భక్తి ఉద్యమానికి మణి కిరీటం - సంత్ రవిదాస్ జయంతి వ్యాసం
సువిశాల, సుసంపన్నమైన ఈ భారత దేశంలో వర్ణ వ్యవస్థ సమాజాన్ని అట్టడుగు స్థాయికి దిగజార్చింది. మన సమాజం కులాధిక్య ప్రభావంతో మనుగడ సాగిస్తున్న రోజుల్లో జ్ఞానమార్గాన్ని, కర్మమార్గాన్ని ఉన్నత వర్గాలు, విద్యావంతులు విశ్వసించగా, సమాజంలోని అట్టడుగు పేదవర్గాలు, అణగారిన వర్గాలు భక్తిమార్గాన్ని అనుసరించడం మనం గమనించవచ్చు. దీనికి ప్రధానంగా నాడు హిందూమతంలో ఉన్న వైరుధ్యాలు, ఇస్లాం మతం దేశవ్యాప్తంగా వ్యాపించడం కారణంగా చెప్పాల్సి వుంటుంది.
దేవుడు ఒక్కడే, ముక్తి మార్గానికి భక్తిమార్గమే ప్రధాన ద్వారమని ప్రబోధించిందీ భక్తి ఉద్యమం. అంతేకాదు కుల వివక్షను ప్రశ్నించి శూద్ర, దళిత వర్గాల్లో సైతం మనిషి దేవుడిని చేరుకోవడానికి భక్తి మార్గమే శరణ్యమనే అవగాహన కల్పించిందీ భక్తి ఉద్యమం. భారతీయ సమాజంలో సంస్కరణలకు బీజం వేసిన ఈ ఉద్యమ ప్రేరణతోనే అనేకమంది బ్రాహ్మణ పండితులు సైతం హిందూమత సిద్ధాంతాలను సంస్కరించాలని అభిప్రాయపడ్డారు. సాంఘిక దురాచారాలను నిర్మూలించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఈ ఉద్యమం వల్ల దళితుడు మానవుడేనని, మనలోని వ్యక్తేనని, జన్మతః అస్పృశ్యుడు కాదని కేవలం సమాజంలోని కొన్ని వర్గాల వల్లనే సంపదకు, సమానతకు, జ్ఞానానికి దూరమైనాడని, దళితులకూ హక్కులున్నాయని సమాజం గుర్తించింది. కాగా నేడు ఇస్లాంలోని సుఫీ మతం కూడా భక్తి ఉద్యమంలో భాగంగా సాగింది.
నాడు సమాజంలో ఉన్న ఎంతోమంది అట్టడుగు వర్గాలకు చెందిన తాత్వికులు, మేధావులు, ఆలోచనా పరుల్లో ప్రధానంగా చెప్పుకోదగినవారు సంత్ రవిదాస్, కబీర్, నానక్, తుకారాం వంటి గురు శిరోమణులు. అయతే భక్తి ఉద్యమ తాత్వికులలో అగ్రగామి సంత్ శిరోమణి గురు రవిదాస్ జీ మహరాజ్. ఆయన 1377 పిబ్రవరి 15న మాఘ పూర్ణిమనాడు చమార్ కులానికి చెందిన మాతా ఖల్సాదేవి, బాబా సంతోఖ దాస్ దంపతులకు కాశీ పట్టణ సమీపాన గల సీర్‌గోవర్థన్‌పురంలో జన్మించారు. 120 సంవత్సరాల దీర్ఘకాలం వరకు జీవించి (150 సంవత్సరాలు జీవించాడని కూడా అంటారు) బ్రహ్మలో లీనమయ్యారు.
ఆయన బ్రతికినంతకాలం కుల వృత్తి అయిన చర్మకార వృత్తిని పాటించారు. స్వయంకృషితో ఎదిగారు. వారు తమ కులాన్ని గురించి ఆత్మన్యూనతా భావంతో మాట్లాడలేదు. సంత్ గురు రవిదాస్‌కు చిన్నతనం లోనే వివాహం జరిగింది. వీరి భార్య పేరు లోనాదేవి. వీరికి విజయదాస్ అనే ఒక కుమారుడు కలిగాడు. ఎంతో మేధస్సు కలిగిన, ప్రతిభావంతుడైన గురు రవిదాస్ చిన్నతనం నుండి దైవచింతనలోనే ఎక్కువ కాలం గడిపేవారు. స్వాధ్యాయం, సంతుల సాంగత్యం వల్ల జ్ఞానసిద్ధి పొందారు. నాటి సమాజ పరిస్థితుల్లో అంటరాని వాడనే కారణంతో శిష్యుడిగా చేర్చుకోవడానికి ఏ గురువు ముందుకు రాని నేపథ్యంలో పరమాత్ముడినే తన గురువుగా ఎంచుకున్నారు సంత్ రవిదాస్. వీరి భక్తి ప్రబోధాలవల్ల దాదాపు 52 మంది రాజులు, అంతఃపుర సౌధాలలో ఉండే రాణులు, కాశీ మహారాజు, మహారాణి, మీరాబాయి వీరంతా వారి శిష్యులుగా మారడం, వీరి గొప్పతనానికి నిదర్శనం.
గురుముఖి పంజాబీ భాషను 35 అక్షరాలతో రాసిన గొప్ప భాషా సృష్టికర్త వీరు. వీరు రచించిన 41 శ్లోకాలను సిక్కుల పరమ పవిత్ర గ్రంథమైన ‘‘గురుగ్రంథ సాహిబ్’’ నందు పొందు పరచడం వీరి ప్రతిభకు తార్కాణం. బోధనలలోని విధానాలను ఆచరించేవారు. ఇది ‘రవిదాస్ పథ్’గా ఇప్పటికీ కొనసాగుతుండటం మనం గమనించవచ్చు.
‘‘పరమాత్ముని దర్శనం కోసం కాశీ కామాల కేగనేల
నీ మనో మందిరంలోనే ఉన్నాడు రవి దాస్ ప్రియ రాముడు’’
అంటూ..
‘‘ఒకే జ్యోతితో విశ్వం సృష్టి జరిగెను సోదరా
బ్రాహ్మణ, చమార ఎక్కువ, తక్కువ తేడాలేలరా’’
‘‘జన్మ జాతులను ఎంచకు, లేదు కులం, లేదు ప్రాంతం
రవిదాసు ప్రియప్రభువు పుత్రులే అందరు, లేదు కుల భేదం’’
అంటూ... సర్వకుల సమానత్వాన్ని ప్రబోధిస్తాడు.
‘‘పుట్టుకతోనే గొప్పది కాదు కులం, కులం కన్నా కర్తవ్యం ప్రధానం
ధర్మమే ఇలలో సత్యం, రవిదాసు కోరెను దానిని అను నిత్యం.’’
అంటూ... ‘‘మదిలో నిలుపుకొనుము ధర్మం, కర్మం: రెండూ సమానం
ధర్మ రహిత కర్మం, లేదిక రవిదాసుకు సుఖ జీవనం’’
అని ధర్మాన్ని, కర్మాన్ని ప్రబోధిస్తారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులెవరైనా శుభచింతన, వారి పవిత్ర కర్మలే శ్రేష్ఠత్వాన్ని ఇస్తాయి అని అంటారు వారు మరో సూక్తిలో.
‘‘హిందువులు, తురకల మధ్య లేదు బేధం, అందరిలోనూ రక్తం మాంసం
ఇరువురిని శోధించి రవిదాసు కనుగొనెను, లేదు ఎలాంటి తర్కమీమాంసం.’’
అని ఆనాడే హిందూ, ముస్లిం సఖ్యతను నొక్కి వక్కాణించిన సమాజ సంస్కర్త,
‘‘నేను ఆశించే రాజ్యంలో అందరికీ లభిస్తుంది పరమాన్నం
చిన్నా చితకా అందరూ సమానంగా నివసిస్తే రవిదాస్ అవుతాడు ప్రసన్నం.’’
అంటూ..తానాశించిన సంత్ గురు రవిదాస్ రాజ్యాన్ని ప్రస్థావించారు.
సంత్ గురు రవిదాస్ తన అనుభవం నుండి, అధ్యయన నుండి, అవగాహన నుండి, మానవతా వాదం నుండి పుట్టుకొచ్చిన కవితలు, సూక్తులు, పదునైన భావజాలం, ప్రబోధాలు నాటి కాలంలోని వారినే గాక నేటి తరాలను సైతం ప్రభావితం చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నాయి.
మనిషిని మనిషి ద్వేషించడం, అహంకారం, అవిద్య, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతల్లేని సమసమాజ, నవసమాజ స్థాపన అనేవి థార్మికచింతన ద్వారానే సాధ్యమని, అలాంటి థార్మిక ప్రబోధాలు గావించి యావత్ సమాజాన్ని చైతన్య పరిచిన సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ బోధనలను మనం మనసా వాచా కర్మణా ఆచరించినప్పుడే అలాంటి సమాజం సాధ్యమని, ఆ ఆచరణలే ఆ మహనీయునికి మనం ఇచ్చే పవిత్రమైన, ఘనమైన నివాళికా భావించాలి.
భక్తి ఉద్యమానికి మణి కిరీటం - సంత్ రవిదాస్ జయంతి వ్యాసం
Reviewed by JAGARANA
on
12:22 PM
Rating:
No comments: