హిందుత్వమే ఈ దేశ రాష్ట్రీయత
మత సమన్వయం వికసించిన ‘మట్టి’...
హెబ్బార్ నాగేశ్వరరావు, ఆంధ్రభూమి దినపత్రిక , 05/02/2015
భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, ‘సమాజవాద’, ‘సర్వమత సమభావ’,
ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దాలని సత్యనిష్ఠతో
నిర్ణయించుకున్నవారమై.... అని అన్నది. మన రాజ్యాంగ పీఠికలోని మొదటి వాక్యం!
ఈ వాక్యంలోని ‘సమాజవాద’- సోషలిస్ట్- ‘సర్వమత సమభావ’- సెక్యులర్ అన్న
పదాలను తొలగించి పీఠిక- ప్రియాంబుల్- కు క్రీస్తుశకం 1977 సంవత్సర పూర్వ
స్థితిని కల్పించాలని కొంతమంది ప్రముఖులు, కొన్ని సంస్థలవారు కోరుతున్నారు!
ఈ కోరిక విచిత్రమైనది. ఎందుకంటె ‘సోషలిస్ట్’అన్న పదం రాజ్యాంగంలో
చేరడానికి ముందు కాని చేరిన తరువాత కాని మన దేశంలో ‘తథాకథిత’- సోకాల్డ్-
సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ ఏర్పడలేదు. ‘సెక్యులర్’అన్న పదం ‘పీఠిక’లో
చేరడానికి ముందు యుగయుగాలుగా తరతరాలుగా మన దేశంలో ‘సర్వమత సమభావం’ హిందువుల
సహజ జీవన విధానమై ఉంది, జీవన వాస్తవమై ఉంది. 1977లో ఈ ‘సెక్యులర్’ పదం
చేరినందువల్ల కొత్తగా వచ్చిన మార్పులేదు! ఈ ‘పదం’ మన దేశంలో అనాదిగా
నెలకొని ఉన్న సర్వమత సమభావ వ్యవస్థ వినూతన ప్రభావానికీ సరికాలేదు, భంగపడనూ
లేదు. అందువల్ల ‘సెక్యులర్’ పదప్రయోగంవల్ల ఏర్పడిన కొత్తదనం లేదు! ఈ పదం
తొలగిపోయినా, తొలగకపోయినా ‘మతాతీత జాతీయత’, ‘సర్వమత సమభావం’ ఈ దేశ ప్రజల
సనాతన స్వభావం! ‘‘ఈ దేశ ప్రజల స్వభావం’’అని అన్నప్పుడు ఈ ‘‘దేశంలోని
అధికాధిక ప్రజల సమష్టి స్వభావం’’అన్నది రూఢి... ఈ అధికాధిక ప్రజలు
హిందువులు..... ఈ దేశపు అనాది జాతీయులు!!
నూతన రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చినప్పటినుంచి 1977 జనవరి మూడవ
తేదీ వరకు రాజ్యాంగ పీఠికలో ఈ రెండు పదాలూ లేవు, అవసరమని రాజ్యాంగ
నిర్మాతలు భావించలేదు. ఎందుకంటె అధిక సంఖ్యాక ప్రజల సమష్టి స్వభావమైన
సర్వమత సమభావం అనాదిగా ఉంది. విదేశీయ పాలనలో సైతం స్వజాతీయులు అధిక
సంఖ్యాకులుగా ఉన్నచోట ‘సర్వమత సమభావం’ చెక్కుచెదరలేదు. విదేశాలనుంచి వచ్చిన
ఇస్లాం మతాన్ని - పాటించేవారు అధిక సంఖ్యాకులుగా ఉండినచోట మాత్రమే ‘సర్వమత
సమభావం’ నశించింది, ఏకమత రాజ్యాంగ వ్యవస్థకల పాకిస్తాన్ ఏర్పడింది. ‘ఏకమత’
సమర్థకులు, అన్యమత విధ్వంసకులు అయిన జిహాదీ బీభత్సకారులు పాకిస్తాన్ నుండి
అనాది స్వజాతీయ మతాల వారైన హిందువులను తరిమివేయడం చరిత్ర! హత్య చేయడం
చరిత్ర.... ఈ ‘‘చరిత్ర’’ 1947వ 1950వ సంవత్సరాల మధ్య ఖండిత భారత్‌లో
నడవలేదు. ఎందుకంటె అధిక సంఖ్యాక ప్రజలైన హిందూ జాతీయ మతాలవారు అనాదిగా
సర్వమత సమభావ సమాజ స్వభావులు! అందువల్లనే ఖండిత భారత్ నుండి అల్పసంఖ్యాక
మతాలవారిని తరిమివేయలేదు, వారిని పాకిస్తాన్‌లో వలె హత్యచేయలేదు! అప్పటికి
అంటే 1947-1950 మధ్య కాలంనాటికి కొత్త రాజ్యాంగం పుట్టలేదు,
‘సెక్యులర్’అన్న పదం రాజ్యాంగంలో చేరనూ లేదు! అందువల్ల ప్రజల సహజ
స్వభాత్మకంగా ఈ దేశంలో అనాదిగా ‘సెక్యులరిజమ్’- సర్వమత సమభావం- ఉందన్నది
రాజ్యాంగ నిర్మాతలు గుర్తించిన సత్యం! అందుకే మళ్లీ రాజ్యాంగంలో ఆ పదాన్ని
చేర్చాలన్న ‘పునరుక్తి దోషానికి’ రాజ్యాంగ నిర్మాతలు పాలుపడలేదు. 1975వ,
1977వ సంవత్సరాల మధ్యకాలంలో అత్యవసర పరిస్థితిని విధించి రాజ్యాంగ
వ్యవస్థను దుర్వినియోగం చేసిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ
‘పునరుక్తి దోషానికి’ పాలుపడింది. ఇందిరమ్మ ప్రభుత్వం రూపొందించిన ‘నలబయి
రెండవ’ రాజ్యాంగ సవరణ ప్రకారం ‘పీఠిక’లో ‘సెక్యులర్’ పదం చేరింది. ఇది
‘పునరుక్తి దోషమే’ కాని భారత ప్రజల స్వభావాన్ని ప్రభావితం చేసిన పరిణామం
కాదు. అందువల్ల ఇప్పుడు ఈ పదాన్ని తొలగించినప్పటికీ, కొనసాగించినప్పటికీ
భారతీయ సమాజస్వభావంలో పరివర్తన రాదు. ఈ స్వభావం వేదఋషులు ‘‘ఏకంసత్
విప్రాఃబహుధావదన్తి’’- సత్యం ఒక్కటే, పండితులు పలువిధాలుగా చెపుతున్నారు-
అని చాటిన నాటినుంచి యుగాలుగా చెక్కుచెదరలేదు. అదే ‘సర్వమత సమభావం’!!
‘సెక్యులరిజమ్’అని అంటే ‘సర్వమత సమభావం’అన్న అర్థంలోనే మన దేశంలో రాజ్యాంగ
వ్యవస్థ స్థిరపడి ఉంది. కానీ ఈ ‘పదం’ అంటే ‘సెక్యులరిజమ్’ అన్న పదం
పాశ్చాత్య దేశాలలో అంకురించడానికి గల చరిత్ర వేరే ఉంది. చైనాలోను గతంలో
వివిధ కమ్యూనిస్టు దేశాలలోను మరో విపరీత అర్థానికి గురిఅయి ఉంది!
‘సెక్యులరిజమ్’ అని అంటే ‘మత రహితము’అన్న అర్థాన్ని కమ్యూనిస్టు మేధావులు
ప్రచారం చేశారు. గుడికి వెళ్లడం, తిలకం ధరించడం, దేవునియందు విశ్వాసం
ఉండడం, మత నియమాలను పాటించడం వంటి సంప్రదాయాలు ‘సెక్యులరిజమ్’అన్న మహా
విషయానికి వ్యతిరేకమన్న ప్రచారం కూడ జరిగిపోయింది! ఇదంతా గతంలో
‘కమ్యూనిస్ట్’లేదా ‘సోషలిస్ట్’దేశంగా చెలామణి అయిన ‘సోవియట్ యూనియన్’
ప్రభావిత మేధావి గణంవారి నిర్వాకం! ఈ నిర్వాకం కారణంగానే
‘సెక్యులరిజమ్’అన్న పదానికి ‘్ధర్మ నిరపేక్షత’అన్న అర్థం పుట్టుకొచ్చింది.
ధర్మమంటే స్వభావం, విధి, కర్తవ్యం అన్న అనేక అర్థాలున్నాయి. కానీ ధర్మమంటే
మతమని కూడ ఈ మేధావులు ప్రచారం చేశారు. కానీ ‘్ధర్మం’పట్ల మానవులకు
‘అపేక్ష’ఉండాలి కానీ ‘నిరపేక్ష’ ఉండడం ఏమిటి? ధర్మవిచక్షణ లేనట్టయితే
పశువులు అవుతారు. అందువల్ల ‘సెక్యులరిజమ్’అన్న పదానికి 'ధర్మనిరపేక్షత’అన్నది సరైన అర్థంకాదని ‘అనువాదకులు’ ఆ తరువాత
గుర్తించారు. అందుకే ఇటీవలి కాలంలో హిందీ భాషా రాజ్యాంగం ప్రతులలో
‘సెక్యులరిజమ్’అన్న ఆంగ్ల పదానికి ‘పంథ నిరపేక్షత’ అన్న అనువాదం చేశారు.
‘హిందీ’లో ‘పంథ్’అని అంటే ‘మతం’అని అర్థం... అయినప్పటికీ కూడ ప్రజలు ‘మతం’
పట్ల ‘ఆపేక్ష’కలిగి ఉండరాదా?? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. అందువల్లనే
మతాలతో నిమిత్తంలేని, ‘మతాతీతము’అన్న అర్థాన్ని ‘సెక్యులరిజమ్’
సంతరించుకొంది!! ఈ పదాలు ఏవికూడ ‘సర్వమత సమభావం’ అన్న తత్త్వాన్ని సమగ్రంగా
నిర్వచించలేకపోవడం గందరగోళానికి దారితీసింది!!
‘వనం’లోని ‘చెట్లు’వంటివి సమాజంలోని మతాలు! అన్ని ‘చెట్ల’కూ సమానంగా ఎదిగే
అవకాశం ఉండాలా?? లేక ‘చెట్లు’లేని ‘వనాన్ని’ ఏర్పాటుచేయాలా?? మత రహిత సమాజం
చెట్లు మొక్కలు లేని ‘తోట’ వంటిది... ‘సర్వమత సమభావ సమాజం’ వివిధరకాల
చెట్లకు మొక్కలకు సమాన పోషణావకాశం ఉన్న ‘తోట’వంటిది! భారతీయ సమాజం అనాదిగా
ఇలాంటి వివిధ వృక్షాలు వికసించిన ‘సర్వమత సమభావ’నందనం. ఐరోపా సమాజానికి ఈ
‘సర్వమత సమభావం’ గురించి తెలియకపోవడం శతాబ్దుల చరిత్ర!! ఒకే దేశంలో కాని,
ఒకే సమాజంలో కాని రెండు మతాలు సమాంతరంగా సమానంగా సహజీవనం చేయడం పాశ్చాత్యుల
స్వభావానికి విరుద్ధం. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. ‘గ్రీసు’నాగరికతను
‘రోము’ నాగరికత ధ్వంసం చేసింది. ‘రోము’నాగరికతను ‘క్రైస్తవం’ తొలగించింది!
‘క్రైస్తవం’ ‘ఇస్లాం’ ఐరోపాలోను ఆఫ్రికాలోను పశ్చిమాసియాలోను ‘పరస్పరం’
తొలగించుకున్నాయి. కలసిమెలసి ఉన్న చరిత్ర లేదు. అందువల్ల ఐరోపావారి
‘సెక్యులరిజమ్’మత వ్యవహారాలకు భిన్నమైన ‘లౌకికత్వం’మాత్రమే! భారతదేశపు
‘సెక్యులరిజమ్’ అనాదిగా ‘సర్వమతాల సంపుటం’.... అదే హైందవ జాతీయతత్త్వం!
అందువల్ల రాజ్యాంగంలో నిర్దేశించిన కారణంగా మన దేశంలో సర్వమత సమభావ -
సెక్యులర్- వ్యవస్థ ఏర్పడలేదు. ఈ దేశ ప్రజల సమష్టి స్వభావం కారణంగా మాత్రమే
క్రీస్తుశకం 1950లో దేశంలో ‘సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ’ ధ్రువపడింది! ఈ
సమష్టి స్వభావం అనాదిగా ఈ దేశంలో వికసించిన జాతీయత. ఈ జాతీయత ఒక మతం
ప్రాతిపదికగా రూపొందలేదు, ఒక భాష ప్రాతిపదికగా రూపొందలేదు!! సర్వమత
సమాహారమైన, సర్వభాషా సంపుటమైన, ఇతరేతర వైవిధ్యాల సమన్వయ తత్త్వమైన
హిందుత్వం ఈ జాతీయత. అందువల్ల 1950లో సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ
ఏర్పడడం ఈ దేశంలో వినూతన పరిణామం కానేకాదు, యుగాలుగా కొనసాగుతున్న హైందవ
జాతీయ సర్వమత సమభావ స్వభావానికి కొనసాగింపు మాత్రమే.... సృష్టిగత
వైవిధ్యాలు సమాజంలో స్థితమై ఉండడం సార్వకాలిక సత్యం, సార్వజనిక
సార్వప్రాదేశిక వాస్తవం! ఎందుకంటె సృష్టినుండి సమాజం భిన్నం కాదు.
వైవిధ్యాలు నష్టమైపోయి ‘ఏకరూపత’ నెలకొన్నట్టయితే సృష్టి వికృతమైపోతుంది.
సృష్టి మొత్తం సూర్యుడుగానో, భూమిగానో, చంద్రుడుగానో, బృహస్పతిగానో
ఉన్నట్టయితే సృష్టిలేదు. సృష్టిలో సంచాలకత్వం, సంచలనం లేదు, జీవరాశి లేదు,
జీవరాశి ప్రాతిపదికగా ఏర్పడే సంస్కార సమాహారం లేదు. అందువల్ల
‘వైవిధ్యరూపాలు’ సృష్టిగత వాస్తవం.... ఈ వైవిధ్యరూపాల మధ్య అద్వితీయ
చైతన్యం అనుసంధానమై ఉండడం సృష్టి స్వభావం! ‘రూపాల’ మధ్య వైవిధ్యమే వైరుధ్యం
లేదు. సూర్యుడు, భూమి, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, భూమిని ఆవహించి
ఉన్న జీవి వైవిధ్యాలు.... ఇవన్నీ విభిన్న రూపాలు! కానీ పరస్పర వైరుధ్యాలు
కాదు, అద్వితీయ చైతన్య సూత్రమైన ఏకోన్ముఖ లక్ష్యంలోని వివిధ భంగిమలు
మాత్రమే....
ఈ సృష్టిగత వాస్తవాలు సమాజంలో ప్రస్ఫుటించడం ప్రపంచంలోని అన్ని దేశాలకూ
వర్తించే వాస్తవం. కానీ ఇతర దేశాలవారు ఈ ‘వైవిధ్య పరిరక్షణ’ను జీవన
స్వభావంగా మలచుకోలేదు. అందుకే ఒకే ‘మతం’ ఆయా దేశాలలో పెరిగి, వైవిధ్యాలను
ధ్వంసం చేసింది... మన దేశంలో వివిధ మతాల సమాహారంగా జాతీయత అనాదిగా
వికసించింది. ఈ జాతీయత భారతీయత, హిందుత్వం.... లేదా సనాతన తత్త్వం!
‘సనాతనం’ అని అంటే ఎప్పుడూ ఉండేది- ఎటర్నల్- అని అర్థం... అనాదిగా ఈ
‘సనాతన’ జాతీయత, లేదా భారత జాతీయత, హిందూ జాతీయత ఈ దేశంలో ఉంది. మతాలు
పుట్టడంతోను గిట్టడంతోను కొత్త మతాలు రావడంతోను నిమిత్తం లేకుండా సర్వమత
సమాహారమైన ‘జాతీయత’ ఈ దేశంలో వికసించింది. క్రీస్తునకు పూర్వం ఐదవ
శతాబ్దిలో ఆది శంకరాచార్యుడు సమైక్య సమన్వయ యాత్రచేసిన నాటికి ప్రధానంగా
ఆరు వేద మతాలున్నాయి. అవి, శైవం, వైష్ణవం, శాక్తం, సౌరం, గాణాపత్యం,
స్కాందం. ఈ ఆరు మతాల వారూ అల్పసంఖ్యాకులే! ఈ ఆరు మతాల దేవతలందరినీ పూజించే
‘సనాతనులు’ అధిక సంఖ్యాకులు. ఇవికాక బౌద్ధం, జైనం ఉన్నాయి. ఆ తరువాత కూడ
దేశంలో అనేక మతాలు పుట్టాయి. విదేశాలనుంచి ఇస్లాం, క్రైస్తవం, పారశీకం,
యూదు మతాలు వచ్చాయి! రాజ్యాంగంలో ‘సెక్యులర్’ పదం చేరడానికి ముందు లక్షలాది
ఏళ్లుగా ఈ దేశంలో ఇలా ‘సర్వమత సమభావ’ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ పేరు
హిందుత్వం.....
హిందుత్వమే ఈ దేశ రాష్ట్రీయత
Reviewed by rajakishor
on
12:07 PM
Rating:
No comments: