మహిళలపై అత్యాచారాలు ఒక్క భారత్ లోనే జరుగుతున్నాయా?
ఎస్ . ఆర్ . రామానుజన్ , సెల్ : 8008322206
ఆంధ్రభూమి దినపత్రిక , 21-03-2015
గత ఐదురోజులుగా జాతీయ టెలివిజన్ ఛానళ్లలో ఒక దురదృష్టకరమైన ఉదంతం చోటు
చేసుకుంటోంది. ఈ ఛానళ్లవారు పుండుమీద గోకిన చందంగా అరుపులు, కేకలతో గగ్గోలు
పెట్టేస్తున్నారు. చర్చి పెద్ద మనుషులతో కలిసి వీరు యథాశక్తి
మతవిద్వేషాన్ని చిందిస్తున్నారు. ప్రస్తుత కాషాయ ప్రభుత్వమే దేశంలో మతపరమైన
వాతావరణం నెలకొనడానికి కారణమంటూ తమకు తోచినవిధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
రోజువారీగా ఈ గగ్గోలు పుట్టించే కార్యక్రమాలను టెలివిజన్లలో
వీక్షించేవారికి ఒక అభిప్రాయం కలుగకమానదు. పశ్చిమ బెంగాల్ సరిహద్దు జిల్లా
రానాఘాట్‌లో 72 ఏళ్ల క్రైస్తవ సన్యాసినిపై జరిగిన అత్యాచార ఉదంతం, అసలైన
తొలి పాపం జరిగిన తర్వాత చోటు చేసుకున్న రెండో పాపంగా వీరికి అర్థమవుతోంది.
అంటే ఇక్కడ ఆ క్రైస్తవ సన్యానికి జరిగిన అన్యాయాన్ని మరచిపోవడమో లేదా
దోషులను క్షమించమనో చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. అటువంటి హేయమైన
నీచకృత్యానికి పాల్పడ్డవారిని తప్పనిసరిగా చట్టపరిధిలోకి తీసుకొని
రావలసిందే. కేవలం ఆమె వృద్ధురాలైనందువల్ల కాదు.. గౌరవంగా చూడవలసిన ఒక పెద్ద
మనిషికి జరిగిన అన్యాయం వల్ల. ఇక్కడ ఆమె ఏ వర్గం లేదా ఏ మతానికి
చెందినవారన్నది ప్రశ్న కాదు.
కానీ మనం చేసిందేంటి? ఈ సంఘటనకు ఒక మతం రంగు పులిమి, దేశంలోని అన్ని
మైనారీటీ వర్గాలు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయన్న భ్రమను
వ్యాపించపజేయడానికి శాయశక్తులా కృషి చేశాం. వయోభేధం, వర్గాల మధ్య ఏవిధమైన
తేడాను పాటించకుండా అత్యాచారాల వంటి ఘోర కృత్యాలకు పాల్పడుతున్న రాక్షసులను
చూసి మనం తలదించుకోవాలి. అత్యాచారానికి పాల్పడేవారికి మతం అనేది ఉన్నదా?
తాము అకృత్యాలకు పాల్పడే సమయంలో బాధితుల మతాన్ని చూస్తున్నారా? చిన్న
పిల్లలు, వృద్ధులు, దళితులు, గిరిజనులు..దేశంలో ఏదో ఒక చోట లైంగిక
అత్యాచారాలకు గురవుతున్నారనేది నిత్యం వార్తలు చదివేవారికి బోధపడే సత్యం.
మరి దీనికి అలవాటు పడిన నేరస్థులకు మరణశిక్ష పడే విధంగా చట్టాన్ని
రూపొందించేందుకు ప్రభుత్వంపై ఈ సంఘటనలు వత్తిడిని పెంచేస్తున్నాయి. నిర్భయ
సంఘటన దేశ ప్రజల మనసులను అల్లకల్లోలం చేసిన మాట వాస్తవం. ఆ తర్వాత ఇటువంటి
సంఘటనలు వరుసగా పునరావృతం కావడం నిజంగా నమ్మలేని నిజం. ఈ సంఘటనలు
జరిగినప్పుడు మనం బాధితుల కులం, మతం, రంగు, జాతీయత అనే అంశాలను
పట్టించుకున్నామా? మరి అటువంటప్పుడు ఈ తాజా పరిణామంలో బాధితురాలి మతాన్ని
ఎందుకు చూస్తున్నాం? దీని వెనుక ఏమైనా అజెండా ఉన్నదా?
విదేశీ పర్యాటకులు కూడ ఈ ఘోరమైన అకృత్యం బారిన పడుతున్నారు. బెంగళూరు ఇతర
నగరాల్లో పాఠశాల విద్యార్థినులు బాధితులుగా మారుతున్నారు. భౌతిక, మానసిక
వికలాంగులను కూడా ఈ రాక్షసులు వదిలిపెట్టడం లేదు. మెజారిటీ మతానికి చెందిన
70 ఏళ్ల మహిళా పూజారి దారుణమైన అత్యాచారానికి గురికావడమే కాకుండా, ఆమె నగ్న
శరీరం ఆశ్రమంలో పడివుండటాన్ని గుర్తించారు. 2007లో జరిగిన ఈ సంఘటనకు
సంబంధించి పియుసిఎల్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ
ఘోరకృత్యానికి బలైన వృద్ధురాలు మారుమూల గ్రామానికి చెందిన దళిత మహిళ అని
తేలింది.
2014, మార్చి నెలలో ఆస్ట్రేలియాకు చెందిన 59 ఏళ్ల బ్రహ్మకుమారి అనుయాయురాలు మౌంట్ అబూకు వెళుతుండగా అత్యాచారానికి, హత్యకు గురైంది. ఆమెను
చిత్రహింసలకు గురిచేసి ఆపై అత్యాచారం జరిపి మరీ హత్య చేశారు. ఆస్ట్రేలియాకు
చెందిన ఏ కౌన్సెల్ నేరం జరిగిన ప్రదేశానికి రాలేదు. 2008లో క్రైస్తవ
మతానికి చెందిన ఒక టీనేజర్ అత్యాచారానికి ఆపై హత్యకు గురైంది. భారత్‌లో
పనిచేస్తున్న ఒక రష్యా దేశస్థురాలు తనపై గోవా రాజకీయ వేత్త అత్యాచారానికి
పాల్పడ్డాడని 2009లో ఆరోపించింది. 2013, మార్చిలో స్విస్ జంట ఆగ్రాకు
వెళుతుండగా, కొంతమంది దోపిడీ దొంగలు వారిని అడ్డగించి భర్తను కొట్టి అతని
ఎదుటనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరి వారి మతాన్ని కూడా పేర్కొనడం
సముచితమే కదా.
జమ్ము-కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ తన జాతి విధ్వంస ప్రక్రియలో భాగంగా, హత్యలు,
దహనకాండ, అత్యాచారాలను ఆయుధాలుగా వాడి, కశ్మీర్ పండిట్లను రాష్ట్రంనుంచి
వెళ్లగొట్టింది. ఇస్లామిక్ మిలిటెంట్లు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు.
ఇందుకు ఒక సంఘటనను పరిశీలిద్దాం. దేశ విభజన జరిగిన తర్వాత.. మానవ చరిత్రలో
చోటు చేసుకున్న అత్యంత ఘోరమైన విషాదంలో..పస్థూన్ ఉగ్రవాదులు
పాకిస్తాన్‌లోని బారాముల్లాపై సైనిక ట్రక్కులో మూకుమ్ముడిగా దాడిచేసి
మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. బాధితుల్లో యూరోపియన్ దేశాలకు చెందిన
క్రైస్తవ సన్యాసినులు కూడా ఉన్నారు.
ఇటాలియన్ కాన్సులేట్‌కు చెందిన ఒక అధికారి రానాఘాట్ కనె్వంట్‌ను
సందర్శించారని సమాచారం. ఈ నేపథ్యంలో 1999లో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న
ఒక నేరస్థుడిని ఇటలీ ఏవిధంగా విడిచిపెట్టిందో పరిశీలిద్దాం. బాధితురాలు
బిగుతైన జీన్ ప్యాటును వేసుకుంది. అందువల్ల, ఆమె అంగీకారం లేకుండా ఆ జీన్
ప్యాంటును బలవంతంగా విప్పదీయడం సాధ్యం కాదు. ఇదీ కోర్టు చెప్పిన తీర్పు.
అంటే ఇక్కడ కోర్టు..జీన్ ప్యాంటుకు, లైంగిక ప్రక్రియకు ముడిపెట్టింది.
అయితే అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో తర్వాత ఈ తీర్పును
రద్దు చేయడం వేరే సంగతి.
బీబీసీ ‘ఇండియాస్ డాటర్’ పేరుతో ఇటీవల చిత్రీకరించిన డాక్యుమెంటీలో
ప్రపంచంలోనే భారత్ ‘రేప్‌లకు రాజధాని’గా చూపారు. ఈ డాక్యుమెంటరీ
ప్రసారాన్ని భారత్ అనుమతించి ఉండాల్సింది. పశ్చిమ దేశాల స్ర్తివాదులు,
వ్యాఖ్యాతలు ఈ డాక్యుమెంటరీకి మద్దతుగా తమ గళం కలిపారు. వీరి జ్ఞాపకశక్తి
చాలా స్వల్పమనే చెప్పాలి. ఎందుకంటే 2010లో ఐక్యరాజ్య సమితి ఒక సర్వే
నివేదికను విడుదల చేసింది. ఇందులో ప్రతి లక్షమందికి ఎన్ని అత్యాచారాలు
జరుగుతున్నాయనే దానిపై వివరాలున్నాయి. దీని ప్రకారం భారత్‌లో అత్యాచారాలు
ప్రతి లక్షమందిలో కేవలం 1.7 మాత్రమే జరుగుతున్నట్టు స్పష్టం చేసింది. ఇది
చాలా తక్కువ. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో ఇవి 91.6గా నమోదయ్యాయి.
ప్రపంచ దేశాల్లో అత్యాచారాల్లో ఈ రెండు దేశాలదే అగ్రస్థానం. ఇక అమెరికాలో
30.2 నమోదవుతున్నాయి. ఇందులో చైనా తక్కువేం తినలేదు.
ఇక మనదేశంలో రాష్ట్రాల వారీగా చోటుచేసుకునే అత్యాచారాల్లో మిజోరంది (10.4)
అగ్రస్థానం. దాని తర్వాత వరుసగా త్రిపుర, మేఘాలయ, సిక్కిం, అస్సాలు
ఉన్నాయి. మరి ఈ రాష్ట్రాల్లో భాజపాకు బలమే లేదు. ఇక పెద్ద నగరాల్లో
ఢిల్లీలో అత్యాచారాల రేటు లక్షమందికి 4.1. ఇక అత్యాచారాల రేటు అతి తక్కువగా
ఉన్న రాష్ట్రం గుజరాత్. ఇక్కడ 0.98 మాత్రమే నమోదయ్యాయి. దీని తర్వాత
బిహార్, కర్ణాటక, యుపి, తమిళనా ఉన్నాయి.
మరి క్రైస్తవ ఫాదర్లు, బిషప్‌లు,
కమ్యూనిస్టు ఉదారవాదుల ప్రేరణతో ఈ అకస్మిక ప్రచారం ఎందుకు? వారి ప్రకారం
భాజపా అధికారంలోకి వచ్చిన తొమ్మిదినెలల కాలంలో మైనారిటీలపై దాడులు
పెరిగాయి. కేంద్రంలో ‘మతతత్వ పార్టీ’ అధికారంలోకి రావడం వల్ల మైనారిటీలు
ఎక్కడలేని బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. అందుకు పశ్చిమ బెంగాల్‌లో
క్రైస్తవ సన్యానిసిపై జరిగిన అత్యాచారాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. గతంలో
చిన్న పిల్లలు, వృద్ధులు, అణగారిన వర్గాలకు చెందిన వేలాది అత్యాచార బాధితుల
మతాన్ని గురించి పట్టించుకున్నారా? వాస్తవాలను కప్పిపెట్టడం ద్వారా
ప్రజలను తప్పుదోవ పట్టించడం, కేంద్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసమే వీరి
యత్నాలు తప్ప మరోటి కావు.
పైన వివరించిన డేటా 2014కు చెందినది కాదని, కేవలం యుపిఎ-1,2 ప్రభుత్వాల
పాలనాకాలం నాటిదన్న సంగతి వీరికి బాగా తెలుసు. అత్యాచార రేటు అత్యధికంగా
ఉన్న దేశాల్లో సంఘ్‌పరివార్ లేదు. అటువంటప్పుడు మీడియాలోని ఒక భాగం,
వామపక్ష కార్యకర్తలు, మైనారిటీలు, ప్రజలచేత తిరస్కరించబడిన రాజకీయ
పార్టీలు..కేంద్రాన్ని ఒక బూచిగా చూపాలని ఎందుకు యత్నిస్తున్నాయి? ప్రస్తుత
ప్రధాని నరేంద్ర మోదీ మీడియాను పట్టించుకోవడం లేదు. దాని స్థానం ఎక్కడో
స్పష్టంగా చూపించారు. ఇదీ మీడియా ఆగ్రహానికి కారణం. ఇక ఎన్‌జిఒల
కార్యకలాపాలు వాటికి వచ్చే విదేశీ నిధుల వివరాలపై కేంద్రం సూక్ష్మ పరిశీలన
ప్రారంభించింది. అందువల్ల భారత ప్రభుత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో
అప్రతిష్టపాల్జేయడం వాటి ప్రధాన లక్ష్యం. ఇందుకు ప్రియా పిళ్లై ఒక ఉదాహరణ.
విదేశాల్లో ఉన్నవారు మాతృదేశ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును రాజ్యాంగం
ప్రసాదించి ఉండవచ్చు గాక. దాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఆమెకు
ఎవరిచ్చారు?
ముస్లింలు, క్రైస్తవుల్లో అధికశాతం నరేంద్ర మోదీని ‘‘హిందూ హృదయ
సామ్రాట్’’గా మాత్రమే పరిగణిస్తున్నారు తప్ప, ఆయన్ను దేశ ప్రజలు ఎన్నుకున్న
ప్రధానిగా పరిగణించడం లేదు.
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రతి సంఘటన ఇదే
మొదటిసారి కాదు. కానీ వీరు అయినదానికి కానిదానికి సంఘ్ పరివార్‌ను
విమర్శించడానికి ఒంటికాలిపై లేస్తుంటారు. కాంగ్రెస్ మాదిరిగానే ఈ మైనారిటీ
గ్రూపులు ప్రస్తుత పాలక ప్రభుత్వం ఊపిరాడని స్థితిలో గిజగిజలాడాలన్న
ఉద్దేశంతో ఉన్నాయి. ఇటువంటి గ్రూపులు ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని ఒట్టేసి
చెబుతుంటాయి మరి!!
మహిళలపై అత్యాచారాలు ఒక్క భారత్ లోనే జరుగుతున్నాయా?
Reviewed by rajakishor
on
9:32 AM
Rating:
No comments: