుల్లో చాలా అరుదుగా చోటు చేసుకునే సంఘటన. ఈ సందర్భంగా దలైలామా మాట్లాడుతూ, ‘‘మనమంతా బుద్ధుడి అనుయాయులం. కొంతమంది శాస్ర్తియ భావన ఉన్నవారు ఈ మతంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిలో చాలామంది బుద్ధుడి బోధనల్లోని దృక్కోణంపై ప్రధానంగా ఆసక్తి కనబరుస్తున్నారు’’ అన్నారు. ఆయనే ఇంకా మాట్లాడుతూ ‘‘మిగిలిన వారితో దూరంగా ఉండేందుకు, మీకు.. వారికి మధ్య అడ్డుగోడను సృష్టించే విషయంలోమీరు మిగతావారికంటే భిన్నమని, కొంత ప్రత్యేకత కలిగినవారని భావిస్తున్నా.’’


దురదృష్టవశాత్తు బహుశా కొన్ని శతాబ్దాలుగా విభిన్న బౌద్ధ సిద్ధాంతాలను అనుసరించే వారి మధ్య నిజానికి జరిగిందిదే. ఈ సమావేశానికి హాజరైన శ్రీలంక బౌద్ధ సన్యాసుల్లో మూడు ప్రధాన బౌద్ధ సంప్రదాయాలకు చెందిన అధిపతులు ఉన్నారు. ‘రమణ్య’, ‘శియం’, ‘అమరపుర నికాయ’ అనేవి ఈ మూడు సంప్రదాయాలు. మహాబోధి సొసైటీ అధ్యక్షుడు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత శ్రీలంకకు చెందిన ప్రతినిధులు ఢిల్లీకి తామెందుకు వచ్చిందీ వివరించారు. ‘‘ మేం రోజంతా ‘వినయ’పై చర్చించాం. శ్రీలంక, టిబెట్‌లలో అనుసరిస్తున్న ‘వినయ’ సంప్రదాయలైన ‘్థరవాద’, ‘మూలసర్వస్తివాద’ లను సరిపోల్చుతూ నిర్వహించిన మా చర్చలో..ఈ రెండింటి మధ్య పెద్దగా గుర్తించదగిన తేడాలు ఏమీ లేవని తేలింది.’’ ఈ సందర్భంగా దలైలామాను తమ దేశంలో చూడాలని ఉన్నదంటూ శ్రీలంక సీనియర్ బౌద్ధ సన్యాసులు ఏకగ్రీవంగా ఆకాంక్షించారు.

ఈ మతపరమైన సమావేశానికి వెనుక కొంత రాజకీయ సహజార్థత గోచరించిన మాట నిజం. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల శ్రీలంకలో పర్యటించిన దాని ప్రత్యక్ష ప్రభావమన్నది సుబోధకమవుతోంది. ఎందుకంటే కొలంబో పర్యటన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ‘‘నిజమైన బౌద్ధం శ్రీలంకలో పరిఢవిల్లింది’’ అన్నారు. అనంతరం ఆయన శ్రీలంక పురాతన రాజధాని అనురాధపురాన్ని సందర్శించి అక్కడి పవిత్రమైన మహాబోధి వృక్షం వద్ద ప్రార్థనలు జరిపారు. నిజానికి ఇదొక బలీయమైన భావసూచన అనే చెప్పాలి. ఆయనతో శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన కూడ ఉన్నారు. వీరిద్దరూ మహాబోధి వృక్ష దేవాలయం వద్ద 30 నిముషాల సేపు గడిపారు. ఈ సందర్భంగా వారుకొన్ని బౌద్ధ సంప్రదాయ పూజలు నిర్వహించారు. గత ఏడాది జపాన్‌లో పర్యటించిన సందర్భంగా మోదీ, "భారత్లో ప్రభవించిన బౌద్ధం శతాబ్దకాలంగా జపాన్‌పై ఎంతో స్ఫూర్తిని నింపింది’’ అన్నారు.

ఆసియాలో బౌద్ధ ఉద్యమానికి నేతృత్వం వహించాలని చైనా ఉవ్విళ్లూరుతున్న తరుణంలో పై పరిణామాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకోవడం సహజం. ‘బౌద్ధ ప్రపంచానికి తానే నాయకురాలినని చైనా పేర్కొంటున్నది’ అంటూ 2014, అక్టోబర్ 27న ‘బౌద్ధులకు చెందిన ఛానల్’ ఒక వార్తను ప్రసారం చేసింది. ఈ ఛానల్ బౌద్ధమతానికి చెందిన వార్తలను మాత్రమే ప్రసారం చేస్తుంది. దీనే్న చైనా అధికార వార్తా సంస్థ గ్జిన్హువా మరింత విస్తరిస్తూ, ‘‘చైనా వాయువ్య ప్రాంతానికి చెందిన షాంగ్జి ప్రావెన్స్‌లోని అతి పురాతన బౌద్ధ దేవాలయంలో నిర్వహించిన ‘ప్రపంచ బౌద్ధుల కూటమి 27వ సాధారణ సమావేశం’లో ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది బౌద్ధులు పాల్గొన్నారు. భావోజి నగరంలోని ఈ ఫామెన్ దేవాలయంలో బుద్ధుడి చేతివేలు ఎముకల అవశేషాలున్నాయి. దాదాపు 30 దేశాలకు చెందిన 600 మంది బౌద్ధ ప్రతినిధులు ఇక్కడకు చేరుకున్నారు,’’ అని పేర్కొంది.

కమ్యూనిస్టు చైనాకు బుద్ధుడిపై, బౌద్ధ గురువుల పునరావతారం గురించి నమ్మకమున్నదని మనం విశ్వసించాలి! ఎందుకంటే సిద్దార్థుడు 2500వ జయంతి సందర్భంగా 1957లో అప్పటి చైనాఅధ్యక్షుడు చౌ ఎన్‌లై భారత సందర్శనకు వచ్చినప్పుడు బుద్ధుడికి చెందిన కొన్ని ‘అవశేషాలు’ భారత్‌కు తిరిగి తీసుకొచ్చారు!

అధికారికంగా అంగీకరించకపోయినా, చైనాలో నేడు 200-300 మిలియన్ల మంది బౌద్ధమత అనుయాయులున్న మాట వాస్తవం. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్య లో బౌద్ధులున్న దేశం చైనా. గ్జియాన్‌కు సమీపంలోని బావోజీ పట్టణంలో అతిపెద్ద బౌద్ధ దేవాలయాలను పునరుద్ధరించారు. ఇక్కడి దేవాలయాల ప్రారంబోత్సవ సమావేశాన్ని పరిశీలిస్తే చైనాలోని బౌద్ధమతం గుర్తించదగిన మార్పుకు లోనైందని స్పష్టమవుతుంది. తాను అనుసరిస్తున్న ‘సప్రమాణిక’ వైఖరిని ప్రస్తుతించే భజనపరులకోసం ప్రస్తుతం చైనా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకకు చెందిన జర్మన్ ధర్మదత్త సొసైటీ ప్రతినిధుల తరపున షాంగ్జికి వచ్చిన డాక్టర్ కళింగ సెనెవిరత్నె చైనాను ప్రశంసలతో ముంచెత్తడం కమ్యూనిస్టు ప్రభుత్వానికి తప్పక సంతోషం కలిగిస్తుంది.

ఈ సమావేశంలో ప్రముఖంగా చెప్పుకోదగింది, చైనాప్రభుత్వం ఎంపిక చేసిన పంచన్‌లామా గ్యాల్‌స్టెన్ నోర్బు ప్రసంగం. ఆయన ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న బౌద్ధులు పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొని..పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ‘‘బౌద్ధం ఇప్పటికే చైనా సంస్కృతిలో అంతర్భాగమైపోయింది. దీన్ని చైనా ప్రభుత్వం గుర్తించింది. వెయ్యి సంవత్సరాలుగా టిబెట్ బౌద్ధం చైనా దేశానికి అమూల్యమైన వజ్రంగా రూపొందింది’’ అన్నారు. పైకి వినడానికి బాగానే ఉన్నప్పటికీ ఈ నాణేనికి మరో వైపు కూడా ఉన్నది. చైనా బయట ‘రాజకీయ కారణాల’ చేత బౌద్ధాన్ని ప్రోత్సహించినా, దేశంలోని అన్ని సమాజాల్లో దాన్ని నిషేధించింది. నేడు దేశంలో 200-300 మిలియన్ల మంది బౌద్ధులు ఉన్నారంటే అది కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వీరి సంఖ్యతో పోలిస్తే దేశంలో కమ్యూనిస్టు సభ్యుల సంఖ్య చాలా తక్కువ! అయితే కమ్యూనిస్టు చైనాలో ‘కారల్ మార్క్స్’ కంటే ‘గౌతమ బుద్ధుడు’ ఏవిధంగా ప్రాచుర్యం పొందగలిగాడన్నది ఆశ్చర్యకరం!

ఇటీవల శ్రీలంక బౌద్ధ సన్యాసులు, దలైలామాతో సమావేశమయ్యేంత వరకు ‘నలంద’ పేరుతో పిలిచే టిబెట్ బౌద్ధ సంప్రదాయానికి..మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్ లేదా లావోస్‌లలో అనుసరిస్తున్న థెరవాద లేదా హీనయాన సిద్ధాంతాలతో పెద్దగా సంబంధాలు లేవనే చెప్పాలి. రాజకీయ కారణాల నేపథ్యంలో చైనా వత్తిళ్ల వల్ల దలైలామా ఎన్నడూ నేపాల్, భూటాన్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్‌ల్లో పర్యటించలేకపోయారు. బంగ్లాదేశ్‌లో చాలా స్వల్ప సంఖ్యలో బౌద్ధులున్నారు. శ్రీలంకలో మోదీ చూపిన చొరవ ఆహ్వానించదగింది. ‘బౌద్ధుల వ్యవహారాలకు సంబంధించి దక్షిణాసియా విభాగాన్ని’ ఏర్పాటు చేయడానికి ధర్మశాల ముందడుగు వేయడానికి ఇదే సరైన తరుణం. ఇందుకోసం టిబెట్ లేదా భారత్‌కు చెందిన గౌరవనీయులైన బౌద్ధమతంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు దక్షిణాసియా దేశాలకు చెందిన రాజధానుల్లో సాధ్యమైనంత త్వరగా పర్యటించాల్సిన అవసరం ఉంది. తద్వారా స్థానిక బౌద్ధులతో సంబంధాలు ఏర్పరచుకోవాలి. మోదీ ప్రభుత్వం అందించే గట్టి మద్దతు వల్ల ఇది అసాధ్యమైన పనేం కాబోదు. ఈ నేపథ్యంలోనే థెరవాద సన్యాసులు, నలంద సంప్రదాయానికి చెందిన టిబెటన్/హిమాలయ ప్రాంతాల సన్యాసుల మధ్య ‘వినయ’ విషయంలో సమావేశం ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం చొరవ చూపింది.

వినయపై చర్చలను అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబిసి) ఏర్పాటు చేసింది. 2011, నవంబర్ నెలలో ‘ప్రపంచ బౌద్ధుల సమారోహం’ (జిబిసి)ని..న్యూఢిల్లీకి చెందిన అశోకా మిషన్ నిర్వహించింది. ఈ సమావేశానికి 40 దేశాలనుంచి మొత్తం 900 మంది బౌద్ధ సన్యాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో దలైలామా పాల్గొనడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది కూడా. అంతేకాదు భారత్-చైనాల మధ్య జరగాల్సిన ప్రత్యేక ప్రతిధునుల 15వ సమావేశాన్ని రద్దు చేయడంతో భారత్ వెనుకడుగు వేసింది. శ్రీలంక, నలంద ప్రతినిధులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజ్జు నివాసంలో లాంఛనంగా ఏర్పాటు చేసిన తేనీటి సమావేశానికి హాజరవడం విశేషం. రిజ్జూ అరుణాచల్ ప్రదేశ్‌కు చెందినవారు. ఈ సమావేశంలో ‘సెంట్రల్ టిబెటన్ ఆర్గనైజేషన్’కు చెందిన మాజీ ప్రధాని సమ్‌ధొంగ్ రింపోచీ కూడా హాజరవడం గమనార్హం.

ప్రస్తుతం జరిగిన ఈ చర్చలను ఇతర బౌద్ధ దేశాలకూ విస్తరించాలి. తమ దేశంలోని మైనారిటీ మతాలవారిని దారుణంగా చూసే చైనా ఆసియాలో ‘బౌద్ధ ఉద్యమానికి’ నేతృత్వం వహించాలనుకోవడమే పెద్ద విచిత్రం. ఇక్కడ బీజింగ్‌కు ఉన్న సానుకూలత ఏంటంటే పుష్కలంగా నిధులు ఉండటం. అందువల్ల ‘మృదువైన దౌత్యవిధానాన్ని’ అనుసరించగలదు. నిధుల ఆశ చూపినప్పుడు ఎవరైనా ఆకర్షితులు కావడం సహజమే కదా!


చైనా బౌద్ధ ‘మత’ రాజకీయం! Reviewed by rajakishor on 8:16 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.